సౌందర్య సృష్టికర్త

మా అమృత నా కోసం ఇంగ్లాండ్ అంతా గాలించి మరీ Trevor Chamberlain, England and Beyond (2006) పుస్తకం వెతికి పంపించింది. చాన్నాళ్ళుగా ఎదురుచూస్తూ ఉన్న ఒక రంగుల కల ఇన్నాళ్ళకు నా చేతికి అందింది.

ట్రెవర్ ఛాంబెర్లేన్ (1933-) బ్రిటిష్ నీటిరంగుల చిత్రకారుల్లో మాత్రమే కాదు, ప్రపంచంలోని సమకాలిక నీటిరంగుల చిత్రకారుల్లో మొదటివరస గౌరవానికి నోచుకున్న కళాకారుడు. ఆయన తైలవర్ణాల్లో కూడా సిద్ధహస్తుడే అయినప్పటికీ నీటిరంగుల్లో అతడి ఇంద్రజాలం చూపరులని మరింత సమ్మోహనపరుస్తూ ఉంది.

ఈ పుస్తకంలో అరవయ్యేళ్ళ పాటు ఆయన చిత్రిస్తూ వచ్చిన తైలవర్ణాల్లోంచి, నీటిరంగుల్లోంచి ఎంపిక చేసిన చిత్రలేఖనాలున్నాయి. వాటిని ఏదో ఒక ఇతివృత్తం చుట్టూతానో లేదా ఏదో ఒక కాలక్రమానికి తగిన అమరికలోనో కాకుండా సంకలనం చెయ్యడంతో చూపరులు వాటిని ముందస్తు అంచనాలూ, బరువులూ లేకుండా చూసే అవకాశం చిక్కుతున్నది.

బొమ్మల్తో పాటు, రచయిత జీవితం గురించిన ఒక సంగ్రహం, చిత్రలేఖకుడిగా ఆయన శైలీ, దృక్పథాల గురించిన ఒక పరిచయ వ్యాసం కూడా ఉన్నాయి. ఛాంబర్లేను చిన్నప్పుడు స్కూల్లో ఆయనకి డ్రాయింగు నేర్పిన టీచర్ సి.ఆర్. ట్రివేనా అనే ఆమె రాసిన అందమైన ముందుమాట కూడా ఉంది.

అసలు ఎవరేనా చిత్రకారుడు కావాలని ఎందుకు కోరుకోవాలి? మరీ ముఖ్యంగా ట్రెవర్ ఛాంబర్లేను లాగా లాండ్ స్కేప్ చిత్రలేఖనాలు గియ్యడంలో ఒక మనిషికి లభించగల జీవిత సార్థక్యం ఏమిటి? తన ముందుమాటలో ట్రివేనా ఒక రచయిత రాసిన మాటల్తో ఈ ప్రశ్నకు సమాధానమిచ్చింది. అదేమంటే, ఏ రోజేనా నువ్వేదన్నా పని చేసినప్పుడు, నీ తర్వాతి తరాలకు ఒకింత సంతోషం కలిగించే పని చేసావని నీకు అనిపించడం కన్నా మించిన సాఫల్యం మరొకటి లేదని.

అలా చూసినప్పుడు ట్రెవర్ ఛాంబర్లేను తన తరానికీ, తన తర్వాతి తరాలకీ కూడా సంతోషాన్నివ్వగల కొన్ని సౌందర్యశకలాల్ని సృష్టిస్తూ వచ్చాడని అర్థమవుతుంది. అతడు చిత్రించిన ప్రతి కాన్వాసులోనూ, ప్రతి కాగితం మీదా కాంతిని అద్దుకుంటూ పోయేడు. ఆ బొమ్మల్ని ఎవరు చూసినా అన్నిటికన్నా ముందు వాళ్ళు ఆ కాంతి తమమీద వర్షిస్తున్న అనుభూతికి లోనవుతారు.

దాదాపు ఇరవయ్యేళ్ళ కిందట నేను నీటిరంగులు నేర్చుకోడం మొదలుపెట్టినప్పుడు ఏంజెలా గెయిర్ అనే ఆమె రాసిన ఇన్స్ట్రక్షన్ పుస్తకంతో మొదలుపెట్టాను. నీటిరంగుల చిత్రలేఖన సాధనలో ఆ పుస్తకం నాకో పెద్దబాలశిక్ష లాంటిది. ఆ పుస్తకం ద్వారానే ట్రెవర్ ఛాంబర్లేను చిత్రలేఖనాలు నాకు పరిచయమయ్యాయి. మొదటిచూపులోనే నన్ను సమ్మోహితుణ్ణి చేసే మంత్రజాలమేదో ఆ రంగుల్లో, ఆ కుంచెముద్రల్లో, ఆ కాంపొజిషన్ లో ఉంది. చూడటానికి చాలా సరళంగా కనిపిస్తూ, ఎవరేనా సరే ఇట్టే సులువుగా గీసేవచ్చుననే భ్రాంతి కలగచేసే ఆ చిత్రలేఖనాల శైలి నాలాంటివాడికి ఒక జీవితకాలం సాధన చేసినా సాధ్యం కాదని ఇప్పుడు తెలుస్తూ ఉంది.

శైలి పరంగా ట్రెవర్ ఛాంబర్లేనుని ఇరవయ్యవ శతాబ్దపు ఇంప్రెషనిస్టుగా లెక్కేస్తుంటారు. కాని పందొమ్మిదో శతాబ్ది ఇంప్రెషనిస్టు చిత్రకారులకన్నా కూడా అతడిది మరింత సరళశైలి. రూపానికీ, నైరూప్యానికీ మధ్య కనీ, కనబడని ఒక అస్పష్టమైన సరిహద్దులో పొగమంచులాగా కనిపిస్తాయి అతడి చిత్రలేఖనాలు. ఆకృతి పట్ల ఎంతో అవగాహన ఉంటే తప్ప అంత మినిమలిస్టుగా చిత్రాలు గియ్యడం సాధ్యం కాదు. అందుకనే ఈ పుస్తకంలో సంకలన కర్తలు రాసినట్టుగా, ట్రెవర్ ఛాంబర్లేను వస్తువుల్నిగాని, మనుషుల్ని గాని, ఆకృతుల్ని గాని చిత్రించడు. అతడు చిత్రించేది కాంతినీ, నీడనీ మాత్రమే. ఆ వెలుగునీడల అమరికను బట్టి ఆ ఆకృతుల్ని మనం పోల్చుకోవాలి. ఇక కుంచె ముద్రల్లో అతడు మరీ పొదుపరి. ఒక్క ముద్ర కూడా ఎక్కువ ఉండదు. రంగుతో అతడు పూసే ప్రతి పూతలోనూ ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది.

నీటిరంగుల చిత్రలేఖనంలో వెట్-ఆన్-వెట్ టెక్నిక్ ని ట్రెవర్ పూర్తిగా కొల్లగొట్టుకున్నాడు. మామూలుగా చిత్రకారులు ఈ టెక్నిక్ ని ఉపయోగించినప్పుడు చిత్రలేఖనాల్లో వాతావరణమూ, ఆకృతులూ కూడా చాలా మసకమసగ్గా, అస్పష్టంగా ఉండటం కద్దు. అదీకాక, వానాకాలం దృశ్యాలో, శీతాకాలపు పొగమంచునో చిత్రించడానికి మాత్రమే ఆ టెక్నిక్ బాగా పనికొస్తుంది. కానీ ట్రెవర్ ఆ టెక్నిక్ తో సూర్యోదయవేళల్నీ, మిట్టమధ్యాహ్నాల్నీ, సాయంకాల సంధ్యకాంతి నగరాలమీదా, పొలాల మీదా, భవంతుల మీదా వర్షంలాగా కుమ్మరిస్తుండటాన్నీ చిత్రించగలిగాడు. అలా చిత్రించడానికి అన్నిటికన్నా ముఖ్యంగా టోనల్ క్లారిటీ ఉండాలి. అంటే ఆకృతుల్లో ఎక్కడ గాఢమైన నీడలున్నాయో, ఎక్కడ వెలుతురు మధ్యస్థంగా ఉందో, ఏ అంచుల్లో వెలుగు పూర్తిగా పడుతో రంగులు బ్లీచ్ అవుట్ అయిపోయాయో గుర్తుపట్టగలిగే నేర్పు ఉండాలి. ఆ గ్రెడేషన్ ని వీలైనంత త్వరగానూ, సరళంగానూ చిత్రించగలిగే నేర్పు ఉండాలి. ఇప్పుడు సమకాలిక ప్రపంచంలో అగ్రశ్రేణి నీటిరంగుల చిత్రకారులు చియెన్-చుంగ్-వెయి, ఆల్వారో కాస్టగ్నెట్, జోసెఫ్ జబక్విక్, మార్క్ ఫోలీ, ఇవా కార్పిన్స్కా వంటి వారు ఈ టెక్నిక్ ని ఊహించని ఎత్తులకు తీసుకుపోయారు. కాని వీరికి దారి చూపిన దీపధారుల్లో టర్నర్, సార్జంట్ వంటి వారితో పాటు ట్రెవర్ ఛాంబర్లేను కూడా ఉన్నాడని మనం మర్చిపోగూడదు.

టోనల్ క్లారిటీ సాధించాలంటే, ఏ చిత్రకారుడికైనా అతడి పరిశీలనాశక్తినే ప్రధానమైన ప్రాతిపదిక గా ఉంటుంది. ట్రెవర్ ఛాంబర్లేను చిత్రలేఖనాల ముందు నిలబడ్డ ప్రతి ఒక్క వీక్షకుడూ ముందు అబ్బురపడేది ఆ పరిశీలనాశక్తికే.

ఈ పుస్తకంలో పొందుపరిచిన చిత్రలేఖనాల్లో చిత్రకారుడి స్వదేశం మాత్రమే కాదు, మధ్య ప్రాచ్యం, భారతదేశం, ఈజిప్టుల్లోని గ్రామాలు, మనుషులు, కట్టడాలు, బజార్లు కూడా కనిపిస్తాయి. తనకి సాంస్కృతికంగా ముందెన్నడూ పరిచయం లేని స్థలాల్ని చిత్రిస్తున్నప్పుడు కూడా అతడు ఆ తావుల్లోని ఆత్మని పట్టుకోగలగడానికి కారణం ఆ పరిశీలనా శక్తినే అని మనం నిస్సందేహంగా ఒప్పుకోవచ్చు. కైరో శివార్లలో గుడారాలు వేసుకున్న బెడోయిన్లను చిత్రించినా, లేదా ఉత్తర ఇరాన్ లో సంధ్యాధూళిలో గొర్రెల్ని తోలుకుపోతున్న గొర్రెల కాపరుల్ని చిత్రించినా, రాజస్తాన్ లో దుంగర్ పూర్ లో సరసు దగ్గర స్నానాలు చేస్తున్న యాత్రీకుల్ని చిత్రించినా, ఆ దృశ్యాల్లో కెమేరా పట్టుకోలేని సున్నితమైన సంస్కృతి ఏదో ఆ చిత్రకారుడి కుంచె పట్టుకోగలిగింది అనిపిస్తుంది.

ఇందులోని ప్రతి ఒక్క చిత్రలేఖనం గొప్ప పద్యాల్లాగా మళ్ళా మళ్ళా పునశ్చరణ చెయ్యదగ్గది. నిజానికి ఈ చిత్రలేఖనాల్ని మళ్ళా స్వయంగా తిరిగి గీసుకుంటేనే ఆ చిత్రకారుడు పాటించిన మెలకువలు మనకి బోధపడతాయి.

ఆధునిక చిత్రకారుల్లో ఒక వర్గం తమ మనసులో, అంతరంగంలో తాము దర్శిస్తున్న ఆకృతుల్నీ, దృశ్యాల్నీ లేదా నైరూప్య భావనల్నీ చిత్రించడానికి ఎక్కువ ఇష్టపడతారు. చిత్రలేఖనం గురించి పెద్దగా తెలియని మామూలు చూపరులు మాడరన్ ఆర్ట్ అని భావించేది అటువంటి చిత్రలేఖనాన్నే. కాని మరో వర్గానికి తమ కళ్ళముందు కనిపిస్తున్న దృశ్యాల్ని వాటి వెలుగునీడల్తో పట్టుకోవడం మీద ఎక్కువ ఆసక్తి. చిత్రకళావిమర్శకులు దీన్ని perceptual art అనీ, representative art అనీ అంటారు. నా దృష్టిలో రెండో తరహా చిత్రలేఖకుడికి ఎక్కువ సాధన కావాలి. తాను చూస్తున్న దృశ్యాన్ని తిరిగి తన సంవేదనల్లోకి అనువదించుకుని దాన్నొక చిత్రలేఖనంగా అతడు మలిచినప్పుడు ఆ చిత్రం ఎదట నిలబడ్డ సందర్శకుడికి ఏకకాలంలో భూమ్మీదా, స్వర్గంలోనూ కూడా ఉన్న అనుభూతి కలుగుతుంది. అతడు చూసే దృశ్యం ఈ భూమ్మీదదే. ఇక్కడి నేలనే, ఇక్కడి ఆకృతులే. కాని వాటిలో కనిపించే సౌందర్యం మాత్రం ఇంతదాకా ఎవరూ చూడనిది. ఆ సౌందర్యం నీ కళ్ళముందు సాక్షాత్కరించిన క్షణం స్వర్గం భూమ్మీదకు దిగినట్టు ఉంటుంది. కాబట్టే ట్రెవర్ ఛాంబర్లేను లాంటి చిత్రకారులు ఒక కొత్త బొమ్మ గీసినప్పుడల్లా మనముందొక స్వర్గాన్ని కొత్తగా ప్రతిష్ఠిస్తూనే ఉంటారు.

13-4-2024

9 Replies to “సౌందర్య సృష్టికర్త”

  1. ట్రెవర్ ఛాంబర్లేన్ చిత్రాల పరిచయం తో పాటు చిత్రకళకు చెందిన అనేక విషయాలు తెలిపారు. పుస్తకం ముందుమాట లోని వాక్యం లలితకళలన్నింటికీ వర్తిస్తుంది. ఏదైనా కళకు ధ్యాన మగ్నత ఎంత అవసరమో ఈ చిత్రాలు చూస్తుంటే తెలుస్తుంది.

  2. మీరు కలగని, తపస్సు చేసి, అన్వేషించి,తపన పడి,సాధన చేసి, సత్యం జ్ఞానం దిశగా ప్రయాణించి, కనుచూపు మేరలో మీ కల సాకారం కాబోతున్నపుడు ఆగి మా వంటి వారికోసం మొదటి అడుగు నుంచి మీరున్నదాకా జరిగినవన్నీ చెబుతారు.అందుకే మీ వాక్యం సహజ సుందరమై,మాకు బ్రతుకు చిత్రాన్ని చూపెడుతుంది.మీకు కృతజ్ఞతలు.నమస్సులు.

    1. హృదయపూర్వక ధన్యవాదాలు మేడం

  3. నమస్సులు. ఈ చిత్రలేఖ
    నాల్ని తిరిగి వేస్తారని ఎదురుచూపు. ఆ మెలకువల గురించి ఇంకొన్ని అద్భుతమైన మాటల పరంపర ,, ముచ్చట గొలిపే వాక్య నిర్మాణాలు చదివితే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ సౌందర్యం మీ పలుకుల్లో , చిత్రాల్లో చూసే భాగ్యం లభిస్తుంది. తమకు తెలుసో , లేదో… మీరున్న కాలం లో నేను ఉన్నందుకు నన్ను నేనే అభినందించుకుంటూ సుమాంజలి.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%