
ఉస్తాద్ రాషిద్ ఖాన్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని విన్నప్పణ్ణుంచీ మనసులో వెలితిగా ఉంటోంది. కురవడానికి ఆకాశాన్ని ఆవరించిన మబ్బు చిరుజల్లు కురిపిస్తుండగానే సగంలోనే అదృశ్యమైపోయినట్టుగా ఉంది. ఈ లోకంలో నిజంగా జీవించవలసింది అటువంటి వాళ్ళు కదా. ఉక్కబోస్తున్న ఈ ప్రపంచంలో ఒక తెమ్మెరలాగా వీస్తూ ఉండవలసిన అటువంటి హృదయాలు కనుమరుగైపోయేక ఈ లోకం ఎంత నిరుపేదగా మారిపోతుందో తెలుస్తూనే ఉంటుంది.
రాషిద్ ఖాన్ (1968-2024) వయసులో నా కన్నా చిన్నవాడు. నాకన్నా ముందే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాని సుకృతుడు. మతవిద్వేషాన్ని నిష్ఠగా ఆచరిస్తున్న నా సమకాలిక భారతదేశంలో అతడు కృష్ణభక్తిగీతాలు పాడగలిగాడు. పరుగెత్తడంలో ఎక్కడ వెనకబడిపోతామో అని మొత్తం జీవితాన్నే పరుగ్గా మార్చుకుంటున్న నా సమకాలిక సమాజంలో అతడు నెమ్మదిని సాధన చేసాడు. అతడు ఏ చెట్టుకింద కూచుని రాగాలాపన చేస్తున్నాడో ఆ దారినపొయ్యేవాళ్ళు అతణ్ణి దాటి ముందుకుపోలేనట్టుగా కట్టిపడేసాడు. అతడు యమన్ రాగం ఆలపిస్తే సాయంసంధ్య చీకటిలోకి కరిగిపోకుండా అలానే నిలిచిపోయేట్టు చేసాడు. అతడు లలిత్ రాగం ఆలపిస్తుంటే ఉషస్సు గంగాతీరాన్ని విడిచిపెట్టకుండా మరికొంత సేపు అక్కడే ఉండిపోతుందనిపిస్తుంది. రాష్ట్రాల మధ్య గీతలు గీసుకుంటూ, ఆ గీతల్ని కొలుచుకుంటూ ఉండే కవులూ, కళాకారులూ తామరతంపరగా వర్ధిల్లుతున్న దేశంలో ఒక గాయకుడు ఉత్తరప్రదేశ్ లో పుట్టి బెంగాల్ కీ, బంగ్లాదేశ్ కీ కూడా సొంతమనిషి గా మారిపోవడం ఒక జానపద కథలాగా తోచే విషయం.
ఉస్తాద్ రాషిద్ ఖాన్ తాన్ సేన్ వంశంలో 31 వ తరానికి చెందిన గాయకుడని విన్నాను. అన్ని తరాల తాన్ పురల తంత్రీ స్వరాలు అతడి రక్తంలో ప్రవహిస్తూనే ఉండేవని మనం నమ్మవచ్చు. అతడి రాగాలాపన, స్వరాలాపన- రెండింటిలోనూ కూడా బిడ్డని అప్యాయంగా హత్తుకునే తల్లి ప్రేమ వినిపిస్తుంది. అతడు ప్రేమగీతాలు పాడినా కూడా వాటినొక మధురగంభీరఛాయ అల్లుకున్నట్టు ఉండటానికి కారణం అతడి గళం ఒక వ్యక్తిదీ, ఒక దేహానిదీ కాదు. అది ఒక అవిచ్ఛిన్న సంప్రదాయపు గాత్రమని తెలుసుకోడానికి మనకి ఆట్టే సేపు పట్టదు. గంగా, యమునా జలాల మీంచి వీచేగాలుల్తో పాటు, సాయంకాలపు నమాజ్ వినిపించే సంధ్యాకాంతితో పాటు, దేవాలయాల్లో పొద్దుటిపూట అల్లుకునే ఒక మంగళమయసునాదంతో అతడి సంగీతం నిండిపోయి ఉందని తెలియడానికి మనకి హిందుస్తానీ సంగీత పరిజ్ఞానంతో ఏమీ పనిలేదు.
రాషిద్ ఖాన్ హిందీ చలనచిత్రగాయకుడుగా అకస్మాత్తుగా ఒక తారగా మారాడు. కాని అతడి నిజమైన సంగీతోత్సవం అతడి రాగప్రస్తారాల్లో, అతడి భజనల్లో వినాలి మనం. రాంపూర్-సహస్వాన్ ఘరానా సంప్రదాయంలో ఉండే ఆ మధ్య, విలంబిత లయల్లోని రాగాలాపన మొగలిపూల గాలి లాంటిది. అది మన మనసుని తియ్యగా, నెమ్మదిగా, మృదువుగా కోస్తూ ఉంటుంది. అప్పుడు మన మనసులో చెలరేగే బాధ మనకేదో ఓదార్పుని, మనమిప్పటిదాకా ఎన్నడూ చూసి ఉండని ఒక ఓదార్పుని పరిచయం చేస్తుంది. అదొక వంశం కొన్ని తరాలపాటు సాధనచేసి మనకి అందిచించిన ఒక స్వరకల్ప చికిత్స.
వినండి, రాషిద్ ఖాన్ స్వరసమ్మోహనం ఎలా ఉంటుందో చూడటానికి ఒక రాగాలాపన, ఒక భజన్, ఒక ఫిల్మ్ గీతం-మూడూ ఇక్కడ పంచుకుంటున్నాను. విని, కొన్ని క్షణాలేనా, ఆ మధురగాయకుడి సన్నిధిలో గడపండి. వినడం పూర్తయ్యాక మనసులోనే ఆయనకొక ప్రేమపూర్వక నమస్కారం సమర్పించండి.
13-1-2024
శుభోదయం🙏
భోగి పండుగ శుభాకాంక్షలండీ!
శుభాకాంక్షలు మేడం
బాగుంది మీ పోస్ట్… కానీ మనసును ఖాళీ ఖాళీ చేసి వెళ్ళింది..
అవునా
అయ్యో, ఆయన బ్రతికుండగా పాపం, ఆయన పాట ఒక్కటీ వినలేదు.
ఇప్పుడు మీ పుణ్యమా అని వింటున్నాను. ఆ భజన్ వింటుంటే మనస్సు ఆర్ద్రమై ప్రసన్నతతో నిండిపోతున్నది.
ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ దినాల శుభాకాంక్షలు.
ధన్యవాదాలు, శుభాకాంక్షలు.
సంక్రాంతి శుభాకాంక్షలు సార్
శుభాకాంక్షలు సార్
వారి సంగీతాన్ని మీ సాహిత్యంలో ఆర్ద్రంగా విన్నాము.
ధన్యవాదాలు సార్
అరుదైన అమృతస్వర గానం .మనసులో తరంగించటం మనమే పాడుకుంటున్నామా అన్న తాదాత్మ్యం కలిగించడం అద్భుతం
ధన్యవాదాలు సార్
మీ Post చూడగానే.. చాల రోజుల తరువాత సూర్యుని చుాసినట్టు ఉంది.
.•♫•♬•Ustaad Rashid Khan•♬•♫•. గారి సాధనకు దిక్కిన పురస్కారలో అత్యుత్తమ పురస్కారం ఈ స్మృతి వచనలు అనటంలో ఎటువంటి సందేహం లేదు.. .First paragraph చదువుతుంటే కొంపెల్ల జనార్ధనరావు పై శ్రీ శ్రీ రాసిన స్మృతి గీతంతో పోల్చదగినవి.. గురువుగారు🙏
.•♫•♬•Ustaad ji•♬•♫•. అ తానులోని గుడ్డ అని అర్థం అయింది గాని DJ(Donkey & Jockey) హోరు లో కొట్టుకు పోయే మా generation ఇటువంటి కోకిల సంగీతని అస్వాదించడం కాస్త కష్టమే.. 😍👍
మీకు నచ్చినందుకు సంతోషం.
కురవడానికి ఆకాశాన్ని ఆవరించిన మబ్బు చిరుజల్లు కురిపిస్తుండగానే సగంలోనే అదృశ్యమైపోయినట్టుగా ఉంది.
Befitting tribute.
ఆయనకొక ప్రేమపూర్వక నమస్కారం sir
ధన్యవాదాలు సార్