
ఆరవ అధ్యాయం
23
గురుశిష్యులనే ఆలోచన తొలగిపోతుంది
ఉపదేశం గురించి చింతన తొలగిపోతుంది
శివుణ్ణీ, సర్వోన్నత సత్యాన్నీ నేనేకాగా
అక్కడ అభివందనమెవరికి? ఎలాగ?
24
అక్కడ దేహవిభాగాల కల్పన ఉండదు
అక్కడ లోకవిభాగాల కల్పనా ఉండదు
శివుణ్ణీ, సర్వోన్నత సత్యాన్నీ నేనే కాగా
అక్కడ అభివందనమెవరికి? ఎలాగ?
25
రజోగుణంకలిగిగాని, లేకగాని ఎన్నడూలేను
నిజంగానే నిర్మలుణ్ణీ, నిశ్చలుణ్ణీ, విశుద్ధుణ్ణీ
శివుణ్ణీ, సర్వోన్నత సత్యాన్నీ నేనేకాగా
అక్కడ అభివందనమెవరికి? ఎలాగ?
26
దేహమనీ, దేహంలేకపోవడమనీ లేకుండా
అనృతమైన నడవడి సత్యమని చెప్పకుండా
ఆ శివుణ్ణీ, సర్వోన్నత సత్యాన్నీ నేనేకాగా
అక్కడ అభివందనమెవరికి? ఎలాగ?
27
దేన్ని ఎవరూ తెలుసుకోలేరో తెలుసుకోజాలరో
అక్కడ ఛందస్సు ఎక్కడ? అలంకారాలెక్కడ?
సమరసంలో మునిగి పునీతుడైన అవధూత
ఏది పలవరిస్తుంటే అది పరమసత్యం.
ఏడో అధ్యాయం
1
దారుల్లోపడిఉన్న గుడ్డపీలికల్తో బొంతకూర్చుకుని
పాపపుణ్యాల్ని పరిత్యజించిన దారిన నడుస్తూ
శూన్యకుటీరంలో, దిగంబరుడైన అవధూత
శుద్ధనిరంజనుడిగా, సమరసమగ్నుడిగా ఉంటాడు
2
లక్షణావలక్షణాల్ని విడిచిపెట్టడమే లక్ష్యంగా
యుక్తాయుక్తాల్ని వదిలిపెట్టడంలోనే నేర్పరిగా
కేవలతత్త్వం కావడంవల్ల మరకలంటనివాడిగా
పవిత్రుడైన అవధూతకి వాదవివాదాలతో పనేమిటి?
3
ఆశాపాశాలనే బంధనాలను తెంచుకున్నవారై
శౌచాశౌచ ఆచారాల్ని నేర్పుగా విప్పుకున్నవారై
సమస్తాన్ని వదిలిపెట్టి అంతస్తత్వంతో ఉండే
అవధూతలు శుద్ధులూ, నీడలు సోకనివారూను.
4
ఇక్కడ దేహమనీ, విదేహమనీ ఆలోచనలెందుకు?
ఇక్కడ రాగమనీ, విరాగమనీ ఆలోచనలెందుకు?
ఇక్కడ ఆ తత్త్వం నిర్మలం, నిశ్చలం, గగనాకారం
స్వయంగా తన స్వరూపమేదో అదే సహజాకారం.
5
ఇక్కడ ఏ తత్త్వాన్ని తెలుసుకోలేమో
దాన్ని రూపమనీ, అరూపమనీ అనడమెలాగు
అక్కడ పరమసత్యం గగనాకారమై ఉండగా
ఇంద్రియగోచరరూపంగా చూడడమెలాగు?
6
అది గగనాకార నిరంతర హంస తత్త్వం
అది విశుద్ధమూ, నిరంజన హంస తత్త్వం
కాగా అదిలా ఉందనీ, లేదలా ఉందనీ,
బంధమనీ లేదా ముక్తమనీ చెప్పడమెలాగ?
7
మొత్తం ఆ సత్యమొకటే నిరంతరాయంగా ఉండగా
యోగాయోగాల్లారా? మీరెందుకు గర్విస్తున్నారు?
ఆ సత్యమొక్కటే సమస్తమూ తానై ఉండగా
ఇంకా సారమనీ, విసారమనీ చెప్పడమెందుకు?
8
ఎటువంటి నీడలూ పడని సత్యం తాను సర్వం
గగనాకారంగా, నిరంతరశుద్ధంగా ఉండగా
కలిసి ఉందనీ, కలిసి లేదనీ చెప్పడమెలాగ?
వినోదిస్తున్నదనీ, లేదనీ చెప్పడమెలాగ?
9
యోగవియోగాలతో పనిలేకుండానే యోగిగా
భోగవిభోగాలతో పనిలేకుండానే భోగిగా
సహజానందంతో కూడుకున్న మనసుతో
నెమ్మదినెమ్మదిగా సంచరిస్తుంటాడు అవధూత.
10
జ్ఞానంతో, అజ్ఞానంతో సదా కూడి ఉండే అవధూత
ద్వైతం నుంచీ,అద్వైతం నుంచీ ఏ విధంగా ముక్తుడు?
ఇక్కడ సహజంగా, రజోరహితంగా ఉండే యోగి
శుద్ధుడూ, నీడలుపడనివాడూ, సమరసభోగీను.
11
భగ్నాభగ్న స్థితులు వదిలిపెట్టి
లగ్నాలగ్నాల పట్ల దృష్టి వదిలిపెట్టి
గగనాకారమైన సమరసతత్త్వానికి
సారవిసారాల ప్రసక్తి ఎక్కడ?
12
అన్నింటినీ వదిలిపెట్టడానికే కట్టుబడగా
తత్త్వాలన్నీ వదిలెయ్యడమే విముక్తికాగా
ఇంక జీవితమెక్కడ? మరణమెక్కడ?
ధ్యానమెక్కడ? ధ్యానసాధనాలెక్కడ?
13
ఈ మొత్తం ఇంద్రజాలం
ఎండమావిలో జలసమానం
ఉన్నదొక్కటే: అఖండితం
అనాకారం, కేవలం శివం.
14
ధర్మం మొదలుకుని మోక్షందాకా
మాకు దేని మీదా ఆసక్తి లేదు.
అయినా ఎందుకని ఈ పండితులు
మాకు రాగవిరాగాలు కల్పిస్తున్నారు?
15
దేన్ని ఎవరూ తెలుసుకోలేరో తెలుసుకోజాలరో
అక్కడ ఛందస్సు ఎక్కడ? అలంకారాలెక్కడ?
సమరసంలో మునిగి పునీతుడైన అవధూత
ఏది పలవరిస్తుంటే అది పరమసత్యం.
సంస్కృత మూలం
షష్ఠాధ్యాయః
23
గురుశిష్యవిచార విశీర్ణ ఇతి
ఉపదేశవిచారవిశీర్ణ ఇతి
అహమేవ శివః పరమార్థ ఇతి
అభివాదనమత్ర కరోమి కథమ్.
24
న హి కల్పితదేహవిభాగ ఇతి
న హి కల్పితలోకవిభాగ ఇతి
అహమేవ శివః పరమార్థ ఇతి
అభివాదనమత్ర కరోమి కథమ్
25
సరజో విరజో న కదాచిదపి
నను నిర్మలనిశ్చలశుద్ధ ఇతి
అహమేవ శివః పరమార్థ ఇతి
అభివాదనమత్ర కరోమి కథమ్
26
న హి దేహవిదేహ వికల్ప ఇతి
అనృతం చరితం న హి సత్యమితి
అహమేవ శివః పార్మార్థ ఇతి
అభివాదనమత్ర కరోమి కథమ్
27
విందతి విందతి న హి న హి యత్ర
ఛందోలక్షణం న హి న హి తత్ర
సమరసమగ్నో భావితపూతః
ప్రలపతి తత్త్వం పరమవధూతః
సప్తమోధ్యాయః
1
రథ్యాకర్పట విరచిత కంథః
పుణ్యాపుణ్యవివర్జిత పంథః
శూన్యాగారే తిష్ఠతి నగ్నో
శుద్ధనిరంజన సమరసమగ్నః
2
లక్ష్యాలక్ష్యవివర్జిత లక్ష్యో
యుక్తాయుక్త వివర్జిత దక్షః
కేవలతత్త్వ నిరంజన పూతో
వాదవివాదః కథమవధూతః
3
ఆశాపాశవిబంధన ముక్తాః
శౌచాచార వివర్జిత యుక్తాః
ఏవం సర్వవివర్జిత శాంత-
స్తత్వం శుద్ధనిరంజనవంతః
4
కథమివ దేహవిదేహ విచారః
కథమివ రాగవిరాగవిచారః
నిర్మలనిశ్చలగగనాకారం
స్వయమిహ తత్త్వం సహజాకారమ్.
5
కథమివ తత్త్వం విందతి యత్ర
రూపమరూపం కథమిహ తత్ర
గగనాకారః పరమో యత్ర
విషయీకరణం కథమివ తత్ర.
6
గగనాకార నిరంతరహంస-
స్తత్వన్విశుద్ధినిరంజన హంసః
ఏవం కథమిహ భిన్నవిభిన్నం
బంధవిబంధవికారవిభిన్నమ్
7
కేవలతత్త్వనిరంతరసర్వం
యోగవియోగౌ కథమిహ గర్వం
ఏవం పరమనిరంతర సర్వ-
మేవం కథమిహ సారవిసారమ్
8
కేవల తత్త్వ నిరంజన సర్వం
గగనాకార నిరంతర శుద్ధం
ఏవం కథమిహ సంగవిసంగం
సత్యం కథమిహ రంగవిరంగమ్
9
యోగవియోగౌ రహితో యోగీ
భోగవిభోగౌ రహితో భోగీ
ఏవం చరతి హి మందం మందం
మనసా కల్పిత సహజానందమ్
10
బోధవిబోధైః సతతం యుక్తో
ద్వైతాద్వైతః కథమిహ ముక్తః
సహజో విరజః కథమిహ యోగీ
శుద్ధనిరంజన సమరసభోగీ.
11
భగ్నాభగ్న వివర్జితభగ్నో
లగ్నాలగ్న వివర్జిత లగ్నః
ఏవం కథమిహ సారవిసారః
సమరసతత్త్వం గగనాకారః
12
సతతం సర్వవివర్జిత యుక్తః
సర్వం తత్త్వవివర్జిత ముక్తః
ఏవం కథమిహ జీవితమరణం
ధ్యానాధ్యానౌ కథమిహ కరణమ్.
13
ఇంద్రజాలమిదం సర్వం యథా మరుమరీచికా
అఖండితమనాకారో వర్తతే కేవలః శివః
14
ధర్మాదో మోక్షపర్యంతం నిరీహాః సర్వధా వయం
కథం రాగవిరాగౌశ్చయ్ కల్పయంతి విపశ్చితః
15
విందతి విందతి న హి న హి యత్ర
ఛందోలక్షణం న హి న హి తత్ర
సమరసమగ్నో భావితపూతః
ప్రలపతి తత్త్వం పరమవధూతః
Featured image pc: Wikimedia Commons
9-11-2024
,🙏