
శివరాత్రి. అమావాస్య దగ్గర కావడంతో సముద్రం ఘూర్ణిల్లుతూంది. నౌకాదళ విన్యాసాలు కూడా తోడవడంతో విశాఖ సాగర తీరం జనసముద్రమైపోయింది. హోరెత్తుతూన్న మనుష్య సముద్రం మధ్య కారు ఎక్కడ పార్కు చెయ్యాలా అని డ్రైవరు ఆలోచిస్తూనే బండి నడుపుతుండగా, ‘నాన్నా, ఆయన శ్రీశ్రీనే కదా’ అన్నాడు ప్రమోద్, మాకు ఎడమవేపుగా ఉన్న విగ్రహాల్లో ఒకరిని చూపిస్తూ. అదేమిటో తక్కిన విగ్రహాలన్నీ చీకట్లో ఉన్నాయిగానీ, శ్రీ శ్రీ ఒక్కడి మీదా ఎందుకో బంగారు రంగు వెలుతురూ పడుతూ ఉంది. ఆయన కూడా విశాఖపట్టణం చూడటానికి వచ్చేడా అన్నట్టు మెరిసిపోతూ ఉన్నాడు.
ఆయన జీవితంలో అధికభాగం చెన్నైలో గడిపినప్పటికీ, అది కూడా సముద్రతీరమే అయినప్పటికీ ఆయనకి విశాఖ సముద్రంతోనే ఆత్మీయత. తాను ఆ ఊళ్ళో పుట్టినందువల్లా, పద్ధెనిమిదో ఏటిదాకా అక్కడే గడిపినందువల్లా, తన బాల్యకౌమారాల్లో, ఆ వీథుల్లోనే తన కవిత్వ ఉపాసన చేసినందువల్లా మాత్రమేనా? సముద్రం అంతకన్నా మించిన సంవేదనలు వేటినో ఆయనలో రేకెత్తిస్తూనే ఉంది. చూడండి. ఆత్మకథలు రాసుకునేవాళ్ళు మామూలుగా తాము పుట్టినప్పటినుంచీ జీవితప్రయాణం గురించి రాసుకుంటారు. కానీ 1910 లో పుట్టిన శ్రీ శ్రీ 1909 నుంచే తన జీవితకథ రాసుకున్నాడు. ‘మరో ప్రారంభం'(1979) అనే మరో వ్యాసంలో ఇలా రాసుకున్నాడు
1910 లో నేను పుట్టానంటే, 1909 లో ఎప్పుడో, ఏదో నెలలో, ఏదో రోజున ఏ క్షణంలోనో, మా అమ్మ కడుపున నేను పడ్డానన్నమాట. ‘నా జనని గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకారం కల్పించిన నాడో..’కాలం గడియారాన్ని కొన్ని దశాబ్దాల దాకా వెనక్కి తిప్పేసి నా ఆరంభాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను.
1909. నేనింకా పుట్టలేదు. పుట్టడానికి ప్రయత్నిస్తున్నాను.
అది నా జనని గర్భంలో amniotic fluid అక్కడ పరిభ్రమిస్తున్నాను. అకస్మాత్తుగా విశాఖపట్టణం కనిపించింది. గట్టిగా కౌగిలించుకున్నాను.
‘ఇదేమిటి? పట్టపగలు! నడివీథిలో!’
అయితే పద అలా సముద్రంలోకి పోదాం అన్నాను
ఇద్దరం సముద్రంలో ఈదుతున్నాం.
తీర్థపు రాళ్ళ దగ్గర మునిగి లాసన్స్ బే దగ్గర తేలాం.’
తాను ఈ భూమ్మీద కళ్ళు తెరవకముందు మాతృగర్భ మహాసముద్రంలో ఈదులాడుతున్నప్పటి జ్ఞాపకాల్ని మరో సారి తలుచుకుంటూ ఇలా అంటున్నాడు (1979):
మాతృగర్భ మహాసముద్రంలో ఈదులాడుతున్నప్పుడే నాలో స్విన్ బర్న్ కవిత్వం ప్రసరిస్తూ, ప్రవహిస్తూ వుండి వుండాలి. స్విన్ బర్న్ కి సముద్రం అంటే ఎంతో ఇష్టం. నాకూ అంతే. జీవితానికి ప్రతీక సముద్రం. జీవితనాటకంలో లేస్తూ, పడుతూ, పడుతూ, లేచే తెరల్లాంటివే సముద్రంలో తరంగాలు. సముద్రం నా ఆవేశం నా ఆనందం.. అందుకే నేనన్నాను స్విన్ బర్న్ మీద రాసిన ఒక గేయంలో-‘కడలి వలపూ, వలపు కడలీ, కవీ, నీ పాటల్..
విశాఖపట్టణం సముద్రం గురించిన తలపుల్లో అతడికి తన తండ్రి, తన తల్లులు, తన బంధుమిత్రులు, గురువులు, తాను చదువుకున్న పుస్తకాలు, వెతుక్కున్న కవిత్వాలు అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే, విశాఖపట్టణమూ, శ్రీ శ్రీ కూడా సమకాలికులుగానే ఎదుగుతూ వచ్చారు. ‘విశాఖపట్టణం ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదుగాని విశాఖపట్టణంలో 1910 వ సంవత్సరంలో నేను జన్మించాను. అప్పటినుంచీ నేనూ విశాఖపట్టణమూ కలిసే పెరుగుతూ వచ్చాము’ అని రాసుకున్నాడు. ఒకచోట ఇలా రాస్తున్నాడు:
అప్పటికింకా నాకు అయిదేళ్ళయినా లేవు. నా చిన్నతనంలో విశాఖపట్టణం కూడా నాలాగే ఒక చిన్న ఊరు. నన్నూ ఒక చిన్న ఊరుగా జమకట్టుకుంటే నాకభ్యంతరం లేదు. ఊళ్ళో ఎక్కడ నిలబడి చూసినా నాలుగు దిక్కులూ కళ్ళబడేవి. మా మేడ ఎక్కి చూస్తే తూర్పున బంగాళాఖాతం, పడమటన ఉప్పుటేరూ, ఉత్తరాన తుమ్మెదల మెట్టా, దక్షిణాన యారాడ కొండా కనపడేవి. ఆకాశం కూడా చెయ్యి ఎత్తితే చాలు అందుకొచ్చేటంత దూరంలో ఉండేది. క్రమంగా విశాఖపట్టణంతో బాటు నేనూ, నాతో పాటు విశాఖపట్టణం ఎదుక్కుంటూ వచ్చేం.
మరొకచోట ఇలా రాసుకున్నాడు: ‘విశాఖపట్టణం వీథుల్లో ఉన్న రాళ్ళన్నిటితో నా పాదాలకు పరిచయం అని గర్వపడుతూ ఉండేవాణ్ణి.’
‘విశాఖపట్నం జ్ఞాపకాలు ‘అనే వ్యాసంలో (1948) ఇంకా ఇలా రాస్తున్నాడు:
అసలు నాకు కనిపించే విశాఖపట్టణం అందరూ చూసేది కాదు. తీర్థపురాళ్ళకెదురుగుండా సముద్రంలో ఒక విశాఖపట్టణం ఉంది. అశోకుని కాలంలో కళింగ రాజు దాన్ని కట్టించాడు. అప్పుడప్పుడూ నా స్వప్నాలలో ఆ విశాఖపట్టణం కనబడుతూ ఉంటుంది.
శ్రీ శ్రీ చూసిన, సదా తన స్మృతుల్లోనూ, స్వప్నాల్లోనూ జీవిస్తూ వచ్చిన విశాఖపట్టణం భూమ్మీద ఉన్నది కాదు. దాని ఉనికి సముద్రంలోనే. కాబట్టే, అదే వ్యాసంలో, ఇంకా ఇలా అంటున్నాడు:
నా విశాఖసంస్కృతుల ప్రధాన రసం బీభత్సమే అని ఒప్పుకుంటాను. కాని అభౌమమైన మహదానందం అనుభవించిన క్షణాలు కూడా అనేకం ఉన్నాయి. రాళ్ళతోటలో కొన్ని చలికాలపు ప్రాతఃకాలాలు కుసుమించిన గులాబిమొక్కల మధ్య గడిచిపోయాయి. యారాడ కొండ మీద నిలబడి ఒక్కొక్కరోజు ఒక్కొక్కరకపు విశాఖపట్టణాన్ని చూశాను. ఎప్పటికైనా నేనొక పదిహేనాశ్వాసాల మహాకావ్యం రాస్తాను. దాని పేరు విశాఖపట్టణం.
ఆ మహాకావ్యంలో సముద్రం అంతర్భాంగం. లేదా సముద్రంలో ఆ మహాకావ్యం అంతర్భాగం. అందుకనే ఈ మాటలు కూడా రాసుకున్నాడు:
ఇది నిజం! నా కవిత్వానికి సముద్రమే ఆవేశం. సమీపంలో సముద్రం లేని స్థలం నన్ను చంపేస్తుంది. ఢిల్లీలోనూ, లక్నోలోనూ ఎన్నో నెలలు నేను జీవించాను. కాని ఒక్క గీతం కూడా ఊదలేకపోయాను. రోజూ వెళ్ళకపోయినా దగ్గరలో మహాసముద్రం ఉందంటే చాలు, ఖర్చుపెట్టకపోయినా బ్యాంకులో పదివేల పద్దున్నవాడికెంత ధైర్యం!
విశాఖపట్టణంలో ఆయనకి అక్షరాభ్యాసం జరిగింది. కాని నిజమైన అక్షరాభ్యాసం, అంటే కవిత్వాక్షరాభ్యాసం కూడా అక్కడే జరిగింది. చిన్నప్పుడు ఎనిమిదో ఏట ఒక పొడుగుపాదం, ఒక పొట్టి పాదం రాసి తాను కందపద్యం రాసేనని, దాంతో కవినైపోయానని అనుకున్నప్పణ్ణుంచి, 1970 తర్వాత, విరసం ఏర్పడ్డాక, తాను రాసిన గీతాల్లో కూడా విశాఖపట్టణం తనకు దారిచూపిస్తున్నదనే చెప్పుకున్నాడు. (‘మరో ప్రస్థానం’ సంపుటిలోని మొదటిగీతం ‘యిప్లవం యాడుందిరా ఆడనే నీ కూడుందిరా, నీ గూడుందిరా ‘ అనే పాటలో విశాఖపట్టణపు కార్మికుల భాషనే తాను ఉపయోగించానని చెప్పుకున్నాడాయన.)
శ్రీ శ్రీ జీవితం పొడుగునా ఒక మహాసముద్రం రహస్యంగా ఆయనలో ఘూర్ణిల్లుతూనే ఉంది. లేదా ఒక మహాసముద్రంలో ఆయన ఈదుతూనే ఉన్నాడు. ‘శిశువు చిత్రనిద్రలో ప్రాచీన స్మృతులూచే చప్పుడు’ ఆయన ఆ సముద్రతరంగాల్లోనే విన్నాడు. మహాప్రస్థానం తర్వాత రోజుల్లో, మరో ప్రస్థానానికి మధ్యకాలంలో, ఆయన సర్రియలిజం పేరిట, ఆ సముద్రంలోకే పయనిస్తూ ఉన్నాడు. సముద్రం ఆయనలో రేకెత్తించిన భావాల్లో ఒక రొమాంటిసిజం ఉంది. ఏకాలంలో అతడు ఒకవైపు సామ్యవాద గీతాలు రాయడానికీ, మరోవైపు సర్రియలిస్టు రచనలు చేయడానికీ మూలం అతడికీ, ఆ సముద్రానికీ ఉన్న అనుబంధంలో ఉంది. ఒకచోట ఈ మాట స్పష్టంగా చెప్పుకున్నాడు కూడా:
విశాఖపట్టణానికి హార్బరు వచ్చినప్పుడు నాకు యౌవనం వచ్చింది. అందరూ ప్రేమగీతాలు రాసే ఆ ఋతువులో నేను పారిశ్రామిక విప్లవాన్ని కౌగిలించాను. ఆ రోజుల్లోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం, అబ్బూరి రామకృష్ణారావుగారూ విశాఖ విచ్చేశారు. అప్పుడు నా ఊహలకే రెక్కలు వచ్చాయి. గ్రంథగతమైన మహాకవిత్వాన్ని రక్తమేధామాంస మజ్జాస్థిగతం చేసుకున్నాను. మరిచిపోలేదు. నా కంటే ముందుగానే పిచ్చాసుపత్రి వెలిసింది. నా ఆవేశంలో ఆగ్రహం, అనుకంపా సరిసమానంగా తులతూగడానికి విశాఖపట్టణము వెర్రాసుపత్రే కారణం. దరిమిలా ఫ్రాయిడ్ ని చదివి అర్థం చేసుకోవడానికి అనుకూలమిన వాతావరణం అతఃపూర్వమే కలిగించగలిగిందని పిచ్చాసుపత్రి అంటే నాకు కృతజ్ఞత.
పిచ్చాసుపత్రికి ఇలా 1948 లో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నవాడు మరో ఏడేళ్ళ తరువాత ఒక రాజకీయసభలో ప్రసంగిస్తూ అమాంతం మతిస్థిమితం కోల్పోడం ఆశ్చర్యమనిపించదు. ఎందుకంటే భావకవులది కూడా స్వాప్నిక ప్రపంచమేగాని, శ్రీ శ్రీ కలల్లో ఉన్న ప్రపంచంలో చీకటి పాలు చాలా ఎక్కువ. సర్రియలిజం గురించి రాస్తూ ఇలా అంటున్నాడు:
మానవసంసారభవనపు ఏడో అంతస్థులో, పరస్పరం గాఢంగా ప్రేంమించుకున్న వారు ఒకరిలో ఒకరు హరించుకుపోయే ఆ అసందర్భపు గాజుమేడలో ఇంద్ర నీలమణి మంజూషలు తప్ప ఇంకేవీ కనబడని వరుణుని రాణివాసంలో, మనుష్యుడూ, సూర్యుడూ అడుగుపెట్టడానికి సంకోచించే అలాస్కా ప్రాంతపు అయస్కాంత ద్వీపాలలో అదుగో అక్కడే వెతకమన్నాను కొత్త సౌందర్యం కోసం.
శ్రీ శ్రీ అంతరంగంలో సజీవంగా ఉన్న ఈ స్వప్నప్రపంచాన్ని పంచుకోడానికి ఎవరూ లేనందువల్లనే ఆయన కవిత్వాన్ని ఆశ్రయించాడు. కాని 1950 లో మహాప్రస్థానం వెలువడ్డ తరువాత, తనకి సాహిత్యక్షేత్రంలో ఒకింత స్థిరత్వం లభించిందని, ఆయన తన మనసులో మాటల్ని సూటిగా చెప్పడానికి సాహసించాడు. ‘సంక్షుబ్ధ సౌందర్యం’ (1945) పేరిట ‘ఢంకా’ పత్రికలో అచ్చయిన ఆ వ్యాసాన్ని తిరిగి ఆయన సమగ్ర సాహిత్యంలో ‘సర్రియలిజం’ పేరిట అచ్చేసారు. ఆ వ్యాసం మొదటిభాగం 1945 లో, అంటే ఆయనకు ముప్ఫై అయిదేళ్ళ వయసులో రాసింది. ఆ వ్యాసం శ్రీ శ్రీ అంతరంగ ప్రపంచంలో ప్రవేశించడానికి ఒక దీపంలాంటిది. కాని ఎందుకనో, ఎవరూ ఆ వ్యాసం మీద ఇప్పటిదాకా ఏమీ రాయగా నేను చూడలేదు. ఆ వ్యాసంలో ఇలా అంటున్నాడు:
నాకు బాగా జ్ఞాపకం. నా పదిహేడో యేట మహాకవి… గారిని సందర్శించాను. ‘కవిత్వం కడుతూన్నావా అబ్బాయీ? ఎందుకేమిటి?’ అని ప్రశ్నించాడాయన. అప్పుడు నేనిచ్చిన జవాబుకు అప్పటికే ఇంచుమించి ఈ అర్థం వచ్చింది. ‘నన్ను సమ్ముగ్ధం చేసిన కొన్ని కొన్ని మరీ ప్రత్యేకమైన కావ్యస్పందనాలకు సమానమనుకున్నవాటిని (నా కోసమేనా?) సృష్టించుకోవాలని. ఆశ్చర్యం యేమిటంటే అట్టి రసస్పదనాలు కాలం గడిచిపోయినా గౌరవం జార్చుకోనివి. రసానికి నిత్య యౌవనంలోని సత్యసౌందర్యం ఉంది. ఇంతెందుకూ? అప్పుడాయన సమక్షంలో ఉదహరించిన పద్యపాదాలే ఇప్పుడూ నాకు జ్ఞాపకం వస్తున్నవి:
‘నీ కంఠార్పిత కాలపాశము, శిరోనిర్ఘాతపాతమ్ము,లంకౌక శ్శ్రేణికి కాళరాత్రి..’
‘గరళపు ముద్ద లోహమవగాఢమహాశని కోట్లు సమ్మెటల్ హరునయనాగ్ని కొలిమి..’
‘..పంచాస్త్రోపనిషద్రహస్య పరమబ్రహ్మస్వరూపంబు నీ కాంచిదామ పదమ్ము..’
‘Mais que salubre este vent..’
‘alors, Comme la nuit Vieilleissant..’
ఇక్కడ ఆయన తలుచుకున్న కవుల్లో తెలుగు కవులు సరే, ఆ రెండు ఫ్రెంచి కవిత్వ పంక్తుల్లో ఒకటి రింబోది, రెండోది, పో కవిత్వానికి బోదిలేర్ చేసిన అనువాదం లోది. అంటే, పదిహేడేళ్ళ వయసుకే శ్రీ శ్రీ మనోలోకంలో వేములవాడ భీమకవితో పాటు ఫ్రెంచి సింబలిస్టులు కూడా బలంగా ఉన్నారన్నమాట. ఆ వ్యాసంలోనే ఆ తర్వాత ఇంకా ఇలా రాస్తున్నాడు:
ఇంతట్లో Chants de Maldoror నా కళ్ళబడింది. ఇదివరకు యెప్పుడెప్పుడో అక్కడక్కడ కనబడే రత్నాలు కాకుండా ఒక అక్షయ తూణీరం లభ్యమయింది. అందులోని రకరకాల Beau comme పాదాలు సంక్షుబ్ధ సౌందర్యపు విశ్వరూప ప్రదర్శనం.
Beautiful as the chance meeting of a sewing machine and an umbrella on the dissection table..’
ఓహో! వికసన్నవ కైరవ గంధబంధురోదార సమీర సౌరభము! గంధర్వలోక మధురమధుర సుధాగాన మంజువాటి. ఏవో విస్ఫారిత నేత్రాలు. వీథుల్లోనివో, గూళ్ళలోనివో! శృంగారమో, బీభత్సమో, భయమో, కోపమో, అస్పష్టంగా తప్ప వేరువిధంగా వీటిలో కనబడదు. కనకదుర్గ కళ్ళు, ఈజిప్టురాణి నెఫరేటి, అరేబియన్ నిశీథాల శహరజాదీ సింహాలకు పారవేసే బానిస బాలికల కళ్ళు, జూలియట్, జస్టిన్ కళ్ళు, మోరో చిత్రించిన కొందరి కళ్ళు, మూర్ మార్కెట్ లో అప్పుడప్పుడు మాత్రమే కనిపించే కళ్ళు.
కానీ నాకీ అప్రహతిహతానందాన్నిచ్చే విశాల సామ్రాజ్యంలో నిరాఘాటంగా పరిపాలించేవాడు. Lautreamont ( మాల్డోరోర్ పాటలు రాసిన Isidore Ducasse పెట్టుకున్న మారుపేరు) అయినప్పటికీ మరికొందరు కూడా నన్ను ఇప్పుడూ యెప్పుడూ తమ ఇంద్రజాల గీతికాజాలాలలో నొక్కి పెట్టిన మాట వాస్తవమే. Baudelaire (ఆ వింతపుష్పాలు), Germain Nouveau, అప్పుడప్పుడు కృష్ణశాస్త్రి, ఇప్పుడిప్పుడు పఠాభి, Et les vierges postulantes… de ia accalinie pour lours seins అని వ్రాసినందుకు మాత్రం Michel Feline మరి Verlaine సముద్రం ఇంద్రధనుస్సు, రసదేవత విపంచి. Les sanglots longs/Du Violons అంటూ ప్రారంభమయ్యే అతని Chanson d’ automns విషాదమనోహరంగా వినబడుతూ ఉంటుంది..
ఈ రెండు పేరాల్నీ ఇంత సుదీర్ఘంగా ఎత్తి రాసానంటే, శ్రీ శ్రీ కవిత్వం గురించి, తన విశాల హృదయ సామ్రాజ్యాన్ని పాలించే ఈ కవుల గురించి ఇంత స్పష్టంగా రాసుకున్న మాటలు ఎప్పుడూ ఎవరూ ప్రస్తావించరు కనుక. ఇందులో ప్రతి ఒక్క వాక్యం ఒక ద్వారం. తెరుచుకుని వెళ్తే శ్రీ శ్రీ హృదయప్రపంచంలోకి, ఇంతదాకా మనం చూడని, కొత్త గదులెన్నిటిలోనో ప్రవేశించగలుగుతాం.
ఉదాహరణకి, ఇక్కడ Lautreamount ప్రసక్తి రాగానే, ఆయనకు కృష్ణశాస్త్రి పద్యాలు సరే, నన్నయ గారి వికసన్నవ కైరవ గంధబంధురోదార సమీర సౌరభము కూడా గుర్తు రావడం ఆశ్చర్యంగా లేదూ! ఎందుకంటే, ఆయన ఎప్పుడూ చెప్తుండే మాట, తిక్కన, వేమన, గురజాడ తన కవిత్రయమని. కాని అది ఆయన తలపుల్లో సింబలిస్టులూ, డికడెంట్ కవులూ మెదలనంతవరకే. ‘ఒక సంభాషణ శకలము ‘అనే వ్యాసం ఎత్తుకుంటూనే ఇలా రాస్తున్నాడు:
అయితే కవీ, నీ ఋషులెవ్వరు?
Charles Baudelaire, Guy De Maupassant, Edgar Allan Poe.
‘వీరేనా ప్రపంచంలోకెల్లా నీకు కనపడ్డవారు?
‘నా కళ్ళకు. ఇతరులు, మహత్తరులు కలరన్న మాట యథార్థం. కాని నా కావ్యజీవితాన్ని ప్రోది చేసి నా ఆదర్శాలను మలచిన ప్రముఖులు వీరు.’
‘వీరిలో ఉన్న, నిన్నాకర్షించే మహత్తేమిటో చెపుతావా?’
‘పొయిట్రీ, కవిత యొక్క పరమ స్వరూపము, విశ్వరూపము వారి రచన. కాబట్టే వారు నాకు ఋషులు.’
మరి షేక్ స్పియర్, తిక్కన?
‘వందనార్హులు. కాని. ..’
ఎడ్గార అలన్ పో ఇంగ్లిషులో రాసిన అమెరికన్ కవి అయినప్పటికీ, ఆయన గురించి బోదిలేర్ రాసాకనే ఇంగ్లిషు మాడర్నిస్టులు పో ప్రతిభని గుర్తించారు. కాబట్టి శ్రీ శ్రీ తనకి దారి చూపించిన ఋషులుగా ఫ్రెంచి రచయితల్నీ, సదా తన హృదయ సామ్రాజ్యంలో నివసించే కవులుగా ఫ్రెంచి సింబలిస్టు కవుల్నీ పేర్కొన్నాడు. ‘ఇప్పుడు కూడా’ అని ఆయన 1945 లో ఈ మాటలు రాస్తున్నప్పటికి, మహాప్రస్థానంలోని కవితలన్నీ కూడా రాయడం పూర్తయిందని గమనించాలి మనం.
అంటే ఏమిటి? అతడు తన జీవితకాలం పొడుగునా ఒక అస్పష్ట మార్మికతని, ఒక సముద్రాంతర్గత మంత్రలోకాన్ని, ఒక చీకటినీడని తనలో దాచుకుంటూనే ఉన్నాడు.
అదే ఏడాది (1945) లో ‘మానవుడి మొగం ‘ అని రాసిన ఒక వ్యాసంలో ఇలా అంటున్నాడు:
కృష్ణశాస్త్రి గొప్ప కవి కాడనినేనెప్పుడూ నమ్మలేదు. ‘నా కనుల క్రాగు చీకట్లు ప్రాకు చోటు లేదు/నెత్తావి మధువేని/ లేదు లేదు/ ప్రాణమొక్క లావణ్యలవమ్ము లేదు, ఏను రుజనైతి, జరనైతి, మృత్యువైతి ‘ అనే పద్యపాదాలను నా మనస్సులోని ఏకాంత గుహల్లో జాంబవంతుడు శ్యమంతకమణిని వలె అమూల్యంగా దాచుకున్నాను.
ఇవాళ నాకు ఏమనిపిస్తోందంటే మానవుని ప్రధాన సమస్య మరేదీ కాదు. చీకటి.. నేను చెప్పదలుచుకున్నది మరేమీ లేదు. చీకటిలో మానవుడి మొగం కనబడదు.
ఈ వ్యాసం రాసిన మరో అయిదేళ్ళ తరువాత అయన ‘చరమరాత్రి’ (1950) కథ రాయడంలో ఆశ్చర్యం లేదు. ఖడ్గసృష్టి లో అత్యధిక శాతం కవిత్వం, శ్రీ శ్రీ కథలు, రేడియో నాటకాలూ ఈ చీకటి గుహల్లో ఆయన నిరాయుధుడిగానూ, నిరీశ్వరవాదిగానూ, నిర్భయంగానూ చేసిన సంచారాలే.
ఒక కవి ఏకకాలంలో సామ్యవాదిగానూ, ‘అంతరాళ భయంకర ప్రాంతరాల విహారి ‘ గానూ సంచరించడం తెలుగు సాహిత్యలోకానికి అర్థం కాని సంగతి. ఇంకా భావకవిత్వమే పూర్తిగా వికసించని రోజుల్లోనే, ‘సుప్తాస్థికలు’ (1929) పద్యాలు రాస్తే ‘భారతి ‘ప్రచురించకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా తెలుగు సాహిత్యవిమర్శకులు తెలుగు భావకవిత్వాన్ని అర్థం చేసుకోడానికి ఇంకా ఇంగ్లిషు తొలితరం రొమాంటిక్ కవుల్నే ప్రస్తావిస్తున్నారు. కాని, శ్రీ శ్రీ, భావకవిత్వవికాసదినాల్లోనే, డార్క్ రొమాంటిక్, డికడెంట్, సింబలిస్టు ధోరణుల్ని ప్రతిబింబించే కవిత్వం రాస్తున్నాడు. మహాప్రస్థానంలో ఒక బలమైన పార్శ్వం ఈ కవితలే. ఇవి లేకపోయుంటే, శ్రీ శ్రీ తనతో తాను జరుపుకున్న అంతర్యుద్ధం గురించిన ఈ ఆనవాళ్ళే లేకపోయుంటే, మహాప్రస్థానం కవిత్వం యొక్క ‘పరమ స్వరూపం’ గా మారి ఉండేది కాదు.
‘ఆశయాలకేం అనేకం, అప్పారావంతటివాణ్ణి’ అని ఆయన చెప్పుకున్న సంగతి మనకు తెలుసు. అదొక పార్శ్వం. కాని ఫ్రెంచి కవుల పట్ల కూడా ఆయనకిలాంటి ఆశయాలే ఉండేవి. ‘కవుల బాధలు’ అనే వ్యాసంలో తాను ‘ఫ్రాన్సులో పాల్ ఎలార్డ్ ని కావడం కంటే తెలుగుదేశంలో శ్రీశ్రీనికావడమే ధన్యంగా భావిస్తున్నాను’ అని రాసుకున్నాడు. ఇక అదే వ్యాసంలో నెర్వాల్ గురించి రాస్తూ, డొంకతిరుగుడులేకుండా, మరింత సూటిగా ఇలా అంటున్నాడు:
ఈ వ్యాసం రాస్తున్న సమయంలో నా అభిమాన కవి జెరార్డ్ డి నెర్వాల్. నెర్వాల్ అభిమాన జంతువొక పీత. దానికొక సిల్కు దారం కట్టి ఎప్పుడూ తన వెంట తిప్పుకునేవాడు. తాను రాసుకొనేటప్పుడది కుక్కలాగా పిల్లిలాగా ఏమీ అల్లరి పెట్టదనేవాడు. అందుకు అదంటే అంత ఇష్టం. ‘ఇట్ ఈజ్ ఎ స్మాల్ సైలెంట్ బీస్ట్ దట నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ ద డీప్’ అని తన పీత గురించి అన్నాడు. ‘సముద్రగర్భపు రహస్యాలు దీనికి తెలుసు. కాని ఎవ్వరికీ చెప్పదు. అదీ దాని గొప్పతనం.’
నెర్వాల్ హాస్యప్రియుడు. అందరినీ వేళాకోళం చేసేవాడు. అతడు చేసిన ఆఖరి వేళాకోళపు పని పారిస్ నగరంలోని ఒకానొక నిర్మానుష్యమైన సందులో లాంతరు స్తంభానికి ఉరిపోసుకుని మరణించడం. నెర్వాల్ నే కాదు, ఎవ్వరినీ నేను అనుకరించలేను.
ఒక కవి ఏకకాలంలో సింబలిస్టుగానూ, సోషలిస్టుగానూ ఉండటం సాధ్యమా? ఫ్రెంచిలో కవిత్వం రాసిన బెల్జియం కవి ఎమిలీ వెర్ హేరన్ ని అడిగితే తననే ఉదాహరణగా చూపిస్తాడు. అందుకనే మహాప్రస్థానంలో ఉన్న ఒకే ఒక్క అనువాద కవిత వెర్ హేరన్ దే. తర్వాత రోజుల్లో సింబలిజం, సర్రియలిజం కి దారి ఇచ్చి, పక్కకు తప్పుకున్నాక, ఒక కవి ఏకకాలంలో సింబలిస్టుగానూ, సర్రియలిస్టుగానూ ఉండటం సాధ్యమేనా అని అడిగితే, Paul Eluard అవుననే చెప్తాడు. అందుకనే ఖడ్గసృష్టిలో శ్రీ శ్రీ ఎలార్డ్ వి ఏకంగా తొమ్మిది కవితలు అనువదించాడు.శ్రీ శ్రీ లోని ఈ అంతరంగప్రపంచాన్ని ఇంకా లోతుగా శోధించవలసిన అధ్యయనాలు రావాలి. లేకపోతే, దీన్నంతా వట్టి విదూషకత్వంగానే పరిగణించి పక్కనపెట్టేసే ప్రమాదముంది.
ఆ సాయంకాలం ఆ మహాసముద్రం ఎదట శ్రీ శ్రీని చూసి వచ్చినప్పణ్ణుంచీ, ఆ సముద్రమూ, ఆ శ్రీశ్రీనే నా మనసులో మెదుల్తూ ఉన్నారు. ఆ సముద్రమూ శ్రీ శ్రీని విడిచిపెట్టలేదు, శ్రీ శ్రీ కూడా సముద్రాన్ని విడిచింది లేదు, భౌతికంగానే కాదు, మానసికంగా కూడా. ఈ వాక్యాలు చూడండి:
గిడుగురామ్మూర్తి అంత్యక్రియలు జరిగిన మైలాపూర్ శ్మశానంలోనే నారాయణబాబుకి ఆరుద్ర, నేనూ ఆఖరి వీడ్కోలు చెప్పాము. నారాయణబాబు తెలుగుసాహిత్యాకాశంలో ఒక ధూమకేతువు. ఎలా వచ్చాడో ఎలా వెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు. . నారాయణబాబు అస్థికలను మరునాడు కావేరిలోనో, గోదావరిలోనో కలుపుతానన్నాడు పురోహితుడు.
‘ఎదురుగానే మహాసముద్రం ఉంది. అందులో కలపండి అన్నాన్నేను.’
మామూలుగా కవుల్ని వారు ఏ నదీతీరాల్లో జీవించారో ఆ నదుల్తో గుర్తుపెట్టుకుంటాం. కానీ శ్రీ శ్రీ సముద్రమంత కవి. ఆయన్ని సముద్రంతోటే గుర్తుపెట్టుకోవాలి.
3-3-2026


ఆహా.. ఎంత అద్భుతమైన , ఆనందదాయకమైన పోస్ట్.. భలే బాగుంది శ్రీశ్రీ విశాఖ కోణం.. అలాగే శ్రీశ్రీ రాతల గురించి ఎన్ని తెలియని సంగతులు తెలిశాయో. ఈ పోస్టు ను ఎంత ఆస్వాదించానో మాటల్లో చెప్పలేను నాకు స్విన్ బర్న్ కవిత్వం తో పాటు ఆయన గురించిన ఏ విషయాలైన భలే ఫాసినేటింగ్ గా అనిపిస్తాయి. అందుకు ముఖ్య కారణం శ్రీ.శ్రీ కవిత ” విషం క్రక్కే భుజంగాల్.. “. అక్కడి నుంచే స్విన్బర్న్ గురించి మరింత ఎక్కువ తెలుసుకున్నా.. ఆ కవిత మాత్రమే కాదు. మీరు ఈ వ్యాసంలో పేర్కొన్న కవులు చార్లెస్ బౌడేలైర్, గై డీ మోపాసా, ఎడ్గార్ అలాన్ పో లతో స్విన్బర్న్ కనెక్షన్, స్విన్ బర్న్ కి విట్మన్ రచనల గురించిన భిన్న కాలాలలో భిన్నాభిప్రాయాలు.. ఎట్రెటాట్ తీరంలో మునిగిపోతున్న తాగిన స్విన్‌బర్న్‌ను గై డీ మౌపాసంట్ రక్షించిన వైనం, తరువాత స్విన్బర్న్ ఇంట్లో లంచ్ మీటింగ్… 1903 నుంచి 1909 వరకు ప్రతీ ఏడు నోబెల్ ప్రైజ్ కి నామినేట్ అవ్వడం.. లాంటి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలతో కుదిరితే ఒక వ్యాసం రాయాలి. ఐల్ ఆఫ్ రైట్ లో ఒక చర్చ్ ప్రాంగణంలో ఆయన సమాధి ఉంది.. కుదిరితే అది ప్రత్యక్షంగా వీక్షించినపుడు ఆ పని చేస్తానేమో…
పనిలో పనిగా విశాఖతో ఉన్న అవినాభావ సంబంధం తో పాటు అక్కడ కుట్టే దోమల గురించిన శ్రీశ్రీ పద్యం ఒకటి…
తెగ కుట్టి వదలి పెట్టినవి
అగణిత వైజాగు దోమలశ్వత్థామల్
పొగరెక్కిన రెక్కేన్గులు
సెగలెగిసెడి తుమ్మముళ్ళు సిరిసిరిమువ్వాg
హృదయపూర్వక ధన్యవాదాలు సార్! ఇంత విస్తృత పఠనానుభవం ఉన్న మిత్రుల కోసం ఇటువంటి పోస్టులు ఎన్నైనా రాయవచ్చు.
అద్భుతంగా ఉంది సర్
ధన్యవాదాలు గోపొల్!
శ్రీశ్రీ ని సమగ్రంగా ఆవిష్కరించారు మీరు. వందనాలు. 🙏
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
వ్యాసంలో ఈక్రింది వాక్యాలు చాలా క్షోభ కలిగించాయి.
– –
మరి షేక్ స్పియర్, తిక్కన?
‘వందనార్హులు. కానినాకక్కరలేని బోలెడు చెత్త వ్రాశారు..’
– –
షేక్ స్పియర్ వ్రాసింది బోలెడు చెత్తో కాదో అది వేరే చర్చ.
తిక్కన గారు వ్రాసినది బోలెడు చెత్త అనటం చాలా అసహ్యంగా ఉంది చదవటానికే.
శ్రీశ్రీ రాసింది మాత్రం బోలెడు బోలెడు చెత్త కాదా?
ఈరోజున ఇంకా ఆయనను నాలుకపీకేలా పొగడే వాళ్ళు కొంతమంది ఉండవచ్చును. మరి కొన్ని వందల యేళ్ళు నిలుస్తుందా శ్రీశ్రీ కవిత్వం?
తిక్కన కవిత్వం నిలిచింది మరి వందల యేళ్ళు కాలానికి నిలబడి.
రేపో మాపో బండ్లకొద్దీ చెత్త వ్రాసాడు శ్రీశ్రీ అని జనం ఈసడించే అవకాశం లేదా? అన్నట్లు ఒక కాట్లాటలో ఆరుద్రే శ్రీశ్రీని ఈసడించ లేదా?
తిక్కన స్వయంగా రాజనీతివేత్త, మంత్రి. గొప్ప కవి. తెలుగునుడికారంతో కవిత్వాన్ని పండించి భారతాంధ్రీకరణం చేసారు. ఆయన రాకకోసమే ఆ ఆంధ్రీకరణయజనం వేచి ఉండినది శ్రీకృష్ణుని వంటి రాజనీతీ యుధ్ధతంత్రమూ ధర్మశాస్త్రమూ తెలిసిన యజ్వ రావాలీ చేయాలీ అని. అందుకే అది నిలిచిపోయింది ఆయన చేపట్టేదాకా.
తిక్కనను చెత్త అన్న వాడిని ఎంతవాడినీ తెలుగుజాతి ఎంతమాత్రమూ క్షమించకూడదు. క్షమించదు.
శ్రీశ్రీ కవిత్వం నిండా ఆయనకు తెలుగుభాషపైన కల సాధికారత కనిపిస్తోందంటే అది పూర్వకవులకవితావైభవాన్ని ఆయన అధ్యయనం చేసిన పుణ్యప్రభావం కాదా?
తన శైశవంలో ఒకపూట పాలు ఇచ్చిన దాదిని ఐనా స్వంత తల్లిలా గౌరవించేది మన భారతీయ సంస్కృతి. ఈనేలపై పుట్టిన ఒక కవివాచ్యుడు తనకు భాషాభిక్ష పెట్టిన ఒక పూర్వమహాకవిని “ఆయన తనకు ఆక్కరలేని బోలెడంత చెత్త వ్రాసాడూ” అన్నాడంటే ఆదెంత దౌష్ట్యం? చెప్పటానికి మాటలున్నాయా?
ఇంతవరకూ శ్రీశ్రీ అంటే ఎంతో కొంత అభిమానం ఉండేది. ఇప్పుడ లేదండి. కుసంస్కారిని కవి యన లేను. క్షమించాలి.
మీ వ్యాఖ్య చదివాక నేను ఉల్లేఖించిన భాగాన్ని కొంత సరి చేశాను. ఎందుకంటే ఏదైనా సందర్భం నుంచి బయటికి లాగి చూస్తే అసందర్భంగానే అనిపిస్తుంది. శ్రీశ్రీ తిక్కనకి ఇచ్చినటువంటి గౌరవం అసామాన్యమైన గౌరవం. బహుశా అంత గౌరవాన్ని అంత బాహాటంగా తెలుగులో మరే కవీ తిక్కనకి ఇవ్వలేదు. అయితే ఇక్కడ సందర్భం వేరే. కాబట్టి నేను ఆ వాక్యాన్ని ఉటంకించాను. కానీ ఇలా సందర్భాన్నించి బయటకు లాగి దాన్ని పరీక్షించే అవకాశం ఉందని మీ వ్యాఖ్య చదివాక నాకు అర్థమైంది. కాబట్టి నేను ఉల్లేఖించిన భాగాన్ని సవరించక తప్పలేదు.