సమాశ్వాస సౌందర్య గాథ

మొన్న ఒక రోజు కూచుని మొత్తం సుందరకాండ మరోసారి చదివేను. మనశ్శాంతికోరుకునేవారు, తాము తలపెట్టిన పనుల్లో విజయం సిద్ధించాలనుకునేవాళ్ళూ, తమ మనసుని నిర్మలం చేసుకోవాలనుకునేవాళ్ళూ, తమ ఆత్మని ఒక ఔన్నత్యం వైపుగా తీసుకుపోవాలనుకునేవాళ్ళూ, సుందరకాండ పారాయణం చెయ్యడం ఈ దేశంలో తరతరాలుగా ఒక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది. 68 సర్గల ఆ కాండ దానికదే ఒక కావ్యంగా, పవిత్రగ్రంథంగా, రామాయణసారంగా పరిగణనకు నోచుకుంది. మహాభారతం నుంచి విడివడి భగవద్గీత ఎలా ఒక ఆధ్యాత్మిక, యోగవిద్యాగ్రంథంగా గుర్తింపు పొందిందో, సుందరకాండ కూడా రామాయణంతో సమానంగా గౌరవం పొందిందని నేను కొత్తగా చెప్పనక్కర్లేదు.

కాని ఆ కాండ చదివిన ప్రతి ఒక్క పాఠకుడికీ ఒకే రకమైన అనుభూతి సిద్ధిస్తుందని చెప్పలేం. గుంటూరు శేషేంద్ర శర్మకి ఆ కాండ మొత్తం శ్రీవిద్యాసారంగా కనిపించింది. సీతమ్మవారు శ్రీవిద్యగానూ, హనుమంతుడు ఒక శ్రీవిద్యోపాసకుడిగానూ ఆయనకు కనబడ్డారు. తనకి కలిగిన దర్శనాన్ని ఆయన ‘షోడశి,రామాయణ రహస్యాలు’ అనే పుస్తకంగా రాసారు కూడా. ఆ పుస్తకానికి ముందుమాట రాస్తూ విశ్వనాథ సత్యనారాయణ సుందరకాండను శేషేంద్ర చదివినపద్ధతి చూసి నిలువెల్లా చకితుడైపోయాడు కూడా. షోడశిలో గొప్ప విషయమేమిటంటే, శేషేంద్ర తన దర్శనం మొత్తాన్ని వాల్మీకి శ్లోకాల ఆధారంగానే వివరించడం. ఎక్కడా ఒక్క మాట, ఒక్క భావన శేషేంద్ర అదనంగా చెప్తున్నట్టు ఉండదు. చూడబోతే షోడశి చదివాకనే వాల్మీకి సుందరకాండ రాసాడా అనిపిస్తుంది మనకి!

కాని నాకెందుకనో సుందరకాండని అటువంటి ఏదో ఒక దృక్పథానికో, వ్యాఖ్యానానికో కట్టిపడెయ్యలేం అనిపిస్తుంది. అలా చెయ్యడం కృతకంగా కూడా అనిపిస్తుంది. చదివిన ప్రతి సారీ కొత్త సౌందర్యమయ ప్రపంచంలోకి మేల్కొల్పే ఆ కావ్యాన్ని ఏదో ఒక ఆధ్యాత్మిక విద్యాగ్రంథంగా వివరించడం సముద్రాన్ని ఒక చెరువుగా మార్చడానికి ప్రయత్నించడమే అవుతుంది.

అసలు సుందరకాండకి ఆ పేరు ఎందుకొచ్చింది? ఈ ప్రశ్న ఎవరికేనా కలగడం సహజం. దీనికి శ్రీభాష్యం అప్పలాచార్యులు ఇచ్చిన అత్యంత రసమయ వివరణ విన్నాక ఒళ్ళంతా పులకించకుండా ఉండదు. కాని ఆ మహాభావుకుడు అంత మనోహరంగా ఇచ్చిన వివరణ అంతా విన్నాక కూడా, ఒకసారి కాదు, చాలాసార్లు విన్నాక కూడా, సుందరకాండలోని సౌందర్యాన్ని మనం పూర్తిగా పట్టుకోగలిగామని ఎప్పటికీ నిశ్చయంగా చెప్పుకోలేమనిపిస్తుంది. ఉదాహరణకి, ఆ కాండ ఆద్యంతం ఎన్ని పూలు! ఎన్ని పూలు!

సుందరకాండ ఒక పూల కడలి. ఆ కాండ మొత్తాన్ని వాల్మీకి ఎందుకని అంతలా పూల వరదతో ముంచెత్తాడు? సుందరకాండ మీద నేను చదివిన వ్యాఖ్యానాల్లో, విన్న ప్రసంగాల్లో ఒక్కరు కూడా ఈ పూల ఉప్పెన గురించి ప్రస్తావించగా చూడలేదు. శేషేంద్ర వంటి రసజ్ఞుడు కూడా సుందరకాండ అనే మంత్రమహోదధిలో ఈదులాడాలని చూసాడేగాని, ఆ పూలసముద్రం గురించి కనీసం ఒక్కమాట కూడా మాట్లాడలేదు.

కొన్ని చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. రామాయణంలోని ఋతువర్ణనల్లో రాముడు అయోధ్యని వదిలిపెట్టాక మొదటిసారి కనిపించిన వసంతం సుందరకాండలో గట్లు తెంచుకుని మరీ కనిపిస్తుంది. కిష్కింధ కాండలో రాముడి విరహాన్ని వర్ణించడానికి హేమంతఋతువునీ, వర్షాకాలాన్నీ వాడుకున్న కవి, అశోకవనంలో సీత వేదనని చిత్రించే సమయంలో అంత వాసంతసంతోషాన్ని ఎందుకు వర్ణించాడు? అసలు సుందరకాండ మొదలవుతూనే వైడూర్యపు రంగుల్తో మెరిసిపోతున్న పచ్చికబయళ్ళు కనిపిస్తాయి. ఇక హనుమంతుడు సీతను చూసి వెనక్కి రాగానే ఆ సంతోషంలో వానరులంతా చేసిన పని నందన వనంలాంటి ఒక మధువనాన్ని పూర్తిగా కొల్లగొట్టడం.ఈ మధ్యలో కావ్యమంతా పూలు, పూలు, పూలు. ఆ పూలమధ్య హనుమంతుణ్ణి ఎంత వర్ణించినా వాల్మీకికి తనివితీరలేదని చెప్పడానికి మొత్తం పధ్నాలుగవ సర్గ సాక్ష్యమిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ శ్లోకం:

పుష్పావకీర్ణశ్శుశుభే హనుమాన్ మారుతాత్మజః
అశోకవనికా మధ్యే యథా పుష్పమయో గిరిః (14-11)

(మారుతాత్మజుడైన ఆ హనుమంతుడిమీద పూలన్నీ జలజలరాలాయి. అప్పుడు ఆయన అశోకవన మధ్యంలో ఒక పూలకొండలాగా కనిపించాడు)

ఒక్క పూలేనా! సంస్కృత కావ్యసాహిత్యంలో వెన్నెల వర్ణనల్లో తలమానికం అని చెప్పదగ్గ వర్ణన కూడా మనకి సుందరాండలోనే కనిపిస్తుంది. ఇక ఆ కావ్యం పొడుగునా సముద్రాన్ని, నగరాన్ని, రాత్రిని, అంతఃపురాన్ని, అశోకవనాన్ని, రావణుణ్ణి, రాక్షసుల్ని, సీతని వర్ణించడానికి వాల్మీకి వాడిన ఉపమానాలు వాటికవే ఒక వరద. ఆ ఉపమానాలు కాలాన్ని దాటి నిలబడటమే కాదు, ఇప్పటికి కూడా సరికొత్తగా కనిపిస్తుండటం ఆశ్చర్యం. సుందరకాండ తెరిచిన ప్రతిసారీ, ఆ ఉపమానాలు ఎప్పటికప్పుడు సరికొత్తగా తోచి నన్ను నిశ్చేష్టుణ్ణి చేస్తుంటాయి. ఉదాహరణకి, హనుమంతుడి ద్వారా రాముడి మాటలు వినగానే కలిగిన సంతోషాన్ని చెప్పడానికి సీతమ్మ ఇలా అంటున్నది:

త్వాం దృష్ట్యా ప్రియవక్తారం సంప్రహృష్యామి వానర
అర్థసంజాతస్యేవ వృష్టిం ప్రాప్య వసుంధరా (40-2)

(హనుమా! నిన్ను చూసి నీ మాటలు వినగానే నాకు చాలా సంతోషం కలిగింది. సగం పెరిగిన పైరుమీద వానపడ్డ నేలలాగా ఉన్నాన్నేను)

ఏమి ఉపమానం ఇది! సగం పెరిగిన పైరుమీద వాన పడ్డ నేల! ‘అర్థసంజాత్యసేవ వృష్టిం ప్రాప్య వసుంధరా!’. దాదాపుగా ప్రతి సర్గలోనూ ఇటువంటి ఉపమానాలు చదివిన ప్రతిసారీ కొత్తగా సాక్షాత్కరించేవి ఎన్నో కనిపిస్తాయి.

అలాగే లంకలో ప్రవేశించాక సీతాదేవి ఇంకా కనబడక ముందు హనుమంతుడు దుఃఖానికి లోనై మళ్ళా తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ చెప్పుకున్న మాటల్లో రెండు ఉపమానాలు చూడండి:

అధవైనం సముత్ క్షిప్య హ్యుపరిసాగరమ్
రామయోపహరిష్యామి పశుం పశుపతేరివ (13-50)

(లేదంటే , పశువుని యజమానికి అప్పగించినట్టు ఈ రావణుణ్ణి సముద్రం మీదుగా ఎత్తుకుపోయి రాముడి ముందు సమర్పిస్తాను)

అలాగే మరొక శ్లోకం చూడండి:

జిత్వా తు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకు కులనందినీమ్
సంప్రదాస్యామి రామాయ యధాసిద్ధిం తపస్వినే (13-57)

(రాక్షసులందరినీ జయించి, ఇక్ష్వాకు కులానికి సంతోషకారకురాలైన సీతాసాధ్విని, ఒక తపస్వికి తపస్సిద్ధి లాగా రాముడికి సమర్పిస్తాను)

చిన్న ఉపమానాలు. కానీ సముద్రమంత స్ఫూర్తి. రెండూ రామార్పణలే. కానీ మొదటిది పశువుని పశుపతికి అర్పించినట్టు. రెండవది తపస్వికి తపస్సిద్ధిని సమర్పించినట్టు.

కాని ఈ కావ్యశయ్యా సౌందర్యాన్ని దాటి కవి దర్శనంలోని లోతును సంభావించడం మరింత సంతోషకరంగా ఉంటుంది. ఉదాహరణకి ఎంతో పారవశ్యంతో వర్ణించిన ఆ అశోకవనాన్ని చివరికి హనుమంతుడు ధ్వంసం చేసిగాని లంకవదిలి బయటకు రాలేదే! ఎంత రమణీయమైనప్పటికీ ఆ అశోకవనం అసురవనం, దనుజవనం అనే స్ఫురణ హనుమంతుణ్ణి వదిలిపెట్టలేదనే మనకి అర్థమవుతూ ఉన్నది. కాని తిరిగి ఇవతలి ఒడ్డుకు చేరాక తోటి వానరుడి తాళవనాన్ని కూడా అలానే ధ్వంసం చేసారని కవి చెప్పకుండా ఉండటం లేదే!

సుందరకాండ ఒక జీవితకాల పఠనీయ కావ్యం. సంస్కృతంలో ఒక నానుడి ఉంది. ‘మాఘే మేఘే గతం వయః’ అని. అంటే మాఘుడు రాసిన శిశుపాల వధ కావ్యాన్నీ, కాళిదాసు మేఘసందేశాన్నీ చదువుకుంటూ, మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ, చదివిన దాని గురించి మిత్రుల్తో మాట్లాడుకుంటూ ఉండగానే కాలం గడిచిపోయిందని ఆ మాటకి అర్థం. కాని నిజానికి ఒక కావ్యపాఠకుడు తన జీవితకాలాన్ని రసమయం చేసుకోడానికి సుందరకాండ చదవడం కన్నా మేలిమి వ్యాపకం మరొకటి ఉంటుందనుకోను. నిజానికి నాలాంటి అల్పజ్ఞుడికే ఈ కావ్యంలోని ప్రతి పుటలోంచి కనీసం ఒక శ్లోకం గురించి, ఒక పదప్రయోగం గురించి, ఒక ఉపమాలంకారం గురించి ఏదేదో చెప్పుకోవాలన్న ప్రలోభమే ఇంత బలంగా ఉంటే, నిజంగా రసజ్ఞుడైనవాడి సంతోషం ఎలా ఉంటుందో కదా!

ఇదంతా మరొకసారి రాయవచ్చు, ఇంతకన్నా మరింత వివరంగా, మరింత లోతుగా రాసుకోవచ్చుగాని, ఈ సారి సుందరకాండ చదివినప్పుడు నన్ను కట్టిపడేసిన ఒక శ్లోకం, నాకు కళ్ళనీళ్ళు తెప్పించిన ఒకఘట్టం- వాటి గురించి మీతో పంచుకోవాలనే ఈ మాటలు రాయడం మొదలుపెట్టాను.

నిజానికి సుందరకాండ ఇద్దరు వేదనాతప్తమానవుల కథ. అత్యంత వేదనాభరితంగా చిత్రించవలసిన ఘట్టాలు అడుగడుగునా ఉన్నాయి. కాని మహర్షి ఈ కావ్యాన్ని వేదనని పైకెత్తడంకోసం రాయలేదు. వేదన శాశ్వతం కాదని చెప్పడమే సుందరకాండ ప్రయోజనం. ఆ సందేశాన్ని ఈ శ్లోకం, ఈ రెండు పంక్తుల ఈ చిన్ని శ్లోకం ఎంత మహిమాన్వితంగా పట్టుకుందో చూడండి:

అనిర్వేద శ్రియోమూలమ్ అనిర్వేదః పరం సుఖమ్
అనిర్వేదో హి సతతమ్ సర్వార్థేషు ప్రవర్తకః (12-10)

(అనిర్వేదమే శ్రేయస్సుకి మూలం. అనిర్వేదమే అన్నిటినీ మించిన సుఖం. అనిర్వేదమే సకల కార్యాల్నీ సఫలం చేసేది)

రెండు పదాలు. ‘అనృశంస్య’. భారతం మొత్తం సారాంశం ‘అనృశంస’ అన్నపదంలో ఉంది. అనృశంస్య అంటే దయ. తోటిప్రాణిని బాధపెట్టకపోవడం. అది తన జీవలక్షణమని ధర్మరాజు యక్షప్రశ్నలకి జవాబిస్తూ యక్షుడితో చెప్తాడు. అలాగే ‘అనిర్వేదం’ అనే పదం రామాయణ సారాంశంగా చెప్పవచ్చు. రామాయణ కావ్యమంతా వేదన పరుచుకుని ఉంటుంది. కాని ప్రతి ఒక్కసారీ రాముడు ఆ వేదనని అనిర్వేదంతో దాటుతుండటం మనకి అర్థమవుతూ ఉంటుంది కూడా.

ఇక ఈ సారి సుందరకాండ చదివినప్పుడు నా కళ్ళని సజలాలు చేసిన ఘట్టం సీతాదేవి హనుమంతుడితో చెప్పిన కాకాసుర వృత్తాంతం. ‘అమ్మా, నేను నిన్ను చూసినట్టు రాముడికి చెప్పడానికి నాకేదైనా ఒక గుర్తు అందించమం’టే సీతాదేవి అతడికి అందించిన గుర్తు కాకాసుర కథ. ఆ తర్వాతనే ఆమె తన చూడామణి అతడి చేతుల్లో పెట్టింది. ఇద్దరు ప్రేమికుల మధ్య వారి ప్రేమకి నిజమైన గుర్తు వస్తువులు కాదు, నగలు కాదు, కానుకలు కాదు, ఒకరినొకరు అత్యంత గాఢంగా ప్రేమించుకున్నప్పటి ఒక జ్ఞాపకమే అని చెప్పడంలో మహర్షి చూపించిన ఈ మెలకువ నన్ను చకితుణ్ణి చేసింది. ఇక ఆ కథ మొత్తం చెప్తూ, సీతమ్మ ఇలా అంటున్నది:

మత్కృతే కాకమాత్రే తు బ్రహ్మాస్త్రం సముదీరితం
కస్మాద్యో మాహరత్ త్వత్తః క్షమసే తం మహీపతే (38-38)

(నా కోసం ఒక కాకిమీదనే బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించిన ఓ రాజా! అటువంటిది నన్ను అపహరించిన వాణ్ణి ఎందుకు ఉపేక్షిస్తున్నావు?)

ఈ వాక్యాలు చదవగానే నాకు పట్టలేనంత దుఃఖం వచ్చింది. మన జీవితాల్లో కూడా మనల్ని లోకులు కాకులై పొడుస్తున్నప్పుడు భగవంతుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించడం ఎన్నో సార్లు మనకి అనుభవంలోకి వచ్చిన విషయమే. కాని అంతకు మించిన కష్టం కలిగినప్పుడు, ఆ కష్టాన్ని భరించలేకపోతున్నప్పుడు, ఆ కష్టాన్ని, ఆ వేదనని నువ్వు త్వరలోనే దాటగలవని దేవుడి తరఫున ఒక దూత సముద్రాన్ని ఈది మరీ మనదగ్గరకు వచ్చి చెప్తాడే, ఆ సమాశ్వాససౌందర్య గాథనే సుందరకాండ.

1-3-2024

6 Replies to “సమాశ్వాస సౌందర్య గాథ”

  1. మానవ హృదయ లోతుల్లో కలగాల్సిన ఆ మెలకువని, మార్ధవాన్ని జాగృతం చేస్తాయి సుందరకాండ, మీ మాటలూ…🙏🙏

  2. నిత్య నూతనమైన సుందరకాండను ఒక ఆశ్చర్యకరమైన రీతిలో.. అనూహ్య రీతిలో.. అద్భుతంగా పరిచయం చేసి.. మా హృదయాల ముందు సరికొత్తగా ఆవిష్కరించారు.. వేవేల ధన్యవాదాలు సర్..

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%