THE WAITING IS OVER

రాజమండ్రిలో నేనున్నాళ్ళూ ఎవరిని కలిసినా, కలవకపోయినా క్రమం తప్పకుండా వేళ్ళే తావు గోదావరి గట్టు. ఆ ఊళ్ళో నేనున్న రూములు గోదావరి గట్టుకి దగ్గర్లో ఉన్నవి కావు. ఊరిలోపలకీ ఉన్నవి. పొద్దున్నే లేవగానే గోదావరిని చూసేటంత దగ్గరలో ఉన్నవి కావు. అందుకని అక్కడున్నన్నాళ్ళూ ఆ రూముల్లో పేరుకు మాత్రమే ఉన్నాను. కాని గడిచిన జీవితమంతా గోదావరి గట్టుమీదే గడిపాను.
 
రాజమండ్రి వైపు గోదావరి తూర్పు వైపు గోదావరి. అందుకని అక్కడ సూర్యోదయాల కన్నా, సూర్యాస్తమయాలు ఎక్కువ సౌందర్యోపేతంగా ఉండేవి. సాయంకాలం కాగానే కొవ్వూరు వెళ్ళే లాంచీల రేవు దగ్గర చేరుకునేవాళ్ళం. అది మా అడ్డా. అక్కడే సమాచారం ఆఫీసు. ఆ పక్కనే సదనం. అక్కడ మా ఇద్దరు చెల్లెళ్ళు చదువుకునేవారు. ఆ సమాచారం మేడమీద కొన్నాళ్ళు శరభయ్యగారు అద్దెకున్నారు. ఆ లాంచీల రేవు దగ్గరే నాలుగడుగుల దూరంలో ఉమా మార్కండేయస్వామి గుడి. ఆ గుడి ఎదట ద్వారం పైన యముడు పాశంతో వెంటబడుతుండగా బాలమార్కండేయుడు శివలింగాన్ని కావిలించుకొని తన్మయత్వంతో కళ్ళు మూసుకునే బొమ్మ ఉంటుంది. ఆ శివలింగంలోంచి శివుడు త్రిశూలధారియై యముణ్ణి నివారిస్తూ ఉంటాడు.
 
నా పసితనంలో మా నాన్నగారు నన్ను రాజమండ్రి తీసుకువెళ్ళినప్పుడు నేను చూసిన తొలిదృశ్యాల్లో ఆ బొమ్మనే నా హృదయఫలకం మీద ముద్రితమైపోయింది. ఇప్పటికీ రాజమండ్రి అంటే నాకు ముందు గుర్తొచ్చేవి రెండే, ఆ బాలమార్కండేయుడూ, గోదావరీను. ఇంకా చెప్పాలంటే, ఆ రెండు దృశ్యాలూ కూడా ఒకే ప్రతీకగా మారిపోయేయి, నా మనసులో. రాజమండ్రి అంటే మృత్యువుని అల్లంతదూరంలోనే ఆపేసే ఒక దయ, ఒక అనుగ్రహం, ఒక grace. బహుశా ఆ కృపాతిశయం అవిరళంగా ప్రవహించడం మొదలుపెడితే గోదావరి అవుతుందనుకుంటాను.
 
గోదావరిని అన్ని వేళల్లో, అన్ని ఋతువుల్లో, అన్ని కాలాల్లో చూసాను. ఒకసారి కనబడ్డట్టుగా మరొకసారి కనబడకపోవడం గోదావరికే చాతనయిన ఒక సౌందర్య విద్య. (కొందరు జీవితమంతా సముద్ర తీరంలో గడిపినవారు సముద్రం గురించి కూడా ఈ మాట అనడం విన్నాను. కాని సముద్రానికి అవతలి ఒడ్డులేదు. గోదావరికి ఉంది.) తెల్లవారుజామున ఒక అందం. పది గంటల వేళ ఒక అందం. అపరాహ్ణవేళ ఇసికతిన్నెల మీద రంగుచీరలు ఆరబోసినట్టు అదో అందం. సాయంకాల సుగంధం సరేసరి. ఎన్నో రాత్రులు గోదావరి ఒడ్డున కూచుని ఉండగా, చంద్రుడు ఉదయించడం, ఆ తర్వాత ఇంతలోనే మళ్ళా సూర్యుడు ఉదయించడం చూసేవాళ్ళం. ఏం మాట్లాడుకునేవారు అక్కడ అని అడక్కండి. సమస్తం మాట్లాడుకునేవాళ్ళం.
 
రాజమండ్రిమీద ఆరుద్ర రాసిన పాటలో ‘శ్రీనాథ కవినివాసము పెద్దముచ్చట’ అని రాసాడు. కొండవీడు కూలిపోయిన తర్వాత శ్రీనాథుడు కొన్నాళ్ళు రాజమండ్రిలో ఉన్నాడు. అక్కడ కవి పండితులకి శ్రీనాథుడు ఆనలేదు. అప్పుడు ఆయన చాలా మానసిక క్షోభకి లోనయ్యాడు. అదంతా పద్యాల్లో మనతో పంచుకున్నాడు. కాబట్టి ఏ సాహిత్య వేత్త, కవి, రచయిత, గాయకుడు, ఆ ఊరికి, ఎవరు వచ్చి వెళ్ళినా పెద్ద ముచ్చటనే. జ్వాలాముఖిలాంటి మహోగ్రవక్త సాహితీవేదిక మిత్రులు అడిగిన ప్రశ్నలకి శాంతంగా జవాబిస్తే, కనీసం నెలరోజులు ఆ గట్టుమీద ఆ ముచ్చటే నడిచేది. సుదర్శనంగారు లాంటి శాంతమూర్తి ఎవరి మీదనో విరుచుకుపడితే అది కూడా ముచ్చటనే. పోతుకూచి సూర్యనారాయణమూర్తి, వరదా బ్రహ్మానందం రెండు భిన్న ధ్రువాలకు చెందిన సాహిత్యవేత్తలు. ఒకరంటే ఒకరికి పడేది కాదు. కాని వాళ్ళల్లో ఏ ఒక్కరూ రెండో వారి ప్రసంగముంటే, ఎక్కడున్నా, మిస్సయ్యేవారు కాదు. అక్కడికి వెళ్ళాలి, ఆ ప్రసంగం వినాలి, ఆ వక్తని మళ్ళా ప్రసంగం దాకా విమర్శిస్తూనే ఉండాలి. అదంతా విప్పారిన కళ్ళతో, విరబూసిన మనసుతో మేం మళ్ళా మళ్ళా చెప్పుకుంటూనే ఉండాలి. అదంతా ఏదో ఒక వంకన సుబ్రహ్మణ్యం మర్నాడు సమాచారంలో అచ్చువెయ్యాలి.
 
సాహిత్యాన్ని ఒక ముచ్చటగా మార్చుకోవడమెట్లానో రాజమండ్రికి తెలిసినట్టుగా, ఆంధ్రదేశంలో మరే పట్టణానికీ తెలియదని నా నమ్మకం. ఆ ముచ్చట్లని ఏ సన్నిధానం నరసింహశర్మ వంటివారో తరం నుంచి తరానికి చేతవెన్నముద్దలా అందిస్తూనే ఉంటారు. ఆ కబుర్లు వింటూ గోదావరి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది.
 
అట్లాంటి రోజుల్లో ఒక ఉదయం, తొమ్మిది పది గంటలవేళ లాంచీల రేవుదగ్గర నిలబడ్డాను. ఒక కవిత కోసం ఎదురు చూస్తూ. ఆ ప్రతీక్షని ఒక కవితగా మలిచాను. చూడండి. ఆ కవితలో చివరి వాక్యం ఏదో రాసానుగాని, గోపీచంద్ దాన్ని ఇప్పుడున్న వాక్యంగా సరిదిద్దాడు. కాబట్టి, ఈ కవిత నాదీ, గోపీచంద్ దీ, గోదావరి దీ కూడా.
 
 

A POEM EXPERIENCED

 
పాటకోసం ప్రతీక్షించి అలసిపోయాను. ఈ నదీతీరాన్న ఒక పనిదినాన్ని వృథాగా గడిపేసాను.
పాట ఏ దిశగా ఎగిరివస్తుందో తెలియదు. ఏ దూరగ్రామాల దేవాలయ ప్రాంగణాల పచ్చగన్నేరు పువ్వులో యీ పల్చని నీటిమీద కనరావడం చూసాను గాని-పాట మటుకు కనరాలేదు.
 
విపణివీథుల్లో చతుష్పథాల్లో సమావేశభవనాల్లో పారిశ్రామిక కేంద్రాల్లో నా మిత్రులు పనిలో ఉండిపోయారు. నేను మాత్రం ఏదో ఆంతర్నిహిత సంగీతం కోసం దిగంతాల్ని తడుముతో ఇక్కడ నిల్చిపోయాను.
 
పాట ఏ హంగామాతో ఎదురవుతుందో తెలియదు. ఏనాడో ఋషులు పాడిన సూక్తాలు మాత్రం ఉదాత్త అనుదాత్త స్వరాల్లో దేవాలయమంతటా మోగుతున్నాయి. నగరం తన దైనందిన పాఠం చదువుకొంటోంది బుద్ధిగా.
 
ఎవరికీ అక్కర్లేని ఒక సుకుమారి పాటకోసం యిలా యీ మిసమిసలాడే రావి ఆకుల లేత ఎండలో సోమరిగా ఒక్కణ్ణీ.
 
రేవులో పడవ కదిలింది. ఆవలి వొడ్డుకు చెందిన ఏదో జాతర కోసం కిక్కిరిసిన జనాల గోలతో- ఈవలి గట్టున ఒక్కణ్ణీ శేషప్రశ్నతో.
 
పాట నాకు ఎదురు కాలేదు, కాని తెలియని ఏదో అనుభవంతో గుండె బరువెక్కింది.
 
19-4-1983
 

THE WAITING IS OVER

 
I wasted a working day here on the riverbank waiting for the song.
 
I didn’t know from which direction the song would waft. Yellow flowers floated on the river from the temples on distant shores, but I did not hear the song.
 
Friends were busy with their routines in meeting halls, workplaces, bazaars, and town squares. I delve into all four directions, standing here, exploring the music tuning inside me.
 
In what insignia the song appears, I’m not sure. Ancient hymns resound in the temples around. The town follows its daily lesson.
 
I sit under the morning sun, in the peepul shade, waiting for the sweet song that no one cares to hear.
 
The boat left the bank. People are going to a fair. With my question left unanswered, I stayed back.
 
I could not see the song, and yet something warm surrounded me.
 
24-6-2022

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%