కొన్ని కలలు కొన్ని మెలకువలు-17

3

మహోద్యమం

నాకు సంబంధించి కార్యక్రమంలో నన్ను ఆశ్చర్యపరిచిన అంశాలు మూడున్నాయి. నాకు కలెక్టర్ అంత ముఖ్యమైన బాధ్యతను ఇస్తారని నేను ఊహించలేదు. అంతేకాక దానివల్ల జిల్లా కోర్ కమిటీలో కూడా నాకు సభ్యత్వం దొరికింది. మొదటిరోజుల్లో నాకు పత్తికొండ, తుగ్గలి మండలాలకు నోడల్ అధికారి బాధ్యతకూడా లభించింది. ఆ రెండు మండలాలూ ఆదోని ప్రాంతంలో గిరిజనులు అత్యధికంగా ఉండే ప్రాంతాలు కావడమే కాకుండా దళితులు, వెనకబడిన కులాలూ కూడా అత్యధిక సంఖ్యలో ఉండే ప్రాంతాలవి.

ఇక నన్ను ఆశ్చర్యపరిచిన రెండవ అంశం, నాకు కొనుగోలు, వస్తుసరఫరాల కమిటీ బాధ్యతని అప్పగించడం.

స్వభావరీత్యా నా ఆసక్తిని బట్టి నాకు అకడమిక్ కమిటీ బాధ్యతలుగాని లేదా ట్రయినింగ్ కమిటీ బాధ్యతలుగాని లభించిఉంటే బాగుండనిపించింది. కాని, అకడమిక్ అర్హతల దృష్ట్యాగాని, అనుభవరీత్యాగాని, లేదా ప్రభుత్వంలో నిర్వహిస్తున్న బాధ్యతల రీత్యాగాని ఆ కమిటీల బాధ్యులు నాకన్నా ఎంతో సీనియర్లు.

నేను కోరుకున్నది ఆయా కమిటీలకు అధ్యక్షునిగా ఉండాలనో లేదా కార్యదర్శిగా ఉండాలనో కాదు, కనీసం సభ్యునిగా ఉన్నా నా అభిప్రాయాల్ని ఎప్పటికప్పుడు వినిపించే అవకాశం ఉంటుందనుకున్నాను. ఆ మాట కలెక్టరుగారితో అంటే, ఆయన కోర్ కమిటీ సభ్యుడు ఏ ఉపకమిటీ సమావేశానికైనా హాజరవ్వవచ్చనీ, తన అభిప్రాయాల్ని వివరించ వచ్చుననీ అన్నారు.

అన్నిటికన్నా ఎక్కువ ఆశ్చర్యపరిచింది ఆయన కొనుగోలుకమిటీకి జిల్లాపోలీసు సూపరింటెండెంట్‌ను అధ్యక్షునిగా ఉండమని కోరడం, నాకు ఆయనతో నేరుగా పనిచేసే అవకాశాన్నివ్వడం.

కలెక్టర్ గారి ప్రణాళికావిధానంతో నాకప్పటికే కొంత అవగాహన కలిగింది. ఆయన ఏం చేసినా దానిలో చాలా ఆలోచనలుండేవి.

అప్పట్లో నల్లమల అడవుల్లో ఉండే చెంచువారిమీద పోలీసు జులుం బాగా ఉండేది. (అప్పటికింకా అక్కడ నక్సలైట్లు బలపడలేదు. వారు ఆ ప్రాంతంలో అప్పుడప్పుడే కాలూను తున్నారు). చెంచువారినింకా అక్కడి పోలీసులు పూర్వకాలపు క్రిమినల్ తెగలాగా భావిస్తూ వుండే మనస్ధితిలో ఉండేవారు. వారిని ఏదో ఒక రకంగా ఇబ్బందికి గురిచేసేవారు. అటువంటి కేసులు కనీసం వారానికొకటయినా నా దృష్టికి వచ్చేవి. నేను వాటిని తక్షణమే కలెక్టరుకి నివేదిస్తుండేవాణ్ణి.

అటువంటి చాలా కేసుల్ని న్యాయపరంగా ఎదుర్కోవడం కష్టమనీ, కేవలం వ్యక్తిగత సంబంధాలు, ఉన్నతాధికారుల లేదా రాజకీయనాయకుల ప్రభావం వల్ల మాత్రమే దిగువస్ధాయి పోలీసుల్ని మనం ఆ విషయంలో అదుపుచేయగలుగుతామని నేను త్వరలోనే గ్రహించాను.

బహుశా, ఈ కార్యక్రమంలో జిల్లాపోలీసుసూపర్నెంటుతో నను కలిసి పనిచేస్తున్న ట్లయితే ఆ సాన్నిహిత్యం ఆ మేరకు దిగువస్దాయి సిబ్బందికి సంకేతాలు పంపిస్తుందనీ, చెంచువారికి దానివల్ల ఎంతో కొంత మేలు జరుగుతుందని కూడా కలెక్టరు ఆలోచించి ఉండవచ్చు.

కలెక్టర్ మాతో సమావేశమైన మర్నాటినుంచే వివిధకమిటీలు తమ పనులు మొదలుపెట్టాయి. ప్రతి ఒక్క కమిటీకి అక్షరాస్యతా కార్యక్రమ ప్రణాళిక, పెర్ట్ చార్ట్ (ఏ పని ఎవరు ఎప్పుడు చేయాలో నిర్దేశించే కాలక్రమణపట్టిక) ఇవ్వబడింది. దాని ప్రకారం అన్ని కమిటీలు తమ బాధ్యతల్ని అవగాహన చేసుకోవడం మొదలుపెట్టాయి.

ఆ దారిలోనే కొనుగోలు, సరఫరాల కమిటీ కూడా తన పనిమొదలుపెట్టింది. చూడగా, మా కమిటీ బాధ్యత చాలా పెద్దదే అనిపించింది. దాదాపు నాలుగుకోట్ల రూపాయల ప్రణాళికలో రెండుకోట్ల దాకా కార్యక్రమాన్ని మా కమిటీయే నిర్వహించవలసిఉంటుంది.

దానిలో అన్నిటికన్నా పెద్ద పని ఒక్కొక్కటి ఆరులక్షల చొప్పున మూడు వాచకాలు ముద్రించడం. ఆరులక్షల మంది అభ్యాసకులకు పలకలు, బలపాలు, అరవైవేల మంది కార్యకర్తలకు కరదీపికలు ప్రచురించడం, ఇవి కాక బాగులు, బానర్లు, కరపత్రాలు, పోస్టర్లువంటి సామగ్రిని ఎప్పటికప్పుడు తయారుచేయించి అందించడం కమిటీ బాధ్యతల్లో ముఖ్యమైనవి. వీటన్నిటిని ప్రొక్యూర్ చేయడం ఒక వంతయితే వీటిని ఎప్పటికప్పుడు జిల్లాలోని అరవైదాకా మండల కేంద్రాలకు చేర్చడం మరొక వంతు.

ఆ డిసెంబర్ నెల మొత్తం ఎవరికి వారు తమముందున్న కర్తవ్యాన్ని అర్ధం చేసుకోవడం లోనూ, ఒకరితో ఒకరు ఆసక్తితో చర్చించుకోవడంలోనూ గడిచిపోయింది. కర్నూలు జిల్లా స్వాతంత్య్రోద్యమకాలం తర్వాత, బహుశా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకాలంలో మాత్రమే అటువంటి సంచలనాన్ని సంరంభాన్ని చూసిఉంటుంది.

మాతో సమావేశమైన తర్వాత కలెక్టరుగారు వివిధ సామాజిక వర్గాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూవచ్చారు. ప్రజాజీవితంలోని అన్ని రంగాలకూ చెందిన పెద్దలందరినీ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావలసిందిగా అభ్యర్ధించారు. అటువంటి ఆహ్వానాన్ని అందించడంలో ఆయన ఏ వర్గాన్నీ వదల్లేదు.

ఒక వైపు మతపెద్దలతో సమావేశమయ్యారు. మరొకవైపు థియేటర్లలో సైడ్లు వేయడం ద్వారా ప్రచారానికి సహకరించమని అభ్యర్థించడానికి ఎగ్జిబిటర్లతో సమావేశమయ్యారు. పెద్ద ఎత్తున కార్యకర్తల శిక్షణ కార్యక్రమాలు చేపట్టడానికి ఆహారన్నందించడంలో సహకారం కోసం, కన్సెషన్లకోసం హోటల్ యజమానులతో సమావేశమయ్యారు. ప్రచార, బోధన సామగ్రిని రవాణా చెయ్యడంలో జాప్యాన్ని నివారించడం కోసం, ట్రాన్స్‌పోర్ట్ రేట్లలో కన్సెషన్ కోసం ట్రాన్స్‌పోర్ట్ యజమానులతో సమావేశమయ్యారు.

అన్ని రాజకీయ పక్షాలతో, కార్మిక సంఘాలతో, విద్యార్ధి సంఘాలతో, ఉపాధ్యాయ సంఘాలతో ఆ డిసెంబర్ రెండవ సగభాగం ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తూనే వచ్చారు.

జనవరి రెండవతేదినుంచి జిల్లాలో కనీవినీ ఎరుగని మహత్తర కార్యక్రమమేదో సంభవించబోతోందని, ఆ యజ్ఞంలో తాము ప్రతి ఒక్కరు ఏదో ఒకరీతిన పాలుపంచు కోవాలని ప్రతి ఒక్కరూ ఊవ్విళ్లూరారు.

జనవరి రెండు నుంచి వారం రోజుల పాటు కలెక్టరు నిర్ణయించిన ప్రకారం కర్నూలుతో మొదలుకుని ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రంలోనూ ఆయా శాసనసభ్యులు కలెక్టర్ సమక్షంలో అక్షరజ్యోతి వెలిగించి అక్షరాస్యతా ప్రతిజ్ఞ చేస్తారు. ఆ తరువాత అన్ని మండల కేంద్రాలలోనూ మండల పరిషత్ అధ్యక్షులు, ఆయా మండలాల నోడల్ అధికారుల సమక్షంలో అక్షరజ్యోతి వెలిగించి ప్రతిజ్ఞ పూనుతారు. అక్కణ్ణుంచి ఆయా మండలాల సర్పంచ్‌లందరూ ఆ అక్షరజ్యోతిని తమ గ్రామాలకు తీసుకుపోయి అక్షరపతాకాన్ని ఎగురవేసి జ్యోతి వెలిగించి ప్రతిజ్ఞ పూనుతారు.

ఆ కార్యక్రమం మొత్తం కలెక్టర్ ప్రణాళిక చేసినట్టే జరిగింది. రోజుమీద రోజు గడిచేకొద్దీ ప్రణాళికలో మేం చూడలేని మీఉత్సాహం మా కళ్లముందు ఆవిష్కారం కావడం మొదలుపెట్టింది.

ఆ సప్తాహంలో చివరి రోజులకు వచ్చేటప్పటికి, ఎప్పుడూ ఏదో భీతావహ స్థితి నెలకొన్నట్టుండే ఆళ్లగడ్డలో సైతం అపూర్వమైన పండగ వాతావరణం అల్లుకుపోయి ప్రతి ఒక్కరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఆ దృశ్యాన్ని నేను కళ్లారా చూసాను.

అక్షరజ్యోతి నియోజకవర్గ స్ధాయి దాటి మండల కేంద్రాలకూ, అక్కణ్ణుంచి గ్రామాలకూ తరలేటప్పటికి నా జీవితంలో ఎన్నడూ చూసిఉండని గొప్పచైతన్యం జిల్లా అంతటా దావానలంలాగా చెలరేగడం చూసాను.

ప్రజల్లో కొన్ని ఆకాంక్షలు సాధారణంగా నిద్రాణంగా ఉంటాయి. కాని అవి  మేల్కొన్నప్ప్పుడు మామూలుగా మేల్కొలుపు. అటువంటి సమయాల్లో మామూలు మనుషులే చరిత్రనిర్మాతలుగా మారతారు. మామూలు దైనందిన జీవితమే చరిత్రగా మారిపోతుంది.

అపూర్వమైన ఉత్సాహం, అనిదంపూర్వమైన కలకలంతో జిల్లా అటు మంత్రాలయం నుంచి ఇటు అహోబిలందాకా, ఇటు శ్రీశైలం నుంచి అటు కస్సాపురం దాకా ఆనందో ద్రేకాలతో ప్రకంపించింది.

మామూలుగా చదువుకోవడానికి ఇష్టపడరనీ, తమ పిల్లల్ని బడికి పంపకుండా పనికి తోడుతీసుకుపోతారనీ అనుకునే ఆదివాసులు, దళితులు, శ్రామిక స్త్రీలు పెద్ద ఎత్తున అక్షరపత్రిజ్ఞకు ముందుకురావడం ప్రతి ఒక్కరినీ చకితుల్ని చేసింది. అది వారిలో నిద్రాణంగా ఉంటూ, ఇంతకాలం జనాదరణకు గురయిన జ్ఞానతృష్ణను మేల్కొల్పింది.

ఆ తృష్ణని నిర్వచించడం, వివరించడం కూడా కష్టం. ఎందుకు ప్రజలు అక్షరాస్యతా నినాదానికి ప్రతిస్పందించారు? అక్షరాస్యులు కావడం వల్ల తమ ఆదాయాలు రాత్రికి రాత్రి పెరిగిపోతాయని వారిలో ఏ వయోజనుడుకూడా నమ్మిఉండడు. లేదా అక్షరాస్యులు కావటంతోటే తమ జీవితాల్లో అంతదాకా చూడనిదేదో మహత్తరమైంది అకస్మాత్తుగా సంభవిస్తుందని కూడా వారు ఊహించి ఉంటారనుకోను. అలాకాక, మామూలుగా అక్షరాస్యతా ప్రచారంలో చెప్పేటట్టుగా, ప్రజలు కనీసం అక్షరాస్యులయితే వారి దైనందిన జీవితాల్లో చాలా సౌలభ్యాలు, సౌకర్యాలు (బస్సుల మీద ఊరిపేర్లు చదవడం, కరెన్సీనోట్లు లెక్కించగలగడం, తూనికలు, కొలతల్లో మోసాల్ని పసిగట్టగలగడం వంటివి) వస్తాయని విన్నందువల్ల లక్షలాది ప్రజలు కొత్త ఉత్సాహంతో ఊగిపోయారని కూడా నేను నమ్మలేను.

మరి ఏది ఆ ప్రజల్ని అంతగా ఉర్రూతలూగించిందని నేను భావిస్తున్నాను?

నేననుకుంటాను, అటువంటి వేళల్లో ప్రజల మధ్య ఉండే వివిధరకాల భేదాలు, చీలికలు, పగుళ్లు అన్నీ మూసుకుపోయి వారిమధ్య ఆత్మీయసంబంధంలాంటిదేదో ఏర్పడుతుందని. అంతదాకా ఒకరికొకరు పట్టనట్టుగా, విడివిడిగా, శకలాలుగా ఉండే వాళ్లంతా మహాస్తిత్వంగా మారిపోతారని.

ఆ ఆస్తిత్వంలో వారు ఒక్కటవంతో వారిలో నిద్రాణంగా ఉన్న సృజనాత్మకశక్తులు మేలుకుంటాయి. ఆ జాగృతిలోని సంరంభంతో మరికొన్ని శక్తులు మేల్కొంటాయి. గొప్ప ఉద్యమాల్లో, గొప్పపోరాటాల్లో సంభవించేదదే. అటువంటి శక్తులు మేల్కోవడం కూడా నిత్యం జరిగే ప్రక్రియకాదు. కొన్ని విరామాల తర్వాత అరుదుగా సంభవించే అవకాశాలవి.

అటువంటి అరుదైన అవకాశాన్ని 90ల ప్రారంభంలో సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమాల సందర్భంగా దేశంలో చాలా ప్రాంతాలు మళ్లా కొత్తగా చూసాయి. స్వాతంత్య్రానంతర తరాలకు చెందిన నాబోటి వాళ్లకి చాలామందికి అదే చెప్పుకోదగ్గ మొదటి సందర్భం కూడా.

ఆ ఉద్యమంలో ప్రచారకార్యక్రమాన్ని భుజాన వేసుకుని ముందుకు కదిలిన గాయకులవల్లే, తమ తోటి మనుషులకు అక్షరాలు దిద్దించడానికి కంకణం కట్టుకున్న కార్యకర్తలమల్లే నాక్కూడా అదొక గొప్ప అవకాశం. అది ప్రజల్లో మేల్కొల్పినట్టే నాలో నిద్రాణంగా ఉన్న సత్త్వాన్నీ, శక్తుల్నీ కూడా మేల్కొల్పి భవిష్యత్తు పట్ల ఆశావహదృక్పథానికి దారి చూపించిందని చెప్పితీరాలి.

4

శారీరిక నైతిక భారం

జనవరి నెల చివరికి వచ్చేటప్పటికి వివిధ స్థాయిల్లో, వివిధ రంగాల్లో కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. ఒకవైపు అన్ని గ్రామాల్లో సర్వే పూర్తయ్యి సర్వే జాబితాలు కంప్యూటరు కెక్కించడం మొదలయ్యింది. మరొకవైపు మండల స్థాయి కళాజాత బృందాల్ని ఏర్పాటు చేసి ఆ కళాకారులకు గాజులదిన్నె ప్రాజెక్టు వద్ద శిక్షణాకార్యక్రమాలు మొదలయ్యాయి.

ఒక వాచకాల విషయానికి వస్తే అకడమిక్ కమిటి తన బాధ్యతను మరీ లోతుగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టింది. తక్కిన జిల్లాల్లో దాదాపుగా వయోజనవిద్య కోసం రాష్ట్రస్ధాయి వనరుల కేంద్రం రూపొందించిన వాచకాల నమూనానే కొద్దిపాటి మార్పుల్తో కొనసాగించగా, కర్నూలు ఆ బాటన నడవడానికి ఇష్టపడలేదు.

ముఖ్యంగా జనవిజ్ఞాన వేదికకు చెందిన డా. బ్రహ్మారెడ్డి చేసిన సూచనల మేరకు మొదటివాచకంలో గణనీయమైన మార్పులు చేపట్టబడ్డాయి. అటువంటి మార్పులు చేపట్టే ముందు ప్రతి పదం దగ్గరా, ప్రతి వాక్యం దగ్గరా విస్తృతమైన, వేడి వేడి చర్చలు జరిగాయి. వయోజనుల అభ్యసన పరివర్తనకు సంబంధించి నాతో ప్రతి ఒక్కరికీ ఆ చర్చలెంతో వెలుగు చూపించాయి.

అటువంటి ఒక చర్చ ముగిసిన తర్వాత రాష్ట్ర వయోజన విద్యా వనరుల కేంద్రానికి చెందిన రిసోర్స్ పర్సన్ నాగలక్ష్మిగారు ప్రబోధనాత్మకమైన గీతం పాడారు. ఆ గీతం విన్నప్పుడు అక్కడ ఉన్నవారందరూ భావోద్వేగానికి లోనవడం నాకు స్పష్టంగా గుర్తుంది.

మొత్తం కొనుగోళ్ల కార్యక్రమంలో తక్కిన వస్తుసామగ్రి అంతా ఒక ఎత్తు, వాచకాల ముద్రణ, సరఫరా మొరక ఎత్తు. తక్కిన జిల్లాల్లో వాచకాల ముద్రణని పూర్తిగా టెండర్ల ద్వారా అప్పగించేసారు. కాని మా కలెక్టర్ దానికి అంగీకరించలేదు. వాచకాల ముద్రణలో ధర నిర్ణయించడంలో కాగితం నాణ్యత, ధర చాలా ముఖ్యమైన అంశాలనీ, అందువల్ల నాణ్యమైన కాగితాన్ని నేరుగా ప్రభుత్వ ముద్రణ శాఖ నుంచి కొనుగోలు చేసి కేవలం ముద్రణ బాధ్యతను మాత్రమే ప్రైవేటు ప్రింటర్లకు అప్పగిస్తే బాగుణ్ణని ఆయన భావించారు.

పొదుపు కోసం, తద్వారా పోస్ట్-లిటరసీ కార్యక్రమాలకు తగినన్ని నిధులు కేటాయించవచ్చుననే ఆయన సదుద్దేశమే దీనికి కారణమని వేరే చెప్పనక్కరలేదు. కాని ఈ నిర్ణయం మా సహనాన్ని, ఓపికని చిరిదాకా కూడా పరీక్షిస్తూనేవచ్చింది. అలాగని ఈ నిర్ణయం వల్ల మేం కష్టపడ్డామని అర్ధం కాదు. వ్యక్తిగతంగా ఇది నాకొక చక్కని శిక్షణగానే నేను భావిస్తూన్నాను. కాని ఈ విధంగా కాగితం ఒకచోట, ముద్రణ మరొకచోట, సరఫరాలు మరొకచోట చెయ్యడంలో ఆచరణాత్మక ఇబ్బందులు మాత్రం చెప్పనలవికానివి.

మొదట, ఆ ప్రింటింగ్ కాగితం గురించి మేం కలెక్టర్ గారి లేఖ తీసుకుని ప్రింటింగ్ కమిషనర్‌ని కలిసాం. ఆయన పోలీసు అధికారి. మా ప్రతిపాదన మొత్తం ఆయనకు హాస్యాస్పదంగా అనిపించింది. వినగానే నవ్వేసాడు. ఆ తరువాత, అలా పేపరు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేస్తాడు. అయినా కలెక్టరుగారు పట్టు వదల్లేదు. విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి మొత్తానికి అనుమతి సాధించారు. ఆ తరువాత ముద్రణ టెండర్లు.

బహుశా అంత కాంపిటిటివ్ రేట్లకు దేశంలోనే ఎవ్వరూ ఆ ముద్రణను ఖరారు చేసి ఉండరు. చివరికి ఒక్కొక్క వాచకం రెండు లక్షల ప్రతులు చొప్పున ముద్రించడానికి ముగ్గురు ప్రింటర్లకు అనుమతి లభించింది. అందులో ఒకరు విజయవాడ ముద్రాపకుడు కాగా, ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన వారు. టెండర్లు ఖరారు చేసి ఉత్తర్వులు ఇచ్చేముందు మా కమిటీ సభ్యులు ముద్రణ శాఖలో డిప్యూటీ డెరెక్టరుగా ఉన్న ప్రసాద్ గారి నేతృత్వంలో కమిటీ అన్ని ప్రెస్‌లనీ తనిఖీ చేసి వచ్చింది.

ఆ తరువాత అసలు కార్యక్రమం మొదలయ్యింది. మేం ఆ ప్రెస్‌లకు కర్నూలు నుంచీ, హైదరాబాద్ నుంచీ పేపర్ పంపించడం, ఆ ప్రెస్‌లు ప్రింటింగ్ చేపట్టేలా పర్యవేక్షించడం, ముద్రణ పొందిన పుస్తకాల్ని కర్నూలు తెప్పించడం, తెప్పించిన తర్వాత మండలాలకు పంపిణీ చెయ్యడం, ఇలా వరసగా పని వెనుక పని.

ఫిబ్రవరి నెలాఖరుకు వచ్చేటప్పటికి నెమ్మదిగా వివిధ కమిటీలకు తమ పనిభారం అర్ధం కావడం మొదలు పెట్టింది. అక్షరాస్యతా కార్యక్రమాన్ని ఉద్యమం అనుకుంటే దానికి కేవలం దిగువ స్ధాయిలో మాత్రమే పూర్తి స్ధాయి కార్యకర్తలుంటే చాలదనీ, దిశానిర్దేశం చేసే జిల్లా కమిటీల్లో కూడా పూర్తి స్ధాయి కార్యకర్తలవసరమనీ బోధపడటం మొదలుపెట్టింది.

మేమంతా మామూలుగానే కొన్ని విధినిర్వహణ బాధ్యతల్ని నెరవేర్ప వలసినవాళ్లం. ఆ బాధ్యతల నిర్వహణకి మేం మా రాష్ట్ర స్ధాయి ప్రభుత్వ శాఖలకూ, మా క్లయింటైల్ అనదగ్గ ప్రజలకూ జవాబుదారులం. అక్షరాస్యత మాకొక స్వచ్ఛంద, అదనపు కార్యక్రమం. అక్షరాస్యత పేరిట మేం మా పనులను పక్కనపెట్టడానికి మా శాఖల్ని అలాఉంచి కలెక్టరే అనుమతించేవాడు కాడు.

ఒకవైపు నేను కొనుగోలు కమిటీ పనులు చూసుకుంటూనే మరొకవైపు నల్లమల అడవుల్లోని చెంచువారి కోసం చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా అంతే శ్రద్ధతో, దీక్షతో చేపట్టవలసి ఉంటుందని ఆయన ఆశించేవాడు. అందులో, ఆ పార్శ్వంలో కూడా ఏ మాత్రం ఆలస్యాన్నీ సహించేవాడు కాడు. ఇది శారీరకంగా, నైతికంగా మామీద నానాటికీ భారాన్ని పెంచడం మొదలుపెట్టింది.

ముఖ్యంగా కలెక్టరు చాలా విషయాల్లో ప్రభుత్వ శాఖలపైనా, అధికారుల చిత్తశుద్ధి పైనా వాస్తవదూరమైన అంచనాలు పెట్టుకున్నట్టుగా నాకు కనిపించడం మొదలు పెట్టింది. రెండవది, ఆయన పొదుపు పాటించాలనుకోవడం వల్ల మామూలుగా జరగవలసిన ప్రతి పనీ మరింత కష్టంగానూ, మరింత ఆలస్యంగానూ జరిగేది.

మా కమిటీకి ఏ పని కూడా తనంత తానుగా చేసే అవకాశం ఉండేది కాదు. మేం ఏం చెయ్యాలన్నా అది చాలా ప్రొసీజర్‌తో, సహజంగానే ఆలస్యంతో కూడుకున్న పని. కొనుగోళ్లు సహజంగానే చాలా నియమనిబంధనల మేరకు చేపట్టవలసిన పని. పేరుకు, కమిటీలో జిల్లా రవాణాధికారి, జిల్లా పౌరసరఫరా అధికారి వంటి అధికారులు కూడా సభ్యులుగా ఉన్నప్పటికీ వారెన్నడూ ఆసక్తితో ఆ కార్యక్రమంలో భాగం పంచుకోలేదు.

మేం ముద్రణాలయం స్టోర్స్ నుంచి పేపరు ముద్రాపకులకు పంపవలసినప్పుడు ఒక్క లారీ కూడా దొరికేది కాదు. మేం ఏ లారీని పెట్టాలన్నా అది రవాణాధికారి ఆమోదించిన రవాణా ధరలకే పెట్టాలన్నది కలెక్టరు ఉత్తర్వు. అందువల్ల లారీలు మమ్మల్ని తప్పించుకు తిరిగేవి. ఒకరోజు కూడా రవాణాధికారి తాను స్వయంగా రావడంగాని లేదా తన సిబ్బందిని పంపించి లారీలు ఏర్పాటు చేయడంగాని చూడలేదు. కలెక్టరుకు తమ వంతు సహాయం అందిస్తామన్న లారీ యజమానులు సమయానికి మొహం చాటేసేవారు. వాగ్ధానానికీ, ఆచరణకూ మధ్య అంత అగాధం ఉండగలదని నేనెన్నడూ ఊహించలేదు.

ఆ సమయంలో నాకు తోడుగా నిలిచిన ఇద్దరు అధికారుల్ని చెప్పుకోవాలి. ఒకరు అప్పట్లో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్‌గా ఉన్న గంగిరెడ్డి. ఆయన కావడానికి యాభయ్యయిదేళ్ల వయస్కుడైనప్పటికీ నా కన్నా యువకుడిగా ఆ పనులన్నిటిని భుజాన మోసాడు. అత్యంత నిజాయితీ పరుడూ, నిష్కళంకుడూ అయిన గంగిరెడ్డిగారి నుంచి నేనెంతో నేర్చుకున్నాను. అన్నిటికన్నా ముఖ్యం ఆయన వినయం.

జిల్లాలో వయసురీత్యా, హోదారీత్యా కూడా సీనియర్ అధికారి అయినప్పటికీ ఆ చలిరాత్రుల్లో ఆ స్టోర్స్ ఎదుట పడిగాపులు పడి పేపరు లారీల కెత్తించేదాకా నిలబడే ఉండేవాడు. కలెక్టరు ఆమోదం కావలసివస్తే తక్కిన అధికారుల్లాగా దేనికన్నా ఫైలు పంపేవాడుకాడు. ఆ ఫైలు తన చంకనపెట్టుకుని నేరుగా పోయి కలెక్టరు తనని పిలిచేదాకా అక్కడే వేచిఉండేవాడు. ఆయన విజ్ఞత, అనుభవమే లేకపోయుంటే మేం ఆ కార్యక్రమంలో ఒక్క పలకని కూడా కొనుగోలు చెయ్యలేకపోయేవాళ్లం.

రెండవ వ్యక్తి ప్రింటింగ్ శాఖ డైరెక్టర్ ప్రసాద్ గారు. ఆయన యువకుడు, మచ్చలేని శీలవంతుడు. ఆయన సాంకేతిక జ్ఞానమే మాకు తోడుగా లేకపోయింటే మేం అంత ముద్రణా కార్యక్రమాన్ని కలెక్టరు ఆశించిన రీతిలో చేపట్టగలిగేవాళ్లమే కాదు.

నా కార్యాలయసిబ్బంది గురించి కూడా చెప్పాలి. వారేమీ అక్షరాస్యతా ప్రతిన పూనిన వారు కాదు. వారి చైతన్యస్ధాయి మామూలు పౌరుల స్ధాయికి మించిందీ కాదు. కాని ఆ రోజులన్నిటా వారు చేసిన కృషి, అక్షరాస్యతా కార్యక్రమానికి చేసిన సేవ మరవలేనివి. ఆ యజ్ఞానికి వారు నిజంగానే సమిధలయ్యారని చెప్పవచ్చు.

ఒకరోజు నాకింకా బాగా గుర్తు. ఆ రోజు జిల్లా కోర్ కమిటీ సమావేశం జరిగింది. అది తొలిరోజుల్లో సమావేశం. అప్పుడప్పుడే ప్రచార కార్యక్రమం మొదలవుతోంది. నోడల్ అధికారులు తమ వెంట తీసుకుపోవడానికి బానర్లు కావాలని అడిగారు. మేం అప్పటికి రెండు రోజులనుంచి బానర్లు స్క్రీన్ ప్రింటింగ్ చేయిస్తున్నాం. ఇప్పట్లో అయిఉంటే ఆ బానర్లను ఏదన్నా కొరియర్ ఏజన్సీకి అప్పగించి నిశ్చింతగా ఊరుకోవచ్చు.

కాని కలెక్టరు దృష్టిలో అదొక వృథా ఖర్చు. ఆయన అన్నదేమంటే బానర్లు కట్టలు కట్టించి నోడల్ అధికారుల ఇళ్లకు చేర్పిస్తే వారు మరుసటి రోజు తమతో పాటు తమ వాహనాల్లో వాటిని మండల కేంద్రాలకు తీసుకుపోవచ్చని. వాటి కోసం అవసరమైన పాకింగ్ మెటీరియల్ కూడా కొనుగోలు చెయ్యవద్దన్నాడాయన. హాస్టళ్లలో నిరుపయోగంగా ఉన్న పాత గోనెపట్టాల్ని తెప్పించి వాటితో బానర్లు పాకింగ్ చెయ్యమన్నాడు. ఆ రోజు, ఆ సాయంకాలం, ఆ రాత్రంతా మేం బానర్లు కట్టలు కట్టించడం, ఆ గోనెపట్టాల మీద మండలాలు అడ్రసులు రాయడం, మా డ్రైవరు సుంకన్న వాటిని ఒక్కొక్క అధికారి ఇంటికే చేర్పించడం. ఆ పనులన్నీ అయ్యేటప్పటికి తెల్లవారింది. నేను కూడా నోడల్ అధికారినే కాబట్టి నా బానర్లు వెంటబెట్టుకుని నేను కూడా నా మండలాలకు తరలిపోయాను.

5

పాత్ర ముగిసిపోయింది

అటువంటి రోజులు, రాత్రులతోనే ఆ కాలమంతా గడిచింది. అంతలో ఒక మధ్యాహ్నం వేళ కలెక్టర్ గారినుంచి ఫోన్ వచ్చింది. ఆయన చెప్పారు కదా ‘నాకు హైదరాబాద్‌కి బదిలీ అయింది. నేను తక్షణమే రిలీవ్ అవుతున్నాను. నా స్వభావం ప్రకారం ఒక చోట నుంచి రిలీవ్ అయ్యాక ఇక అక్కడి ఫైళ్ల మీద వేటి మీదా సంతకం పెట్టడం నాకు ఇష్టముండదు. నేనేమయినా ఆమోదాలు ఎక్కడన్నా ఫైలు మీద ఇవ్వవలసినవి ఉంటే వెంటనే తీసుకురండి’ అన్నారాయన.

నాకొక క్షణం ఏమీ తోచలేదు. అక్షరాస్యతా కార్యక్రమం ఏమి కాబోతున్నది? కాని ఆ విషయాలు ఆలోచించే టైం లేదు. కలెక్టర్ ఆమోదం పొందవలసిన అంశాలుగాని, ఫైళ్లు గాని ఏమి మిగిలిఉన్నాయా అని ఆలోచించాను. ఏమీ కనబడలేదు. ఆయన పాలనతీరు అటువంటిది. ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయవలసిఉంటుంది. పెండింగు పెట్టడాన్ని సహించేవాడు కాడు.

జిల్లాలో ఇంకా ఆయన బదిలీ వార్త పూర్తిగా తెలియకముందే ఆ సాయంకాలమే కలెక్టర్ కర్నూలు వదిలిపెట్టేసారు. ఆ మర్నాడో లేదా తరువాతి రోజునో జిల్లా జాయింట్ కలెక్టర్ అత్యవసరంగా కోర్ కమిటినీ సమావేశపరిచాడు. ఆయన అప్పుడు కలెక్టర్ బాధ్యతల్ని కూడా నిర్వహిస్తున్నాడు.

అంతదాకా జరిగిన పరిణామాల్ని ఆయన కోర్ కమిటీ సభ్యులకు వివరించాడు. కేవలం రాజకీయ కారణాల వల్ల కలెక్టర్ అర్ధాంతరంగా బదిలీ అయిపోవలసిరావడాన్ని వివరించి, అందర్నీ సూటిగా ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. ‘అక్షరాస్యతా కార్యక్రమం పట్ల పూర్తి నిబద్ధత, స్పష్టమైన విజన్ కలిగిన కలెక్టర్ బదిలీ అయి వెళ్లిపోయారు. మనతో తన ఆలోచనలు ఆయన చాలావరకూ పంచుకునే ఉండిఉండవచ్చు. ఆయన లేని లోటు పూడ్చగలమనుకోను. ఈ పరిస్ధితుల్లో మనమేమి నిర్ణయం తీసుకోవాలి చెప్పండి? కార్యక్రమాన్ని కొనసాగిద్దామా వద్దా?’ అని అడిగాడు. దాదాపుగా ఓటింగ్ పెట్టినట్టుగా ఆయన ప్రతి సభ్యుడినీ పేరుపేరునా ప్రశ్నించాడు.

ఆశ్చర్యకరంగా అందరూ కూడా ముక్తకంఠంతో, కార్యక్రమం ఆగకూడదనీ కొనసాగ వలసిందేననీ అన్నారు. బహుశా కలెక్టర్ బదిలీ మీద ప్రతి ఒక్కరిలో మౌనంగా రగులుతున్న ఆగ్రహం నుంచి ఆ ప్రతిస్పందన వచ్చిందనుకుంటాను. అంతేతప్ప, వారిలో చాలామందికి అక్షరాస్యత అనేక అధికారికకార్యక్రమాల జాబితాలో మరొక కొత్త కార్యక్రమం కాదనీ, అదొక మహోద్యమమనీ ఆ క్షణంలో స్ఫురించకపోయిఉండాలి.

కొత్త కలెక్టర్ రాజయ్యగారు చేరారు. ఆయన అనుభవజ్ఞులు. రెవెన్యూ శాఖలో వివిధ బాధ్యతల్ని కిందనించీ నిర్వహిస్తూ వచ్చిన, వ్యవస్ధ పనితీరును ఎంతో కాలంగా ఎంతో దగ్గరగా చూసిన లోకానుభవం ఆయనది. పదవీబాధ్యతలు స్వీకరించిన కొన్నాళ్ల దాకా అక్షరాస్యతా కార్యక్రమం ఆయన్ని కలవరపరుస్తూనే ఉంది.

ఆ కార్యక్రమంలో దోషమేమిటో, గొప్ప ధ్యేయాన్ని తలకెత్తుకున్న కలెక్టర్‌కి ఇరవై నాలుగ్గంటల్లోగా జిల్లా విడిచిపెట్టే పరిస్ధితి ఎందుకు సంభవించిందో ఆయనకి ఒక పట్టాన అర్ధం కాలేదు. జిల్లాలో చేరిన మొదటిరోజుల సందిగ్ధతని దాటిన తర్వాత నెమ్మదిగా ఆయన అక్షరాస్యతా కార్యక్రమాన్ని తన కార్యక్రమంగా భావించడం మొదలుపెట్టారు.

ఈ లోగా మేం ప్రింటింగ్‌కి ఇచ్చిన మొదటి వాచకాల ముద్రణలో ఆలస్యం సంభవించడంతో మొదట అనుకున్నట్టుగా ఏప్రిల్ 2 నుంచి కాక ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతినుంచి అక్షరాస్యతా బోధనాభ్యసన కార్యక్రమం మొదలయ్యింది. దాదాపుగా ఆరులక్షల మంది అభ్యాసకులూ, పలకలూ, పుస్తకాలూ చేతపట్టుకుని అక్షరాస్యతకు శ్రీకారం చుట్టారు.

బోధనాభ్యసన మొదలయిన మొదటి నెలరోజుల పాటు మళ్లా మొదటి రోజుల ఉత్సాహం లాంటిది కనబడింది. కొన్ని చోట్ల ఆ ఉత్సాహం ఊహించనంతగా వ్యక్తమయింది కూడా. ముఖ్యంగా జిల్లాలో కర్ణాటక సరిహద్దుల్లోని మండలాల నుంచి కన్నడ వాచకాల కోసం కూడా విజ్ఞప్తులందడం మొదలయ్యింది. పట్టణ ప్రాంతాల్లో కన్నా దళితవాడల్లో, గిరిజన తండాల్లో అక్షరాస్యతకు అపూర్వ ఆహ్వానం లభించింది.

కాని, ఇతమిత్ధంగా చెప్పలేని కారణాల వల్ల జిల్లా యంత్రాంగంలోనే పూర్వపు ఉత్సాహం నెమ్మదిగా కొరవడ్డం మొదలయ్యింది. జిల్లా కోర్ కమిటీ సమావేశంలో జాయింట్ కలెక్టర్‌తో కార్యక్రమాన్ని కొనసాగించి తీరవలసిందేనని చెప్పినవారే నెమ్మదిగా మొహం చాటెయ్యడం మొదలుపెట్టారు.

చివరికి సాయంకాలం పూట కలెక్టర్‌ని కలవడానికి వెళ్తే ఆయన అక్షరాస్యతా కేంద్రాల్ని సందర్శిద్దాం రమ్మంటారన్న కారణం మీద వారు కలెక్టర్‌ని కూడా కలవకుండా దూరంగా ఉండేవారు. ఈ ఒడిదుడుకులన్నిటిమధ్యా అభ్యాసకులు చాలామంది మొదటివాచకాన్ని పూర్తిచేసారు.

రెండవవాచకం మొదలు పెట్టబోతుండగా అప్పటి ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు లోక్‌సభకు ఎన్నిక కావడానికి నంద్యాల నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటారనే వార్తలు వినవచ్చాయి.

మరి కొద్దిరోజుల్లోనే నంద్యాల పార్లమెంటు సభ్యుడు తన సభ్యత్వానికి రాజీనామా చెయ్యడంతో నంద్యాల లోక్‌సభ స్ధానానికి ఉప ఎన్నిక ప్రకటించారు. దాంతో జిల్లా యంత్రాంగం దృష్టి పూర్తిగా ఎన్నికలమీదకు మళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఎన్నికలు ప్రకటించిన చాలా రోజులవరకూ కూడా కలెక్టరుగారు రాత్రి బడులు సందర్శిస్తూనే ఉండేవారు. చాలా సార్లు ఆయన పర్యటనలో నేనాయన్ని అనుసరించాను.  ఆ బడులకు వెళ్లినప్పుడూ, వచ్చేటప్పుడూ ఆయనొక వేదననుభవించేవారు. వ్యవస్థ ఆదర్శాన్ని అందుకోవడానికి, కలని నిజం చసుకోవడానికి మనఃస్ఫూర్తిగా సిద్ధంగా లేదనే అనుభవ జ్ఞానం వల్ల కలిగిన వేదన అది. ‘వీళ్లకి చదువక్కర్లేదమ్మా’ అనేవారాయన నాతో.

అది జిల్లా రాజకీయ-సాంఘిక శక్తుల్ని ఉద్దేశించి అనేమాట. ఆయన ఆ మాటని తనలో తను అనుకుంటున్నట్టుగా అనేవారు. ఎవరైనా ప్రభుత్వాధికారి తనతో అక్షరాస్యతా కేంద్రాలు బాగా నడుస్తున్నాయని చెప్పినా, లేదా నడవడం లేదని చెప్పినా ఆయన అతడి కేసి అనుమానంగా చూసేవారు.

అతడు వెళ్లిపోగానే నా వైపు తిరిగి ‘ఏమిటమ్మా ఇతడు చెప్తున్నది? అక్షరాస్యత కలెక్టరు ప్రోగ్రామనుకుంటున్నాడేమిటి ఈయన? అది అందరి ప్రోగ్రాం  కాదా? ముఖ్యంగా అతని ప్రోగ్రాం కూడా కాదా? ఆ నమ్మకం ఏ కోశానా కనబడదేం అతడి మాటల్లో’ అని బాధపడేవారు. ఆ ఉద్యమంలో కూలిపోకుండా ఆయనకి తోడుగా మిగిలిన అతికొద్ది సహచరుల్లో నేను కూడా ఒకణ్ణన్న విశ్వాసం కనబడేది ఆ మాటల్లో.

ఒక సాయంకాలం నేను రాత్రిబడులు చూస్తూ ఉండగా కలెక్టర్‌గారు నన్ను పిలుస్తున్నారన్న వార్త వచ్చింది. నేను హుటాహుటిని కలెక్టర్ కేంప్ ఆఫీసుకి చేరి ఆయన ఎదట హాజరయ్యాను.

‘ఎక్కడికి పోయావు?’ అని అడిగారాయన.

నేను కల్లూరు మండలంలో రాత్రిబడులు చూస్తున్నాననీ, ఇంకా ఏదో చెప్పబోతున్నాను.

‘సరి సరి, రేపు భారత ఎన్ని కల కమిషన్ నుండి సెంట్రల్ ఆబ్జర్వర్ వస్తున్నాడు. నువ్వు మహబూబ్‌నగర్ పోయి ఆయన్ని వెంట తీసుకునిరా’ అని ఆదేశించారు.

అప్పటితో అక్షరాస్యతాకార్యక్రమంలో నేను నిర్వహించవలసిన పాత్ర ముగిసి పోయిందని అర్ధమయింది నాకు.


3

A Great Alchemy

Looking back at the campaign, three things surprised me deeply.

First, I had never expected the Collector to entrust me with such an important responsibility, which also earned me a seat on the District Core Committee. In the initial phase, I was appointed as the Nodal Officer for Pathikonda and Tuggali mandals. Located in the Adoni division, these two mandals not only held the highest concentration of Adivasi population in the district, but were also home to substantial Dalit and Backward Class communities.

The second surprise was being tasked with the Procurement and Supply Committee. Given my personal background and inclinations, I felt I would have been better suited for the Academic Committee or the Training Committee. However, in terms of academic qualifications, administrative seniority, and official rank, those heading these committees were far senior to me in service.

My desire was never to chair or serve as secretary to those committees; I merely felt that if I were included even as a member, I would have had an avenue to voice my thoughts from time to time. When I shared this sentiment with the Collector, he reassured me that as a member of the Core Committee, I was welcome to attend any sub-committee meeting and offer my perspectives freely.

What surprised me most of all, however, was his choice of the District Superintendent of Police as Chairman of the Procurement Committee, allowing me to work directly alongside him as Convener.

By then, I had come to appreciate the Collector’s method of planning: every decision he made carried deep, underlying purpose. In those days, police high-handedness was a frequent reality for the Chenchu community in the Nallamala forests. (The Naxalite movement had not yet taken firm root there; they were only just making their initial inroads into the region). The local police force still viewed the Chenchus through the outdated lens of a “criminal tribe,” subjecting them to routine harassment. At least one such incident reached my notice every week, and I brought them directly to the Collector’s attention without delay.

I soon recognized that resolving these grievances through formal legal channels alone was exceptionally difficult, and that keeping lower-level police personnel in check relied heavily on personal rapport, administrative influence, and the intervention of senior officials. The Collector had likely reasoned that placing me in close daily association with the District Superintendent of Police would send a clear signal down the police hierarchy, providing a measure of protection and relief to the Chenchu people.

The day after our initial briefing, the various committees commenced their work. Each committee was provided with the master campaign plan and a detailed PERT chart outlining specific tasks, timelines, and personnel responsibilities.

As the Procurement and Supply Committee took stock of its mandates, the sheer magnitude of our responsibility became clear. Out of a total campaign budget of four crore rupees, our committee alone was tasked with executing projects worth nearly two crore rupees.

Our most formidable task was printing three graded adult primers—six hundred thousand copies of each. In addition, we had to procure slates and slate pencils for six hundred thousand adult learners, publish instructional handbooks for sixty thousand voluntary trainers, and arrange the continuous production and distribution of shoulder bags, banners, pamphlets, and publicity posters. Procuring these materials was only half the challenge; ensuring their timely dispatch to sixty mandal headquarters across the vast district was an equally daunting task.

The entire month of December passed in a flurry of activity as officers grasped their respective duties and engaged in earnest deliberations. Kurnool district had likely not witnessed such collective fervor and public momentum since the days of the Freedom Struggle or the movement for Andhra Statehood.

Following his initial meeting with district officers, the Collector held a series of consultative sessions with diverse social groups, calling upon leaders from every walk of life to join the campaign as active partners. He left no community unaddressed.

He met with religious heads to seek their blessings and involvement. He conferred with cinema hall owners to request that campaign slides be screened during film shows. He met with hotel and restaurant owners to secure subsidized meals for mass volunteer training programs. He convened meetings with transport operators to ensure prompt dispatch of learning materials and to negotiate discounted freight rates. Throughout the second half of December, he conducted continuous dialogues with all political parties, trade unions, student organizations, and teachers’ associations across the district.

Everyone felt a deep thrill knowing that an unprecedented, magnificent movement was about to sweep across the district starting January 2nd, inspiring citizens from all walks of life to participate in this grand endeavor (Yajna).

As planned by the Collector, a week-long inaugural campaign (Akshara Saptaham) commenced in Kurnool town. In every assembly constituency headquarters, the respective Member of the Legislative Assembly lit the ceremonial Flame of Literacy (Akshara Jyothi) in the Collector’s presence and administered the literacy pledge. The campaign then radiated outward: at every mandal headquarters, Mandal Parishad Presidents lit the flame alongside their respective Nodal Officers and took the pledge. From there, village Sarpanches carried the Akshara Jyothi back to their hamlets, hoisting the literacy flag, lighting the local flame, and leading their communities in the pledge.

The entire rollout unfolded precisely according to the Collector’s blueprint. Day after day, a spontaneous public fervor—far exceeding anything written on paper—unfolded before our eyes.

By the final days of that inaugural week, even in Allagadda—a region long burdened by factional dread—an unprecedented festive spirit took hold, leaving everyone in quiet awe. I witnessed this extraordinary spectacle with my own eyes. As the Akshara Jyothi moved from constituency centers down to mandal headquarters and into remote hamlets, a collective awakening swept across the entire district like wildfire—a phenomenon I had never before witnessed in my life.

Certain human aspirations lie quietly dormant within a society. But when they are awakened, it is no ordinary awakening. In such rare moments, ordinary citizens become the true architects of history, and everyday life itself is elevated into historical destiny.

With boundless enthusiasm and joy, the entire district reverberated with excitement—from Mantralayam to Ahobilam, and from Srisailam to Kasapuram.

Public perception had long assumed that Adivasis, Dalits, and working women possessed little interest in learning, preferring to take their children to manual labor rather than sending them to school. Yet, seeing these very communities step forward in vast numbers to take the literacy pledge filled observers with astonishment. It stirred a deep, long-suppressed thirst for knowledge that society had ignored for generations.

Defining or explaining that inner thirst is no simple task. Why did the masses respond so profoundly to the call of literacy? Certainly, no adult learner believed that becoming literate would magically raise their income overnight, nor did they expect some grand, sudden transformation in their material circumstances. Nor can I bring myself to believe that millions of people were moved merely by the utilitarian arguments often cited in literacy campaigns—such as the ability to read bus destination boards, count currency notes, or prevent fraud in weights and measures.

What, then, moved the people so deeply?

My conviction is that in such historical moments, the deep divisions, caste barriers, and social fractures that separate people suddenly heal over, giving birth to a profound sense of human solidarity. Individuals who hitherto lived isolated, fragmented, and indifferent lives unite to form a single, vibrant collective being.

In that shared collective consciousness, dormant creative energies awaken. The momentum of that initial awakening, in turn, rouses even deeper reserves of human potential. This is the alchemy that occurs during great historical movements and social struggles. Such awakenings are not everyday occurrences; they are rare, precious moments that arrive only after long intervals.

In the early 1990s, during the Total Literacy Campaigns, many regions across our country were privileged to witness such a rare awakening once again. For those of us belonging to the post-Independence generation, it was the first great historic movement of our lives.

Just as it was for the singers who carried the campaign songs on their shoulders, and for the thousands of volunteers who pledged to teach their fellow human beings, it was a transformative moment for me as well. Beyond stirring the hearts of the masses, it awakened the latent purpose and vitality within my own soul, illuminating a clear, hopeful path toward the future.

4

The Trial of Commitment

By the end of January, campaign activities intensified across every level and domain. In all villages, the household survey was completed, and data entry onto computers commenced. Simultaneously, mandal-level cultural troupes (Kala Jathas) were formed, and intensive training workshops for these performers began at the Gajuladinne Project.

Regarding the instructional primers, the Academic Committee sought to deepen its pedagogical approach. While most other districts adopted the standardized adult literacy readers developed by the State Resource Centre with only minor modifications, Kurnool chose an independent path. Driven primarily by suggestions from Dr. Brahma Reddy of the Jana Vignana Vedika, substantial revisions were introduced into Primer I. Every single word and sentence became the subject of intense, passionate debate. For me, those discussions cast profound light on the psychological shift required for adult learning. I vividly recall how, at the conclusion of one such heated session, Smt. Nagalakshmi, a resource person from the State Resource Centre, broke into an inspiring song, moving everyone present to deep emotion.

Within the procurement portfolio, managing general campaign supplies was one matter, but printing and distributing eighteen lakh readers was a challenge of an entirely different magnitude. In other districts, printing was outsourced entirely through open private tenders. Collector Appa Rao, however, refused to follow suit. Recognizing that paper quality and cost were the primary determinants of total printing expenditure, he insisted on purchasing high-grade paper directly from the Government Printing Department at official rates, outsourcing only the actual printing work to private presses.

His sole intent, of course, was to practice strict financial frugality and divert the resulting savings directly into post-literacy programs. Yet this decision tested our patience and endurance to its absolute limits.

This is not to say that the hardship was without value; personally, I viewed the entire exercise as a rigorous administrative training. Nevertheless, the practical complications of procuring paper at one location, printing at another, and coordinating distribution across a third were staggering.

Our first hurdle arose when we met the Printing Commissioner with a letter from the Collector to secure paper supplies. The Commissioner, a senior police officer, found our proposal absurd and dismissed it with a laugh, declaring that paper could not be released in such a manner. Yet the Collector remained unyielding. Taking the matter directly to the state government, he eventually secured the necessary sanction.

Next came the printing tenders. Rates were finalized at prices that were perhaps among the most competitive ever achieved in the country. Orders were split among three private presses—one in Vijayawada and two in Hyderabad—each contracted to print two hundred thousand copies of each primer. Before issuing final work orders, our committee, led by Sri Prasad, Deputy Director of the Printing Department, personally inspected all three printing facilities.

Then began the relentless logistical marathon: dispatching paper consignments to the presses from Kurnool and Hyderabad, supervising printing quality on-site, transporting finished volumes back to district headquarters, and distributing them systematically across sixty mandals.

By the end of February, the various committees began to feel the crushing weight of their workload. It dawned upon us that for a mass literacy campaign to succeed, having full-time volunteers at the grassroots was not enough; dedicated, full-time personnel were equally imperative at the district planning level.

All of us were full-time civil servants with primary administrative responsibilities, accountable to our respective state departments and the citizens we served. Literacy work was an additional, voluntary assignment. Far from allowing us to neglect our routine duties for the campaign, the Collector himself insisted on absolute performance in our regular roles. Even as I managed the massive procurement portfolio, he expected me to execute development initiatives for the Chenchu community in the Nallamala forests with equal devotion and promptness, refusing to tolerate the slightest delay. This dual expectation placed an escalating physical and ethical strain on us day by day.

Furthermore, I began to realize that the Collector harbored somewhat unrealistic expectations regarding the capacity of government departments and the sheer commitment of official machinery. His uncompromising insistence on financial frugality meant that routine administrative tasks, which ordinarily moved smoothly, became far more arduous and time-consuming to execute.

Our committee possessed no authority to take independent shortcuts; every decision had to follow rigid administrative procedure, which naturally introduced delays. Procurement, by its very nature, is governed by stringent rules. Although officers like the District Transport Officer and the District Civil Supplies Officer were nominal members of our committee, they rarely engaged with the campaign or showed genuine interest.

When paper needed to be moved from the printing stores to private presses, finding even a single lorry proved virtually impossible. The Collector had ordered that transport could only be hired at official rates fixed by the Transport Department. Consequently, commercial lorry operators systematically avoided us. Not once did the Transport Officer personally intervene or send his staff to arrange transport, while lorry owners who had grandly promised support at public meetings turned elusive when work actually began. I had never before realized how vast a chasm could lie between a public promise and its practical fulfillment.

During those trying weeks, two officers stood by my side with steadfast loyalty. The first was Sri Gangireddy, then General Manager of the District Industries Centre. Though fifty-five years old, he shouldered the physical burden of operations with the vigor of a young man. A man of absolute integrity and blameless character, he taught me invaluable lessons through his conduct. Above all was his boundless humility; despite his age and senior rank in the district, he would stand vigil outside freezing storage depots late into the night until the final reams of paper were loaded onto the trucks. Whenever an urgent file required the Collector’s sign-off, rather than routing it through bureaucratic channels like other officers, he would tuck the folder under his arm, walk to the Collectorate, and wait patiently outside the office until called in. Without his administrative wisdom and practical experience, our committee could not have procured even a single slate.

The second officer was Sri Prasad, Director of the Printing Department—a young man of impeccable character and technical skill. Had it not been for his specialized expertise, we could never have executed a printing operation of that magnitude within the strict parameters set by the Collector.

I must also pay tribute to my own office staff. They were not ideological activists, nor did their social awareness exceed that of ordinary citizens. Yet, the selfless service and sheer effort they poured into the campaign throughout those frantic days remain unforgettable; they truly became the quiet fuel (samidhalu) that sustained the sacred flame (Yajna) of literacy.

One particular incident remains etched in my memory. During an early meeting of the District Core Committee, as the initial publicity wave was gathering momentum, the Nodal Officers requested printed banners to carry to their respective mandals. We had already spent two days screen-printing the banners. In modern times, one would simply hand over such a consignment to a commercial courier agency and be done with it.

To the Collector, however, commercial dispatch was an unacceptable extravagance. He directed us to bundle the banners and deliver them directly to the residences of the Nodal Officers, who could then carry them to the mandals in their official vehicles the following morning. He further instructed us not to spend a single rupee on packing material, advising us instead to retrieve discarded gunny sacks from government welfare hostels. That entire evening and through the long night, my staff and I bundled the banners, stitched them into old gunny bags, and painted mandal addresses on the sacks, while our driver, Sunkanna, shuttled across town delivering the packages to the officers’ homes. By the time the task was complete, dawn had broken. Since I was also a Nodal Officer, I picked up my own bundle of banners without a moment’s rest and set off directly for my assigned mandals.

5

The Role Concludes

Our days and nights passed in that breathless rhythm. Then, one afternoon, the Collector phoned me directly. “I have been transferred to Hyderabad,” he said quietly. “I am getting relieved immediately. By nature, once I am relieved from a post, I dislike signing official papers. If there are any files requiring my formal approval, bring them to me right away.”

For a moment, I was struck motionless. What would become of the Total Literacy Campaign? But there was no time to lose in worry. I quickly checked whether any pending files or sanction orders required his signature. There were none. Such was his administrative discipline: every day’s work was finished that very day, with no tolerance for pending files.

Before the news of his transfer had even spread through the district, the Collector departed from Kurnool that very evening. The next day or the day after, the Joint Collector—who had temporarily assumed charge as Collector—convened an emergency meeting of the District Core Committee.

He briefed the committee on the sudden developments. Explaining that the Collector’s abrupt transfer was driven purely by extraneous considerations, he put a single, direct question to us: “A Collector with complete dedication and a clear vision for literacy has been removed. Though he shared his vision generously with us, none of us can truly fill the void he leaves behind. Under these circumstances, what is our decision? Should we press forward with the campaign, or call it to a halt?” He went around the room, questioning each member individually, almost as though taking a roll-call vote.

To our surprise, every single member responded with unanimous resolve: the movement must not stop; it had to go forward. Perhaps that collective response sprang from a silent, burning resentment over the Collector’s unjust transfer. Beyond that anger, however, many members had not yet fully grasped that literacy was not merely another line item on a list of official programs, but a profound social movement.

The new Collector, Sri Rajaiah, soon assumed office. He was a seasoned administrator who had risen through the ranks of the Revenue Department from the ground up, possessing deep, practical wisdom born of observing the state machinery at close quarters for decades. For his first few weeks, the literacy campaign caused him considerable anxiety. He struggled to comprehend what flaws lay within the program, or why an officer who had embraced such a noble mission should be forced to pack his bags and leave the district within twenty-four hours. Yet, once he navigated the initial uncertainty of his new posting, he gradually adopted the literacy movement as his own.

Meanwhile, owing to printing delays with the first set of readers, the launch of active classroom instruction was rescheduled from April 2 to April 14—the birth anniversary of Dr. B.R. Ambedkar. On that historic day, nearly six hundred thousand adult learners across the district picked up their slates, pencils, and primers to begin their journey into literacy.

For the first month of classroom learning, the vibrant enthusiasm of the early campaign days flared anew. In several pockets, the response surpassed all expectations; notably, border mandals adjoining Karnataka submitted urgent requests for primers printed in the Kannada language. The welcome accorded to the literacy classes in Dalit hamlets (malapalles) and tribal settlements (thandas) was far more overwhelming than in urban centers.

Yet, for reasons that are difficult to pinpoint precisely, the initial momentum within the district administration slowly began to wane. The very officers who had assured the Joint Collector in the Core Committee that the campaign must continue at all costs began to quietly pull back. Eventually, officers even avoided visiting the Collectorate in the evenings, fearing that the Collector might invite them to inspect night literacy centers alongside him. Despite these fluctuations and hurdles, a vast number of learners successfully completed Primer I.

Just as classes were preparing to transition to Primer II, news broke that the Prime Minister of India, Sri P.V. Narasimha Rao, had chosen the Nandyal parliamentary constituency to seek election to the Lok Sabha. Within days, the sitting Member of Parliament for Nandyal resigned his seat, and a major Lok Sabha by-election was officially announced. Instantly, the entire attention and administrative machinery of the district were diverted toward election duties.

Even for many days after the election was announced, the Collector continued his late-night visits to the literacy schools, and I frequently accompanied him on his rounds. Driving to and from those remote night classes, he carried a deep, visible agony within him—a quiet sorrow born of his pragmatic realization that the administrative system lacked the genuine heart to sustain such a dream to its end.

“These people don’t truly want education for the poor, my kid,” he would often say to me with a heavy sigh.

He was speaking, of course, of the entrenched political and social forces of the district, uttering the words almost as a quiet monologue to himself. Whenever a fellow government official assured him that the night literacy centers were functioning brilliantly, or even if they reported that classes were failing, the Collector would look at them with quiet skepticism.

As soon as the official departed, he would turn to me with sorrow in his voice: “What is this officer saying, my kid? Does he imagine that literacy is merely the Collector’s personal scheme? Isn’t it a mission belonging to everyone? Above all, isn’t it his own responsibility as well? Why is that conviction so utterly absent from his words?” In those intimate moments, I could sense his trust—a quiet recognition that I was among the very few companions who remained standing beside him without breaking under the strain.

One evening, while I was out inspecting night schools, word reached me that the Collector required my presence immediately. I rushed to his camp office and presented myself before him.

“Where have you been?” he asked.

I replied that I had been visiting night literacy centers in Kallur mandal, and was about to elaborate on my observations when he cut in.

“Alright, alright,” he said. “Tomorrow, the Central Observer from the Election Commission of India is arriving. Proceed to Mahabubnagar and escort him here.”

With those few words, I understood that my role in the Total Literacy Campaign had come to an end.


Featured image PC: United Nations photo

24-7-2026

6 Replies to “కొన్ని కలలు కొన్ని మెలకువలు-17”

  1. Certain human aspirations lie quietly dormant within a society. But when they are awakened, it is no ordinary awakening. In such rare moments, ordinary citizens become the true architects of history, and everyday life itself is elevated into historical destiny.

    Literacy Programme was a wonderful and memorable event.

  2. Independence తర్వాత, state formation తర్వాత అంతటి మహోద్యమంగా అక్షరాస్యత కార్యక్రమాన్ని మీరు వర్ణించారు.
    అటువంటి మహోన్నతమైన project ని conceive చేసి, every aspect ని పకడ్బందీగా plan చేసి, actionable movement గా మార్చడం అదీ అంత aggressive timelines లో అదేమీ సామాన్యమైన విషయం కాదు.

    ఆ సంరంభాన్ని, ఉత్సాహాన్ని, చైతన్యాన్ని మీరు మీ రచన ద్వారా నిజంగా మా అనుభవంలోకి తీసుకొచ్చారు. రాత్రింబవళ్లు ఒక యజ్ఞంలా, ఒక తపస్సులా మీరందరూ కలిసి పనిచేసిన విధానం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది.

    ఈ ఉద్యమానికి ప్రజలు ఎందుకు స్పందించారనే ప్రశ్నకు మీరు ఇచ్చిన explanation చాలా inspiring, Sir.
    “ప్రజల్లో కొన్ని ఆకాంక్షలు సాధారణంగా నిద్రాణంగా ఉంటాయి. కాని అవి మేల్కొన్నప్పుడు మామూలుగా మేల్కొలుపు. అటువంటి సమయాల్లో మామూలు మనుషులే చరిత్రనిర్మాతలుగా మారతారు.”

    ఈ మహోద్యమంలో మీ భాగస్వామ్యం ఎంత గొప్పదైనా, మీరు దానిని approach చేసిన perspective ఇంకా గొప్పది. You wrote with gratitude for having had the opportunity to be part of such a transformative movement. At the same time, మీరు గంగిరెడ్డి గారు, ప్రసాద్ గారు, మీ సిబ్బంది, ఇంకా ఈ యజ్ఞంలో భాగమైన ప్రతి ఒక్కరినీ కృతజ్ఞతతో గుర్తు చేసుకోవడం మరో విలువైన పాఠం.
    Thank you for writing these experiences, sir.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading