ప్రేమపానంతో మత్తెక్కాను

19

రంజాన్. ప్రార్థనలతో, ఉపవాసాలతో, దానాలతో గడిచిన నెల. మెహిదిపట్నంలో నేను చూస్తున్న ప్రతి రంజాన్ నెలా ఒకప్పుడు నేను శ్రీశైలంలో చూసిన మాఘమాసాన్ని గుర్తుతెస్తూంటుంది. గాల్లో ఒక తేటదనం, శుభ్రత్వం ఆవరించినట్టుంటాయి. మనుషులు కొద్దిగా కొంతసేపు ఈ ప్రపంచపు బరువు పక్కకు దించుకుని అగోచరమైన ఓదార్పునేదో అనుభవిస్తున్నట్టుంటారు. అది మతాతీత క్షణం. అటువంటి సందర్భంలో రూమీ మాటలే నాకు పదేపదే గుర్తొస్తుంటాయి.  ఆయన ఇలా గానం చేసాడు:

మిత్రులారా, నేనేం చేసేది?

మిత్రులారా, నేనేం చేసేది? నేనెవరో నాకే తెలియదు.
నేను క్రైస్తవుణ్ణి కాను, యూదునిగాను, పారశీకుణ్ణికాను, ముస్లిమునీ కాను.

నేను తూర్పుకి చెందినవాణ్ణి కాను, పడమటివాణ్ణీ కాను.
నేను నేలదారిన రాలేదు, సముద్రమార్గానా రాలేదు.
ప్రకృతిపొత్తిళ్ళనుంచి ప్రభవించినవాణ్ణికాను, అంతరిక్షంనుంచి ఊడిపడనూ లేదు.
నాది పృథ్వికాదు, ద్యులోకమూ కాదు.
నాకొక ఉనికి లేదు, అస్తిత్వం లేదు.

నేను హిందుస్థాన్ కి చెందినవాణ్ణి కాను, చీనావాణ్ణి కాను, మంగోల్ ని కాను,
మధ్యాసియా వాణ్ణీ కాను.
యూఫ్రటీస్, టైగ్రిస్ ల మధ్యదేశం వాణ్ణి కాను, ఖొరాసాన్ కి అసలే చెందను.
నాదీ లోకం కాదు, పరలోకమూ కాదు
స్వర్గనరకాలతో సంబంధమే లేదు.

నేను ఆదాముకి చెందినవాణ్ణి కాను, అవ్వకి చెందినవాణ్ణీకాను,
ఏ పరదైసుకీ చెందను, ఏ దేవదూతకీ చెందను.
నాకంటూ ఒక చోటు లేదు, ఆనవాలు లేదు.
దేహం లేదు, ఆత్మ లేదు, ఆత్మలకే ఆత్మ ఆధారమైన చోటు నాది .

నేను ద్వంద్వాన్ని వెంటాడాను, రెండు ప్రపంచాలూ ఒక్కటిగా జీవించాను.
నేను వెతికేదొక్కటే, తెలుసుకున్నదొక్కటే, చూసేదొక్కటే, ఎలుగెత్తి పిలిచేదొక్కటే
నేను అందరికన్నా మొదట చూసిందొక్కణ్ణే, అతడే చివరివాడూను,
బయటా అతడే, లోపలా అతడే
అతడు తప్ప మరేదీ నేనెరగను.
ప్రేమపానంతో మత్తెక్కాను, రెండు ప్రపంచాలూ నా నుంచి జారిపోయాయి.
ఇప్పుడు నాకు ప్రేమపానం తప్ప మరేదీ పట్టదు.

ఏ రోజైనా ఒక్క క్షణమైనా నీనుంచి ఎడబాటు తటస్తించిందా
జీవితకాలం దుఃఖం తప్ప మరేదీ మిగలదు.
ఏ రోజైనా ఒక్కక్షణమైనా నీతో ఏకాంతం దొరికిందా
రెండు ప్రంపంచాల్నీ కాలరాచి మరీ నాట్యం చేస్తాను.

తబ్రీజ్ నుంచి వచ్చిన నా మిత్రుడా
నేను లోకం నుంచి తేలిపోతున్నాను
సంతోషపారవశ్యమొక్కటే నేనిప్పుడు చెప్పుకోగలిగింది.

8-8-2013

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading