
ప్రియమైన శాఫో
నువ్వు అవనిజవి అనిపిస్తుంది నాకు. ఇప్పటికీ భూగర్భంలోంచి నీ కవిత్వశకలాలు బయటపడుతూనే ఉన్నాయి. చివరిసారి 2014 లో తొమ్మిది కవితలు దొరికాయి. అంతకుముందు 2004 లో ఒక కవిత దొరికింది. మార్టిన్ వెస్ట్ ఆ కవిత దొరికిందని చెప్పినప్పుడు అది అంతర్జాతీయ పతాక వార్తగా మారిపోయింది. ప్రపంచం మొత్తం ఆ పేపైరీని కళ్ళప్పగించి మరీ చూసింది. అయితే, అది కొత్త కవిత కాదనీ, అంతకుముందు చిన్న చిన్న శకలాలుగా లభ్యమైందే దాదాపుగా ఒక పూర్తిపాఠంగా దొరికిందని కూడా అనుకున్నారు. అలా దాదాపుగా పూర్తి కవితగా దొరకడం కూడా చిన్న విషయం కాదుకదా!
ఎందుకంటే అప్పటిదాకా ఒక పేపైరీ మాత్రమే ఆ కవితకి ఆధారంగా ఉండేది. నలిగిపోయి, చిరిగిపోయి ముడతలుపడ్డ కాగితం. అది ఈజిప్టులో ఆక్సిరింకస్ లో 1922 లో దొరికింది. ఆ కవితలో ఎన్ని పదాలున్నాయో అన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. అది నువ్వు వృద్ధాప్యం మీద రాసిన కవితని తెలుస్తూనే ఉంది. శాఫో వృద్ధాప్యం మీద రాయడం! ఊహించు! అది ఎంత కుతూహలాన్ని రేకెత్తించి ఉంటుంది! దాదాపు వందేళ్ళ తరువాత ఈజిప్టులోనే మరో చోట ఓ మమ్మీలో కూరిన కాగితాల చుట్టల్లో మరో పేపైరీ బయటపడింది. ఆశ్చర్యం! ఇదీ ఆ కవితనే. అయితే, పాత కాగితంలో ఏ పదజాలం కనబడకుండా పోయిందో, ఇప్పుడు పంక్తులకు పంక్తులు బయటపడ్డాయి. పరిశోధకులు చెప్పేదాని ప్రకారం ఆ కాగితం క్రీ.పూ. మూడో శతాబ్దం నాటిది. ఇప్పటివరకూ మాకు దొరికిన నీ కవిత్వపత్రాల్లో అదే అత్యంత పురాతనమైంది. ఇదీ ఆ కవిత:
కవిత్వదేవతలు పువ్వుల్లో పెట్టిమరీ
కానుకలు తీసుకొస్తారు: పిల్లలూ, త్వరపడండి,
అందుకోండి, పాటగా ప్రవహించే
తంత్రీవాద్యాలు శ్రుతిచెయ్యండి.
నా సంగతంటారా:
నా చర్మం ఒకప్పుడు నిగనిగలాడేది
ఇప్పుడు వార్ధక్యం విరుచుకుపడింది, నల్లనిజుత్తు
తెల్లబడింది.
జవసత్త్వాలు ఉడిగిపోతున్నాయి
ఒకప్పుడు లేడికూనల్లాగా నాట్యమాడిన
నా మోకాళ్ళిప్పుడు
దేహభారం మొయ్యలేకపోతున్నాయి.
వీటన్నిటినీ తలుచుకుని ఒకటే నిట్టూరుస్తాను
కాని చెయ్యగలిగేదేముంది?
మనిషిని ముసలితనం ఆవహించకుండా
ఆపగలిగే శక్తి ఏదీ లేదు.
ఉదాహరణ మీకు తెలిసిన కథనే:
ఒకప్పుడు కాంక్షాభరితురాలై
గులాబీ చేతుల ఉషోదేవత తిథొనస్ ను
భూమి అంచులదాకా ఎగరేసుకుపోయింది.
అప్పుడతడు యువకుడు, అందగాడు.
చూస్తూండగానే
ముసలితనం అతణ్ణి కూడా ఆక్రమించింది
కాని అతడి సహచరికి మాత్రం జరామరణాల్లేవు.
నువ్వు ఈ కవితలో తిథొనస్ గురించి చెప్పి నీ గీతాన్ని గొప్ప భావగర్భితంగా మార్చేసావు. నేను విన్నదాన్ని బట్టి తిథొనస్ ఒక ట్రోజన్ వీరుడు. ఒకప్పుడు ఉషోదేవత అతణ్ణి చూసి, వలచి, తనలాగే అతడికి కూడా అమరత్వాన్నిమ్మని సర్వేశ్వరుణ్ణి ప్రార్థించింది. కాని అలా కోరుకునే తొందరలో, అమరత్వంతో పాటు నిత్యయవ్వనాన్ని కూడా ఇమ్మని అడగడం మర్చిపోయింది. దాంతో తిథొనస్ కి మరణం లేకపోయిందిగాని, వృద్ధాప్యం తప్పలేదు. అనంతకాలం మరణరహితుడిగా ఉండటంతో అతడు ముసలివాడై, వాడి వగ్గై, పిగిలిపోయాడు. చావులేని నిరంతర వార్థక్యం అతడికి వరంగా కాక శాపంగా పరిణమించింది. తర్వాత రోజుల్లో ఈ పురాణకథని ఇలా వదిలిపెట్టలేక ఎవరో దీన్ని మరికొంత పొడిగించారు. ఆ కథలో ఉషోదేవత తన వృద్ధసహచరుడి వేదన చూడలేక అతణ్ణి ఒక చిమ్మెటగా మార్చేసిందని చెప్తారు. అంటే శాపగ్రస్తంగా మారిన శరీరం వదిలిపెట్టి అతడు ఒక పాటగా మారిపోయాడన్నమాట.
నువ్వు ఈ కవితలో రెండు విషయాలు చెప్తున్నావు. మొదటిది, కాలం మీదపడేలోపే, తంత్రీవాద్యాలు శ్రుతిచేసి గీతాలు పాడుకోడానికి త్వరపడాలని చెప్పడం. ఇది నీ వంటి కవి సహజంగానే చెప్పేమాట. కవిత్వదేవతలు, సాహిత్యదేవతలు, సంగీత దేవతలు వళ్ళో పూలు పెట్టుకుని మరీ మనల్ని చేరపిలుస్తారని నువ్వు మటుకే చెప్పగలవు. ఇక ‘పిల్లలూ’ అని సంబోధించడంలోనే, ఇది నువ్వు నడియవ్వనంలోకాక, వయసు వాటారాక రాసిన కవిత అని తెలుస్తూనే ఉంది. నాకు తెలిసి, తన వృద్ధాప్యాన్ని దాచుకోకుండా, తన తర్వాతి తరానికి సాహిత్యాన్నీ, సంగీతాన్నీ అందించడానికి ఇలా ఆతృతపడ్డ కవి ప్రపంచసాహిత్యంలోనే మరొకరు కనిపించడం లేదు.
కాని కవితలో నువ్వు చెప్తున్న రెండో విషయం మరింత ప్రగాఢమైంది. నువ్వు తిథొనస్ కథ చెప్పడం ద్వారా చెప్తున్నదేమంటే, మనుషులు నిత్యయవ్వనాన్ని కోరుకోకుండా అమరత్వాన్ని కోరుకుని ప్రయోజనం లేదని. ఈ మాట నువ్వు కవిత్వం విషయంలో చెప్తున్నావంటే అర్థమేమిటి? నాకు రెండు అర్థాలు స్ఫురిస్తున్నాయి. మొదటిది, ఉషోదేవత, ఉషోదేవతనే. ఆమె ప్రతిరోజూ కొత్తగా పుడుతుంది. ఎప్పటికప్పుడు ఆమె కరాగ్రాలు గులాబిరంగులోనే ఉంటాయి. కాబట్టి ఆమె నిత్య బాల, నిత్య యవ్వని. కాని ఆమె వలచిన మనిషి, ఆ తిథొనస్ నిజానికి మనుషులందరికీ ప్రతినిధి. అతడు యవ్వనంలేని అమరత్వాన్ని కోరుకోవడంలో ఒక విషాదముంది. మనం కవితలు రాస్తాం, ప్రసంగాలు చేస్తాం. జీవించడం గురించి మాట్లాడతాం. మన మాటలు కలకాలం నిలబడాలని కోరుకుంటాం. కాని అవి కాలం గడిచేకొద్దీ వన్నె కోల్పోతాయి. పాలిపోతాయి. రంగు వెలిసిపోతాయి. జీవశక్తి నెమ్మదిగా ప్రిదిలిపోయి ఆ మాటలు ముదివగ్గులుగా మారిపోతాయి. కాబట్టి కవులు నిత్యయవ్వని అయిన ఉషోదేవి చెలిమిని కోరుకుంటే వారు కోవలసింది అమరత్వాన్ని కాదు, తమ పలుకుల్లో సజీవ హృదయస్పందనం వినబడుతుండాలని కోరుకోవాలి. జీవశక్తి, ప్రాణశక్తి లేకపోయిన తర్వాత ఆ మాటలూ, ఆ పాటలూ, ఆ కావ్యాలూ కలకాలం నిలిచి మాత్రం లాభమేమిటి?
ఇక నాకు స్ఫురిస్తున్న రెండో విషయమేమిటంటే, నువ్వు ఈ కవితలో వృద్ధాప్యాన్ని తక్కువ చేయలేదు. నిందించలేదు. నీ యవ్వనం శాశ్వతం కానందుకు విలపించడం లేదు. అందుకు బదులు దాన్ని ప్రాణుల సహజధర్మంగా అంగీకరిస్తున్నావు. లేడిపిల్లల్లాగా చెంగుచెంగున గెంతులాడే మోకాళ్ళు ఇప్పుడు నీ శరీరభారాన్ని మొయ్యలేకపోతున్నాయని నువ్వు రోదించడం లేదు. ఎల్లకాలం నువ్వే పాటలు పాడుతూ ఉండాలన్న కోరిక ప్రకటించం లేదు. అందుకు బదులు పిల్లల్ని త్వరపడమంటున్నావు. సంగీతవాద్యాలకి శ్రుతిపెట్టమంటున్నావు. ఇలా వృద్ధాప్యాన్ని ఒక dignity తో సమీపించే ఈ మనఃస్థితి చూసి నాకు నీ పట్ల అపారమైన గౌరవం కలుగుతోంది. మా కృష్ణశాస్త్రి కూడా నీలాంటి కవినేగాని, ‘శీతవేళ రానీయకు శిశిరానికి చోటీయకు’ అని పాడాడు. కానీ నువ్వో! నగరద్వారం దగ్గర కాపలా ఉండేవాళ్ళు తమస్థానంలో మరొకరు రాగానే తాము పక్కకు తప్పుకున్నంత సహజంగా, హుందాగా, మర్యాదగా నువ్వు శీతవేళనీ, శిశిరాన్నీ అంగీకరిస్తున్నావు.
యవ్వనలాలసనీ, బృందావన మధురిమనీ, గులాబి కాంతుల వెన్నెలనీ, సాంబ్రాణి సువాసననీ ఇష్టపడ్డ నువ్వు, అంతే ధీరతతో, అంతే మెలకువతో వృద్ధాప్యానికి చోటిస్తూ చెప్పిన ఈ కవిత ఉందే, ఇటువంటిది, శాఫో! నా మొత్తం తెలుగు సాహిత్యమంతా గాలించినా ఒక్కటి కూడా కనిపించడం లేదు.
కాని ప్రపంచ సాహిత్యంలో కొన్ని కవితలు లేకపోలేదు. వృద్ధులంటే తమ ఇంట్లో వాళ్ళ గురించి రాయడం కాదు, బీదవాళ్ళు, సమాజం అంచులకి నెట్టేసినవాళ్ళు, జీవితంలో చెప్పుకోదగ్గ ఏ ప్రత్యేకతా లేకుండానే రోజులు నెట్టుకొచ్చేవాళ్ళు- అటువంటి వాళ్ళ మీద రాసిన కవితలు, The Bean Eaters లాంటివి అస్సలు కనిపించవు.
గ్వెండొలిన్ బ్రూక్స్ నల్లజాతి సాహిత్యానికి ఒక క్లాసికల్ స్థాయి శిల్పాన్ని సంతరించిన కవి, రచయిత. ఆమెని చదువుతుంటే సమకాలిక అమెరికన్ కవిరచయితలకన్నా కూడా ఒక హోరేస్ నో, లేదా ఒక ఛాసరో గుర్తొస్తుంటారని ఒక సంకలన కర్త అన్నాడు. ఆమె రాసిన ఈ కవిత ఎంత సాదాసీదా మాటల్లో ఎంత నిండుగా, గంభీరంగా, ఎంత హుందాగా, ఎంత ఆరాధనీయంగా ఉందో చూడు:
సాదా భోజనం చేసేవాళ్ళు
ప్రతిరోజూ వాళ్ళ భోజనం చిక్కుళ్ళో, బొబ్బర్లో
పండిపోయిన ఆకుల్లాంటి ఆ ముసలి దంపతులకి.
వాళ్ళకి భోజనమంటే చాలా సాదాసీదా వ్యవహారం
కిర్రుమంటూ ఊగిసలాడే మామూలు బల్లమీద
చవకరకం సత్తుగిన్నెల్లో పెట్టుకు తింటారు.
ఒకరకంగా మంచివాళ్ళనే చెప్పాలి.
జీవితం సింహభాగం గడిచిపోయినవాళ్ళు
అయినా రోజూ చక్కగా తయారవుతారు
అక్కర్లేనివి పక్కన పెట్టేస్తుంటారు.
తలుచుకుంటూ ఉంటారు. ..
ఆ తలపుల్లో కొన్ని తళుకులూ, కొన్ని ములుకులూ.
తలుచుకుంటూనే ఆ పెరటివేపు అద్దెగదిలో
చిక్కుడుకాయలమూటలమీద జారబడతారు
ఆ గదినిండా గింజలూ, గుడ్డలూ, బొమ్మలూ, చీటీలూ
పొగాకు తునకలూ, పోగులూ, కుండీలూనూ.
ఇది నిజంగా జాలిపుట్టించవలసిన దృశ్యం. కాని ఆమె తాను దక్షిణ చికాగోలో, నల్లవాడల్లో చూసిన ఆ నిరుపేద దంపతులుల్ని ఎంత హుందాగా మన ముందు చూపించింది! నాకీ కవిత చదివినప్పుడు, వాన్ గో గీసిన The Potato Eaters (1855) చిత్రం గుర్తొచ్చింది. అందులోనూ బీదరికం ఉంది. కాని ఆ బంగాళదుంపలు వాళ్ళు కష్టించి పండించుకున్న తిండి. మట్టిరంగుల ఆ చిత్రం చూడగానే, ఆ బీదరికం మనల్ని ఎంత బాధిస్తుందో, ఆ dignity of sharing అంత ధైర్యాన్నిస్తుంది.
ఇదుగో, నువ్వు రాసిన ఈ కవితలానే.
ఒక్కమాట చెప్పనా శాఫో! వృద్ధాప్యాన్ని అంగీకరిస్తూ రాసిన ఈ కవితకి నువ్వు నిత్యయవ్వనం సంతరించావు. అందుకనే ఇన్ని యుగాల తర్వాత కూడా ఈ కవితను భూమి భద్రంగా మళ్ళా మాకప్పగించింది.
Featured image: The Potato Eaters (1855) by Vincent Van Gogh
20-5-2026


ఆహా… ఎంత బాగుంది.
ధన్యవాదాలు మేడం!
సాహిత్యోల్లాసం అనే పదం స్ఫురించింది మీ ఈనాటి పోస్టు చదువుతుంటే . ఒక కవితను పూర్వాపరాలు తెలుసుకుని, విశ్లేషించుకుని చదివితే ఎంత మాధుర్యమో ఈ నాటి శాఫో కవితకు మీ వింగడింపు తెలియపరుస్తుంది. గ్వెండొలిన్ బ్రూక్స్ నీ వాంగో గీచిన చిత్రాన్ని అనుసంధానం చేసి ఈ కవితను ఆకాశానికెత్తి చూపాలంటే ఎంతటి అధ్యయనం, స్ఫురణ, ధారణ కావాలి. ప్రపంచ సాహిత్యాన్ని ఇంత లోతుగా పరిశీలించే వారు కోటికొక్కరే. మీకు సాహిత్యోల్లాస చక్రవర్తి అని నా మనసు ఇచ్చే మాటపువ్వు కానుక .
‘సాహిత్యోలాస చక్రవర్తి’! ఎంత గొప్ప బిరుదు లభించింది ఈ రోజు!