ఒక తరాన్ని తీర్చిదిద్దిన స్ఫూర్తి

మల్లాప్రగడ రామారావుగారు ఇప్పటికి నలభయ్యేళ్ళ కిందట, 80 ల ప్రారంభంలో కార్మిక విద్యాశాఖాధికారిగా రాజమండ్రిలో పనిచేసేవారు. అంతకుముందు ఆయనకు విశాఖపట్టణంలో విశాఖసాహితి అనే ఒక సాహిత్యసంస్థను నిర్వహించిన అనుభవం వల్ల, రాజమండ్రిలో కూడా సాహితీవేదిక అని ఒక సాహిత్యబృందాన్ని ఏర్పాటు చేసారు.

కొప్పర్తి వెంకట రమణమూర్తితో కలిసి ఆయన ప్రారంభించిన ఆ వేదిక సంస్థాగత నిర్బంధాలూ, లాంఛనాలూ లేని పూర్తి ప్రజాస్వామిక వేదిక. ఆ బృందంలో సభ్యులుగా ఉండే యువతీ యువకులందరికీ రామారావుగారూ, వారి శ్రీమతి బాలా త్రిపురసుందరిగారూ అన్నయ్యా వదినలు. వారి ఇల్లే ఆ బృందానికి సాహిత్యకేంద్రం. పూర్వకాలపు ఉమ్మడికుటుంబాల వాతావరణాన్ని తలపించేవిధంగా ఆ ఇంటిచుట్టూ ఆ యువతీయువకుల జీవితాలూ, ఉత్సాహాలూ అల్లుకుని ఉండేవి. అలా ఆ రోజు వారి నీడన నడయాడిన వాళ్ళల్లో అప్పటికే చెప్పుకోదగ్గ సాహిత్యకృషి చేసిన సావిత్రిగారు, కల్లూరి భాస్కరం మొదలైనవాళ్ళతో పాటు, అప్పుడప్పుడే సాహిత్యరంగంలో అడుగుపెట్టి తర్వాత రోజుల్లో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న కుప్పిలి పద్మ, యెర్రాప్రగడ రామకృష్ణ, ఎమ్మెస్ సూర్యనారాయణ, వసీరా, రాణి శివశంకర శర్మ, సాధనాలవంటి వారితో పాటు నేను కూడా ఉన్నాను. ఈ రోజు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ గంధం నాగ సుబ్రహ్మణ్యం, సి.వి.ఎస్.మహేశ్వర్, కవులూరి గోపీచంద్‌లు అన్నయ్యగారికుటుంబసన్నిధి నుంచి అందుకున్న ప్రోత్సాహం మాటల్లో వెలకట్టలేనిది.

రామారావుగారు అభ్యుదయభావాలు ఉన్నవారు. వ్యవస్థని మార్చడానికి, రాజ్యాంగ పరిధిలోనూ, ఇప్పటికే అమల్లో ఉన్న ప్రభుత్వ చట్టాలమేరకైనా కూడా ఎంతో చేయవచ్చునని నమ్మేవారు. తన ఉద్యోగంలో కూడా ఆ నమ్మకానికి తగ్గట్టే కార్మికజాగృతికోసం కృషి చేసేవారు. ఆయనకు నచ్చని అంశాలు చాలానే ఉండేవి. కాని వాటిని పదేపదే చెప్పడం ద్వారా ఆయన తన చుట్టూ ఉన్న సాహిత్యవాతావరణాన్ని కలతపరచడానికి ఇష్టపడేవారు కాదు. అందుకు బదులుగా ప్రతి ఒక్కరూ తమ భావాల్నీ, సుందరభవిష్యత్తుకోసం తాము కంటున్న కలల్నీ నిస్సంకోచంగా నలుగురితో పంచుకునేలాంటి ఒక అనుకూలతను, ఇప్పటి మాటల్లో చెప్పాలంటే, ఒక ఇకో-సిస్టంను నిర్మించడానికే ప్రయత్నించేవారు. కాబట్టి ఈ రోజు రచనలు చేస్తున్న మేమంతా ఆయన మాకు అందించిన ఆ తోడ్పాటుకి ఎప్పటికీ ఋణపడి ఉంటామని చెప్పక తప్పదు.

తన ప్రభావపరిధిలోకి వచ్చిన యువతీయువకుల్నే ఇంతగా ప్రోత్సహించినప్పుడు రామారావుగారి శ్రీమతి ఒక కవీ, రచయితా కాకుండా ఎలా ఉంటారు? ఆమె ఇన్నేళ్ళుగా కవితలూ, కథలూ రాస్తూనే ఉన్నారని ఈ పుస్తకం చూసేక అర్ధమయింది. కానీ పుస్తకరూపంలో రావడమే ఆలస్యమైంది.

ఈ కవితలూ, కథలూ ఆసక్తిగా చదివాను. ఇందులో బాలగారు మాకు తెలిసిన వదినగానే మాత్రమే కాదు, ఒక పెద్దక్కగా, ఒక పెద్దత్తగా, పాతకాలపు గ్రామీణకుటుంబాల్లో ప్రతి ఒక్కరికీ సాయంగా నిలబడే పూర్వకాలపు మహిళగా కనిపించారు. కాని ఆ భావాలు మాత్రం నవీన మహిళవి. ఒకవైపు అభ్యుదయ భావాలూ, మరొక వైపు పూర్వకాలపు సంస్కారం కలిసి ఉండే ఇటువంటి అపురూపమైన వ్యక్తులు నేడు అరుదైపోతున్న కాలమిది. అందుకనే ఈ రచనలు చదువుతున్నంతసేపూ, ఆమె చిత్రిస్తూ వచ్చిన నిష్ఠురవాస్తవాల్ని దాటి, ఆమె సంధిస్తూ వచ్చిన తీక్ష్ణమైన ప్రశ్నల్ని దాటి, వాటి వెనక వెన్నలాగా కనిపిస్తున్న ఆ నిర్మల హృదయాన్నే నేను పదే పదే సంభావిస్తూ ఉండిపోయాను. మహాకవి ‘చేదువిషం జీవఫలం’ అని అన్నాడుగానీ ఈమె నిర్మలహృదయ కాబట్టి ‘చేదువిషం కాదు జీవఫలం’ అని అనగలిగారు.

ఒక స్త్రీ చదువుకుంటే ఒక కుటుంబానికి దారి దొరుకుతుంది అనేది పాతమాట. కాని ఆ చదువుకున్న స్త్రీకి హృదయసంస్కారం కూడా బలంగా ఉంటే మొత్తం ఒక తరానికే దారి దొరుకుతుందని ఇదుగో బాలగారి వంటి వారిని చూస్తే తప్పకుండా స్ఫురించే మాట. ఒక తరాన్ని తీర్చిదిద్దిన స్ఫూర్తి వారిది. ఈ కవితలూ, కథలూ ఆ స్ఫూర్తినే ప్రతిబింబిస్తుండడంలో, అందుకే, ఆశ్చర్యం లేదు.

27-11-2025

2 Replies to “ఒక తరాన్ని తీర్చిదిద్దిన స్ఫూర్తి”

  1. చదువుకున్న స్త్రీకి హృదయసంస్కారం కూడా బలంగా ఉంటే మొత్తం ఒక తరానికే దారి దొరుకుతుంది.
    అత్యద్భుతంగా చెప్పారు.
    నమస్సులు సర్

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%