వేలూరి వెంకటేశ్వరరావు

వేలూరి వెంకటేశ్వరరావుగారిని నేనెన్నడూ ప్రత్యక్షంగా చూడలేదు, కలుసుకుని మాట్లాడలేదు. కాని సాహిత్యపరంగా నా హృదయానికి చాలా సన్నిహితంగా వచ్చిన వారిలో ఆయన్ని కూడా లెక్కేసుకుంటాను.

ఫేస్ బుక్ పుణ్యమా అని, పది పన్నెండేళ్ళ కిందట ఆయన పరిచయం లభించింది. మేము పరస్పరం ఒకరికొకరం స్నేహితులజాబితాలో చేరాం. కాని ఆయనతో స్నేహం కేవలం ఫ్రెండ్స్ లిస్ట్ కి మాత్రమే పరిమితమైన స్నేహం కాదు. మేం ఒకరికొకరం పరిచయమైన పదేళ్ళపాటు, అంటే దాదాపు 2022 దాకా, ఆయన నా ప్రతి పోస్టూ చూసారు. చూసి ఊరుకోవడం కాదు, ప్రతి ఒక్క పోస్టు మీదా ఏదో ఒక స్పందన కూడా రాసేవారు. ఆయనకు సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారు పరిచయమయ్యాక, 2022 లో రాధాకృష్ణమూర్తిగారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినదాకా, మేము ఒకరి పోస్టులు ఒకరం చదువుకోవడమేకాక, ఒకరి స్పందన మరొకరం చదువుకునేవాళ్ళం. అలా వేలూరి వారికీ, నాకూ మధ్య అనుబంధం రాధాకృష్ణమూర్తిగారి వల్ల త్రిగుణీకృతమైంది. మేం ముగ్గురం ఒకరి స్పందనలు ఒకరు చదువుకుంటూ రావడంతో దాదాపుగా ఒకరికొకరం సన్నిహిత మిత్రుల్లాగా, రోజూ ఒక అడ్డాలో కలిసి కూచుని మాటాడుకునే మిత్రుల్లాగా, లేదా పొద్దున్నో, సాయంకాలమో నడకలో కలుసుకునేవాళ్ళలాగా ఉండేవాళ్ళం. అందుకనే వెంకటేశ్వరరావుగారిని నేను నాకు అంత సన్నిహితులని చెప్పుకోగలిగాను.

ఆయన గురించి కన్నెగంటి రామారావు చాలా గౌరవప్రపత్తులతో మాట్లాడేవాడు. ముఖ్యంగా మహాత్మాగాంధీ సంపూర్ణరచనలు వంద సంపుటాలూ ఆయన ఇండియానుంచి అమెరికా తెప్పించుకోవడం, వాటిని ఎంతో శ్రద్ధగా దాచుకోవడం లాంటివి చెప్పినప్పుడు వేలూరి వారి పైన నాకు మరింత గౌరవం పెరిగింది.

ఆయన నన్ను తన పుస్తకాలు రెండింటి మీద సమీక్ష చెయ్యమని అడిగారు. మొదటిది, సౌభాగ్య కుమార మిశ్ర అనే ఒడియా కవి కవిత్వం ‘అవ్యయ’ పేరిట తెలుగులోకి చేసిన అనువాదం. దాన్ని 2016 లోనే సమీక్షించాను. ఆ సమీక్ష ఆయనకు చాలా నచ్చింది. ఆ సమీక్ష ఇక్కడ చూడవచ్చు:

కాఠజోడి నది ఒడ్డున

ఆ తర్వాత ‘ద్వా సుపర్ణా’అనే సంపుటిని కూడా చెయ్యమని 2019 లో అడిగారుకాని, నా ఉద్యోగజీవితం నాకు వెసులుబాటునివ్వలేదు. ఆ పుస్తకం నేను చదివే ఉంటాననీ, కాని దాన్ని నేను సమీక్షించవలసినంత ముఖ్యమైన పుస్తకంగా భావించి ఉండననీ ఆయన అనుకున్నారు. ఇప్పుడు ఫేస్ బుక్ మెసెంజరు తిరగేస్తే, 2018 ఫిబ్రవరినుంచి దాదాపు ఏడాదిన్నర పాటు ఆయన ఆ పుస్తకం సమీక్ష కోసం నాకు పదేపదే గుర్తుచేస్తూనే ఉన్నారు. కాని నా దురదృష్టం. నేను ఆ సమీక్ష రాయలేకపోయాను.

ఈ మధ్య నాలుగైదేళ్ళుగా ఆయనకీ, నాకూ మధ్య సంవాదం సన్నగిల్లింది. నేను ఫేస్ బుక్ లో నేరుగా పోస్టులు పెట్టడం మానేయడం ఒక కారణమై ఉండవచ్చు లేదా ఆయనకి పూర్వం ఉన్నంత సౌలభ్యంగా కూడా ఉండకపోయి ఉండవచ్చు. కానీ, ఈ నాలుగైదేళ్ళుగా కూడా నేను ఆయన ఎక్కడో దూరంలో ఉన్నారనీ, మా మధ్య సంభాషణలు అదృశ్యమైపోయాయనీ అనుకోలేదు. కొన్ని స్నేహాలు అలానే ఉంటాయి. సెల్ ఫోన్లు స్విచ్ఛాఫు చేశాక కూడా సంభాషణ కొనసాగుతూనే ఉంటుంది. ఇన్నాళ్ళ పాటూ ఎలానూ ఆయన్ని చూడనేలేదుకాబట్టి, ఇప్పుడు ఆయన భౌతికంగా కనిపించరనే వార్త కూడా, నాలో ఏ కొత్త దిగులునీ పుట్టించనూ లేదు.

అలా ఉంటారు మనుషులు కొందరు, వారిని ఒక్కసారి కలిసినా చాలు, రూమీ చెప్పినట్టు వారు గుర్తొచ్చిన ప్రతిసారీ కస్తూరి పరిమళం గుప్పుమంటూనే ఉంటుంది. వెంకటేశ్వరావుగారు అటువంటి వ్యక్తి.

8-2-2026

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%