పోస్టు చేసిన ఉత్తరాలు -3

25-10-2023 తెల్లవారు జాము మూడున్నర

ప్రియమైన

తెల్లవారే ఈ వేళలో టీ పెట్టుకుని ఇలా ఉత్తరం రాయడానికి కూచోగానే నాకు ‘తలపుల దుమారము’ గుర్తొచ్చింది. మౌలానా అబుల్ కలాం రాసిన ఉత్తరాల సంపుటికి దేవులపల్లి రామానుజరావుగారి తెలుగు అనువాదం. బహుశా క్విట్ ఇండియా రోజుల్లో అనుకుంటాను, మౌలానాని, అగాఖాన్ పాలస్ లో అని గుర్తు, నిర్బంధించిన రోజుల్లో తెల్లవారు జాముల్లో ఆయన రాసిన ఉత్తరాలు అవి. ఆ ఉత్తరాలంతా ఉర్దూ కవిత్వం ఎంత ఉందో, వెచ్చని తేయాకు పరిమళం కూడా అంతే ఉంది. నలభయ్యేళ్ల కిందట చదివిన ఆ చిన్న పుస్తకంలో కవిత్వం ఇప్పుడు గుర్తులేదుగాని అది నా హృదయంలో విడిచిపెట్టిన ఒక ముద్ర మాత్రం ఇప్పటికీ వెచ్చగానే ఉంది.

చిత్రమేమిటంటే, ఆ రోజుల్లోనే ఆయనతో పాటు నెహ్రూని కూడా నిర్బంధించారు. ఆయన ఆ నిర్బంధకాలంలో ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ రాసాడు. ఆ పుస్తకం రాయడానికి భారతదేశ చరిత్ర గురించిన చాలా పుస్తకాలు జైల్లో దొరికే అవకాశం లేదు. కాని ఎంతో సమాచారం మౌలానా, పుస్తకాల్తో పనిలేకుండానే, తన మెమొరీలోంచి తనకి అందిస్తోవచ్చాడనీ, అందుకు ఆయనకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువేననీ నెహ్రూ తన పుస్తకానికి రాసుకున్న ముందుమాటలో రాసుకున్నట్టు గుర్తు. ‘మౌలానా’ అంటేనే పండితుడని కదా అర్థం. కానీ, నాకు ఆ విషయం చదవగానే కలిగిన ఆశ్చర్యమేమిటంటే, తన మిత్రుడు భారతదేశాన్ని అన్వేషిస్తానంటే అన్ని విషయాలు అంత అలవోకగా చెప్పిన ఆ భావుకుడు తాను రాసుకున్న ఉత్తరాల్లో ఆ చరిత్రగురించిగాని, ఆ రాజకీయాలగురించి గాని, ఊసే ఎత్తకపోవడం. ఆ ఉత్తరాలంతటా కవిత్వం తప్ప మరో ఊసే లేదు. ఇప్పుడు ఇన్నేళ్ళు గడిచాక, ఇప్పుడు అర్థమవుతోంది నాకు, మౌలానా ఎంత వివేకవంతుడో. ఉత్తరాల్లో రాసుకోవలసింది చరిత్ర గురించి కాదు. అవి చరిత్ర ఆగిపోయే తావులు.

తెలుగులో సాహిత్యకారుల ఉత్తరాలు మరికొన్ని కూడా సంపుటాలుగా వచ్చినవి చదివాను. వీరేశలింగంగారి ఉత్తరాలు చూడు. ఇంకా అటువంటివే, వాటిలో వాళ్ళ కార్యమగ్నత కనిపిస్తుంది. మొన్ననే అక్కడొక మహోపన్యాసం చేసాననీ, నిన్ననే కొత్త పుస్తకం మొదలుపెట్టాననీ, రేపు మరొకచోట ఒక సాహిత్యసభకి అధ్యక్షత వహించబోతున్నాననీ-ఇలాంటి విశేషాలే ఉంటాయి. తనకి ఫలానా పుస్తకం కావాలి, దొరుకుతుందా అనో, ఫలానా ఆయన రాసిన వ్యాసంలో ఫలానా శాసనంలో ఫలానా అక్షరం పొరపాటుగా ఉచ్చరిస్తున్నారనో-ఆ ఉత్తరాల్లో ఉండేది నిజంగా దుమారం. ఉద్యమ దుమారం. కానీ మౌలానా ఉత్తరాల్లో పేరుకే దుమారం ఉంది గాని, ఆ వాక్యాలంతటా మనకి కనిపించేది గులాబీపరిమళం.

మనుషులు, అంటే మనం ప్రేమించదగ్గ మనుషులు, రెండు రకాలుగా ఉంటారు. ఒకరు కార్యమగ్నులు, మరొకరు ధ్యానమగ్నులు. కానీ కార్యమగ్నుల్ని కూడా ధ్యానమగ్నుల్ని చేసేది ఉత్తరాలే. చలంగారి ఉత్తరాల్లో కనిపించేది ఆ ధ్యానమే. ధ్యానమంటే, జపాలగురించీ, యోగం గురించీ రాయడమని కాదు. దీక్షితులుగారికి రాసిన ఉత్తరాలు చూడు. వాటిల్లో ఉన్నది ఆత్మధ్యానం. తన లోపలి పొరల్ని నిస్సంకోచంగా విప్పేసుకోడానికి ఆయన దీక్షితులుగారిని ఒక సాకుగా వాడుకున్నాడు. అంతే. ఆ ఉత్తరాలు ఆయన జీవితంలో ఎంతో కీలకమైన దశలో రాసుకున్నవి. ఆ ఉత్తరాలంతటా చలంగారి తలనెప్పులు, శారీరకంగానూ, మెటఫర్ గా కూడానూ. కానీ ఆ తలనెప్పుల గురించి చదువుతుంటే మనకి ఎంత ఊరటగా అనిపిస్తుందని. నెమ్మదిగా ఒక వెలుగు ఆయన జీవితంలో ఉదయించినది, మన మనోగగనం మీద పరుచుకుంటున్నట్టు, మనకి కూడా తెలుస్తూంటుంది.

చలంగారు రాసిన ఉత్తరాలు చాలా సంపుటాలే వెలువడ్డాయి. ఆయన రాసింది, అచ్చులోకి వచ్చిన, ప్రతి ఒక్క ఉత్తరం చదివేను. మరీ ముఖ్యంగా, ప్రేమలేఖలు, దీక్షితులు గారికి రాసిన ఉత్తరాలు, అరుణాచలం వెళ్లాక, చిన్నారావుగారికి రాసిన ఉత్తరాలు- ఈ మూడు సంపుటాలైతే, ఎన్నిసార్లు చదివి ఉంటానో చెప్పలేను. ఆ ఉత్తరాల్లో చలంగారు తాను ఎవరికి రాస్తున్నారో ఆ మనిషిని ఒక అద్దంగా తనముందు పెట్టుకుని రాసుకున్నారని పిస్తుంది. ఒక విశ్వాసి మరొక విశ్వాసికి దర్పణంగా పనిచేస్తాడని సూఫీలు చెప్తారని తెలియకుండానే చలంగారు ఆ పని చేసారు. అందుకని నీకు నేను చెప్పగలిగే మంత్రం ఇదే, నీ అంతరంగం కలవరపడుతున్నదా, ఇతమిత్థంగా చెప్పలేని ఏ వేదననో లేదా ఉద్వేగమో నిన్ను నిలవనివ్వకుండా అస్థిరపరుస్తోందా, అయితే నువ్వు చెయ్యవలసిన పని, ఉత్తరాలు రాయడం.

ఒకప్పుడు నా జీవితంలో యవ్వనపు అలజడిలో కొన్ని వందల ఉత్తరాలు రాసిన తరువాతనే నేను నేనుగా మారేనని ఇప్పుడు గ్రహిస్తున్నాను. కాయ పండుగా మారే తావు అది. ‘నిర్వికల్ప సంగీతం’ పుస్తకం ఆవిష్కరణ రోజున మా అక్క ఆ పుస్తకం మీద మాట్లాడిన మాటలు నాకిప్పటికీ గుర్తే. ఆమె అంది కదా, మా తమ్ముడు చాలా వైల్డ్ గా ఉండేవాడు. ఈ కవిత్వం చదువుతుంటే, ఆ వైల్డ్ నెస్ ఇలా కవిత్వంలోకి విరిగిపోయిందని అనిపిస్తోంది అని చెప్పింది. కాని ఉత్తరాలు కవితలుగా మారిన కాలం ఒకటి ఉన్నట్టే కవిత్వం ఉత్తరాలుగా మారే కాలం కూడా ఒకటి రావాలి. నీ wildness ని ఉత్తరాలతో tame చేసినట్టే, నీ calmness ని ఉత్తరాలతో convey చేసే రోజులు కూడా రావాలి. అరవిందులు చూడు, ఆయన పూర్తి ఏకాంతంలోకి వెళ్ళిపోయేక, తాను ఈ లోకం నుండి సెలవుతీసుకునేదాకా, ఆ ఏకాంతంలోనే పాతికేళ్లు గడిపారు. కాని ఆ కాలమంతటా ఆయన వందలాది ఉత్తరాలు రాసారు, తన మిత్రులకీ, శిష్యులకీ, తన కవిత్వప్రేమికులకీ. ఆ ఉత్తరాల్లో అపారమైన ప్రశాంతీ, ప్రేమా కనవస్తాయి. కవిత్వం గురించీ, సావిత్రి గురించీ, కవిత్వాన్ని అర్థం చేసుకోవలసిన పద్ధతుల గురించీ, ఎంత ఓపిగ్గా ఆ ఉత్తరాల్లో రాసారంటే, అవి చదువుతోంటే, నాకు బుద్ధుడి సంభాషణలే గుర్తొస్తూంటాయి.

ఎమిలీ డికిన్ సన్ ఉత్తరాలే చూడు. చిన్నపిల్లనుంచి దైవాన్ని దర్శించిన ఒక మిస్టిక్ దాకా ఆమె ఎలా ఎదిగిందో, ఆ క్రమ పరిణామమంతా ఆ ఉత్తరాల్లో కనిపిస్తుంది. 1862 ఆమె జీవితంలో ముఖ్యమైన మలుపు అని చెప్పానుకదా. అప్పటిదాకా ఆమె రాసుకున్న ఉత్తరాల్లో తన గురించి రాసుకుంది. ఆ తర్వాత ఆమె గురించిన వివరాలు చాలా చాలా తక్కువగా కనిపిస్తాయి. కాని 1862 తర్వాత రాసిన ఉత్తరాల్లోనే ఆమె యథార్థమైన self-portrait ని మనం దర్శించగలుగుతాం.

నిన్నంతా ఆమె ఉత్తరాలు చదువుతున్నాను. దాదాపు నూటయాభై ఏళ్ళకిందట న్యూ ఇంగ్లాండ్ లో అమ్హరెస్ట్ లో తన తోటనీ, ఇంటినీ దాటి ఒక్కరోజు కూడా బయటకు అడుగుపెట్టని ఆమె జీవితం భూమ్యాకాశలు కలుసుకునే దిగంతం లాగా కనిపిస్తో ఉంది. మరొకవైపు పొద్దుణ్ణుంచి సాయంకాలం దాకా భూమ్యాకాశాల్నే చూస్తో ఉన్న నాకు, ఆ రెండూ కలుసుకునే తావులో ఆమె హృదయమే ప్రత్యక్షమవుతూ ఉంది.

నా రోజు పొద్దున్నే మేడమీద నడకతో మొదలవుతుంది. ఇప్పుడిప్పుడే మంచురాలడం మొదలైన ప్రత్యూషంలో మేడ మీద అడుగుపెట్టగానే పారిజాతం పలకరిస్తుంది. ఆ చిన్న మొక్కచుట్టూ చెదిరిపడ్డ ముత్యాల్లాగా పారిజాతపుష్పాలు పలకరిస్తాయి. నీకు తెలుసా! నా జీవితంలో కవిత్వం ప్రవేశించిన రోజులకీ పారిజాతాలకీ ఎంత దగ్గర సంబంధముందో. తాడికొండలో హీరాలాల్ మాష్టారు అడుగుపెట్టిన రోజుల్లో నేను బి-డార్మిటరీలో ఉండేవాణ్ణి. ఆ బిల్డింగు ఎదట చిన్నతోట ఉండేది. ఆ తోటలో పెద్ద పారిజాతం చెట్టు. ఇట్లాంటి శరత్కాలపు రోజుల్లో మేము రాత్రుళ్ళు ఆ డార్మిటరీ వరండాలో చదువుకుంటో, అక్కడే నిద్రపోయేవాళ్ళం. తెల్లవారి లేచేటప్పటికి ఆ చెట్టుచుట్టూ పాలనురుగులాగా పారిజాతాలు కనిపించేవి. ఆ సూక్ష్మ సుగంధాన్ని అట్లానే ఇంత ముఖానికీ, ఇంత హృదయానికీ హత్తుకుని మోర్నింగ్ పి.టి కి పరుగెత్తేవాణ్ణి. ఇక అప్పణ్ణుంచీ సాయంకాలం ఎప్పుడవుతుందా అని ఎదురుచూసేవాణ్ణి. సాయంకాలంకాగానే మాకు కంపల్సరీ గేమ్స్ ఉండేవి. కాని ఆ క్లాసులు ఎగ్గొట్టి మాష్టారి వెంటపడేవాణ్ణి. ఆయన ఆ స్కూలు వెనక పత్తిచేల మధ్య, ఆ పొలం గట్లమ్మట నడిపిస్తో, ఎక్కడెక్కడి కవుల గురించీ చెప్పేవారు. ఇప్పుడు ఆయన బాధ్యత పారిజాతాలు తీసుకున్నట్టుంది. పొద్దున్నే ఆ పూల ఎదట నిలబడగానే ఎమిలీ డికిన్ సన్ గురించి మాట్లాడటం మొదలుపెడుతున్నాయి.

ఏడాది పొడుగునా అన్ని ప్రత్యూషాలూ, అన్ని ప్రభాతాలూ అందమైనవేగాని, శరత్కాల, హేమంతకాల ప్రభాతాలు అద్వితీయాలు. బహుశా ఇలాంటి ప్రభాతాలు చూసే ఇస్మాయిల్ గారు తాను వేయి సువర్ణ ప్రభాతాల మేరకు సంపన్నుణ్ణి అని చెప్పుకున్నారనుకుంటాను. కాని శరత్తులోనూ, హేమంతంలోనూ నిన్ను నీకు మరీ దగ్గరగా తీసుకుపొయ్యే వేళలేమిటో తెలుసా? అందరూ శరత్కాలపు వెన్నెల రాత్రుల గురించి చెప్తారు. ఆ ‘వికసన్నవ కైరవా’ల్ని తలుచుకుంటారు. కాని నన్ను సమ్మోహితుణ్ణి చేసేది ఈ ఋతువుల్లో late afternoons. ఆ వేళల్లో నెమ్మదిగా పరుచుకునే నీరెండ. నా ఉద్యోగ జీవితంలో నేను కోల్పోయింది ఇలాంటివాటినే. బయట నీరెండ అల్లుకునే వేళల్లో సెక్రటేరియట్ నుంచి అర్జంటుగా ఫొనొచ్చేది, ఆ రిపోర్టు ఏమయ్యింది అనడుగుతో.

నిన్న ఆ నీరెండవేళ రాగ ముల్తానీ వింటూ కూచున్నాను. శరత్కాల అపరాహ్ణాల్లో భీం పలాస్, ముల్తానీ లాంటి అపరాహ్ణ రాగాల్ని విని చూడు, అవి నిన్నొక అలౌకిక సీమలోకి తీసుకుపోతాయి. ఆ రాగాలనుంచి నెమ్మదిగా యమన్, మార్వా, మాల్కోస్ లాంటి సాయంసంధ్యారాగాల్లోకి ప్రయాణించడం మామూలు అనుభవం కాదు. నువ్వున్న అపార్ట్ మెంటునుంచి కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్న సముద్రం నీ కిటికీ దగ్గరకు ప్రయాణించడం తెలుస్తుంది నీకు.

సాయంకాలం మళ్లా మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉండగా దశమి చంద్రుడు ఆకాశంలో సగం విరబూస్తూండగా మళ్ళా ఎమిలీ మాటల్నే తలుచుకుంటూ ఉన్నాను. ఎందుకంటే, ఆమె తోటలో ఒక noiseless noise ఉందనీ, ఆమెని చూడవచ్చినవాళ్లకి అది వినిపిస్తుందనీ హిగ్గిన్ సన్ రాస్తాడు ఒక ఉత్తరంలో. ఎమిలీ డికిన్ సన్ కి గానీ, హిగ్గిన్ సన్ కి గానీ తెలీదు, ఆ noiseless noise నే కబీరు అనాహత నాదం అన్నాడని. ఆ ఉత్తరాలు చదువుతున్నప్పుడు, ఆ పేజీల్లోనూ, పుస్తకం పక్కన పెట్టినప్పుడు సాయంకాలపు నీరెండలోనూ నిన్నంతా నేను ఆ అనాహతనాదాన్నే వింటూ ఉన్నాను.

నిజమైన ప్రేమలేఖ ఏమిటో తెలుసా? అది నువ్వు ముందు నీ గుండెచప్పుడు వినేలాగా చేస్తుంది. ఉత్తరం రాగానే నీ గుండె వేగంగా కొట్టుకోవడం నీకే వినిపిస్తుంది. నెమ్మదిగా ఆ గుండెచప్పుడు సద్దుమణిగాక, అప్పుడు నీ లోపల వినిపించే ఆ noiseless noise ని నీకు వినిపించినప్పుడే ఉత్తరాలు ప్రేమలేఖలవుతాయి.

హిగ్గిన్ సన్ పందొమ్మిదో శతాబ్ది అమెరికాలో ఒక అత్యున్నత మానవుడు. పత్రికాసంపాదకుడు, రచయిత, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడినవాడు. చివరికి అంతర్యుద్ధంలో ఒక యుద్ధభూమిలో పోరాడి గాయపడ్డవాడు కూడా. 1862 లో ఎమిలీ ఆయనకు తన కవితలు పంపించి వాటిమీద అభిప్రాయం చెప్పమని అడగడంతో వాళ్ళిద్దరి మధ్యా స్నేహం మొదలయ్యింది. అప్పణ్ణుంచీ ఆయన ఆ కవయిత్రిని చూడాలని అనుకుంటూనే ఉన్నాడుగాని, 1870 దాకా వీలుకాలేదు. ఆమెని మొదటిసారి కలిసినప్పటి తన అనుభూతిని తన భార్యకి రాసిన ఉత్తరంలో ఎంతో గాఢంగా రాసిపెట్టాడు. ఎమిలీతో నడిచిన సంభాషణలో ఆమె చెప్పిన కొన్ని మాటల్ని కూడా ఆ ఉత్తరంలో రాసుకున్నాడు. వాటిల్లో, ఈ వాక్యం, ఎమిలీ డికిన్ సన్ కవిత్వాన్ని ప్రేమించేవారందరికీ కంఠస్థంగా ఉండే ఈ వాక్యం చూడు:

If I read a book (and) it makes my body so cold no fire ever can warm me I know that is poetry. If I feel physically as if the top of my head were taken off, I know that is poetry. These are the only way I know it. Is there any other way?

మనం ఉత్తరాలు రాసుకుంటే నా ఉత్తరం చదివినప్పుడు నీకూ, నీ ఉత్తరం చదివినప్పుడూ నాకూ ఇలాగే కదా అనిపించాల్సింది? మూడో దారి ఉండకూడదనుకుంటాను.

25-10-2023

16 Replies to “పోస్టు చేసిన ఉత్తరాలు -3”

  1. మీ ఉత్తరాలు ఈ ఉదయాలలో వేనవేల శరత్తులను, హేమంతాలను ఒక్కసారిగా గుభాళిస్తున్నాయి.
    ఉదయం శరీరాన్ని మెల్కొల్పుతుంటే, మీ ఉత్తరం మనసుకు సుప్రభాతం పలుకుతుంది.
    ఒక దేవదూత మేలుకోలుపులు వింటున్నట్టు ఉంది sir
    బహుశా ఇది చాలా అరుదైన అదృష్టం
    వెలవెల ధన్యవాదములు. అన్నింటికీ 🙏🙏

  2. సర్, పొద్దున్నే టీ పెట్టుకుని మీ ఉత్తరం తెరిచాను. మౌలానా నుండీ, చలం నుండీ, అరవిందుల నుండీ Dickinson నుండీ అందరినీ తీసుకొచ్చి మన టీ గోష్ఠి లో కూర్చోపెట్టినట్లుంది.
    (Please forgive this liberty in this imagination) 😊
    మీ ఉత్తరాలు అందుకోవడం అదృష్టం. Thank you 🙏🏽

  3. సీతాకోకచిలుకను మెటాఫర్ గా చేసి ప్రేమ ఎలా ఉండాలో చెబుతున్న తీరు.. కాయ పండుగా మారే తావు

  4. ఉత్తరాల లోకం లోకోత్తరం. ఉత్తరం రాయాలనిపించడమే ఒక ప్రేమ వివశత్వ దశ. అది వైయక్తికం కావచ్చు సార్వజనీనం కావచ్చు. వైయక్తికమే సార్వజనీనం కూడా కావచ్చు. ఎప్పుడో ఎక్కడో చదివిన గుర్తు. రాతిలో విగ్రహం ఎప్పుడు బయటపడుతుంది? అనవసరమైన దాన్ని శిల్పి తన ఉలితో తొలగిస్తే సుందరశిల్పం ఆవిష్కృతమౌతుంది. ఉత్తరాలు చిత్తపు చిత్తడిలో ఎదిగిన పూలమొక్కలు. మీరు రాసినవి చదువుతుంటే చివరలోమీరిచ్చిన ఆంగ్ల వ్యాఖ్య అనుభూతమౌతుంది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading