
భారతదేశంలో భక్తికవుల గురించీ, భక్తి ఉద్యమాల గురించీ తెలుసుకోవడం కేవలం ఆధ్యాత్మికవిషయం కాదు. అది ఆధ్యాత్మికంగా ఎంత ఆసక్తికలిగించే విషయమో, సామాజిక-రాజకీయ సందర్భంలో కూడా అంతే ఆసక్తికరమైన విషయం.
ఉదాహరణకి పందొమ్మిదో శతాబ్ది సంస్కరణ ఉద్యమాలకి నేపథ్యంగా ప్రాచీన ధార్మిక గ్రంథాల స్ఫూర్తి ఎంత ఉందో, భక్తికవులు స్ఫూర్తికూడా అంతే ఉంది. ఇరవయ్యవ శతాబ్దంలో ప్రధానంగా గాంధీ, అంబేద్కర్, లోహియాలు మాత్రమే భక్తికవుల వెలుగులో తమ సామాజిక-రాజకీయ కార్యాచరణకు పదునుపెట్టుకున్నారు. కానీ ఇరవయ్యవశతాబ్దపు విమోచనోద్యమాలు, ముఖ్యంగా వామపక్ష ఉద్యమాలూ, విప్లవోద్యమాలు ఏళ్ళు గడిచినా కూడా విస్తృత ప్రజానీకాన్ని ప్రభావితం చెయ్యలేకపోవడానికి కారణం ఆయా ఉద్యమకారులకీ, ఆ సిద్ధాంతకర్తలకీ భక్తి ఉద్యమాలగురించిన అవగాహన లేకపోవడం. ఇంకాచెప్పాలంటే, ఆ ఉద్యమకారులెవరి వెనకా చెప్పుకోదగ్గ ఒక్క భక్తికవి కూడా లేకపోవడం.
మన దేశంలో వామపక్ష అవగాహన ద్వారా పరివర్తన సాధించాలనుకున్న సిద్ధాంతకర్తలు ఆర్థిక-రాజకీయ విశ్లేషణలమీద పెట్టిన దృష్టి సామాజిక- నైతిక అంశాల మీదపెట్టలేదు. మన జాతీయోద్యమకారులు యూరపియన్ జాతీయోద్యమాల వైపు చూసినట్టుగా వామపక్ష ఉద్యమకారులు రష్యన్, చీనా, లాటిన్-అమెరికన్ విప్లవాలవైపు చూస్తూ వచ్చారు. మరొకవైపు మొత్తం మతాన్ని అభివృద్ధి నిరోధకంగా భావించి తమ నిర్మాణాల్నీ, తమ పోరాటాల్నీ మతపరమైన స్ఫూర్తికి పూర్తిగా దూరంగా పెట్టారు.
అది భారతదేశ చరిత్ర గురించి సరిగ్గా తెలియకపోవడం వల్ల జరిగిన తప్పిదం. ఎందుకంటే భారతదేశంలో, ముఖ్యంగా మధ్యయుగాల్లో, మతాలు పోషించిన పాత్ర ఇప్పటి రాజకీయ పార్టీలు పోషించిన పాత్ర లాంటింది. ఆధునిక భారతదేశంలో వనరులూ, అవకాశాలూ కలిగినవాళ్ళూ, లేనివాళ్లూ కూడా ఒకే రాజ్యాంగ చట్రంలో పనిచెయ్యవలసి ఉంది. కాని తీరా వాస్తవానికి వచ్చేటప్పటికి రాజకీయ అధికారం అప్పటికే వనరులూ, అవకాశాలూ ఉన్నవాళ్ళని మరింత బలోపేతంచేసేదిగానే ఉపయోగపడుతోంది. ఈ పరిస్థితిలో మరొక రాజకీయ పక్షం అధికారాన్ని అనుభవిస్తూ ఉండగా, మరొక రాజకీయ వర్గం ప్రజలమధ్య పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అధికారాన్ని హస్తగతం చేసుకున్న రాజకీయ పక్షం అనతికాలంలోనే ప్రజాగ్రహాన్ని చవిచూసి అధికారాన్ని పోగొట్టుకుంటుంది. అప్పటిదాకా ప్రజలతో పనిచేసిన రాజకీయ పక్షానికి ప్రజలు అధికారం కట్టబెడతారు. మళ్ళా చరిత్ర పునరావృతమవుతుంది. గెలిచిన పక్షం అధికారానికి దగ్గరగానూ, ప్రజలకి దూరంగానూ జరుగుతుంది. ఓడిన పక్షం మళ్ళా ప్రజలకు చేరువ కావడం మొదలవుతుంది.
సరిగ్గా ఒకప్పుడు మధ్యయుగాల్లో మతాలు పోషించిన పాత్ర ఇటువంటిదే. నా మటుకు నాకు బి.ఎస్.ఎల్.హనుమంతరావుగారు రాసిన ‘ఆంధ్రదేశం-మతపరిణామాలు'(1989) అనే పుస్తకం చదివేదాకా, మతాల గురించిన ఏ సమాచారమైనా చిక్కుముడిగానే ఉండేది. కాని ఆయన విశ్లేషణ చదివిన తరువాతనే, ప్రాచీన, ముఖ్యంగా, మధ్యయుగాల్లో మతాలన్నీ కూడా రాజకీయ ప్రాపకం కోసం పనిచేసేయనీ, ఆ క్రమంలో అవి ప్రజలకు దగ్గరగానూ, దూరంగానూ వస్తూ పోతూ ఉన్నాయనీ అర్థమయింది. అందుకనే మధ్యయుగాల్లోని ఏ మతమైనా-బౌద్ధం, జైనం, శైవం, వైష్ణవం, వీరశైవం, వీరవైష్ణవం, ఇస్లాం- ప్రతి ఒక్కటీ కూడా కొన్నిసార్లు liberating forceగానూ, మరికొన్ని సార్లు oppressive force గానూ పనిచేసాయని గుర్తుపట్టగలిగాను. అందుకనే ఆయా మతాలు సృష్టించిన సాహిత్యంలో కూడా ఒక విమోచక పార్శ్వంతో పాటు ఒక పీడక పార్శ్వం కూడా తప్పనిసరిగా కనిపిస్తుంది.
మతపరిణామాలకు సంబంధించిన ఈ డయలెక్టిక్ అర్థమయితే తప్ప, ఒకప్పుడు పీడక శక్తిగా మారిన జైనం మీద తిరుగుబాటు చేసి ప్రజల్ని సాంస్కృతికంగా విమోచన వైపు నడిపిన శైవం తిరిగి రామానుజాచార్యుల కాలానికి ఎందుకు క్రూరమైన రాజకీయ శక్తిగా మారిందో అర్థం కాదు. అలాగే ఒకప్పుడు బౌద్ధాన్ని రెండుచేతులా ఆహ్వానించిన పీడిత ప్రజలు అంతే ఆశతో ఇస్లాంను ఎందుకు చేరదీసారో మనకి అర్థం కాదు. ఈ సామాజిక-మతధార్మిక గతితర్కం తెలియకుండా చరిత్ర చదివితే అది ఎంతసేపూ ఒక మతం మరో మతంతో కలహించుకుంటూ ఉన్నట్టుగానే కనిపిస్తుంది.
మరొక ఉదాహరణ చెప్పాలంటే మధ్యయు గాల తొలిశతాబ్దాల్లో ప్రజలప్రేమని జైనం పొందినట్టుగా మరే మతం కూడా పొందలేదు. ఇప్పటి వామపక్షవాదుల కన్నా మిన్నగా జైనులు దేశభాషల్నీ, విద్యనీ, సాహిత్యాన్నీ ప్రజలకు మరింత చేరువగా చేర్చే ప్రయత్నం చేసారు. ఆ కాలాల్లో వారి త్యాగం, శరీర సుఖపరిత్యాగం, నిరాడంబర జీవితం ప్రజల్ని ఎంతగా ఆకర్షించాయంటే, అందరికన్నా ముందు సైన్యాధిపతులు జైనాన్ని ఎక్కువ ఇష్టపడ్డారు. కాని దాదాపు పదిహేను శతాబ్దాల దక్షిణ భారతదేశ చరిత్ర చూస్తే జైనం ఉత్థాన పతనాలు మనల్ని నిశ్చేష్టుల్ని చేస్తాయి.
ఎందుకని? ఎందుకని అంత త్యాగశీలం చూపించిన మతం నుంచి ప్రజలు ఎందుకు దూరంగా జరిగిపోయారు? జైనమనే కాదు, ఆంధ్రలో బౌద్ధం, చోళనాడులో శైవం, చివరికి భారతదేశమంతా వైదికధర్మం ఎందుకని ప్రజల నిరాదరణ చవిచూడవలసి వచ్చింది?
ఒకటే కారణం. ఏ మతమైనా సరే privileges నీ, సౌకర్యాల్నీ, సదుపాయాల్నీ కోరుకోవడం మొదలుపెట్టగానే అది తన ధార్మిక-నైతిక స్వభావాన్ని పోగొట్టుకుని రాజకీయ స్వభావాన్ని సంతరించుకుంటుంది. దానిలో కూడా అవకాశాలు, వనరులూ కలిగినవాళ్ళూ, లేనివాళ్ళూ అని రెండు వర్గాలు ఏర్పడతాయి. వాటి మధ్య ఒక సంఘర్షణ మొదలవుతుంది. అవకాశాలకు నోచుకోని వాళ్ళు నెమ్మదిగా మరొక మతం వైపు జరిగిపోతారు.
ప్రతి మతమూ మరొక మతంతో తలపడటానికి ముందు అంతర్గతంగా తనలో తానే తలపడుతుంది. అందులో దైవం ఒకపక్కా, దేహం ఒక పక్కా; సమాజం ఒకపక్కా, అధికారం మరొకపక్కా; త్యాగం ఒక పక్కా, సుఖమయ జీవితం మరొకపక్కా సంఘర్షించడం మొదలుపెడతాయి. నా చిన్నప్పుడు తాడికొండ హైస్కూల్లో భారతదేశ చరిత్ర పాఠం చెప్తూ మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వెంకటరత్నం గారు ఒక మాట చెప్పారు: ఇస్లాం భారతదేశం మీద దండెత్తినప్పుడు, అప్పటిదాకా కరడుగట్టిన మతాలు తమ వైఖరిని మరింత సడలించుకోవడం మానేసి మరింత బిగిసిపోయాయి అని. దాదాపుగా ఇప్పటికీ ఇదే పరిణామం నా కళ్ళముందు కనిపిస్తూ ఉంది. తమ మతంలో అంతర్గతంగా సంఘర్షణ మొదలుకాగానే ఆ మతాల్ని నియం త్రిస్తున్న పురోహిత వర్గం, పీఠాధిపతులు, తమ మతాలు లోనవుతున్న corruption ని చక్కదిద్దడానికి బదులు తమని ప్రశ్నిస్తున్న గళాల్ని మరింత అణచివెయ్యడం మొదలుపెడతారు .
అందుకని రాజాదరణ పొందిన మతశక్తులకు ప్రత్యామ్నాయంగా ప్రజలు భక్తికవుల వైపు చూసారు. భక్తికవులు ప్రజల్లోని మత-ధార్మిక ఆకాంక్షల్ని మత క్రతుకాండ నుంచీ, దేవాలయాలనుంచీ, రాజకీయాధికారం నుంచీ విముఖుల్ని చెయ్యడం మీద దృష్టిపెట్టారు. సుఖమయజీవితం అనతికాలంలోనే corruption కి దారితీస్తుందని చెప్పడమే కాదు, అటువంటి అవినీతిరహిత జీవితం ఎలా ఉండాలో తమ జీవితాలే ఉదాహరణలుగా ప్రజలకు చూపించారు. భక్తి కవుల దృష్టిలో ఆధ్యాత్మికత అంటే రాజీలేని నైతికత మాత్రమే. ఈ నేపథ్యంలో చూసినప్పుడు బసవన్న భక్తి ఉద్యమంలోని విమోచక శక్తి ఎంత విప్లవాత్మకమో మనకి అర్థమవుతుంది.
ఇప్పుడు మనం మన సమకాలిక రాజకీయాల దగ్గరకి వద్దాం. నేను ప్రస్తుత రాజకీయ-సాంఘికఉద్యమాలు మత పరిభాషలో మాట్లాడాలని గాని, మతతత్వాన్ని సంతరించుకోవాలనిగాని ఎంత మాత్రం చెప్పటం లేదు. నేను చెప్తున్నదల్లా మన దేశ చరిత్రలో మత పరిణామాల్ని ముందు సామాజిక పరిణామాలుగా గుర్తించండి అని మాత్రమే. అప్పుడు మాత్రమే ఆయా మతాలు ఎందుకు సఫలమయ్యాయో, ఎందుకు విఫలమయ్యాయో; ఎందుకు ప్రజాదరణ పొందాయో, ఎందుకు పీడక శక్తులుగా మారాయో అర్థం అవుతుంది. ఆ పాఠాల నుంచి మన ప్రస్తుత సామాజిక-రాజకీయ ఉద్యమాలు ఏ విధంగా ఉండాలో, ఉండకూడదో మనం తెలుసుకోగలుగుతాం.
భక్తి కవుల నుంచి మన వామపక్ష ఉద్యమాలూ, సంస్కరణోద్యమాలూ, అస్తిత్వవాద ఉద్యమాలూ నేర్చుకోవలసిందేమిటంటే, ముందు తమ ఆకాంక్షల్ని తరచిచూసుకోవడం, తమని తాము, సంస్థాగతంగానూ, వ్యక్తిగతంగానూ కూడా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకుంటూ ఉండటం. అలాగని ప్రజల కనీస అవసరాలు తీరడంకోసమూ, ప్రజలకు రాజకీయ నిర్ణయాధికారం కోసమూ ఆ ఉద్యమాలు పనిచేయకూడదంటున్నానా? అలా ఆనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. నిజానికి ఆ ఉద్యమాలు ఏ కొద్దిమంది అవకాశాలకోసమో, ఏ కొద్దిమంది రాజకీయాధికారం కోసమో పనిచేయడానికి పరిమితం కాకూడదనుకుంటే, అత్యధికసంఖ్యాకులకు మేలుచేకూర్చేవిగా మారాలనుకుంటే, అవి వ్యక్తిగతంగానూ, సంస్థాగతంగానూ కఠోరమైన నైతికతను అనుష్ఠించవలసి ఉంటుందని మాత్రమే చెప్తున్నాను.
ఎందుకనే రాజకీయ అధికారానికి స్వతఃసిద్ధంగానే విప్లవాత్మక శక్తుల్ని co-opt చేసుకునే నైపుణ్యం ఉంటుంది. అలా co-opt కాకుండా ఉండాలంటే, రాజకీయ అధికారాన్ని కోరుకునే ఉద్యమకారులూ, కార్యకర్తలూ కూడా తమ బయటి శత్రువుతో పాటు, తమ అంతరంగ శత్రువుపట్ల మరింత మెలకువ వహించవలసి ఉంటుంది.
71
భక్తులు కనబడగానే
చేతులు జోడించేవాడే భక్తుడు
మృదువచనమే
సకల జపాలూనూ.
మృదువచనమే
సకల తపస్సులూనూ.
సద్వినయమే సదాశివుడు మెచ్చేది.
అలాకాకపోతే ఒల్లడయ్యా
కూడల సంగముడు. (244)
72
దయలేకపోతే
అదేం ధర్మం?
సకలప్రాణుల పట్లా
దయ కలిగి ఉండాలి.
దయనే
ధర్మానికి మూలం.
అలాకాకపోతే
ఒప్పుకోడయ్యా
కూడల సంగముడు. (247)
73
తనమీద కోపించేవాళ్ళమీద
కోపం తెచ్చుకోవడమెందుకయ్యా?
తనకి కానిదేమిటి
వాళ్ళకి అయినదేమిటి?
తనువులో కోపం పెద్దరికానికి చేటు
మనసులో కోపం తెలివికి చేటు.
ఇంట్లో చిచ్చు తన ఇంటిని కాకుండా
పక్కింటిని కాలుస్తుందా
కూడలసంగమదేవా! (248)
భక్తుని భక్తి స్థలము
74
ఎట్టకేలకు మీరు
దేవుడని తెలుసుకున్నాను
కాని మీరే
నన్ను గుర్తుపట్టడం లేదు.
నమ్మటం తెలియనివాణ్ణి
నమ్మించడం తెలియనివాణ్ణి
మెచ్చటం తెలియనివాణ్ణి
మెప్పించటం తెలియనివాణ్ణి.
‘యథా భావస్తథా లింగం
సత్యంసత్యం నసంశయః
యథాభక్తిస్తథా సిద్ధిః
సత్యం సత్యం నసంశయః’
అన్నారు కాబట్టి
కూడలసంగమయ్యా
వినవయ్యా
కోట్లాది సంవత్సరాలిట్లా
కుంగుతూనే ఉన్నానయ్యా! (268)
75
కోటానుకోట్ల జపాలు చేసి
కష్టపడటమెందుకే
మనసా?
కించిత్తు గీతంలోనే
అనంతకోటి జపాలు.
ఇంకా జపాలెందుకు?
కూడలసంగముడి మనుషుల్ని
కనుగొని
ఆడుతూపాడుతూ
బతకవే మనసా! (275)
76
సురల్నీ వేడుకునీ
ప్రయోజనం లేదు
నరుల్నీ వేడుకునీ
ప్రయోజనం లేదు.
మనసా!
ఊరికే ధైర్యం పోగొట్టుకోకు.
ఎవర్నైనా ఊరికే వేడి వేడి
నీ నిబ్బరం పోగొట్టుకోకు.
కూడలసంగమదేవుణ్ణి తప్ప
మనసా!
మరెవ్వరిని వేడినా
ప్రయోజనం లేదు. (277)
77
ఆడటం అలవాటయింది
పాడటం అలవాటయింది.
అర్చన అలవాటయింది
పూజించడం అలవాటయింది
నిత్యలింగార్చన ముందే
అలవాటయ్యింది.
కాని కూడలసంగముడి
మనుషులొస్తే
‘ఏం చెయ్యాలి, ఏం పెట్టాలి’
అన్నది మాత్రం
ఒక్కింత కూడా అలవాటవలేదు. (302)
78
ఇళ్ళు చూద్దామా
నిరుపేదలు.
మనసుచూద్దామా
ఘనులు.
ఉన్నచోట సుఖులు
తమనితాము జయించుకున్నవాళ్ళు.
ఏదీ దాచుకోనివాళ్ళు
అప్పటికప్పటికి వచ్చిపోయేవాళ్ళు.
కూడలసంగముడి మనుషులు
స్వతంత్రులు, ధీరులు. (325)
79
నాకంటే చిన్నవాళ్లు లేరు
శివభక్తులకన్నా
పెద్దవాళ్లు లేరు.
నీ పాదం సాక్షి
నా మనసు సాక్షి.
కూడలసంగమదేవా
నాకు ఇదే గొప్ప. (334)
80
డొక్కల కక్కయ్య మా నాన్నయితే
ముత్తయ్య చిన్నాన్న అయితే
మరికొన్నాళ్ళు బతకనా?
శ్వపచయ్య సన్నిధిలో
భక్తి సద్గుణమింత
అలవర్చుకున్నాను.
కడజాతిలో పుట్టడమే
నేను కోరుకునే గమ్యమయ్యా
కూడల సంగమయ్యా! (343)
30-11-2023
ఈ రోజు ముందుమాటలో మననం చేసుకోదగిన వాక్యాలు రాశారు, ముఖ్యంగా ఆధ్యాత్మికత అంటే రాజీలేని నైతికత మాత్రమే అన్న మాట. సుఖమయ జీవితం అనతి కాలంలోనే corruption కి దారి తీయగలదు – అన్న మాట ఆలోచనలో పడేసింది. నిజమే, ఆ కరప్షన్ కి వెయ్యి ముఖాలు. మనకు తెలియనివి కూడా – బహుశా అందుకే గుర్తుపట్టి జాగ్రత్త పడేలోపే కొన్నిసార్లు నష్టం జరిగిపోతుంది.
71 వ వచనం దగ్గరే నేనంతా ఒక్క బొట్టుగా కరిగినట్టైంది. ఊహ తెలిసిన నాటి నుండి, వినీవినీ అనుకుని అనుకునీ ఉన్న మాటలే కదా. అయినా ఈ సరళ వాక్యాల ముందు ఎందుకిట్లా అయిపోతాం అని ఆలోచించుకుంటూన్నాను. బహుశా, ఆ ఆదర్శంలోని బలం తెలిసీ ఆచరణలో విఫలమైన ఏ క్షణమో గుర్తొచ్చి లోపటి నుండి పొడుస్తుందేమో! ఎవరి దగ్గరో అకారణంగా అనుభవం లోకి వచ్చిన నిర్దయ నలకై మళ్లీ ఇప్పుడు కళ్ళ ముందుకు వస్తుందేమో! భక్తి కవిత్వం క్షాళన. అందుకే మారే వయసుతో వాటి అర్థాలు అన్నింతలవడం. మీకు ఇంకోసారి…🙏
ఇంత సహృదయంతో, ఇంత సవివరంగా స్పందించినందుకు ధన్యవాదాలు.
దయనే
ధర్మానికి మూలం.
సత్యగుళిక ఈ వాక్యం. 🙏
రాజకీయ అధికారం కోసం తుష్టీకరణ రాజకీయాలు నెరపడం వర్తమాన రాజకీయాల
విశిష్ట లక్షణం గా పేర్కొనవచ్చు.
అందరి కొరకు కొందరు గా కాకుండా
కొందరి కొరకు అందరు అన్నట్టుగా ఉన్నాయి
నేటి రాజకీయ పరిస్థితులు.
అస్తిత్వాని కొరకు ఆరాటం,పోరాటం
కొందరికి న్యాయంగా,మరి కొందరికి అన్యాయంగా తోచడం విచిత్రాలలోకెల్లా విచిత్రం Sir.
అవును మాష్టారూ
రాజకీయ ఆధ్యాత్మిక చింతనలు అన్నీ మంచివే, ఆచరణలోనే అవి మూలాలకు దూరం అవుతాయి. ‘వ్యక్తిగతంగానూ, సంస్థాగతంగానూ కఠోరమైన నైతికతను అనుష్ఠించక పోవడమే’ ముఖ్య కారణం. మీరన్నది ముమ్మాటికీ నిజం
అవును సార్