ద వీవర్స్

42

గెర్టార్ట్ హౌప్ట్ మన్ ‘ద వీవర్స్’ (1892) చదవడం పూర్తి చేసాను. ఈ రచన గురించి మొదటిసారి ‘జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం’ లో చదివాను. ముప్ఫై ఏళ్ళ కిందట. నాటకంలోంచి ఒక చిన్న భాగం అనువాదం కూడా ఉందందులో. మొత్తం నాటకం కోసం వెతికినప్పుడు గౌతమీ గ్రంథాలయంలో Sixteen European Plays దొరికింది, మోడర్న్ లైబ్రరీ వాళ్ళ ప్రచురణ. కాని సరిగ్గా ఈ నాటకమున్న పేజీలే ఎవరో చింపేసుకున్నారు. ఏమైతేనేం, ఇన్నాళ్ళకు చదవగలిగాను. Horst Frenz, Miles Waggoner ల అనువాదం (1951).

‘ద వీవర్స్’ పందొమ్మిదో శతాబ్ది పూర్వార్థంలో జర్మనీలో పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో చిత్రించిన నాటకం. మరమగ్గాలు వచ్చి చేతి మగ్గాల మీద ఆధారపడ్డ చేనేతకారుల జీవితాల్ని ఎట్లా దుర్భరం చేస్తూ ఉన్నదీ, ఆ నరకం భరించలేక నేతపనివాళ్ళు ఎట్లా తిరగబడ్డరూ, మరమగాల్ని ఎట్లా ధ్వంసం చేసారూ ఇతివృత్తం.

జర్మనీలో సైలీషియా ప్రాంతానికి చెందిన నేతపనివాళ్ళ కుటుంబాలనుంచి వచ్చిన హౌప్ట్ మన్ నేతపనివాడుగా జీవించిన తన తాతని దృష్టిలో పెట్టుకునే ఈ నాటకం రాసాడు. నాటకాన్ని తన తండ్రికి అంకితమిస్తూ ఆ మాట చెప్పాడు కూడా.

పందొమ్మిదో శతాబ్ది ఉత్తరార్థంలో యూరపియన్ నాటకరంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన స్వభావవాదం (naturalism) ఈ నాటకాన్ని కూడా ప్రభావితం చేసింది. తన ప్రసిద్ధ గ్రంథం A Study of World Drama లో బారెట్ ఎచ్ క్లార్క్ రాసినట్టు, వీవర్స్ ఒక ప్రయోగం. ఇందులో నాయకుడు లేడు. అందుకు బదులు ఒక గుంపు ( అతడు mob అన్నాడు) ప్రధానపాత్ర వహిస్తుంది. మామూలుగా నాటకాల్లో కనవచ్చే విధంగా అయిదంకాల్లోనూ పాత్రల మధ్య కంటిన్యుటీ కనబడదిక్కడ. ఇక్కడ, నాయకుడూ, పాత్రలూ, ఇతివృత్తమూ, కథ, మలుపు, పతాకా అన్నీ నేతపనివాళ్ళ జీవితమే. మరొక విమర్శకుడు ఈ నాటక శిల్పాన్ని సింఫనీతో పోల్చాడు. నాటకంలో ప్రతి అంకమూ తనదైన ఒక వాచకంతో, గమకంతో, ధ్వనితో సాగుతుంది. చివరికి నాటకం ముగింపుకి వచ్చేటప్పటికి అయిదు వాద్యాల సంగీత కచేరీ పూర్తయినట్లుగా మన మనసుమీద ఒక సమగ్రముద్ర మిగిలిపోతుంది.

నా మటుకు నాకు నాటకంలో కనిపించిన గొప్ప ప్రజ్ఞ ఇంటినీ, వీథినీ, వ్యక్తినీ, సమూహాన్నీ, సంఘటననీ, చరిత్రనీ అల్లుకుంటూపోయిన తీరు. పరిస్థితులు మనుషుల జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.తిరిగి మనుషులు మళ్ళా పరిస్థితుల్ని ప్రభావితం చేస్తారు. ఈ పారస్పరికతని నాటకకర్త అనూహ్యంగా పట్టుకున్నాడు.నాటకం ఒక డాక్యుమెంటరీగా, కరపత్రంగా మారిపోకపోవడానికి ఇదే కారణమనిపిస్తుంది.

‘ద వీవర్స్’ చదవడం పూర్తవగానే తెలుగు నాటకం గురించి ఆలోచించకుండా ఉండటం కష్టం. 1892 లో ఈ నాటకం వచ్చినప్పుడే తెలుగులో కన్యాశుల్కం కూడా వచ్చింది. ‘కన్యాశుల్కం:19 వ శతాబ్ది ఆధునిక భారతీయ నాటకాలు ‘ (2007) అనే తన అద్భుతమైన రచనలో డా.యు.ఏ.నరసింహ మూర్తిగారు వీవర్స్ నాటకాన్నీ, కన్యాశుల్కాన్నీ పోల్చే ప్రయత్నం కొంతచేసారు. సమకాలిక సమాజాన్ని చిత్రించడం, వాడుకభాష వాడటం, బీభత్సరసపోషణ వంటివి రెండు నాటకాల్లోనూ సమానంగానే ఉన్నప్పటికీ, కన్యాశుల్కం నిస్సందేహంగా మరింత గొప్ప నాటకం. హౌప్ట్ మన్ కి 1932 లో నోబెల్ బహుమతి రావడానికి అతడు దీర్ఘకాలం జీవించిఉండటం కూడా ఒక కారణం కావచ్చు.

కాని 21 వ శతాబ్దంలో కూడా వీవర్స్ నాటకం నుంచి తెలుగునాటక రంగం నేర్చుకోగలిగింది చాలానే ఉంది. అన్నిటికన్నా ముందు నేతపనివాళ్ళ గురించే. తెలుగు రాష్ట్రాల్లో దశాబ్ద కాలం ముందు విరివిగా సంభవించిన నేతపనివాళ్ళ ఆత్మహత్యల్ని విశ్లేషించడానికి ప్రయత్నించిన నాటకమేదీ నాకింతదాకా కనిపించలేదు. పత్తి రైతుల ఆత్మహత్యలు, సెజ్ లకు వ్యతిరేకంగా తలెత్తిన ఉద్యమాలు, గ్లోబలైజేషన్ నేపథ్యంలో సంభవించిన, సంభవిస్తూన్న సామాజిక పరిణామాల నెన్నిటినో మన నాటకకర్తలు పట్టించుకోకుండా వదిలేసారనే అనాలి.

అందుకు కారణం బహుశా ఆ సంఘటనలూ, ఆ పరిణామాలూ రంగస్థలం మీద ఇమిడేటంత చిన్నవి కావనిపించిఉండవచ్చు. కాని సరిగ్గా ఇక్కడే హౌప్ట్ మన్ ప్రతిభ నన్ను ఆశ్చర్యపరిచింది. కళ్ళముందు బీభత్సంగా కనిపిస్తున్న జీవితాన్ని ఒక సమగ్ర శిల్పంగా రూపొందించడం కష్టమే కాదు, కొన్ని సార్లు క్రూరం కూడా. అందుకనే ఆయన ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపించాడు. ఆ చూపించడంలోనే ఒక నేతనేసాడు. ఒక రకంగా గురజాడ చేసింది కూడా అదే.

జీవితవాస్తవాన్ని చూపించడానికి పంతొమ్మిదో శతాబ్దికన్నా ఇప్పుడు మనకి మరిన్ని వనరులు లభ్యంగా ఉన్నాయి. కాని సాహసమే తక్కువయ్యింది. ఇట్లాంటి నాటకాలెవరు చూస్తారనే ప్రశ్న కూడా వెయ్యవచ్చు. కాని సాహిత్య చరిత్రలో ఆ ప్రశ్నకి ఏమంత విలువ లేదు.

13-4-2015

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading