శ్రీవేంగడం

Reading Time: 3 minutes

భగవద్దర్శనానికి ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు మనకి లభించగల అతి పెద్ద ఆశీర్వచనం ‘పునర్దర్శన ప్రాప్తిరస్తు’ అన్నదే. రెండు నెలలకిందట తిరుమల కొండ ఎక్కి దేవుణ్ణి దర్శించుకున్నప్పుడు, అక్కడ వేదాశీర్వచనం పూర్తికాగానే ‘విన్నావా, ఏమన్నారో, పదే పదే పునర్దర్శన ప్రాప్తిరస్తు’ అట అంది మా అమృత. నెలరోజులు కూడా గడవకుండానే ఆ ఆశీర్వచనం ఫలించడం మొదలుపెట్టింది. మొన్న చిత్తూరు వెళ్ళినప్పుడు ఒక రాత్రి కొండమీద బస చేసి, సుప్రభాతవేళ దేవుణ్ణి మళ్ళా దర్శించుకోగలిగాను.

తిరుమల-తిరుపతిని ఒక క్షేత్రంగాకానీ, ఒక ప్రాంతంగా కానీ చూడలేం. గడచిన అయిదారువేల ఏళ్ళ చరిత్రని పరిశీలిస్తే, శ్రీవేంగడం దానికదే ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్యం అని బోధపడుతుంది. మరీ ముఖ్యంగా, తమిళదేశాన్ని ప్రభావితం చేసిన ఆళ్వారుల భక్తి ఉద్యమం వేంగడంలోనే మొదలయ్యింది. మొదటి ముగ్గురు ఆళ్వారులూ, పేయాళ్వారు, పొయిగై ఆళ్వారు, భూతత్తాళ్వారులు వేంగడనాథుణ్ణే స్తుతించారు. వేంగడం నుంచి కంచిదాకా ఉన్న ఉత్తరతమిళభూమి సంస్కృత, మార్గ సంస్కృతికీ, శ్రీరంగం, మధురై, రామేశ్వరాల దక్షిణతమిళ భూమి పూర్తి స్థానిక తమిళ సంస్కృతికీ కేంద్రాలుగా విలసిల్లాయి. మధ్యలో చిదంబరం, తిరుక్కోవిలూర్ ప్రాంతాల నడునాడు ఆ రెండు సంస్కృతుల్నీ జమిలినేత నేసి అచ్చమైన తమిళ సాహిత్యానికీ, భక్తి ఉద్యమానికీ బాసటగా నిలిచింది.

తమిళదేశ సాహిత్యం మీదా, సంస్కృతి మీదా వేంగడం నెరిపిన ప్రభావం పదిహేనో శతాబ్దికిగానీ తెలుగు సాహిత్యం మీద ప్రసరించడం మొదలుకాలేదు. కానీ ఒకసారి శ్రీవేంకటనాథుడు తెలుగు కవుల్ని ఆకర్షించడం మొదలుపెట్టాక అన్నమయ్య వంటి మహాభక్తుడూ, శ్రీకృష్ణదేవరాయల వంటి చక్రవర్తి మాత్రమే కాదు, మరెందరో కవులు తుమ్మెదలై ఆ పద్మనాభుడి చుట్టూ పరిభ్రమిస్తూనే ఉన్నారు. శ్రీవేంకటేశ్వరుడి మీద కవిత్వం చెప్పిన కవుల్లో అన్నమయ్య, కృష్ణదేవరాయలు, తరిగొండ వెంగమాంబలు మాత్రమే నేడు ప్రసిద్ధికెక్కారుగానీ, తక్కిన కవులు కూడా ఏమీ తీసిపోనివారే.

తమిళదేశ దేవాలయాలు సందర్శించేటప్పుడు అక్కడ స్థానికులకి ఆ దేవాలయాలమీద ఏ కవులు కవిత్వం చెప్పారు, అక్కడ ఆ కవులకి ఎట్లాంటి అనుభవాలు సంప్రాప్తమయ్యాయి అన్నది తెలిసి ఉండటం నాకు అనుభవంలోకి వచ్చిన విషయం. కాని నిత్యం లక్షలాదిమంది తిరుమల దర్శనానికి వెళ్ళి వస్తున్నా వారిలో వేంకటేశ్వర భక్తి కవుల గురించి విన్నవారుగానీ, తెలిసినవారు గానీ ఎంతమంది ఉంటారన్నది అనుమానమే.

అటువంటి కొందరు భక్తి కవుల గురించి, వారి కృతుల గురించి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చాలా పరిశోధన చేసారు. ప్రాచీన తాళపత్రాలు పరిశీలించి కొన్ని రచనల్ని వెలుగులోకి తీసుకువచ్చారు. వాటిలో ‘శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు’ (1981) ఒకటి. పదిహేడు, పద్ధెనిమిది శతాబ్దాలకు చెందిన పందొమ్మిది శతకాలు, స్తోత్రాలు, దండకాల నుంచి లభ్యమైన కొన్ని పద్యాల్ని ఆయన ఆ పుస్తకంలో సంకలనం చేసారు. తెలుగు సాహిత్యవిద్యార్థులకు కూడా అంతగా పరిచయం ఉండని ఆ లఘుకృతుల్లో ఎన్నో మేలిమి పద్యాలు ఉన్నాయి. ఉదాహరణకి ‘శ్రీవేంకటేశ్వర పంచచామరములు’ అనే కృతిలో 41 పద్యాలు ఉన్నాయి. అందులో ఒకటి రెండు పద్యాలు చూడండి:

~

తన మనస్సె యెంచి చూడతన్ను చంపు శత్రువున్

తన మనస్సె యెంచి చూడ తన్ను బ్రోచు మిత్రమున్

తనమనస్సుకోడెనేని తనకు శత్రువే సరీ

తన మనస్సు గెల్చెనేని తనకు బంధువే హరీ.

ఈ ధనంజయోపమానులీ వృథాభిమానులున్

ఈ ఘనాతప స్వరూపులీ రవి ప్రతాపులున్

ఈ ధనాభిలాషులున్ మరీ ప్రచండభాషులున్

ఈ ధనంబు లీ ఘనంబులింద్రజాలమే హరీ.

కన్న కన్న నీళ్ళలోన కాయమేను ముంచుటల్

యెన్ని యెన్ని గట్లచెట్ల కేను చుట్టివచ్చుటల్

వన్నె వన్నె కాళ్ళకేను వంగివంగి మ్రొక్కుటల్

నన్ను నేను కన్న వెనుక నవ్వులాయె నో హరీ.

~

తక్కిన లఘుకృతులు కూడా ఇంత ఇంపుగానూ ఉన్నాయి. నా మిత్రుడు కవితాప్రసాద్ కొన్నాళ్ళు ధర్మప్రచార పరిషత్ కార్యదర్శిగా దేవస్థానంలో పనిచేసాడు. ఆయన అక్కడనుండి తిరిగిరాగానే ‘సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ’ మకుటంతో కొన్ని పద్యాలు వినిపించాడు. వాటిలోంచి కొన్ని ఎంచమని నన్నడిగితే ఎంచిపెట్టాను. ఆ పద్యాల్ని ఒక శతకంగా వేసాడు. ఆ శతకం కూడా ఈ లఘుకృతులతో సమానస్థాయిలో ఆచంద్రార్కం నిలబడుతుందని నమ్ముతున్నాను.

శ్రీవేంకటేశ్వరభక్తి కవుల్లో అద్వితీయుడూ, అత్యాధునికుడూ అని చెప్పదగ్గ కవి అన్నమయ్య పెద్ద కొడుకు తాళ్ళపాక పెదతిరుమలాచార్యుడు. తన తండ్రి రాసినట్టే ఆయన తానుకూడా వేంకటేశ్వరుడి మీద ఆధ్యాత్మిక, శృంగార కీర్తనలు రాసాడుగానీ, ఆయన ప్రశస్తి ‘శ్రీవేంకటేశ్వర వచనములు’ (2013) మీద ఆధారపడి ఉంది.

సాధారణంగా మనం వచనకవిత, ఆధునిక యుగంలో, పాశ్చాత్య ప్రభావం వల్ల తలెత్తిన ప్రక్రియగా చెప్పుకుంటాం. కాని, ఇప్పటికి ఏడెనిమిది వందల ఏళ్ళకిందటే, కృష్ణమాచార్యుడనే వైష్ణవకవి ‘సింహగిరి వచనములు’ పేరిట ఒక వచనస్తోత్రమాలని వెలువరించాడు. పెదతిరుమలాచార్యుడు కూడా ఆ తోవనే వేంకటేశ్వరుడి మీద వచనములు వెలువరించాడు. సంకీర్తన లక్షణకారులు ఈ ప్రక్రియని తాళగంధి చూర్ణికలుగా పేర్కొన్నారు. అంటే ఒకప్పుడు అవి గానయోగ్యంగా ఉన్నాయన్నమాట. కాని, ఇప్పుడు ఆ వచనాల్ని చదివితే ఎంతో సరళంగా, సూటిగా, తేటగా వినిపిస్తూ మనహృదయంలోకి నేరుగా చొచ్చుకుపోతాయి.

ఆ వచనాలు మొత్తం 166 ఖండికలు. సాహిత్య అకాడెమీ కోసం ‘తెలుగు కావ్యమాల’ వెలువరించిన కాటూరి వెంకటేశ్వరరావుగారు, ఈ వచనాలనుండి కూడా ఒకటి రెండు ఖండికలు ఆ సంకలనంలో చేరుస్తూ వాటిని టాగోర్ ఇంగ్లీషు గీతాంజలి లోని వచనపద్యాలతో పోల్చారు. ఆ వచనాల్లో కేవలం వర్ణన మాత్రమే కాదు, అన్ని రకాల మానవీయ భావాస్థలూ ఉన్నాయి. అందువల్ల వాటిని చదువుతుంటే ఒక ప్రేమైక మానవుడి హృదయోద్వేగాన్ని వింటున్నట్టే ఉంటుంది. ఒకటి రెండు ఉదాహరణలు చూడండి:

~

దేవదేవా! నిన్ను నే పలుమారు తలచిన వీడేమి కోరి తలచుచున్నాడో అని నీ చిత్తంబున ఉండునని ఒకానొకసారి నిన్ను తలంపుదును. మరియును మేనిం బడలించి తపంబు సేసిన అంతరాత్మవైన నిన్ను బడలిక సోకునో అని ఊరకుందును. పేరుకొని నిన్ను పిలిచిన అన్ని పనులు విడిచి వత్తువో అని మౌనంబున ఉండుదును. జగత్తున నీవుండుట భావించి నిన్ను శోధించినట్లయ్యెడినో అని పరాకు చేసికొందును. నీ చరిత్రంబులు సారెసారెకు వినంగడంగిన రహస్యంబులు బయలపడునో అని ఆలకింపను. నీ కొలువు సేసి పాదంబులకు మ్రొంక్కంగా మందెమేల మయ్యేడినో అని అంతట ఇంతటనుండి సేవింతును. ఇది యెరింగి నీవే దయంగావుము, శ్రీ వేంకటేశ్వరా! (35)

నరహరీ! మొదలనే నోరు మాటల పుట్ట; మౌనంబెట్లు సిద్ధించు? వీనులు గిరిగుహల వంటివి. ఎవ్వరు మాటలాడిన ప్రతిధ్వనుల వలె నాదింపుచుండు. అవి వినకుండ ఎట్లుండవచ్చు? కన్నులు రూపంబులకు అద్దంబువలె నున్నవి. ఇందు సకలంబును ప్రతిఫలించుచుండగా చూడకుండ ఎట్లుండవచ్చు? నీ దేహంబును ఆకలి దినదినము పీడింపగా చవులుకొనక ఎట్లుండవచ్చు? ముక్కున ఒక్కొకదినము పదియొక్క వేయున్నారు నూరుల ఉచ్ఛ్వాసములు కలుగగా వాసనలు గ్రోలక ఎట్లుండవచ్చు? అన్నియు నేననుభవించిన ఏమి, నీవు రక్షకుడవై ఉండగా; నేను నీకు గురి, నీ పాదంబులు నాకు గురి; నన్ను నీవెల్ల విధంబుల రక్షింతువుగాక; శ్రీవేంకటేశ్వరా! (91)

~

ఆశ్చర్యమేమిటంటే, దాదాపు అయిదువందల ఏళ్ళ తరువాత తిరిగి ఆధునిక తెలుగు కవిత్వంలో ఈ ‘వచనములు’ ప్రక్రియ మరొకసారి ప్రాణంపోసుకుంది. గీతాంజలిని ఎంతో సరళసుందర వచనంలో తెలుగు చేసిన చలంగారే, ‘విన్నపాలు’ పేరిట, ఇటువంటి ఆత్మనివేదనాత్మక కవిత్వాన్ని వెలువరించారు.

పెదతిరుమలాచార్యుడినుండి చలంగారిదాకా ఈ విన్నపములు కొనసాగాయని గుర్తుపట్టినందువల్లనే కాటూరి వేంకటేశ్వరరావుగారు చలంగారి విన్నపాలనుంచి కూడా ఖండికలు తన కావ్యమాలలో సంకలనం చేసారు.

ఒకవేళ ఇటువంటి ప్రక్రియ ఆధ్యాత్మిక నివేదనకి మాత్రమే సరిపోతుందనీ, ఇహలోక చితినీ, చింతనీ ప్రకటించడానికి సరిపోదనీ మనం ఎక్కడ పొరపడతామో అనుకుని వేగుంట మోహన ప్రసాద్ తిరిగి తన ‘సాంధ్యభాష'(1999) లో ఈ విన్నపాల్ని కొనసాగించాడు. అవి తాళ్ళపాక పెదతిరుమలాచార్యుడి వచనాలకీ, బోదిలేర్ verse libre కీ సమానంగా ఋణపడ్డ కవితలు.

1-5-2017

Leave a Reply

%d bloggers like this: