అవధూత గీత-13

మూడవ అధ్యాయం

25

ఆ విమలసత్యాన్ని ఇదనిగాని, ఇదికాదని గాని ఎలా చెప్పను?
ఆ నిర్మలసత్యాన్ని శేషమనిగాని, నిశ్శేషమనిగాని ఎలా చెప్పను?
ఆ తేటవెలుగును గుణమనిగాని, గుణరహితమనిగాని ఎలా చెప్పను?
నశింపులేని ఎరుకను, సామరస్యాన్ని, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

26

అత్యున్నతమైన ఆ నిష్కర్మనే నేను సతతం నిర్వహిస్తున్నాను,
నిస్సంగం, సంగం లేని ఆ వ్యాపకమే అత్యున్నత వ్యాపకం,
స్థూలసూక్ష్మ దేహాలతో పనిలేని కార్యకలాపంలోనే నిమగ్నుణ్ణి,
నశింపులేని ఎరుకను, సామరస్యాన్ని, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

27

మాయద్వారా ఒక ప్రపంచాన్ని నిర్మించడం నా పని కాదు,
కుటిలత్వం, డంబాలతో కూడుకున్న కల్పనలు నా పని కాదు,
సత్యంతోనో, అసత్యంతోనో వ్యవహారం నడపడం నా పని కాదు,
నశింపులేని ఎరుకను, సామరస్యాన్ని, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

28

నా కాలం సంధ్యల్తో కొలిచేది కాదు, నాకు వియోగమన్నది లేదు,
నా ఎరుక అంతరంగానిది కాదు, మూగనిగాను, చెవిటినిగాను,
ఇటువంటి వికల్పాలేవీ లేనివాణ్ణి, అలాగని భావశుద్ధుణ్ణీ గాను,
నశింపులేని ఎరుకను, సామరస్యాన్ని, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

29

నాథుడున్నవాణ్ణిగాను, నాథుడులేనివాణ్ణీగాను, నిరాకులుణ్ణి.
చిత్తం లేనివాణ్ణిగాను, చిత్తమున్నవాణ్ణిగాను, నిరాకులుణ్ణి.
ఆ ఉన్నదేదో అది ఏదీ లేనిదనీ, ఆందోళనలేనిదనీ తెలుసుకో.
నేను జ్ఞానామృతాన్ని, సామరస్యాన్ని, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

30

ఇది కారడవి అనిగానీ, మందిరమనిగానీ ఎలా చెప్పగలను?
ఇది ఒనగూడేదనిగానీ, లేదు సందేహమేననీ ఎలా చెప్పగలను?
ఇలా నిరంతరం, సమం, నిరాకులమైనదాన్నెలా వివరించను?
నశింపులేని ఎరుకను, సామరస్యాన్ని, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

31

నిర్జీవ, జీవాలకు అతీతంగా అదెల్లప్పుడూ ప్రకాశిస్తున్నది.
నిర్బీజ, బీజాలతో పనిలేకుండా అదెల్లప్పుడూ ప్రకాశిస్తున్నది.
నిర్వాణ, బంధాలనే భేదాల్లేకుండా అదెల్లప్పుడూ ప్రకాశిస్తున్నది.
నేను జ్ఞానామృతాన్ని, సామరస్యాన్ని, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

32

సంభవంతో పనిలేకుండానే అదెల్లప్పుడూ ప్రకాశిస్తున్నది,
సంసారంతో పనిలేకుండానే అదెల్లప్పుడూ ప్రకాశిస్తున్నది,
సంహారంతో పనిలేకుండానే అదెల్లప్పుడూ ప్రకాశిస్తున్నది,
నేను జ్ఞానామృతాన్ని, సామరస్యాన్ని, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

33

మాటవరసకి చెప్పుకోడానికేనా నీకు నామరూపాల్లేవు,
ఇది వేరే, ఇది వేరుకాదు అనే వస్తువు నీకొకటేనా లేదు,
మరెందుకని మనసా! సిగ్గులేకుండా విలపిస్తున్నావు?
నేను జ్ఞానామృతాన్ని, సామరస్యాన్ని, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

34

సఖా! నీకు చావుపుట్టుకల్లేవు, అయినా ఎందుకు ఏడుస్తున్నావు?
సఖా! నీకు జన్మదుఃఖం లేదు, అయినా ఎందుకు ఏడుస్తున్నావు?
సఖా! నీకు ఎటువంటి వికారాల్లేవు, అయినా ఎందుకు ఏడుస్తున్నావు?
నేను జ్ఞానామృతాన్ని, సామరస్యాన్ని, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

35

మిత్రమా, నీకు స్వరూపమే లేదు, అయినా ఎందుకు విలాపం?
మిత్రమా, నీకు విరూపమే లేది, అయినా ఎందుకు విలాపం?
మిత్రమా, నీకు వయోవస్థల్లేవు, అయినా ఎందుకు రోదిస్తున్నావు?
నేను జ్ఞానామృతాన్ని, సామరస్యాన్ని, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

36


సఖా, వయసువల్ల వచ్చే మార్పుల్లేవునీకు, ఎందుకు దుఃఖం?
సఖా, నీకు మనసువల్ల వచ్చే అవస్థల్లేవు, ఎందుకు దుఃఖం?
సఖా, నీకు ఇంద్రియాలేలేనప్పుడు, ఇంకా, ఎందుకు దుఃఖం?
నేను జ్ఞానామృతాన్ని, సామరస్యాన్ని, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

37

నీకు కోరికల్లేవు, మిత్రమా, అయినా ఏ పేరుపెట్టి విలపిస్తున్నావు?
నీకు ప్రలోభాల్లేవు, మిత్రమా, అయినా ఏ పేరుపెట్టి విలపిస్తున్నావు?
నీకు వ్యామోహాల్లేవు, మిత్రమా, అయినా ఏ పేరుపెట్టి విలపిస్తున్నావు?
నేను జ్ఞానామృతాన్ని, సామరస్యాన్ని, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

38

నీకు ధనం లేదు, అయినా ఐశ్వర్యమెందుకు కోరుకుంటున్నావు?
నీకు భార్యలేదు, అయినా ఐశ్వర్యమెందుకు కోరుకుంటున్నావు?
నీకు నీదనేదే లేదు, అయినా ఐశ్వర్యమెందుకు కోరుకుంటున్నావు?
నేను జ్ఞానామృతాన్ని, సామరస్యాన్ని, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

39

జన్మ, లింగం, ప్రపంచం ఇవి నీకూ లేవూ, నాకూ లేవు,
ఇలా వేరువేరుగా కనిపించేట్టుచేస్తున్నది సిగ్గులేని మనస్సు.
భేదమూ, నిర్భేదమూ రెండూ నీకూ లేవు, నాకూ లేవు,
జ్ఞానామృతాన్ని, సామరస్యాన్ని, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

40

నీకు అణుమాత్రమేనా వైరాగ్యరూపం లేదు,
నీకు అణుమాత్రమేనా అనురాగరూపం లేదు,
నీకు అణుమాత్రమేనా సురాగరూపం లేదు,
నశింపులేని ఎరుకని, సామరస్యాన్ని, గగనసమానుణ్ణి.

41

నిన్ను ధ్యానించేవాడు లేడు, నీకు ధ్యానసమాధీ లేదు,
నీ హృదయంలో ధ్యానం లేదు, దానికి బయటా ఏమీ లేదు,
ధ్యానించవలసిన వస్తుకాలాలేవీ నీ హృదయానికి లేవు,
నేను జ్ఞానామృతాన్ని, సామరస్యాన్ని, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

42

నాకు నువ్వు లేవు, గొప్ప గురువు లేడు, శిష్యుడు లేడు
అయినా నేన్నీకు వివరించింది సారభూత సత్యమే,
నాకు తెలిసిన పరమార్థ తత్త్వం స్వచ్ఛందం, సహజం,
జ్ఞానామృతాన్ని, సామరస్యాన్ని, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి

43

ఇక్కడ నేనొక్కణ్ణే ఆకాశరూపంతో వర్తిస్తున్నప్పుడు
ఆ పరమార్థతత్త్వం ఆనందరూపమెలా కాగలదు?
ఆ పరమార్థ తత్త్వం ఆనందంకానిదెలా కాగలదు?
ఆ పరమార్థ తత్త్వం జ్ఞానం, విజ్ఞానమెలా కాగలదు?

44

ఆ విజ్ఞానమొక్కటే, అది అగ్నికాదు, వాయువు కాదు,
ఆ విజ్ఞానమొక్కటే, అది అవనికాదు, జలం కాదు,
ఆ విజ్ఞానమొక్కటే, అది సమం, గమనవిహీనం,
ఆ విజ్ఞానమొక్కటే, అది ఆకాశసదృశం, విశాలం.


సంస్కృత మూలం

25

నిర్నేతి నేతి విమలో హి కథం వదామి
నిశ్శేషశేషవిమలో హి కథం వదామి
నిర్లింగ లింగ విమలో హి కథం వదామి
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్

26

నిష్కంప కంపరహితం సతతం కరోమి
నిస్సంగ సంగరహితం పరమం వినోదం
నిర్దేహ దేహరహితం సతతం వినోదం
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్

27

మాయాప్రపంచ రచనా న చ మే వికారః
కౌటిల్య దంభరచనా న చ మే వికారః
సత్యానృతేతి రచనా న చ మే వికారో
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్

28

సంధ్యాదికాల రహితం న చ మే వియోగో
హ్యంతః ప్రబోధ రహితం బధిరో న మూకః
ఏవం వికల్పరహితం న చ భావశుద్ధం
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్

29

నిర్నాథనాథరహితం హి నిరాకులం వై
నిశ్చితచిత్తవిగతం హి నిరాకులం వై
సంవిద్ధి సర్వవిగతం హి నిరాకులం వై
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్

30

కాంతారమందిరమిదం హి కథం వదామి
సంసిద్ధసంశయమిదం హి కథం వదామి
ఏవం నిరంతరసమం హి నిరాకులం వై
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్

31

నిర్జీవజీవరహితం సతతం విభాతి
నిర్బీజబీజరహింతం సతతం విభాతి
నిర్వాణబంధ రహితం సతతం విభాతి
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్

32

సంభూతి వర్జితమిదం సతతం విభాతి
సంసారవర్జితమిదం సతతం విభాతి
సంహారవర్జిత మిదం సతతం విభాతి
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్

33

ఉల్లేఖమాత్రమపి తే న చ నామరూపం
నిర్భిన్నభిన్నమపి తే న హి వస్తు కించిత్
నిర్లజ్జమానస కరోషి కథం విషాదం
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్

34

కిం నామ రోదిషి సఖే న జరా న మృత్యుః
కిం నామ రోదిషి సఖే న చ జన్మదుఃఖం
కిం నామ రోదిషి సఖే న చ తే వికారో
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్

35

కిం నామ రోదిషి సఖే న చ తే స్వరూపం
కిం నామ రోదిషి సఖే న చ తే విరూపం
కిం నామ రోధిషి సఖే న చ తే వయాంసి
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్

36

కిం నామ రోదిషి సఖే న చ తే వయాంసి
కిం నామ రోదిషి సఖే న చ తే మనాంసి
కిం నామ రోదిషి సకే న తవేంద్రియాణి
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్

37

కిం నామ రోదిషి సఖే న తేస్తి కామః
కిం నామ రోదిషి సఖే న చ తే ప్రలోభః
కిం నామ రోదిషి సఖే న చ తే విమోహో
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్

38

ఐశ్వర్యమిచ్ఛసి కథం న చ తే ధనాని
ఐశ్వర్యమిచ్ఛసి కథం న చ తే హి పత్నీ
ఐశ్వర్యమిచ్ఛసి కథం న చ తే మమేతి
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్

39

లింగప్రపంచజనుషీ న చ తే న మే చ
నిర్లజ్జమానసమిదం చ విభాతి భిన్నం
నిర్భేదభేదరహితం న చ తే న మే చ
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్

40

నో వాణుమాత్రమపి తే హి విరాగరూపం
నో వారుణమాత్రమపి తే హి సరాగరూపం
నో వారుణమాత్రమపి తే హి సకామరూపం
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్

41

ధ్యాతా న తే హి హృదయే న చ తే సమాధి-
ర్ధ్యానం న తే హి హృదయే న బహిః ప్రదేశః
ధ్యేయం న చేతి హృదయే న హి వస్తుకాలో
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్

42

యస్సారభూతమఖిలం కథితం మయా తే
న స్త్వం న మే న మహతో న గురుర్న శిష్యః
స్వచ్ఛందరూపసహజం పరమార్థ తత్త్వం
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్

43

కథమిహ పరమార్థ తత్త్వమానందరూపం
కథమిహ పరమార్థం నైవమానందరూపం
కథమిహ పరమార్థం జ్ఞానవిజ్ఞాన రూపం
యది పరమహమేకం వర్తతే వ్యోమరూపమ్

44

దహన పవనహీనం విజ్ఞానమేక-
మవనిజలవిహీనం విద్ధి విజ్ఞాన రూపం
సమగమనవిహీనం విద్ధి విజ్ఞానమేకం
గగనమివ విశాలం విద్ధి విజ్ఞానమేకం


Featured image pc: Wikimedia commons

4-11-2024

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%