జయగీతాలు-12

ఈ మూడు గీతాలతో సామగీతాలు రెండవగ్రంథం నుంచి నేను ఎంపిక చేసిన గీతాలు పూర్తయ్యాయి. రేపటినుంచి మూడవగ్రంథం (73-89) నుంచి కొన్ని ఎంపికచేసిన గీతాల అనువాదాలు పంచుకుంటాను.

64

ప్రధాన గాయకుడికి గీతం, దావీదు కృతి


నా మొరలాకించు దైవమా, నా విన్నపాలు వినిపించుకో
శత్రుభయం నుండి నా జీవితాన్ని కాచి రక్షించు
తప్పుడు పనులు చేసే మూకలమధ్యనుంచి
దుర్మార్గుల రహస్యపన్నాగాలనుండి నన్ను తప్పించు.
నాలుకల్ని కత్తుల్లా పదును పెట్టుకునేవాళ్ళు
క్రూరవచనాల్ని శరాల్లాగా సంధించేవాళ్ళు
నిష్కళంకులమీద దొంగచాటుగా దండెత్తేవాళ్ళు
వాళ్లని హతమార్చడానికి ఏ మాత్రం వెనుతియ్యనివాళ్ళు
ఎంతసేపూ తమ దుష్టప్రయోజనాల్నే పట్టుకుని ఉంటారు
ఎంతసేపూ ఉచ్చులు పన్నడం గురించే వాళ్ల తలపోత.
మమ్మల్నెవరు చూడగలరనుకుంటారు
అన్యాయాన్ని అన్వేషిస్తూ ఉంటారు
మా వెతుకులాట చాలా గోప్యం అనుకుంటారు
తన మనసులో, హృదయంలో మనిషి ఎంత నిగూఢం!

కాని దైవం వాళ్లమీద విల్లు ఎక్కుపెట్టితీరతాడు
ఒక్కసారిగా వాళ్ళని నిట్టనిలువునా కూల్చేస్తాడు
వాళ్ళ నాలుకలు వాళ్ళకే ఎదురుతిరిగేట్టు
వాళ్ళని సర్వనాశనం చేసేస్తాడు
అదంతా చూసినవాళ్ళు అంగీకరిస్తో తలాడిస్తారు
అప్పుడు మొత్తం మానవజాతికి భయమంటే తెలుస్తుంది
భగవంతుడు ఏమి చేసాడో చెప్పుకుంటారు
ఏమి చేసి చూపించాడో తలుచుకుంటారు.

నీతిమంతుడు సర్వేశ్వరుణ్ణే నమ్ముకుని ఉండుగాక
ఆయన్నే ఆశ్రయించుగాకవ
సత్యవంతుడు ధీరచిత్తుడై విలసిల్లుగాక!

67

ప్రధానగాయకుడు తంత్రీవాద్యాలకు అనుగుణంగా పాడవలసిన గీతం


భగవంతుడు మాపై దయచూపించుగాక, మమ్మల్ని ఆశీర్వదించుగాక!
ఆయన వెలుగు మా పై ప్రసరించుగాక!
అప్పుడే ఈ భూమ్మీద నీ దారి మాకు గోచరిస్తుంది
నీ రక్షణశక్తి సకల జాతులకు తెలిసి వస్తుంది
జనులు నిన్ను స్తుతింతురు గాక, ఓ దైవమా
సకల జనులు నిన్ను కొనియాడుదురు గాక!

ఎల్లజనులు సంతోషపరవశులై నిన్ను కీర్తింతురు గాక!
నువ్వు ప్రజలందరినీ సమదృష్టితో పరిపాలిస్తావు
వసుధపైన సమస్త జాతులకీ దారిచూపుతావు
జనులు నిన్ను స్తుతింతురు గాక, ఓ దైవమా
సకల జనులు నిన్ను కొనియాడుదురు గాక!

పుడమి పైన పాడిపంటలు పొంగిపొర్లుతాయి
దైవం, మా దైవం మమ్మల్ని ఆశీర్వదించుగాక!
దైవం మమ్మల్ని అనుగ్రహించుగాక
నేలనాలుగు చెరగులూ భయభక్తులతో మసలుగాక!

70

ప్రధాన గాయకుడికి గీతం, స్మరణభక్తిగీతం, దావీదు కృతి


సర్వేశ్వరా, త్వరపడు, నన్ను విడుదల చెయ్యి
నాకు నీ ఆపన్న హస్తం అందించడానికి త్వరపడు
నా జీవితం మీద పగబట్టినవాళ్ళకి
ఆశాభంగం కలిగించు, అవమానంతో శిక్షించు.
నా అవమానాన్ని చూసి సంతోషపడాలనుకున్నవాళ్ళు
వెనక్కి తిరిగి అగౌరవంతో తలవాల్చుకోవాలి
ఇహిహీ అంటో వేళాకోళం చేసేవాళ్ళు
సిగ్గుతో ముఖం చాటేసుకోవాలి.

నిన్ను అన్వేషించేవారంతా
నీ పాదకమలసేవలో తరించాలి, సంతోషంగా.
నీ అభయహస్తంకోసం ఎదురుచూసేవాళ్ళు
నీకు జయజయధ్వానాలు పలకాలి.
నేను దీనుణ్ణి, అనార్తుణ్ణి
జాగుచెయ్యకు తండ్రీ!
రావే ఈశ్వర, కావవే వరద
సంరక్షించు భద్రాత్మకా!

24-1-2023

2 Replies to “జయగీతాలు-12”

Leave a Reply to Vadrevu Ch VeerabhadruduCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading