తెలంగాణా హెరిటేజి మూజియం

ఆ మధ్య నా మిత్రుడొకాయన యూరోపు యాత్రకి వెళ్తున్నాడని చెప్తే, తన పర్యటనలో అమస్టర్ డాం కూడ ఉందని చెప్తే, వాన్  గో మూజియం తప్పకుండా చూడమని చెప్పాను. ఆయన తిరిగొచ్చాక చెప్పిందేమంటే, వాన్ గో మూజియంకి మరో ఆర్నెల్లదాకా టిక్కెట్లు లేవని!

విన్సెంట్ వాన్ గో (1853-1890) – ఆధునిక చిత్రకారుల్లో అగ్రశ్రేణికి చెందినవాడు. పోస్ట్-ఇంప్రెషనిస్టు తరహాలో చిత్రలేఖనాలు గీసిన ఆయన జీవితం దానికదే ఒక కళాత్మక ఇతివృత్తం. ఆయన చిత్రలేఖనాలకీ, ఆయన జీవితం మీద వచ్చిన ఎన్నో పుస్తకాలకీ, ఆయన తన తమ్ముడికి రాసిన ఉత్తరాలకీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులూ, ఆరాధకులూ ఉన్నారు కాబట్టి, ఆ మూజియంకి టికెట్లు దొరకలేదంటే ఆ విషయం వినడానికే కించిత్ గర్వంగా కూడా ఉంటుంది.

1819 లో అజంతాగుహల్ని బ్రిటిషు సైనికులు కనుగొన్నాక, ఆ గుహాలయాల్లో అద్భుతమైన చిత్రలేఖనాలున్నాయని తెలిసిన తర్వాత, అవి హైదరాబాదు నిజాం పరిథికి చెందినవని తెలిసాక, ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో ఏడో నిజాం ఆ చిత్రలేఖనాలకు నకళ్ళు రూపొందించి తీసుకురమ్మని ఇద్దరు ముస్లిం చిత్రకారుల్ని పంపించాడు. వారు దాదాపు రెండేళ్ళు అజంతాలోనే ఉండి, అజంతా చిత్రలేఖనాలకు చిత్రించిన నకళ్ళు ఇప్పుడు పబ్లిక్ గార్డెన్సులో ఉన్న తెలంగాణా స్టేట్ మూజియంలో ఉన్నాయి. ఈ వందేళ్ళల్లో  కాలం రాపిడికి, సందర్శకుల తాకిడికి అజంతా చిత్రలేఖనాల వన్నె తగ్గిందిగానీ, ఇక్కడి మూజియంలో ఉన్న చిత్రలేఖనాలు మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి. నా దృష్టిలో వాన్ గో చిత్రలేఖనాలకు ఎంత కళాత్మక, చారిత్రిక ప్రాముఖ్యత ఉందో, ఈ ఫ్రెస్కోల నకళ్ళకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. కానీ ఏరీ సందర్శకులు?

నేను ఈ మూజియం సందర్శించిన రెండు సార్లూ కూడా నాతో పాటు నలుగురైదుగురు మాత్రమే కనిపించారు. ఇంత ప్రతిష్ఠాత్మకమైన మూజియంలో ఇవి మాత్రమే కాదు, ఇంతకన్నా విలువైన ఎగ్జిబిట్లు ఉన్నాయి. బుద్ధుడి ధాతు అవశేషాల మీద భారతదేశంలో ఎన్నోచోట్ల చైత్యాలూ, స్తూపాలూ నిర్మించిన సంగతి మనకు తెలుసు. అటువంటి ఒక ధాతు అవశేషాన్ని, బావి కొండ తవ్వకాల్లో బయటపడ్డదాన్ని, ఇక్కడ మూజియంలో ప్రదర్శిస్తున్న సంగతి ఎంతమందికి తెలుసు? బుద్ధుడి ధాతు అవశేషాలు లభ్యమై, భద్రపరిచిన తక్కిన మూజియముల్లో వాటిని ప్రజలు చూడటానికి వీలుగా బయటకి కనిపించేలాగా ప్రదర్శించరు. కానీ ఇక్కడ మూజియంలో, ఆ పవిత్రధాతుశకలాన్ని మనం బయటనుంచి చూడవచ్చునని ఎందరికి తెలుసు?

అంతేనా? భారతదేశంలో లభించిన బౌద్ధ ప్రతిమల్లో, విగ్రహాల్లో అత్యంత ప్రాచీనమైన హారీతి కాంస్య ప్రతిమ కూడా ఇక్కడ ఉందనీ, ఔరంగజేబు స్వయంగా రాసుకున్న ఖురాన్ షరీఫు కాలిగ్రఫీ ప్రతుల్ని ఇక్కడ చూడవచ్చుననీ, దేశం గర్వించదగ్గ చిత్రకారుడు అబ్దుర్ రహ్మాన్ చుగ్తాయి (1897-1975) నీటిరంగుల చిత్రాలు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయనీ ఎంతమందికి తెలుసు? ఇటువంటి మూజియం అమస్టర్ డాంలో ఉండి ఉంటే, ప్రపంచమంతా ఆరునెలల ముందే టికెట్లు కొనుక్కుని మరీ చూడటానికి విరగబడి ఉండేది కద!

పబ్లిక్ గార్డెన్సులో ఉంది కాబట్టి, పక్కనే అసెంబ్లీ ఉంది కాబట్టి, ఈ మూజియం చూడ్డానికి  ఎంతమంది శాసనసభ్యులు వస్తుంటారని అక్కడొకరిని అడిగాను. ఎమ్మెల్యేలెవరూ రారుగాని, వారి అనుచరులేవరేనా ఊళ్ళనుంచి వచ్చినప్పుడు, కాలక్షేపానికి, ఈ మూజియంకి వచ్చిపోతుంటారని విన్నాను. నేను విన్నదాని ప్రకారం గత పదిపదిహేనేళ్ళల్లో ఏ ముఖ్యమంత్రిగానీ లేదా ఏ మంత్రిగానీ, కార్యదర్శిగానీ, ఏ సినిమాతారగానీ, రాష్ట్రానికి అతిథిగా వచ్చిన ఏ విదేశీ ప్రముఖుడుగానీ ఈ ప్రాంగణంలో అడుగుపెట్టలేదు. సమాచార ప్రసార సాధనాల్ని బట్టే మనుషులు తమ అభిప్రాయాల్నీ, అభిరుచినీ ఏర్పరచుకునే ‘నిరక్షరాస్యసమాజం’  మనది కాబట్టి కనీసం ఒక పత్రికాసంపాదకుడుగాని లేదా టెలివిజను ఛానలు అధినేతగానీ ఈ మూజియంను సందర్శించి ఉంటే ప్రజలకి వారిని అనుసరించడానికి తోవదొరికేది.

రాష్ట్ర మూజియం చూడటానికి వెళ్ళినప్పుడే నాకు తెలంగాణా హెరిటేజి మూజియం గురించి తెలిసింది. రాష్ట్ర వారసత్వ సంపద శాఖ వారి కార్యాలయ ప్రాంగణంలో ఉన్న హెరిటేజి మూజియంకి మొన్న జీడిగుంట విజయసారధిగారితో అడుగుపెట్టాను.

ఆబిడ్సు చౌరస్తాకు దగ్గరలో గన్ ఫౌండ్రీలో రోడ్డుమీదనే ఉన్న ఇంత విలువైన వారసత్వ సంపద చూడటానికి మనుషులు బారులు తీరి ఉండాలి కదా! ట్రాఫిక్కును అదుపు చెయ్యడానికి పోలీసులు హంగామా పడుతుండాలి కదా! కాని ఇంత అపురూపమైన మూజియంలో ఆ రోజు సందర్శకులం మేమిద్దరమే. ఆ వారమంతా లెక్కేసినా కూడా మరో ఇద్దరికన్నా ఎక్కువ సందర్శకులు లేరని సందర్శకుల అభిప్రాయాల రిజిస్టరు చెప్తున్నది.

ఈ మూజియంను వారసత్వ సంపదకి చెందిన మూజియంగా పిలవడం సముచితమే. ఎందుకంటే, శ్రీశైలం, ఏలేశ్వరం నీటిపారుదల పథకాల కింద ముంపుకు గురైన ప్రాంతాలకు చెందిన ఎన్నో విలువైన పురావస్తు అవశేషాలను తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారు. మూజియంలో అడుగుపెడుతూనే ఒక ప్రాచీన ద్వారం మనల్ని ఆకర్షిస్తుంది. అది మహబూబ్ నగర్ జిల్లా ప్రాగటూరులోని శ్రీవరదరాజస్వామి దేవాలయ ద్వారం. తొమ్మిది-పది శతాబ్దాలకు చెందిన ఆ చాళుక్య శైలి దేవాలయ ద్వారాన్ని ముంపునుంచి రక్షించి తీసుకొచ్చి ఇక్కడ పునః స్థాపించారు.

ఆ పక్కనే ‘తరతరాల చరిత్ర’ పేరిట, మానవుడి ప్రాగైతిహాసిక కాలం నుంచి పద్ధెనిమిది- పందొమ్మిది శతాబ్దాల దాకా, తెలంగాణా చరిత్రకు చెందిన విలువైన జ్ఞాపికలను భద్రపరిచారు. ఆ మొత్తం గాలరీని ఎంతో శ్రద్ధగా, ఎంతో విలువైన పరిశ్రమతో క్యురేట్ చేసారు. మ్యూజియంలో పనిచేస్తున్న శ్రీనిధి ఆర్కియాలజీలో  పోస్టు గ్రాడ్యుయేషను చేశారు. ఆమె అన్ని గ్యాలరీలు మాకు దగ్గర ఉండి చూపించారు.

తెలంగాణా పబ్లిక్ సర్వీసు కమిషను పరీక్షల్లో తెలంగాణా చరిత్ర, సంస్కృతి అని ఒక పేపరు ఉంటుంది. ఆ పేపరు రాయాలనుకున్న అభ్యర్థులు ఒక వారం రోజుల పాటు ఈ గాలరీ చూస్తే చాలు, ఎన్నో గ్రంథాలు చదివినంత పరిజ్ఞానం లభిస్తుంది. సివిల్ సర్వీసు పరీక్షలకు ప్రిపేరయ్యేవారికి కూడా జనరల్ స్టడీసు పేపరు-1 లో భాగంగా భారతదేశ చరిత్ర, సంస్కృతిల పైన చదువుకోవలసి ఉంటుంది. ఆ అభ్యర్థులు ఈ గాలరీ చూస్తే వారికి తమ అధ్యయనం సులభతరం అవుతుంది. కానీ ఒక్క అభ్యర్థికేనా ఈ విషయం తెలుసా?

కొండాపూరు, పెద్దబంకూరు, ధూళికట్ట, పోచంపాడు, సేరుపల్లి, గొల్లతగుడి, యేలేశ్వరం, కోటిలింగాల, నేలకొండపల్లి మొదలైన చారిత్రిక స్థలాల్లో చేపట్టిన తవ్వకాల్లో దొరికిన టెర్రకోటా, స్టక్కో, ఆకుపచ్చ సున్నపురాయి, పాలరాయి, పంచలోహాలు, దంతపు సామగ్రి, నాణేలు, పూసలు మొదలైన ఎన్నో విలువైన అవశేషాల్ని చారిత్రిక యుగాలవారీగా ప్రదర్శించడం మామూలు పని కాదు. ఆ గ్యాలరీ ని క్యురేటు చేసిన వారెవరో వారి వివరాలు అక్కడ లేవు కానీ వారికి మనం కచ్చితంగా ఋణగ్రస్తులం.

ఆ గాలరీలో ప్రదర్శించబడ్డ శిల్పాల్లో లజ్జాగౌరి శిల్పం కూడా ఉంది. పదేళ్ళ కిందట నేను బాదామి వెళ్ళినప్పుడు ఆ మూజియంవారు తమ దగ్గర మాత్రమే లజ్జాగౌరి శిల్పం ఉందని ప్రకటించుకోవడం గుర్తొచ్చింది. కిందటేడాది అలంపురం వెళ్ళినప్పుడు అక్కడ మూజియంలో లజ్జాగౌరి శిల్పం చూసి వారికి బాదామి మూజియం సంగతి చెప్పి, తాము కూడా తమ దగ్గర ఆ విగ్రహం ఉందని నలుగురికీ చెప్పుకోవచ్చుకదా అని చెప్పాను. ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఈ శిల్పం కనిపించింది. వీళ్ళకీ అదే మాట చెప్పాను.

మూజియం రెండో అంతస్తులో ప్రాగైతిహాసిక సంస్కృతిని ప్రదర్శించే నాలుగు గాలరీలు ఉన్నాయి. నాలుగూ కూడా చాలా విలువైనవి. ఈ రోజు చరిత్రపేరుమీద జరుగుతున్న దుష్ప్రచారాన్నీ, దురభిప్రాయాల్నీ ఖండించడానికి ఒకే ఒక్క మార్గం మనుషులకి చరిత్ర పూర్వయుగం గురించి మరింతగా తెలియచెప్పడమే. ఒక మతం వారి పవిత్రస్థలాన్ని కూలదోసి మరో మతం వారు తమ దేవాలయాల్ని నిర్మించుకున్నారని వాదించేవారంతా తెలుసుకోవలసింది ఏమంటే, ఈ దేశంలో మతాలన్నీ కూడా ఏదో ఒక దశలో, ఏదో ఒక కాలంలో, ప్రాగైతిహాసిక మానవుడి ఆరాధనాస్థలాల్ని కూలదోసి తమ దేవాలయాలు కట్టుకున్నారనే.

ఈ మూజియంలో మెగాలితులపైన ప్రత్యేకంగా ఉన్న గాలరీ మనకి ఎన్నో విధాల కనువిప్పు. అలానే పూర్వకాలంలో, మరణించినవాళ్ళని, ముఖ్యంగా మరణించిన శిశువుల్ని కుండల్లో పెట్టి భూస్థాపితం చేసేవారని కంభంపాటి సత్యనారాయణ పుస్తకాల్లో చదివాను. ఆ sacrophagi  ఎలా ఉంటాయో ఇన్నాళ్ళకు కళ్ళారా చూసాను.

కాబట్టి, చరిత్ర గురించి పుస్తకాల్లో ఎంత చదివినా, ఒక పురావస్తు ప్రదర్శనశాలకి వెళ్ళి చూసినప్పుడు కలిగే మెలకువ దానికదే ప్రత్యేకం.

మూడవ అంతస్తులో గుహాచిత్రాల ఫొటోలతో ఏర్పాటుచేసిన ఒక ప్రదర్శన ఉందిగానీ, ఆ ఫ్లెక్సీలు వానకు తడిసి దాదాపు చివికిపోతూ ఉన్నాయి.

మూజియంలో మరొక విశిష్ట విభాగం లైబ్రరీ. దాదాపు పదిహేనువేల పుస్తకాల గ్రంథాలయంలో దేవాలయ వాస్తు, పురావస్తు శాస్త్రం, చిత్రకళకి సంబంధించిన పుస్తకాలు తమ ప్రత్యేకం అని ఆ లైబ్రేరియను సాంబయ్య చెప్పారు. చిత్రకళకి సంబధించిన ఒకటి రెండు పుస్తకాలు చూసాం. ముఖ్యంగా అజంతా ఫ్రెస్కోల్ని 1915 లోనే చిత్రించిన నలుపు-తెలుపు రేఖాచిత్రాల, వర్ణచిత్రాల పుస్తకాల్ని చూస్తే ఎంతో సంతోషంగా అనిపించింది.

అటువంటి పుస్తకాలు ఆ గ్రంథాలయంలో ఉన్నాయని ఎలా తెలుస్తుంది?

అమెరికాలో ఇటువంటి మూజియాలకీ, చిత్రకళాప్రదర్శనలకీ ఎంత ఆదరణ ఉంటుందో స్వయంగా చూసిన విజయసారథిగారు ఆ మూజియంలో తిరుగుతున్నంతసేపూ దిగులు పడుతూనే ఉన్నారు. ఏం చేస్తే మన ప్రజలకి ఇటువంటి విలువైన వారసత్వసంపద పైన దృష్టి మళ్ళుతుంది? ఒక మాల్ కో, మల్టీప్లెక్సుకో పిల్లల్ని తీసుకువెళ్ళడంలో సంతోషాన్ని పొందుతున్న మన కుటుంబాలకి తమ పిల్లలని ముందు ఇటువంటి మూజియంలకు తీసుకురావడం అత్యవసరమని ఎప్పుడు తెలుస్తుంది? ఇవే ఆయన నన్ను పదే పదే అడుగుతున్న ప్రశ్నలు.

25-9-2025

20 Replies to “తెలంగాణా హెరిటేజి మూజియం”

  1. నిజం సార్, మనది నిరక్షరాస్యసామ్రాజ్యం.
    ఆ పదం ఎంత బాగుందో!
    నా లాంటి నిరక్షరాస్యులు ఎందరో!

    1. మీ స్పందనకు ధన్యవాదాలు జగదీష్! అయితే మీబోటి రచయితలే ఈ నిరక్షరాస్య సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్ళవలసిన వారు.

  2. చాలా అవసరమైన విషయం ముందుకు తెచ్చారు!
    అందరం రాయాలి, మాట్లాడాలి, అడగాలి — ఇలాంటి విషయాలు.

      1. ధన్యవాదాలు. నేను పాట్నాలో ప్రత్యేకించి గాంధీ మ్యూజియం చూశాను. అప్పటికి నాకు ఆ కొద్దిపాటి సమయమే ఉంది. ఈసారి వెళ్ళినప్పుడు తక్కిన మ్యూజియంలు కూడా చూస్తాను.

  3. Nice writeup on Museums.
    I will visit our Hyderabad Heritage Museum sometime. Thanks for sharing the information.
    It is true that many museums in America and Europe are well designed and attracting millions of visitors annually. They know how to popularise their culture and make museums generate money as well.
    I have visited some of the best museums in the world. I will this Hyderabad museum too.
    Regards.
    🙏

  4. sailajamitra – Hyderabad – I am a poet, writer and journalist residing at hyderabad. I was born in chinnagottigallu, chittoor dist on jan 15th. My qualifications are MA..PGDCJ ( In journalism).In all my 18 years of penchant writing, I launched 5 poetry books, one shortstory book and five english translated books on my own.
    sailajamithra says:

    ఒక పర్యటన వర్ణనలా మొదలై చివరికి మన సమాజపు సంస్కృతి దృష్టికోణంపై ఆత్మపరిశీలనలా మారింది. వాన్ గో మ్యూజియం ముందు నెలల తరబడి టిక్కెట్లు దొరకవు, కానీ మన తెలంగాణా మ్యూజియాలు వెలవెలబోతున్నాయి అనే వ్యత్యాసాన్ని మీరు బలంగా ఉంచారు. అజంతా చిత్రాల నకళ్ళ నుంచి బౌద్ధ ధాతు అవశేషాలు, హారీతి విగ్రహం, చుగ్తాయి చిత్రాలు, లజ్జాగౌరి శిల్పం వరకు ఎన్నో విలువైన నిధులు మన దగ్గర ఉన్నా వాటికి సరైన గుర్తింపు లేదని తేటతెల్లం చేసారు.
    నాయకులు, మంత్రులు, ప్రముఖులు అడుగుపెట్టని ఈ ప్రాంగణం ప్రజల దృష్టికి కూడా అందకుండా పోయిందని చెప్పిన తీరు ఆవేదన కలిగించేలా ఉంది. అంతేకాక, “తరతరాల చరిత్ర” గ్యాలరీని విద్యార్థులకు పుస్తకాలకన్నా విలువైన పాఠశాలగా చూపడం మీ ఆలోచనలోని ప్రాయోజనాత్మకతను తెలియజేస్తుంది. అమెరికా, యూరప్ మ్యూజియాల హడావిడిని చూసినవారు ఇక్కడి నిర్లక్ష్యం చూసి దిగులు పడతారనడం అసలు సమస్య గుండెబట్టే తాకుతుంది.
    మొత్తం మీద మీరు రాసినది గర్వం, బాధ, ఆశ అన్నీ కలగలిపిన మనసారా రాసిన గమనిక. ఇది చదివిన ప్రతి ఒక్కరికీ “మనకున్న నిధులపై మనమే విలువ ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు?” అనే ప్రశ్నను తలపెడుతుంది.

    1. ఎంతో హృద్యమైన మీ ప్రతిస్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు.

  5. కళ్ళకు కట్టినట్టు చూపించారు మ్యూజియం విశేషాలు. విశాదం ఏమిటంటే నేనూ చూడలేదు. అసలు ఇలాటి మ్యూజియం ఉందని కూడా తెలియదు. అమరావతిలో, నాగార్జునసాగర్ లో, ఆఖరుకు చంద్రగిరిలో కూడా అద్భుతమైన అవశేషాలు చూశాను. మదురైలో గాంధీ మ్యూజియం ఒకటుంది. ఆయన్ను పిస్టల్ తో కాల్చినప్పుడు పైన వున్న రక్తపు మారకతో, బుల్లెట్ రoధ్రంతో వున్న వస్త్రాన్ని చూశాను. మీరన్నట్లు పాలకులకు ఆసక్తి లేకపోతే, ప్రజలకు తెలిసే అవకాశం తక్కువ. నేను విజయవాడ లో ఉండేటప్పుడు మొగల్రాజపురం లో ఉండేవాడిని. మా ఇంటి దగ్గరలోనే రెండు గుట్టలు, వాటిలో గుహలు వుండేవి. అందులో శిల్పాలు ఉన్నాయని అనేవారు. అయితే అవి ఎప్పుడూ తాలాలు వేసివుండేవి. జులాయి వెధవలు ఆ లోపల చేరి వారి కాలక్షేపం చేసేవారు. అలా వుంటే ఎవరు వెళ్తారు? వుండేది ఒక్క ఆదివారం సెలవు. ఆరోజున పరిస్థితి ఇలా వుండేది. ఇది 20 ఏళ్ళనాటి మాట. ఇప్పుడు తీర్చిదిద్దేరని, కొద్దిగా సందర్శకులు వస్తున్నారని విన్నాను.

    1. మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు.

  6. నేత్రోన్మీలన పరిచాయికతో అద్భుతమైన వారసత్వ సంపదను కన్నులకు కట్టారు. ఫ్లెక్సీగా అచ్చువేసి పటం కట్టి గన్ ఫౌండ్రీ రహదారిపై ‘ఇదే దారి’ అని మార్గసూచికతో నిలబెట్టవలసిన వ్యాసం.

    ఈ వారమే తప్పక సకుటుంబంగా దర్శిస్తాము – మీకు ధన్యవాదాలతో.

    1. మీ వంటి పెద్దలు ఈ రచన చదివి స్పందించడం నా భాగ్యం.

  7. ఆ కళాఖండాల వివరాలు మీ నోటివెంట తెలుసుకోవడంలో ఉన్న సంతోషం.. అయ్యో అవి ఎలాంటి గుర్తింపుకీ నోచుకోవడం లేదే (వాటిని విజ్ఞానం కోసమో, వికాసం కోసమో ఉపయోగపెట్టుకోలేకపోతిమే అనే బాధ..

    1. శ్రీధర్ గారూ! బాగున్నారా! చాలాకాలం తర్వాత!

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%