ఇరకం దీవి

ప్రళయకావేరి ప్రళయం వచ్చినట్టే ఘూర్ణిల్లుతోంది. మేఘాలు ఆ మొత్తం సరస్సుని మట్టిలోంచి పెళ్ళగించి మరీ పైకి లేపుతున్నట్టుంది. కనిపిస్తున్నంతమేరా నేలా, నీరూ, నింగీ ఒక్కటైపోయాయి. కారు అద్దాలు కూడా తీయ్యలేనంతగానూ, కాలు బయటపెట్టలేనంతగానూ గాలివానజల్లు.

ఎట్లానో కిందకి దిగాం. అక్కడొక షెడ్డు. ఆ కప్పు మొత్తం కారుతూనే ఉంది. అక్కడ నలుగురైదుగురు మా కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళల్లో ఒకతను గొడుగు పట్టుకుని ఉన్నా మొత్తం తడిసిపోయి ఉన్నాడు. నాతో పాటు నెల్లూరు జిల్లా ప్రాజెక్టు అధికారీ, ఆయన సిబ్బందీ కూడా ఉన్నారు. మేమెట్లానో కిందకి దిగి, ఆ షెడ్డుకిందకి చేరాం. వాన నాలుగువేపులనుంచీ ఆ షెడ్డుని తడిపేస్తోంది.

నా ఎదట అంచులు చెరిగిపోయిన సముద్రంలాగా పులికాట్ సరస్సు. స.వెం.రమేష్ రాసిన ఒక కథ, బహుశా, ‘ఉత్తర పొద్దు’ అనుకుంటాను, అందులో చూసాను, మొదటిసారి ప్రళయకావేరిని. కానీ, ఆ సరసునీ, ఆ దీవినీ నా హృదయానికి సన్నిహితంగా తెచ్చింది జయతి లోహితాక్షణ్ అనుభవాలు. ఆమె పులికాట్ సరస్సుదాకా చేసిన సైకిల్ యాత్రలో చివరి అధ్యాయం, వేనాడు, ‘ఇరకం’ దీవుల్లో ముగుస్తుంది. ఆమె తన యాత్రానుభవాల్లో రాసిందేదో నా మనసుమీద వదిలిపెట్టిన ముద్ర ఎటువంటిదంటే, ఆమె అడుగుజాడల్ని వెతుక్కుంటూ ఆ దీవిలో ఒక్కసారేనా కలయదిరగాలని అది చదివిన రోజే ఎంతో బలంగా అనుకున్నాను.

ఒకప్పుడిట్లానే సి.వి.కృష్ణారావుగారి పాదముద్రలు వెతుక్కుంటూ పోయేవాణ్ణి. ఆయన ప్రస్తావించిన గిరిజన గ్రామాలన్నీ, ‘కిండ్ర’నుంచి ‘తుపాకుల గూడెం’ దాకా ప్రతి ఒక్కటీ నేను కూడా వెళ్ళి, చూసి, ‘ఇదిగో, ఈ గ్రామం కూడా చూసేను’ అని నాకు నేను చెప్పుకునేవాణ్ణి.

ఇప్పుడు ఇరకం దీవి. కాని అడుగుతీసి ముందుకు పెట్టడమే అసాధ్యంగా ఉంది. నీళ్ళు ఒకటే తల్లకిందులవుతున్నాయి. ‘గాలులు బలంగా ఉన్నాయి. పడవ నీళ్ళ మీద నడవడం కష్టం’ అన్నాడు మా కోసం అక్కడ పర్యటన ఏర్పాట్లు చూస్తున్న సహోద్యోగి.

కాని ఇరకం దీవిలో ఒక్కసారేనా అడుగుపెట్టాలి. ‘ఈ గట్టుమీంచి ఇట్లానే వెనుదిరిగివెళ్ళిపోవడానికి కాదు, నువ్వింత దూరం వచ్చింది’ అంటోంది నా మనసు. ఈలోపు స్థానిక శాసన సభ్యుడు సంజీవి గారు ఆ వానలోనే మమ్మల్ని వెతుక్కుంటూ అక్కడికొచ్చేసారు. ఆయన వెనక ఒక పోలీసు బృందం కూడా. ‘మీరింత వానలో ఎందుకొచ్చారు’ అనడిగితే ‘మీరింత వానలో రాలేదా, అందుకే’ అన్నాడాయన. కాని ఆ ఎగిసిపడే అలల మీద, ఆ ఈదురుగాలుల మధ్య, ఆయన్ని తీసుకుని ఆ దీవికి వెళ్ళడం మరింత ప్రశ్నార్థకంగా తోచింది నాకు. ‘కొద్ది సేపు, ఒక్క గంట ఆగితే చాలు, బహుశా మనం వెళ్ళగలమేమో’ అన్నారు ఆయనతో వచ్చినవాళ్ళు.

అక్కడొక పాఠశాల తెరవడం కోసం మేమంతా ఆ దీవికి వెళ్ళాలని అక్కడ గుమి కూడేం. పాఠశాలలు ఎక్కడన్నా తెరవవచ్చు. ఉపాధ్యాయుల్ని ఎక్కడో ఒకచోట నియమిస్తూనే ఉంటారు. కాని, ఇరకం దీవిలో పాఠశాల తెరవడం, అది కదా, పాఠశాల విద్యాశాఖకి నిజమైన కార్యసాధన.

నాకు ఆక్షణాన గతంలో నేను తిరిగిన కొండలూ, అడవులూ ఎన్నెన్నో గుర్తొచ్చాయి. దారులు లేని దుర్గమారణ్యాల్లో, మారుమూల, కొండకోనల్లో, బళ్ళు తెరవడం కోసం ఇట్లానే చేసిన వెన్నో ప్రయాణాలు గుర్తొచ్చాయి. చాలా కాలం తర్వాత మళ్ళా అటువంటి ఒక అనుభవం ఆ సరసు మధ్య దీవి మీద కాచుకుని నన్నూరిస్తోంది.

ఈలోపు బిలబిల్లాడుతూ ఆ దీవికి చెందిన మత్స్యకారులు కొందరు, ‘తడ’ దాకా వెళ్ళినవాళ్ళు అప్పుడే తిరిగి వచ్చారు. తమ ఊరికి రావడం కోసం ఎమ్మెల్యే తో సహా కొందరు అధికారులు అక్కడ వేచి ఉన్నారని తెలియగానే వాళ్ళు సంతోషం పట్టలేకపోయారు. కొద్దిగా వాన ఉధృతి తగ్గిందో లేదో మరబోటుని నీళ్ళల్లోకి లాగారు. మా అందర్నీ ఆ పడవమీదకు ఆహ్వానించేరు. ప్రయాణం సురక్షితం కావాలని లైఫ్ జాకెట్లు తొడిగించారు.

ఊగుతున్న అలల మీద, ఆశ్చర్యం, అయిదారు నిమిషాలు గడిచాయో లేదో, వాన ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగిపోయింది. మబ్బులు చెదిరిపోయాయి. ఆకాశం మధ్యధరా సముద్రం మీది ఆకాశంలాగా నిర్మలంగానూ, ధూళిరహితంగానూ మారిపోయింది. చెరుకు రసంలాగా కదలాడుతున్న జలాలతో మరికొంతసేపటికి సరసు కూడా మధురసరోవరంగా మారిపోయింది.

‘ఆసియాలో ఇది రెండవ పెద్ద సరస్సు. చిలక సరస్సు తర్వాత ఇదే’ అని చెప్తున్నారెవరో. నేను చిలక సరస్సు మీద కూడా ప్రయాణించేను.అదొక అనుభవం. నీలి కాంతిలో తూనీగల్లాగా తేలియాడే నావల మధ్య నువ్వు కూడా ఒక తూనీగలాగా మారే అనుభవం అది. కాని, ఈ ప్రయాణం వేరు.

ఇరకం దీవి ఒడ్డుకి పడవచేరేదాకా ఒక గంట పాటు ప్రయాణం చేసామనిపించలేదు. ఆ దీవి మహాసముద్రాల మధ్యనుండే దీవులన్నిటికీ ప్రతినిధిలాగా ఉంది. సముద్రంలోని మాలిన్యమూ, నైర్మల్యమూ కూడా ఆ ఒడ్డున పోగుపడినట్టున్నాయి. నాలుగడుగులు వేసామో లేదో, దానికదే ఒక ప్రపంచంగా జీవిస్తున్న ఒక మానవసమాజం, సమూహం మా కళ్ళముందు ప్రత్యక్షమైంది.

ఆ ఊరి పేరు పాళెంతోపు కుప్పం. అక్కడున్నవాళ్ళంతా మత్స్యకారులే. ఆ దీవి, ఆ సరసు అదే వాళ్ళ ప్రపంచం. అక్కడొక ప్రాథమిక పాఠశాల ఉంది గానీ, ఉపాధ్యాయులెవరూ లేకపోవడంతో అది మూతపడిపోయింది. రోజూ ఆ దీవినుంచి పిల్లలు పడవ ఎక్కి దగ్గరలో తమిళనాడులో ఉన్న ‘సున్నాంబాకూళం’ అనే ఊళ్ళో ఒక తమిళ మీడియం పాఠశాలకు వెళ్ళివస్తున్నారు. ప్రసిద్ధ విద్యావేత్తా, శాసన మండలి సభ్యులు బాలసుబ్రహ్మణ్యంగారు కూడా ఒకరోజు ఆ పిల్లల్తో కలిసి ఆ పాఠశాలకు ప్రయాణం చేసిన ఒక వీడియో క్లిప్పింగు చూపించారెవరో. అట్లా పిల్లలంతా సీతాకోక చిలకల్లాగా పడవమీద వాలి, రోజూ, ఒక పాఠశాలకు వెళ్ళి రావడం సుమనోహర దృశ్యమే కాని, అందులో ఎంతో ప్రమాదముందని కూడా మనం మర్చిపోలేం.

అందుకని ఇప్పుడక్కడ ఉపాధ్యాయుల్ని నియమించి తిరిగి ఆ పాఠశాల మళ్ళా తెరవాలని ఆ గ్రామస్థుల కోరిక. సర్వ శిక్ష అభియాన్ నెల్లూరు జిల్లా ప్రాజెక్టు అధికారి బ్రహ్మానంద రెడ్డికి వాళ్ళ కోరిక వినబడింది. అటువంటి కార్యసాధకుడి దృష్టిలో పడ్డాక అగేదేముంది? ఎంతో కాలంగా మూతపడి పాడుపడిపోయిన పాఠశాల భవనం తలుపులు తెరిపించాడు. మేం వెళ్ళేటప్పటికి ఆ భవనానికి సున్నం వేస్తున్నారు. మమ్మల్ని చూసి ఊరంతా అక్కడ గుమికూడింది. ‘వట్టి ప్రాథమిక పాఠశాల కాదు, ఆ మత్స్యకార కుటుంబాల కోసం ఒక రెసిడెన్షియల్ పాఠశాల తెరవగలరా? ఇక్కడ చుట్టుపక్కల ఇట్లాంటి కుప్పాలు పదిహేడు దాకా ఉన్నాయి’ అని అడిగాడు ఎమ్మెల్యే గారు. ఒక రాష్ట్ర స్థాయి అధికారి తనతో పాటు ఆ ద్వీపంలో అడుగుపెట్టగానే ఆయన కొత్త కలలు కనడం మొదలుపెట్టాడు.

చీకటి పడబోతోంది, త్వరగా మనం బయల్దేరాలి అంటో హెచ్చరించారు మాతో వచ్చినవారు. మేం తిరిగి వస్తుంటే, అప్పుడే పడవ దిగి, ఊళ్ళో అడుగుపెట్టిన చిన్నారులు ఎదురయ్యారు. ‘మీకు బడి ఇక్కడ ఉంటే ఇష్టమా? లేకపోతే రోజూ పడవ మీద పోయి రావడం ఇష్టమా?’ అనడిగాను వాళ్ళని. తల్లికి దూరంగా ఉండే బడికి వెళ్ళాలని ఏ చిన్నారి కోరుకుంటుంది కనుక? గాంధీగారికి ఆధునిక విద్య పట్ల ఉన్న ఫిర్హ్యాధుల్లో మొదటిది ఇదే, అది పిల్లల్ని తల్లిదండ్రులనుండి వేరు చేస్తుందని. పిల్లలకి ఏడేళ్ళ వయసు వచ్చేదాకా పాఠశాలలో వెయ్యకూడదన్నాడాయన. కాని, ఇప్పుడు మనం రెండున్నరేళ్ళకే పిల్లల్ని బడిలో వేసే కాలానికి చేరుకున్నాం.

ఈ సారి నావ మీద తిరుగుప్రయాణం మరింత ప్రశాంతంగా ఉంది. నావలో ఉన్నవాళ్ళంతా అప్పుడే ఏదో ప్రార్థన ముగించుకుని వచ్చినవాళ్ళల్లాగా శాంతంగానూ, నిరామయంగానూ ఉన్నారు. ఆకాశమంతా సాంధ్యనీలం కమ్ముకుంది. మధ్యలో ఒక కుంచెతో విదిలించినట్టు సంజె గులాబి రంగు అక్కడక్కడా. మేము బయల్దేరినప్పటి ఆకాశమేనా అది? ఆ సరోవరమేనా అది? ఆ క్షణాన ప్రళయకావేరి నా కళ్ళకు ప్రణయకావేరిగా గోచరించింది.

27-9-2019

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading