ఇన్నాళ్ళకు మరొకసారి బనగర్ వాడి చదివాను. దాదాపు నలభై అయిదేళ్ళ తరువాత. ఆ పసిప్రాయంలో నన్నంతగా లోబరుచుకున్న ఆ ప్రాశస్త్యం ఆ నవలదా లేక అప్పటి నా నిష్కళంక హృదయానిదా లేక తాడికొండ పాఠశాలదా అని పరిశీలనగా చదివాను. అదంతా ఆ కథలోని నైర్మల్యమని నాకిప్పుడు బోధపడింది.
తాడికొండ గురుకుల పాఠశాల
ఆ స్ఫూర్తి ఆ మట్టిలో, ఆ గాలిలో అలానే ఉందనుకుంటాను. సదుపాయాల కల్పనలో ఎగుడుదిగుళ్ళు ఉండవచ్చుగాక, కాని స్ఫూర్తిప్రసారంలో, తాడికొండ ఇప్పటికీ అంతే నవచైతన్యంతో కనిపించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది.