
గంటేడ గౌరునాయుడు నాకు 1987 లో పరిచయమయాడు. ఆయన అప్పుడు టిక్కబాయి ఆశ్రమ పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేస్తుండేవాడు. కురుపాం నుంచి గుమ్మలక్ష్మీపురం వెళ్ళే దారిలో టిక్కబాయి ఒక మలుపు. అక్కణ్ణుంచి ఒక దారి కొండల్లోకి వెళ్తుంది. మరోదారి గుమ్మలక్ష్మీపురానికి వెళ్తుంది. కాబట్టి పార్వతీపురంలో పనిచేయడానికి వెళ్ళిన ఏ అధికారికైనా లేదా ఆ ప్రాంతాల్ని చూడాలనుకున్న ఏ సందర్శకుడికైనా అడవి టిక్కబాయి దగ్గరే ఎదురై స్వాగతం చెప్తుంది. అటువంటి అడవిబాటన ఆ ఉపాధ్యాయుడు ఆ ఆశ్రమపాఠశాలని ఎప్పుడూ తన పాటల్తో, మాటల్తో వెలిగిస్తూ ఉండేవాడు. పగలంతా గుమ్మలక్ష్మిపురం గిరిజన గ్రామాల్లో తిరిగి నేను సాయంకాలం పార్వతీపురం వెళ్ళేటప్పుడు చాలా సార్లు ఆ సంధ్యవేళ గౌరునాయుడు తన ఆశ్రమపాఠశాల పిల్లల్ని ఆరుబయట చెట్లకింద కూచోబెట్టి వాళ్ళకు పాటలూ, పద్యాలూ నేర్పే దృశ్యాలు ఎన్నో సార్లు చూసాను. మాఘమాసపు రోజుల్లో కొండలమీంచి ఇప్పపూల గాలి ఆ స్కూలు మీంచి వీస్తూ ఉండగా ఆ దారిన నేనెన్నోమార్లు ప్రయాణించేను. గౌరునాయుణ్ణి తలుచుకున్నప్పుడల్లా మాఘమాసపు ఇప్పపూలగాలి నన్ను ముంచెత్తినట్టు అనిపిస్తుంది. కాబట్టే ఆయన్ని ‘పాటపాడే ఇప్పచెట్టు’ అని అభివర్ణించాను ఒక కవితలో. నేను పార్వతీపురం నుంచి వచ్చేసిన తరువాత, గౌరునాయుడు ఒక శక్తిమంతుడైన రచయితగా ఎదగడం, చూస్తూనే ఉన్నాను. ఆయన పాటలు, కవితలు, కథలు, వ్యాసాలు- ఈ రోజు కళింగాంధ్రకి ప్రాతినిధ్యం వహిస్తున్న unacknowledged legislators లో ఆయన కూడా ఒకడు. ఈ రోజు ఫేస్ బుక్కులో ఆయన పోస్టు చేసిన ఈ వాక్యాలు చూడగానే నన్ను ముందు ఆ రోజులు, ఆ గాలులు, ఆ కాంతులు చుట్టబెట్టాయి. అందుకని ఈ వాక్యాల్ని మీతో పంచుకోలేకుండా ఉండలేకపోతున్నాను.
ఋషి వాక్యానికి వందనం
గంటేడ గౌరునాయుడు
ఒక కవిత నీకోసం దిగివచ్చేటప్పుడు ఆకాశంలో
కిరణాలు మరింత వన్నెతేరతాయి. నదుల్లో
జలాలుమరింత తేటపడతాయి, గోదావరివొడ్డున
రసజ్ఞులకొకపూర్వపద్యంలో కొత్త అర్థం స్ఫురిస్తుంది
కవితాదేవత దర్శనం కావడమంటే ఇదేకదా! కవితా దేవత దర్శనమైన ఋషికి పూర్వపద్యంలో కొత్తర్థం స్ఫరించడం విశేషమేమీ కాదు.
గోవును సేవించినట్టుగా
వాక్కును సేవించాలి
గోచరజీవితాన్ని
క్షీరంగా మార్చుకోవాలి
అంటున్న కవి ‘వాక్కును సేవించిన వాడు’ అని మరోమారు చెప్పనక్కర్లేదు.
నడుస్తున్న ప్రతిక్షణాన్ని ఒక్క గుక్కగా నొల్లుకుని ఇంటికి చేరిన ఒక్కొక్కటీ నెమరేసుకుంటాడు. ఇది బయటకు కనిపించినంత తేలికేమీ కాదని నాకు తలుసు. అనుభవాలన్నీ రక్తాస్థిగతమయ్యాక ఒళ్ళంతా పాలుగారతాయట. గోవును సేవించినట్టు వాక్యాన్ని సేవించిన వారినుంచి మాత్రమే ఊహించ గలం ఇలాటి వాక్యాల్ని.
మానసిక శారీరక శక్తి కలిగిన ఆరోగ్యవంతులే కవితను కూర్చగలరని నమ్మిన వాడు కాబట్టే , రైతులపట్ల అచంచలమైన ప్రేమ గలవాడు కాబట్టే ఈ కవి ‘కవిత్వ నిర్మాణం రైతు చేసే వ్యవసాయం పనులవంటిది’ అంటాడు. ఈ మాటలు చూసారా!
రాత్రంతా పొలాల్లో ఎదిగే పైర్లకు
నీరు పారిస్తారు చూడు..
కొనదేలిన వాళ్ళ భుజాలు రసాలూరే
పండ్లలాగా చమటలు స్రవించే కండలు
ఎంత గొప్ప పోలిక . ఈ కవి మరో చోట ఒక కవితలో (ప్రవాసం ఒక యుద్ధరహస్యం) అంటాడు:
“ప్రేమించడమంటే కోతకెదిగిన పంటను కాపు కాచుకునే ఏరైతునడిగినా చెబుతాడు’ అని రైతుపట్ల, శ్రమ పట్ల గల తన ప్రేమని ప్రకటిస్తాడు.
వెన్నెలని ప్రేమించే వాళ్ళు, పిల్లల్ని ప్రేమించే వాళ్ళు,
వేడుకలాగా జీవితం గడపగలిగే వాళ్ళంతా ఒకపక్క,
కేవలం డబ్బును ఆరాధించేవాళ్ళొకపక్క…
నిజమే! డబ్బును ప్రేమించేవాళ్ళు రసాత్మక వాక్యాన్ని ప్రేమించ లేరని చెప్పకనే చెబుతున్న ఈ కవి వాక్కుకు నమస్కరించకుండా ఉండగలమా!
ఓల్గా నుండి కాంగో దాకా, వేదాన్నీ,
వాల్ట్ విట్మన్ నీ కలిపి చదువుకుంటూ
మా ఊరి చాపరాయి నుంచి మచ్చుపిచ్చు దాకా
ఇంటికీ ప్రపంచానికీ వంతెన కడుతున్న-
కవి ఆ వంతెన మీదుగా ప్రతిరోజూ ఉదయమే మనల్ని నడిపించి ఆయా అందాల్ని అనుభవాల్ని మనవిగా చేస్తున్నాడు. ఇది ఒక ఋషి వంటి మానవుడికి మాత్రమే సాధ్యం కదా..అందుకే ఆ ఋషి వాక్యానికి నమస్కరిస్తున్నాను.
… నాకిప్పుడు
ముతకమాటలు కావాలి, అప్పుడే గనిలోంచి తవ్వితీసిన
లోహసదృశ శబ్దాలు కావాలి. పట్టకుంటే చేతుల్లో పాలుకారాలి
అంటున్న కవి గొంతులో నగరం పట్ల విసుగు మనది కూడా కదా!
‘ఈ నగరభాషలు చేతికి చిక్కేవి కావు. పాలిష్ చేసి ప్లాష్టిక్ తొడుగు తొడిగిన జెల్లీ జిడ్డు’ ను ఎలా వొదిలించుకోగలం? ఆ జిడ్డు వొదిలించు కోవాలంటే స్వచ్ఛ గంగాజలం లాటి కవితావాక్యాలతోనే సాధ్యం.
ఆ నిర్మల నీటిప్రవాహాల్లాటి వాక్యాలకి నమస్కారం.
తలుపు మూసివుంటే ఎదురు చూసే అతిథి వెనుదిరిగిపోతాడని తలుపులు తెరుచుకుని కూర్చుంటే రావలసిన అతిథి తప్ప తక్కిన వాళ్ళందరూ చొరబడతారని తక్కిన వాళ్ళను చొరబడకుండా అతిథికోసం ఎదురు చూడ్డం లాటిదట కవితా సాక్షాత్కారం కోసం కనిపెట్టుకుని కూర్చోవడం.
అలా ఎదురు చూసి కవితాసాక్షాత్కారం పొందిన ఈ కవికి నమస్కరించకుండా ఉండగలమా?!
ఈ కవి కవితల్లో సామాజిక స్పర్శ సూక్ష్మంగా వ్యక్తమౌతుంది..అదెలాగంటే ఒక సైంటిస్టులో సామాజికత లేబొరేటరీకి పరిమితం కావడం లాటిది, ఉద్యమసాహిత్యంలో సామాజికత స్థూలంగా వ్యక్తమవుతుంది అదెలాగంటే టెక్నీషియన్ సైన్టిష్టు సూత్రాల్ని పరికరాలుగా మార్చి ఇవ్వడం లాటిది. అంత మాత్రాన టెక్నీషియన్ సైంటిస్ట్ కంటే ఎక్కువ సామాజికుడిగా భావించలేం. సామజిక స్పృహకి సంబందించి ఈ కవి చేసిన విశ్లేషణ కాదనలేనిది.
తెలుగు విమర్శలు తననొక సామాజిక స్పర్శ (స్పృహ అనాలనిపించట్లేదు) గల కవిగా గుర్తించడం లేదనే భావన ఈ కవికి ఏమూలనో కొంత వేదనకు గురి చేసినట్లనిపిస్తుంది. కానీ ఈ కవిలో సామాజికత సైంటిస్ట్లో సామాజికతలాగా సూక్ష్మంగా వ్యక్తమవుతుంది తన కవిత్వమంతటా.
కవి సందర్శిస్తున్న దేవుడు ఒక మూర్తి కాదు. ఒక స్ఫురణ, ఒక ఉనికి, ఒక మెలకువ, కానీ విమర్శకులు తనని భక్తకవిగా ముద్రవేయలేకపోడానికి కారణం తాను భగవంతుడిని ఒక మెలకువగా సమీపించడం వల్లనే. (ఈయనెంత సామాజికుడో ‘సుజాత’, ‘ప్రశ్నభూమి’ వంటి కొన్ని కథలు స్పష్టం చేస్తాయి)
గొప్ప కవిత విన్నప్పుడు లేదా చదివినప్పుడు గొప్ప ప్రేమానుభవం లాగానే మన మనశ్శరీరాలు ఏకమైపోతాయి. అటువంటి గొప్ప కావ్యానుభవాన్ని అందజేస్తున్న ఋషి వాక్యాలకు ఆ ఋషికి వందనం చేస్తున్నాను.
‘నానృషికురుతే కావ్యం?’ ఋషికానివాడు కావ్యం నిర్మించలేడు. ఋషి అంటే ముని, సన్యాసి, పరివ్రాజకుడు, కాదంటాడీకవి. ‘స్వాతంత్ర్యం తన సహస్ర బంధనాలతో నన్నాలింగనం చేసుకుంటుంది’ అన్న టాగోర్ ని ‘ఋషి’ అంటున్న కవి అభిప్రాయంతో ఏకీభవించకుండా ఉండగలమా?
‘ఒక ఉన్మత్త భ్రమరం తన హృదయంలో సంచరిస్తున్నప్పటికీ తాను నిశ్చల పద్మంలాగా’ నిలబడగలిగిన వాడే ‘యోగి’ అని జీవితం లోని ప్రతి సంవేదనకూ సంచలిస్తూనే నిశ్చలంగా నిలబడగల మనస్థితికోసం పడే ఆరాటమే తన కవిత్వం..అందుకే కవి చినవీరభద్రుడు ఒక ఋషి అనడానికి నాకు ఎటువంటి సందేహమూ లేదు. ఆ ఋషికి, ఆ ఋషి వాక్యాలకి నమస్కరిస్తున్నాను.
(ఎప్పుడు రాసేనో గానీ ఉదయం పాత కాగితాల దొంతరలో దొరికింది)
నీటిరంగుల చిత్రం మీద క్లిక్కు చేసి ఈ-బుక్ డౌనులోడు చేసుకోవచ్చు.
13-7-2025
ఈ వ్యాసంలో రచయిత చినవీరభద్రుడిని కేవలం కవిగా కాక, ఒక ఋషిగా, వాక్యాన్ని సేవించే యోగిగా గౌరినాయుడు గారు దర్శించారు . కవిత్వాన్ని వ్యవసాయంతో పోల్చుతూ, శ్రమ, ప్రేమ, అనుభవం ద్వారా మెదడులో కాక మనసులో పుట్టే ప్రక్రియగా వివరిస్తారు. ‘వాక్యాన్ని గోవుగా సేవించాలి’ అనే భావన ద్వారా భాష పట్ల ఉన్న భక్తిని తెలియజేస్తారు. నగర భాషల తక్కువతనాన్ని, పాలిష్ చేసిన శబ్దాల నిర్జీవతను విమర్శిస్తూ, కవిత్వాన్ని స్వచ్ఛమైన గంగాజలం లాంటి సజీవ అనుభూతిగా కోరుకుంటారు. సామాజిక స్పృహను ఉద్యమ సాహిత్యం లాగా ఘర్షణాత్మకంగా కాక, శాస్త్రీయంగా, సూక్ష్మంగా వ్యక్తీకరిస్తూ ఒక సైంటిస్టు వంటి దృక్కోణాన్ని చూపుతారు. భగవంతుడిని మూర్తిగా కాదు, ఒక మెలకువగా చూసే ఈ కవిలో భక్తి కూడా అన్వేషణగా మారుతుంది. ‘ఋషికానివాడు కావ్యాన్ని రచించలేడు’ అన్న భావనకు అనుగుణంగా, జీవితం మీద సంపూర్ణ తేజస్సుతో స్పందించే మనస్థితిని ఈ కవి వ్యక్తీకరిస్తారు. కవిత్వాన్ని అనుభవంతో జీవింపజేస్తూ, వాక్యాల వంతెనపై మనల్ని నడిపించే ఈ ఋషికి రచయిత నమస్కరిస్తారు. మొత్తానికి విశ్లేషణ బావుంది. దాచుకోదగినది .
హృదయపూర్వక ధన్యవాదాలు శైలజ గారూ! చాలా చాలా సంతోషం.