బసవన్న వచనాలు-22

బసవన్న పేరు మీద లభ్యమవుతున్న మొత్తం 1414 వచనాల్లో మొదటి 960 వచనాలూ షట్ స్థల వచనాలుగానూ , మిగిలిన 454 వచనాలూ అధికవచనాలుగానూ సంకలనకర్తలు వర్గీకరించారు. మొత్తం 960 వచనాల్లోనూ ఈ ఇరవై ఒక్క రోజులుగా 275 వచనాలు నేను తెలుగులో మీతో పంచుకున్నాను. అధికవచనాలనుంచి కూడా కొన్ని అనువదించాలని అనుకున్నానుగానీ, అవి షట్ స్థల వచనాలకు వివరణగానో, కొనసాగింపుగానో మాత్రమే కనిపిస్తున్నందువల్ల, ఆ ఆలోచన విరమించుకున్నాను. వచనాల్ని ఇంగ్లిషులోకి, తెలుగులోకి అనువదించిన చాలామంది అనువాదకులు కూడా తమ అనువాదాన్ని షట్-స్థల వచనాలకే పరిమితం చేసుకున్నారు. కాబట్టి నేను కూడా అధికవచనాలనుంచి అనువదించడానికి బదులు షట్ స్థల వచనాలనుంచే మరొక 25 వచనాలను తెలుగు చేస్తున్నాను. దీనితో మొత్తం 300 వచనాలు అనువదించినట్టు అవుతుంది. ఈ 25 వచనాల్లో ఇవాళ పది, రేపు పదిహేను వచనాలు అందిస్తున్నాను.


276

రేపూ, మాపూ
మర్నాడూ
అనొద్దు.

శివుణ్ణి
వేడుకోడానికి
ఈ రోజే
మంచిరోజు.

హరుణ్ణి
వేడుకోడానికి
ఈ రోజే
మంచిరోజు.

కూడలసంగముణ్ణి
మానక
తలచేవాడికి
ఈ రోజే
మంచిరోజు. (174)

277

సత్యమైందైతేనే
సరుకు
నింపాలి.

జాగ్రత్త
జాగ్రత్తయ్యా.

మనసు
ధారాపాత్ర.

కూడలసంగన
శరణులు
ఒప్పుకోని సరుకుని
మరెవరూ
ఒప్పుకోరు . (238)

278

ఇలా రావయ్యా
ఇలా రావయ్యా
అని భక్తులంతా
కూచుని
దగ్గరకు
పిలుస్తుంటే

చేరి శరణంటూ
నోటికి అడ్డుపెట్టుకుని
సేవకుడిలా
మెల్లగా మాట్లాడుతూ
వినయశీల ధ్యానంలో
ఉంటే

కూడలసంగమదేవుడు
ప్రమథులముందు
పైకెత్తుకుంటాడయ్యా! (245)

279

కరిగించి
నా మనసులో
మాలిన్యం పోగొట్టయ్యా

గీటుగీసి
వన్నెకు పుటంపెట్టి
చూడయ్యా.

చరచి,
విరచి
మెత్తబడి
శుద్ధబంగారంగా
మెరుగెక్కాక

నీ శరణులపాదానికి
కడియంగా తొడిగి
కరుణించు
కూడలసంగమదేవా! (251)

280

వాళ్ళూ వీళ్ళూ
అనిలేకుండా
అందరూ వచ్చి
కాళ్ళమీదపడి
మొక్కుతుంటే
ఉబ్బిపొయ్యాను.

అహంకారం పెరిగిందయ్యా

ఆ అహంకారానికి
నిప్పుపెట్టి, కాల్చి
మెరుగుపెట్టి
మెరిసేలా చెయ్యి
కూడలసంగమదేవా! (253)

281

పొడిపించుకుని
భక్తులయ్యామంటారు.

తలనరుక్కుని
భక్తులమయ్యామంటారు.

గుండుకొట్టించుకుని
భక్తులమయ్యామంటారు.

తిట్లు తిట్టించుకుని
భక్తులమయ్యామంటారు.

కూడలసంగన
శరణుల్ని పట్టించుకోక
నా భక్తి సగమయ్యింది. (255)

282

మనసుకి
నచ్చని
మాట.

మాటకు
నచ్చని
మనసు.

తక్కువో
ఎక్కువో
పలుకుతాను.

ప్రతి ఒక్కమాటనీ
గెలవడానికి
పట్టు పట్టి పోరాడతాను.

కూడలసంగన
శరణులను
నా ప్రభువులంటాను. (256)

283

హృదయంలో కత్తెర
నాలుక చివర బెల్లం
ఓహో!

ఆడాను
ఓహో!
పాడాను
ఓహో!
ప్రతి రాత్రీ
శివరాత్రి చేసాను
ఓహో!

నేను నాలానే
మనసు మనసులానే
కూడలసంగమదేవుడు
తాను తనలానే. (280)

284

కంసాలి
ఆభరణానికి
వన్నెపెట్టినట్టు
సంభాషణలకి
తగ్గట్టుగా మాటలు
మాటాడతాను.

కాని గీసి చూడటానికి
పనికి రాదు.

చూడు
మనసులో ఒకటి
హృదయంలో ఒకటి
వచనంలో ఒకటి.

కూడలసంగమదేవా
నేను భక్తుణ్ణనే
అబద్ధపు మసకని
ఎలా వర్ణించేది? (290)

285

పాలుపారే ఏటిలో
బెల్లపు బురద
చక్కెర ఇసుక
మీగడల అలలనురుగులాగా
ఆద్యుల వచనాలుండగా

మళ్ళీ మరో బావి తవ్వి
ఉప్పునీళ్ళు
తాగేవాడిలాగా
అయ్యింది
నా బతుకు

చూడయ్యా
కూడలసంగమదేవా! (291)

15-12-2023

6 Replies to “బసవన్న వచనాలు-22”

  1. ఎంత బిజీగా ఉన్నా వారానికి ఒక రోజైనా మీ బ్లాగుకి వచ్చి మీ రచనలు చదువుతూనే ఉంటా. మీ కృషికి అబ్బురపడుతునే ఉంటా. ఇవాళ వచనాల్లో 279 చదివాకా ఆశ్చర్యం, ఆనందం కలిగేయి. కనకప్రసాదుని దృష్టిలో ఉంచుకుని రాసిన కింది లంకెలో రెండో కవిత చూడండి.

    https://eemaata.com/em/issues/202102/25084.html

  2. కూడలసంగమదేవా
    నేను భక్తుణ్ణనే
    అబద్ధపు మసకని
    ఎలా వర్ణించేది?
    నేటి భక్తి మీద బలమైన ప్రశ్న.

    ఆధునికంగా చెప్పాలంటే
    సైలెంట్ ఫ్రెండ్ తో చాటింగ్ లాగా ఉంది
    మనసును పరిపరివిధాల వెళ్లబోసుకోవడం
    ఆగని తపన తృష్ణ ధ్యాస అన్నీ కనిపిస్తాయి ఈ వచనాల్లో.

  3. సత్యమైందైతేనే
    సరుకు నింపాలి..🙏

    ఒకొక్క వచనం
    ఒ సౌర కుటుంబంలా..
    ఒకొక్క పదము
    ఒ గ్రహంలా
    పట్టి పీడిస్తున్నాయి..

    కుాడలసంగముణి
    ఆభరణములకు
    మెరుగు పేట్టే
    భాగ్యము మీకు..

    వట్టిని
    విభుాతిగా నొసటి
    దిద్దుకునే అనుభూతి
    మాకు కలిగించిన
    బసవేశ్వరుడికి
    సహస్ర ప్రణామాలు🛐

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%