ఆ మధ్య మా అక్కతో సహా ఒకరిద్దరు భాసుడి గురించి గుర్తు చేసారు. అప్పణ్ణుంచీ భాసమహాకవి గురించి రాయాలని అనుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే కొన్నేళ్ళ కితం మైకెల్ లాక్ వుడ్, విష్ణు భట్ అనే ఇద్దరు పరిశోధకులు Metatheatre and Sanskrit Drama (2005) అనే పరిశోధన ఒకటి వెలువరించారు. అందులో భాసుడి గురించి వారు సరికొత్త ప్రతిపాదనలు కొన్ని చేసారు. వాటిమీద పండితవర్గంలో జరగవలసినంత చర్చ జరగలేదు. కాని వారి పరిశీలనలు కొత్తగానూ, చాలా వరకూ అంగీకరించదగ్గవిగానూ అనిపించాయి.
‘భాస’ అనే పేరు మనకి తెలిసి మొదటిసారి కాళిదాసు రాసిన మాళవికాగ్నిమిత్రం నాటకంలో ప్రస్తావనకు వచ్చింది. అందులో కాళిదాసు ‘ప్రథిత యశసాం భాస సౌమిల్ల కవిపుత్రాదీనాం ప్రబంధాన్ అతిక్రమ్య వర్తమాన కవేః కాళిదాసస్య క్రియాయాం కథం బహుమానః’ అన్నాడు. దానికి వ్యాఖ్యాతలు ‘ఇప్పుడు కావ్యాలు రాస్తున్న కాళిదాసు అనే కవి ని ప్రశంసించడం కోసం భాసుడు, సౌమిల్లకుడు, కవిపుత్రుడు లాంటి ప్రథిత యశస్కుల రచనల్ని పక్కనపెట్టడమేమిటి?’ అని అర్థం చెప్తూ వచ్చారు. కాని అందులో ఆయన ప్రస్తావించిన భాసుడు ఎవ్వరో, ఆయన్ని ప్రథిత యశస్కుణ్ణి చేసిన ఆ రచనలు ఎటువంటివో మరెక్కడా మరే ప్రస్తావనా లేదు. ఆ తర్వాత రాజశేఖరుడు అనే ఆలంకారికుడి దాకా మరెవ్వరూ భాసుణ్ణి ప్రస్తావించలేదు. రాజశేఖరుడు తొమ్మిదో శతాబ్దానికి చెందిన ఆలంకారికుడు. ఆయన తన సూక్తిముక్తావళిలో ఇలా అన్నాడు:
భాసనాటకచక్రేపి చేకై క్షిప్తే పరీక్షితుమ్
స్వప్నవాసవదత్తస్య దాహకోభున్న పావకః
( విమర్శకులు భాసనాటకచక్రాన్ని నిశిత అగ్నిపరీక్షకు గురిచేసినప్పుడు స్వప్నవాసవదత్త ఆ పరీక్షని తట్టుకుని నిలబడింది)
కాని ఆ స్వప్నవాసవదత్త నాటకం ఎలా ఉంటుందో, ఎందుకు అది అగ్నిపరీక్షకు తట్టుకుని నిలబడగలిగిందో 1910 దాకా ఎవరూ చెప్పలేకపోయారు. ఆ ఏడాది మహామహోపాధ్యాయ గణపతి శాస్త్రి అనే ఆయన తిరువనంతపురంలో అరుదైన తాళపత్రాల్ని కనుగొన్నాడు. వాటిలో పదకొండు నాటకాలున్నాయి. ఆ తర్వాత మరొక రెండు నాటకాలు దొరికాయి. ఆ నాటకాల్లో ఏ ఒక్కదానిలోనూ రచయిత పేరు లేదు. కాని వాటిల్లో స్వప్నవాసవదత్త అనే నాటకం కూడా ఉండటంతో గణపతి శాస్త్రి తన చేతికి దొరికిన నాటక చక్రమూ, రాజశేఖరుడు ప్రస్తావించిన నాటకచక్రమూ ఒకటేనని భావిస్తూ, ఆ పదమూడు నాటకాలూ భాసుడు రాసినవే అని తీర్మానించాడు. అది సంస్కృత సాహిత్య చరిత్రలో అరుదైన ఆవిష్కరణ. అలాగని అందరూ ఆయన ప్రతిపాదనని అంగీకరించలేదు. కొందరు ఆ నాటకాలు భాసుడివి కావన్నారు. మరికొందరు ఆయన వాదాన్ని బలపరిచారు. ఇంకొంతమంది ఎటూ తేల్చుకోకుండా తటస్థంగా ఉండిపోయారు. అందువల్ల ఇప్పటికీ ఆ నాటకచక్రం శీర్షిక plays attributed to Bhasa అనే ఉంటుంది. ‘అంటే, భాసుడికి అంటగట్టినవన్నమాట’ అన్నారు మా మాష్టారు ఒకసారి నాతో.
ఇప్పుడు ఈ పరిశోధకులు చెప్పేదేమంటే కాళిదాసు వాడిన ‘భాస’ అనే పదం నామవాచకం కాదనీ, అది విశేషణం మాత్రమే అనీ, అసలు ఆయన ఆ పదం వాడినప్పటికి భాసుడనే నాటకకర్త లేనేలేడనీ. తన వాదనని సమర్థించుకోవడం కోసం ఆ పరిశోధకులు అసలు సంస్కృత నాటకాల్లో కనవచ్చే నాందీ ప్రస్తావనలనే ప్రక్రియల్నీ, ఆ ప్రకరణానికీ, ప్రధాన నాటకానికి ఉండే సంబంధం గురించీ చాలా విస్తృతంగా చర్చ చేసారు. సంస్కృత నాటకం ‘నాట్య యజ్ఞం’ అనే భావనమీద ఆధారపడింది. దాని ప్రకారం ఒక నాటకంలోని ప్రధాన నాటకం ప్రస్తావననే. మనం ప్రధాన నాటకంగా భావించే భాగం నాటకంలో నాటకం అన్నమాట. ఈ అంశం గురించి మరోమారు ఎప్పుడన్నా రాస్తాను.
కాని ఇప్పటికి చెప్పవచ్చేదేమంటే లాక్ వుడ్, విష్ణు భట్ ల ప్రకారం మనం భాసనాటకాలుగా భావిస్తున్నవాటిని ఏడవ శతాబ్దానికి చెందిన పల్లవరాజు మొదటి మహేంద్ర వర్మ రాసాడు. ‘మత్తవిలాసం’ అనే ప్రహసనం, ‘భగవదజ్జుకం’ అనే నాటకాలు రాసిన వాడుగా మహేంద్రవర్మకు చరిత్రకు తెలుసు. ఆయనే భాసుడనే ఒక కలం పేరు పెట్టుకుని ఈ నాటకాల్ని రాసాడని ఈ పరిశోధకుల ప్రతిపాదన. అంతేకాదు, భాసనాటకాల్లో ఒకటైన చారుదత్తం మహేంద్రవర్మ రాస్తే, ఏడెనిమిది శతాబ్దాలకి చెందిన దండి దాన్ని ‘మృచ్ఛకటికం’ పేరిట విస్తరించి రాసాడనీ కూడా ఈ పరిశోధకులు ప్రతిపాదిస్తున్నారు. అందుకు వారు చెప్తున్న కారణాల్ని మనం తేలిగ్గా కొట్టిపారేయలేం.
ఈ పరిశోధకులు లేవనెత్తిన మరొక అంశం ఇంతదాకా వ్యాఖ్యాతలూ, విమర్శకులూ ‘భాస నాటక చక్రం’ అనే పదాన్ని వాడుతూనే ఉన్నప్పటికీ, అక్కడ ‘సంపుటం’ అనో, ‘సముచ్చయం’ అనో కాకుండా ‘చక్రం’ అనే మాట ఎందుకు ఉందని ఎవరూ ప్రశ్నించనేలేదని కూడా. చక్రం అనే మాటలో ఒక పూర్తి సంపుటం అనే అర్థం ఉంది. పూర్తి అంటే దేనికి సంపూర్తి? ఈ పరిశోధకులు చెప్తున్నదేమంటే, భరతుడూ, ధనంజయుడూ వివరించిన దశవిధ రూపకాలకీ ఉదాహరణలుగా మహేంద్రవర్మ ఈ రూపకాలు రాసాడనీ అందుకనే వాటన్నిటినీ కలిపి ‘చక్రం’ అన్నాడనీ.
ఆ విధంగా చూస్తే, పదిరకాల రూపకాల్లోనూ మొదటిదైన ‘నాటక-ప్రకరణం’ అనే వాటిలో స్వప్నవాసవదత్త ‘నాటకం’ , చారుదత్తం ‘ప్రకరణం’. కన్యాపహరణానికి సంబంధించిన కథ కాబట్టి, నాయికా నాయకులు రంగస్థలం మీద కనబడరు కాబట్టీ ప్రతిజ్ఞా యౌగంధరాయణం ‘ఈహామృగం’. ఏదో ఒక ముట్టడికో, హింసాత్మక సంఘటనకో సంబంధించిన ఏకాంకికని ‘డిమం’ అంటారు కాబట్టి బాలచరితం ఒక డిమం. సంఘర్షణకి సంబంధించిన అంతిమ పరిష్కారాన్ని మూడంకాల్లో చూపించే పాంచరాత్రం ‘సమవాకారం’. ఇక మధ్యమ వ్యాయోగం అనే పేరులోనే అది ‘వ్యాయోగం’ అనే రూపకం అని స్పష్టంగా ఉంది. దూతవాక్యం ‘సల్లాపం’ లేదా ‘వీథీ’ అనే తరహా రూపకం. ఊరుభంగం, కర్ణభారం, దూతఘటోత్కచం అనే మూడు భారతరూపకాలూ ‘ఉత్సృష్టికాంకం’ అనే తరహా రూపకాలు. ఇక రెండు మిగిలాయి. ఒకటి ‘ప్రహసనం’. మత్తవిలాసం అనే ప్రహసనం ఎలానూ ఉండనే ఉంది. మరొకటి ‘భాణం’. అది మహేంద్ర వర్మ రాయకపోయినా ‘పద్మ ప్రభృతకం’ అనే పేరుమీద శూద్రకుడి పేరిట దండి రాసాడని ఈ పరిశోధకుల ప్రతిపాదన.
ఈ నాటకాలు భాసుడు రాసినా, మహేంద్ర వర్మ రాసినా, దశవిధరూపకాల్లోనూ ఒక్కొక్కదానికీ ఒక ఉదాహరణగా ఒక రూపకాన్ని రచించవచ్చుననే ఆలోచన రావడమే ఎంతో కొత్తగానూ, శ్లాఘనీయంగానూ ఉంది. ఆధునిక హిందీ, మరాఠీ, కన్నడ నాటకకర్తలెవరికీ ఈ ఆలోచన ఇప్పటిదాకా రాలేదని కూడా మనం గమనించాలి.
సాధారణంగా పూర్వరచనల కర్త ఎవరో తేల్చుకోవడానికి పరిశోధకులు ఒక అంతర్గత సాక్ష్యం కోసం వెతుకుతారు. అది భాషా ప్రయోగాల రూపంలో ఉండవచ్చు, లేదా వివిధ సామాజిక రాజకీయ ప్రస్తావనల రూపంలోనైనా ఉండవచ్చు. భాసనాటకాల్లోని సంస్కృతం ఆరేడు శతాబ్దాల దాక్షిణాత్య సంస్కృతం అని నిరూపించే ప్రయత్నం కాని, లేదా ఆ నాటకాల్లో పాత్రలు తెలిసో, తెలియకో ప్రస్తావించిన సామాజిక-రాజకీయ అంశాల్ని బట్టి వాటి కాలాన్ని నిరూపించే ప్రయత్నం గాని ఈ పరిశోధకులు చెయ్యలేదు. కాని ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను.
భారతీయ సమాజంలో వర్ణాశ్రమ ధర్మాలు కాలూనుకుంటున్న సమయాన్ని కాళిదాసు నాటకాలు ప్రతిబింబిస్తే, ఆ ధర్మాలు పూర్తిగా వేళ్ళుదన్నుకున్న కాలం భాసనాటకాల్లో కనిపిస్తుంది. కాళిదాసు నాటకాల్లో ఒక వర్ణం కన్నా మరొక వర్ణం గొప్పదనే భావనగానీ లేదా ఒక ఆశ్రమవిధికన్నా మరొక ఆశ్రమ విధి గొప్పదనే ప్రచారం కానీ కనిపించవు. కానీ సమాజంలో ‘నిమ్న’వృత్తులకు చెందిన మనుషుల పట్ల తక్కువ చూపు భాసనాటకాల్లో పాత్రలు తమకు తెలియకుండానే కనపరుస్తాయి. ఏళ్ళకిందట నేను మొదటిసారిగా ‘మధ్యమ వ్యాయోగం’ నాటకం చదివినతరువాత చాలాకాలం పాటు భాసనాటకాల్ని మళ్ళా తెరవడానికి మనసు ఇచ్చగించక పోవటానికి కారణమదే.
కాని నాటకకర్తగా భాసుడు అత్యంత ప్రతిభావంతుడు, ఒక విధంగా చెప్పాలంటే అత్యాధునికుడు. షేక్స్పియర్ నాటకాలు రాసిన షేక్స్పియర్ ఎవరో మనకు ఇప్పటికీ తెలియకపోయినప్పటికీ, ఆ షేక్స్పియర్ నాటకప్రజ్ఞ ఎంత గొప్పదో , ఇప్పటికీ ఎవరో ఇతమిత్థంగా తెలియని ఆ భాసుడి రూపకప్రజ్ఞ కూడా అంతే గొప్పది.
భాసనాటకాల గురించి మాట్లాడుకోవడం, నాకు ఫలానా నాటకం ఇష్టం అని చెప్పుకోవడం ఒకప్పుడు పండిత వర్గాల్లో ఒక తీరికసమయపు వ్యాపకంగా ఉండేది. ఆ ప్రలోభానికి లోనుకానివాళ్ళు లేరని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, చివరికి కొడవటిగంటి కుటుంబరావు కూడా ‘ఐశ్వర్యం’ అనే నవలలో భాసుడు గురించీ, శూద్రకుడి గురించీ చర్చచేయకుండా ఉండలేకపోయాడు.
నా వరకూ నాకు ఎంపిక చేయమంటే , తూలికాతుల్యమైన శైలితో చిత్రించిన స్వప్న వాసవదత్త నాటకాన్నే, అందరిలానే నేను కూడా, ముందుగా ఎంపికచేస్తాను. కాని ఏ విధంగా చూసినా చారుదత్తం కూడా వాసవదత్త తో సమానమైన నాటకమే. చాలామంది భావించేటట్లుగా చారుదత్తం ఒక అసంపూర్ణ నాటకం అని నాకు అనిపించదు. ఇద్దరు వ్యక్తుల ప్రేమకథ సరిగ్గా ఎక్కడ ముగియాలో అక్కడే ముగిసినట్టు చెహోవ్ రాసిన Lady with the Lapdog కథ చదివితే మనకు తెలుస్తుంది. చారుదత్తం భాసుడు రాయకపోయి ఉంటే ఒక్క చెహోవ్ మాత్రమే రాయగల నాటకం. ఆ ఇద్దరి ప్రేమ మధ్యా మొత్తం సమాజమంతా వచ్చి చేరినప్పుడు, personal పూర్తిగా political గా మారినప్పుడు చారుదత్తం మృచ్ఛకటికంగా విస్తరిస్తుంది.
20-11-2021