స్కాట్లాండ్ పూలగుత్తి

మా అమృత యుకె నుంచి వస్తున్నప్పుడు ఏదైనా కవిత్వం తీసుకురమ్మంటే A Year of Scottish Poems (2018) పట్టుకొచ్చింది. గేబీ మోర్గాన్ అనే ప్రసిద్ధ సంకలనకర్త సంకలనం చేసిన కవితలకి, మరొక ప్రసిద్ధ స్కాటిష్ కవయిత్రి జాకీ కే ముందుమాట రాసింది.

స్కాట్లాండ్ కవిత్వంతో నాకు ఇంతకు ముందు కొంత పరిచయం లేకపోలేదు. సర్ వాల్టర్ స్కాట్ గేయం లోకిన్వార్, ఇంటర్ లో చదివింది, ఇంకా చెవుల్లో మోగుతూనే ఉంది. కృష్ణశాస్త్రి పదే పదే ఆరాధనా పూర్వకంగా రాస్తూ ఉండటం చూసి రాబర్ట్ బర్న్స్ ని చదవడానికి ప్రయత్నం చేయకపోలేదు. మరీ ముఖ్యంగా రాబర్ట్ లూయీ స్టీవెన్ సన్ బాలగేయాలు నా హృదయానికి అతి దగ్గరగా వచ్చిన కవిత్వం కూడా. కొన్నేళ్ళ కిందట డగ్లస్ గిఫర్డ్, అలాన్ రియాచ్ అనే వారు సంకలనం చేసిన Scotlands, Poets and the Nation (2004) అనే పుస్తకం కూడా కొనుక్కున్నానుగానీ, స్కాటిష్ యాస వల్ల, ఆ కవిత్వ ప్రపంచంలోకి ఎన్నిసార్లు ప్రవేశించాలనుకున్నా మొదటిపేజీల్లోనే ఆగిపోతూ వచ్చాను.

కానీ ఈ సంకలనం నన్ను చేయిపట్టుకుని నడిపిస్తూ ఉంది. ముఖ్యంగా పుస్తకం చివరలో స్కాటిష్ పదాల్లో కఠినమైనవాటికి ఇంగ్లిషు అర్థాలు ఇవ్వడం వల్ల కూడా ప్రవేశం మరీ అంత కష్టమనిపించలేదు. యాభై కవితలు చదివేటప్పటికి పదకోశంతో పనిలేకుండానే స్కాట్ పదజాలం చాలావరకూ బోధపడటం మొదలయ్యింది.

స్కాట్లాండ్ కొండలదేశం, నదుల దేశం, సరసుల దేశం. ఉత్తరసముద్రపు గాలులకి ఎప్పుడూ వణికిపోతుండే పూలరేకలాంటి దేశం. ఆశ్చర్యమేమంటే, ఈ కవితల్లో ఆ ప్రకృతి సౌందర్యం అంతే తాజాగా నవనవలాడుతూ కనిపిస్తుండటం. ఆ కవిత్వం చదువుతున్నంతసేపూ మన కవిత్వం గుర్తొస్తూనే ఉంది. మనం అవసరానికి మించి ‘మాడర్నైజ్’ అయిపోయామనీ, మరీ తెలివి మీరిపోయామనీ కూడా అనిపిస్తూ ఉన్నది. మన కవిత్వాన్ని ఆధునిక యుగంలోకి తీసుకుపోయే క్రమంలో మనం ఇంగ్లిషు కవుల వైపు చూసినంతగా ఐరిష్, స్కాట్ కవులవైపు చూడలేదని కూడా తెలుస్తూ ఉన్నది. బహుశా కృష్ణశాస్త్రి ఒక్కడే బర్న్స్ ని గాఢంగా ప్రేమించినవాడు, కాబట్టే, ఇద్దరి కవిత్వంలోనూ ఆ కోయిలలూ, ఆ వసంతాలూ, ఆ పూలతోటలూ చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నాయి.

ఈ సంకలనకర్త పూర్వకాలపు, సమకాలపు కవుల కవిత్వాల్ని వెంటవెంటనే పొందుపర్చినందువల్లా, ఆ కవుల గురించిన జీవితవిశేషాలేవీ చెప్పనందువల్లా, ఏ కవిత పూర్వకవితనో, ఏది మన కాలం నాటి కవితనో తెలియకుండా ఉంది. అలా సంకలనం చేయడంలో ఆమె ఉద్దేశ్యం కూడా బహుశా, కాలం స్కాటిష్ కవిహృదయాన్ని ఏ విధంగానూ ప్రభావితం చెయ్యలేకపోయిందని చెప్పడమే కావచ్చు. దాదాపుగా ఆ కవిత్వమంతా ఒక్కలానే ఉంది, ఆ కవితలన్నిటిలోనూ అదే అందం, అదే అమాయికత్వం.

పుస్తకానికి జాకీ కే రాసిన ముందుమాటలో Poetry, both oral and written, is the national art of Scotland అని రాసింది. ఈ మాట ఇంతకు ముందు ఒక మధ్యాసియా కవిత్వసంకలనంలో కూడా చదివాను. కవిత్వం మధ్యాసియాదేశాల సొత్తు అని. ఒక బ్రెజీలియన్ కవిత్వసంకలనంలో కూడా చదివాను, బ్రెజిల్లో అందరికన్నా అత్యధిక గౌరవానికి, ప్రేమకి నోచుకునేది కవులేనని. ఏ దేశానికి ఆ దేశం ఇలా అనుకోవడం చాలా బాగుంటుంది. అందులోనూ ఒక సంకలనం తెరవగానే మొదటి పేజీలోనే ఇటువంటి వాక్యం కనిపించాక ఆ పుస్తకం హృదయానికి దగ్గర కాకుండా ఎలా ఉంటుంది?

366 కవితలు. రోజుకొక్కటి చొప్పున ఏడాది పాటు చదువుకుంటూ ఉండవలసిన కవితలు. అప్పుడే మూడు నెలల కవితలు చదివేసి నాలుగో నెలలో అడుగుపెట్టాను. స్కాట్లాండ్ నుంచి తెచ్చిన తాజాపూలగుత్తి లాగా ఉంది. మనం పొద్దున్నే ఏటిఒడ్డుకో, తోటదాపుకో నడుచుకుంటూ వెళ్ళివచ్చినప్పుడు, ఆ పూలగాలీ, ఆ పచ్చిగాలీ ఇంకా మనల్ని అంటిపెట్టుకుని ఉండగానే, వస్తూ వస్తూ ఊరికినే రాలేక, దారిలో కనబడ్డ నాలుగు పూలు తెంచుకుని మరీ వస్తామే, అలానే ఇందులోంచి రెండు కవితలు తెలుగులోకి తెంపి మీకు అందివ్వకుండా ఎలా ఉండగలను?

హ్యూ మెక్ డెర్మిడ్ (1892-1978) ఇరవయ్యవ శతాబ్దపు స్కాటిష్ కవిత్వ వైతాళికుల్లో ఒకడు. ప్రకృతి ప్రేమికుడు. ఆయన కవిత చూడండి:

చిన్ని తెల్లగులాబి

(జాన్ గావ్స్వర్త్ కి)

మొత్తం ప్రపంచపుగులాబీతో
నాకు పనిలేదు.
నేను కోరుకునేది
స్కాట్లాండ్ లోని చిన్ని తెల్లగులాబి.
అది ఘాటుగా, తీపిగా పరిమళిస్తూనే
హృదయాన్ని కోసేగలదు.

రాబర్ట్ లూయీ స్టీవెన్ సన్ (1850-1894) పేరు వినని వారు ఎవరుంటారు? ఆయన ట్రెజర్ ఐలండ్ మన చిన్నప్పుడు ఇంగ్లిషు నాన్ డిటెయిల్డ్ రీడింగ్ లో ఉండేదని మనమెలా మర్చిపోతాం? కాని అతడు గొప్ప బాలగేయాలు కూడా రాసాడు. చాలా మామూలు లోకంలోనే మార్మిక లోకాల్ని మేల్కొల్పగలకవి. ఈ కవిత చూడండి:

కొండదారుల్లో

కొండదారుల్లో, గ్రామసీమల్లో
మామూలు మనుషులు, వృద్ధులు కూడా
గులాబీరంగులో కనిపించేచోట
కన్నెపిల్లల నయనాలు
సవ్వడిచేయని చోట
గొప్ప నిశ్శబ్దమొకటి
మనల్ని పలకరిస్తూ
ఆశీర్వదిస్తుండేచోట
ఆ కొండలోయల్లో
ఆమె ప్రేమాస్పదసంగీతం
వినిపిస్తూంటుంది
అదృశ్యమవుతుంటుంది.

ఒకప్పుడు నేను తిరుగాడిన
ఆ పర్వతశ్రేణుల్ని
మళ్ళా ఎక్కాలని ఉంది
పక్షిగానాలకు
మత్రముగ్ధలైపోయే
ఆ ఎర్రమలల్లో
పచ్చికబయళ్ళతో మిలమిల్లాడుతూ
ఎండిపోయినా కూడా
అగణితవర్ణాల్లో తళతళ్ళాడే
ఆ ఆకుపచ్చనిలోయల్లో
రాత్రి కాగానే
గ్రహతారకలు తళుకులీనుతో
లోయమొత్తం
దీపాలు వెలిగించినట్టుంటుంది.

ఓహ్! అక్కడ కలల్లో, మెలకువల్లో
ఆ నిశ్శబ్దసమ్మోహనంలో
సంతోషిస్తో, తిరుగాడుతో
ప్రశాంతంగా ఊపిరిపీలుస్తో

ఓహ్! అక్కడ ఆ పూలమధ్య
పచ్చికమీద
మహాచలత్ సౌందర్యమొకటి
వినిపిస్తూ తరలిపోతుంది
ఇంకక్కడ మిగిలేవి
నదులూ, గాలులూ
జీవితమూ, మృత్యువూ.

ఏంగస్ పీటర్ కాంప్ బెల్ (జ.1952) సమకాలిక స్కాటిష్ కవుల్లో అగ్రశ్రేణి కవుల్లో ఒకడు. ఆయన కవిత చూడండి:

దేవుడు దయామయుడు

ఒద్దిగ్గా కుదురుకుని
జీవితప్రయాణం మొదలుపెడతావు.

దేవుడు దారిలో ఎక్కడో
ఈ దుమ్ములో ఇంత ప్రాణం ఊదిపెడతాడు.

అప్పుడు నీకో క్షణంతో, స్త్రీతో, కాగితంతో, కవితతో
లంకె కలుస్తుంది.

30-1-2023

10 Replies to “స్కాట్లాండ్ పూలగుత్తి”

  1. శుభోదయం సర్, అవునుదేవుడు దారిలో ఎక్కడో
    ఈ దుమ్ములో ఇంత ప్రాణం ఊదిపెడతాడు.

    అప్పుడు నీకో క్షణంతో,, కాగితంతో, కవితతో, మీలాటి వారితో
    లంకె కలుస్తుంది…ధన్యోస్మి..

  2. “ ఇందులోంచి రెండు కవితలు తెలుగులోకి తెంపి మీకు అందివ్వకుండా ఎలా ఉండగలను?” ❤️
    Absolutely beautiful poetry and thank you for bringing it to us in the most beautiful Telugu. 🙏🏽

  3. అచ్చమైన కవి
    దేశనౌకకు తెరచాప
    రెపరెపలాడే దేశీయపతాక

    అని చెప్పక చెప్పారు.

  4. మెుత్తం ప్రపంచ సాహిత్యంతో
    మాకు పనిలేదు
    “మా గురువుగారి కంటపడ్డది”
    మాకు ఒంటపడితే చాలు
    జీవితాలు కుదురుగా
    పయనించడానికి/పరిమళించుటానికి

    అంధకారనికి అక్షరాన్నికి
    జడత్వానికి చైతన్యాన్నికి
    లంకె కలవడానికి 🙏

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%