సచ్చిదానందమూర్తి-1

ఆ రోజు పొద్దున్నే విజయవాడనుంచి తెనాలి వెళ్ళే దారి పొడుగునా వర్షం పడుతూనే ఉంది. భాద్రపదమాసపు చివరిరోజులు రాగానే వానలు వెనకబట్టి ఆకాశంలో దూదిపింజల్లాగా తెల్లటి మబ్బులు తేలియాడాలి. నదీతీరం పొడుగునా, వాగులమ్మటా, వంకలమ్మటా, చెరువుల్లోనూ, దొరువుల్లోనూ రెల్లు విరబూయాలి. కాలంకాని కాలంలో ఉన్నాం. వర్షఋతువు నడిచినంతకాలం ఎండలు కాసి తీరా ఇప్పుడు వానలు మొదలయ్యాయి.

దారి పొడుగునా ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తిగారి గురించే ఆలోచిస్తూ ఉన్నాను. ఆ ఉదయం తెనాలిలో వివేకా విద్యాసంస్థల సెంట్రల్ స్కూల్లో ఆచార్య సచ్చిదానందమూర్తిగారి శతజయంతి సభలో నన్ను మాట్లాడమని పిలిచారు. డా.మూర్తి రాసిన Vedic Hermeneutics (1993) అనే పుస్తకం చదివినప్పుడు నాకు కలిగిన సంతోషాన్ని అణచుకోలేక ఆ పుస్తకాన్ని ‘వేదార్థ మీమాంస'(2011) పేరిట తెలుగు చేసాను. ఆచార్య రఘురామరాజు ఆ అనువాదాన్ని ‘పొరుగునుంచి తెలుగులోకి’ సిరీస్ లో పుస్తకంగా తీసుకొచ్చారు. ప్రతిఫలం మీద దృష్టిలేకుండా చేసిన ఆ పనికి ఇన్నేళ్ళ తరువాత ఫలితం కనిపించింది. లేకపోతే, తత్త్వశాస్త్ర ఆచార్యులెందరో ఉండగా, ఆచార్య మూర్తిగారి శతజయంతి సభలు నా ప్రసంగంతో మొదలుకావడమేమిటి!

ఆచార్య సచ్చిదానందమూర్తి (1924-2011) తెలుగువాళ్ళు గర్వించదగ్గ తాత్త్వికుడు, తత్త్వశాస్త్ర ఆచార్యుడు అని చెప్పడం అందరూ చెప్తారు గాని, ఆయన ఏమి రాసారు, ఆయన జీవితకాల సాధన తాలూకు ప్రధాన సందేశం ఏమిటి అన్నదాని గురించి చెప్పేవాళ్ళెవ్వరు? పాశ్చాత్యదేశాల్లో బెర్గ్ సన్ నుండి డెరిడా దాకా ఒక తత్త్వవేత్త ప్రసంగించడానికి వస్తే సమావేశమందిరాలు కిక్కిరిసిపోతాయి. కాని మన కాలంలోనే ఒక మహోపాధ్యాయుడు ప్రపంచం నలుమూలలనుంచీ గౌరవం పొందినవాడు పుట్టి వందేళ్ళు గడిచాయంటే ఎందుకని ఒక స్తబ్ధత తప్ప ఉద్వేగం కనరావడం లేదు?

ఇటువంటి విషయాల్లో ప్రజల కన్నా  ముందు విద్యాధికులూ, సమాచార ప్రసారసాధనాలూ కదా స్పందించవలసింది! కాని ఆచార్య మూర్తి జీవితకాలం పాటు ఏమి అన్వేషించారో, దేన్ని కనుగొన్నారో, తాను దర్శిస్తూ వచ్చింది దేన్ని మనతో పంచుకున్నారో వాళ్ళకి తెలిస్తే కదా ప్రజలకు తెలిసేది! నిజంగానే కాలంకాని కాలంలో ఉన్నాం మనం అనిపించింది.

కానీ ఆ ఉదయం వివేకానంద విద్యాసంస్థల అధిపతి రావిపాటి వీరనారాయణరావు గారి ఆధ్వర్యంలో సచ్చిదానందమూర్తిగారి శతజయంతి సభ జరిగాక నా భావోద్వేగానికి కొంత ఉపశమనం లభించింది. మొదటిది, ఆయన ఆ సభ, స్కూల్లో, పిల్లలమధ్య జరపడం. రెండోది, సచ్చిదానందమూర్తి గారి కుమారుడు కృష్ణగారితో పాటు, గుజ్జర్లమూడి కృపాచారి, డా.దక్షిణామూర్తి, కె. రామరాజులు పాల్గొన్న ఆ సభలో సచ్చిదానందమూర్తిగారి పైన రాసిన పిల్లలకోసం బి.ఎల్. నారాయణగారు రాసిన పుస్తకం ఆవిష్కరించే అవకాశం నాకు లభించింది. మూడోది, ఒకప్పుడు తాడికొండ గురుకులపాఠశాలలో మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు నాగళ్ళ వెంకట రత్నంగారు ఆ సభకి రావడమే కాక, నా ప్రసంగం ఆద్యంతం వినడం కూడా.

2

సత్యం గురించి మానవుడు చేసే అన్వేషణ ప్రధానంగా రెండురూపాల్లో వ్యక్తమవుతూ వచ్చింది. ఒకటి, విశ్వాసం. అంటే సత్యం భగవంతుడు మాత్రమేననీ, తక్కిన దృశ్యప్రపంచమంతా నశ్వరమనీ పవిత్రగ్రంథాలు చెప్తూ వచ్చిన విషయాలు. వాటిని విశ్వసించడం ముఖ్యమంటుంది మతం. మతగ్రంథాల్లోని వాక్యాలు దేవుడు ప్రవక్తలకీ, ఋషులకీ అందిన revelation అనీ వాటిని విధేయంగా విశ్వసించడమే మన కర్తవ్యమనీ భావించడం ఒక మార్గం. రెండోది, ఆ గ్రంథాల్నీ, ఆ సత్యాల్నీ గుడ్డిగా నమ్మకుండా, ప్రశ్నిస్తో, వాటిని ఎప్పటికప్పుడు నిగ్గుతేల్చుకుంటో, వస్తుగత సత్యాన్ని ప్రయోగపద్ధతిలో ఎప్పటికప్పుడు కనుక్కుంటూ, నిరూపించుకుంటూ ఉండాలని చెప్తుంది సైన్సు. మతగ్రంథాలు చెప్పే సత్యం ఏ మతానికి ఆ మతానికి మాత్రమే లభించిన revelation కాగా, తాను చెప్పేది objectively verifiable truth అని సైన్సు చెప్పుకుంటూ ఉంటుంది.

సైన్సు దృష్టిలో శాశ్వత సత్యాలూ, నిశ్చల సత్యాలూ ఉండవు. ప్రశ్నించడం, ప్రయోగపద్ధతిద్వారా పరీక్షించి సూత్రాలు రాబట్టడం సైంటిఫిక్ మెథడ్. కానీ శాస్త్రీయ వివేచన ద్వారా మాత్రమే మనం సత్యాన్ని తెలుసుకోగలమనీ, తక్కిన ఏ మార్గాలూ సత్యానికి చేరువగా తీసుకుపోలేవనీ వాదించడం మొదలుపెట్టాక సైన్సు సైంటిజంగా మారుతుంది. ఉదాహరణకి సైన్సు ఇంట్యూషన్ ని నమ్మదు. కాని చాలా సైంటిఫిక్ ఆవిష్కరణలు ఒకటి కనుక్కోబోతే మరొకటి బయటపడటం కూడా సైన్సు చరిత్రలో అరుదు కాదు. కాని దాన్ని సైన్సు సెరెండిపిటి అంటుంది. అలాగే, ఎంత శాస్త్రీయ పద్ధతిలో విచారణ చేపట్టినప్పటికీ, విషయాన్ని పరిశీలించే ఒక ద్రష్ట, తాను చూసినదాన్ని మనకు తన భాషలో నివేదిస్తున్నంతకాలం సైన్సు కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్ కాలేదని గుర్తుపెట్టుకోవాలి.

అయితే గమనించవలసిందేమంటే, ఈ రెండింటిలోనూ, అంటే సైన్సులోనూ, మతంలోనూ కూడా, మనిషి స్వీయానుభవానికీ, స్వీయానుభూతికీ చోటు లేదు. కానీ సత్యంగానీ, దేవుడుగానీ ఏ మనిషికైనా ముందు స్వీయసత్యంగా ఎరుకపడాలి. స్వీయం అని అంటున్నప్పుడు, ఎవరి ఉనికి మాత్రమే వారికి ధ్రువపడే మొట్టమొదటి సత్యమైనప్పుడు, ఆ తమదైన ఉనికి గురించి మాట్లాడే ఒక విచారణ కూడా మనిషికి అవసరమయ్యింది. అది అటు మతమూ కాదు, ఇటు సైన్సూ కాదు. ఆ మధ్యస్థంగా ఉండేది. దాన్నే తత్త్వచింతన అన్నారు.

తత్త్వం అనేది సంస్కృత పదం. తత్ అంటే అది, త్వమ్ అంటే నువ్వు. ‘అది నువ్వే’, ‘తత్త్వమసి’ అని చెప్పే దర్శనాన్ని తత్త్వం అనీ, దాని గురించి ఆలోచించడాన్ని తత్త్వశాస్త్రం అనీ అన్నారు. యూరోపులో దాన్ని ఫిలాసఫీ అన్నారు. అంటే జ్ఞానం పట్ల ప్రేమ. అది పూర్తిగా గ్రీకు పదం. సత్యం గురించిన ప్రసంగం, దాని గురించి ఒప్పించడం, బాగా మాట్లాడటం అదంతా సోఫిస్ట్రీ. వాక్చాతుర్యం. కాని ఫిలాసఫీ ముందు నువ్వే ఆ సత్యానివి కమ్మంటుంది. దాన్ని నీ జీవితంలో అనుష్టించుకొమ్మంటుంది. దానికోసం తక్కిన అన్ని ప్రలోభాల్నీ పక్కనపెట్టెయ్యమంటుంది.

కాని గత మూడువేల ఏళ్ళుగా, గ్రీసులో, చైనాలో, భారతదేశంలో, తత్త్వశాస్త్రం, ఫిలాసఫీ, దర్శనం వంటి వాటిని అనుసరించేవాళ్ళు మళ్ళా రెండుగా చీలిపోయారు. ఒకరు, తాము నమ్మిన సత్యాల్ని తమ జీవితంలో పరీక్షకు పెట్టుకుని అందుకోసం ఎటువంటి మూల్యం చెల్లించడానికైనా వెనకాడక, తమకీ, తమ చుట్టూ ఉన్నవాళ్ళకీ వెలుగైన వాళ్ళు. మరొకరు, తాము చదివినదాన్నీ, ఆలోచిస్తున్నదాన్నీ సుస్పష్టంగా వివరించడం, చర్చించడం ప్రధానంగా పెట్టుకున్నవాళ్ళు. ఈ రెండో తరహా పండితులకి, తాము కనుగొంటున్న సత్యాల్ని తమ జీవితంలో అనుష్టించడం, లేదా వాటికి తగ్గట్టుగా తమ జీవితాలు జీవించడం ముఖ్యం కాదు. తమ జీవితాల్లో, తమ ఆచరణలో తాము ఎలా ఉన్నామన్నదానితో నిమిత్తం లేకుండా, తమ వాక్యాల్లోనూ, ప్రతిపాదనల్లోనూ, సత్యనిష్కర్షలోనూ మాత్రం రాజీ పడకూడదనుకుంటారు. నేడు ప్రపంచమంతా విశ్వవిద్యాలయాల్లో కనవచ్చే చాలామంది తత్త్వశాస్త్ర ఆచార్యులు ఈ రెండో కోవకి చెందినవారు.

సచ్చిదానందమూర్తి తత్త్వశాస్త్ర ఆచార్యుడు. జీవితకాలంపాటు విశ్వవిద్యాలయాల్లో తత్త్వశాస్త్రం బోధిస్తో ఉన్నారు. కాని ఆయన ఉద్యోగజీవితంలో ఉన్నప్పుడూ, ఉద్యోగ విరమణ తర్వాతా, మరీ ముఖ్యంగా తన చివరి సంవత్సరాల్లో మొదటి తరహా తాత్వికుడిగా జీవించారు. ఆయనలో అన్నిటికన్నా విశిష్టమైన అంశం అదే.

తన అస్తిత్వం గురించీ, ఈ ప్రపంచం గురించీ అసలు సత్యం ఏమై ఉంటుంది, అది తనకి ఎరుకలోకి ఎలా వస్తుంది, ఆ ఎరుకను తిరిగి తాను తనచుట్టూ ఉన్నవారితో ఎలా పంచుకోగలను అన్నదే ఆయన జీవితకాలం పాటు చేసిన అన్వేషణ. కాని ఈ వెతుకులాటలో సచ్చిదానందమూర్తి ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ఎక్కడా మతగ్రంథాల్ని పక్కన పెట్టలేదు, సైన్సుని నిర్లక్ష్యం చెయ్యలేదు. అలాగని ఏ మతానికీ లేదా మతాలు చెప్తున్న సత్యాలకీ గుడ్డివిధేయుడిగా జీవించలేదు, లేదా సైంటిఫిక్ మెథడ్ మాత్రమే సత్యానికి చేరువగా తీసుకుపోగలదనీ నమ్మలేదు.

అందుకని ఆయన చింతనలోనూ, రచనల్లోనూ మనల్ని అన్నిటికన్నా ముందు ఆకట్టుకునే అంశం అపారమైన చింతనాస్వాతంత్య్రం. ఆ స్వాతంత్య్రం ఆయన జీవలక్షణం అనుకోవాలి. కాని తన స్వాతంత్య్రాన్ని కాపాడుకోడానికి ఆయన విస్తృతంగా అధ్యయనం చేస్తూ వచ్చారు. ఒకవైపు హిందూ, బౌద్ధ, జైన మతగ్రంథాలు మాత్రమేకాదు, మరొకవైపు క్రైస్తవ, మహ్మదీయ, దూరప్రాచ్య గ్రంథాలు కూడా ఆయన ఎంత చదవగలరో అంతా చదివారు. వాటితో పాటు, పాశ్చాత్య తత్త్వశాస్త్ర సంప్రదాయానికి చెందిన ప్రసిద్ధ తత్త్వవేత్తల ఆలోచనాధోరణుల్ని నేరుగా అధ్యయనం చేసారు. కానీ అక్కడితో ఆగకుండా ఫిజిక్సు, సైకాలజీ, యాంత్రొపాలజీల్ని కూడా అధ్యయనం చెయ్యడం ఆయన ప్రత్యేకత. మరీ ముఖ్యంగా మ్యూక్లియర్ ఫిజిక్స్, లింగ్విస్టిక్ అనాలసిస్, కల్చరల్ యాంత్రొపాలజీ లలో ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న కొత్త ఆలోచనల్ని అందుకుంటూ, చదివినదాంతో, తన ఆలోచనని సమన్వయపరుచుకుంటూ, తాను దర్శిస్తున్నదానికి అనుగుణంగా తన దైనందిన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ గడిపేడు ఆయన. ఇరవై, ఇరవై ఒకటవ శతాబ్దాల్లో ఒక మనిషి తత్త్వశాస్త్రం చదివి ఏమి చెయ్యగలడో, ఏమి చెయ్యవచ్చునో సచ్చిదానందమూర్తి తన జీవితం ఒక ఉదాహరణగా నిరూపించారని చెప్పవచ్చు.

Conformity తత్త్వశాస్త్రపు ప్రధాన శత్రువు. ఒకవిధంగా చెప్పాలంటే మనిషి మనిషిగా జీవించడానికి కూడా అదే ప్రధాన శత్రువు. Conformity అంటే ఎవడు ఏమి చెప్పినా తలూపడం. ప్రశ్నించకుండా అంగీకరించడం. ఈ ధోరణి మతపరంగా మూఢభక్తినీ, సామాజికంగా వీరపూజనీ, రాజకీయంగా నియంతృత్వాన్నీ, కళాపరంగా చౌకబారువినోదాన్నీ, సాహిత్యపరంగా శుష్కప్రసంగాల్నీ ప్రోత్సహిస్తుంది. మరీ ముఖ్యంగా ఈనాటి సోషల్ మీడియా యుగంలో ఇది మనుషుల్ని తమకై తాము ఆలోచించుకోవలసిన, తమకై తాము బాధ్యత పడవలసిన స్థితినుంచి తప్పించి ట్రోలర్లుగా మార్చేస్తుంది. అటువంటి ట్రోలింగ్ పర్యవసానాలు ఎలా ఉంటాయో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం.

ఒక మనిషి conformist కాకుండా ఉండటం అంటే, విగ్రహవిధ్వంసకుడిగానో, లేదా నిత్యశంకితుడిగానో లేదా ఎవరికీ జవాబుదారు కాకుండా ఉండటమనో కాదు. నువ్వొక మతసంప్రదాయంలోనో లేదా ఒక జాతీయతలోనో లేదా ఒక విజ్ఞాన శాస్త్ర పద్ధతిలోనో లేదా ఆస్తికుడిగానో నాస్తికుడిగానో ఏదో ఒక మార్గంలో ప్రయాణిస్తోనే, non-conformist గా ఉండవచ్చు. అంటే నువ్వు అనుసరిస్తున్న మార్గం ఒక్కటే ఏకైక మార్గం కాదనీ లేదా అంతిమ సత్యం మీద దానికి మాత్రమే గుత్తాధిపత్యం లేదనీ నమ్మడం. నువ్వు అనుసరిస్తున్న మార్గం అన్నిటికన్నా ముందు నిన్ను ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ ఉండాలంటే, నువ్వు కూడా నీ మార్గాన్ని సరిదిద్దుకుంటూ ఉండాలి. అది నిత్యవిచారణ వల్లా, నువ్వు నమ్మేది మాత్రమే సత్యం కాదనే వినయంవల్లా మాత్రమే సాధ్యపడుతుంది. సచ్చిదానందమూర్తి తన జీవితం పొడుగునా చేసింది ఇదే. ఆయన రచనలు చదివినప్పుడు మనకి ప్రధానంగా కనిపించేది ఈ నిర్మలత్వమూ, ఈ వినయసౌశీల్యమే.

ఉదాహరణకి ఆయన జన్మతః విశిష్టాద్వైతి. కాని జీవితకాలం పాటు అద్వైతాన్ని అధ్యయనం చేస్తూ వచ్చాడు. వేదాంతం పట్ల ఉన్న ఈ ఆసక్తి వల్ల ఆయన బౌద్ధానికి దూరంకాకపోగా, ఆచార్య నాగార్జునుడిపైనా, మాధ్యమిక బౌద్ధం పైనా ఎన్నో మౌలికమైన పరిశీలనలు చేపడుతూ వచ్చారు. భగవంతుడికి సంబంధించినంతవరకూ ఆయనది రామానుజ మార్గం. కాని శ్రుత్యర్థాన్ని ఏ మేరకు అంగీకరించాలి అన్నవిషయంలో న్యాయదర్శనానికి చెందిన జయంత భట్ట ఆయనకు మార్గదర్శి.

ఆయన ఎఫ్.ఏ చదువుకుంటున్నరోజుల్లో భగవద్గీతకు వ్యాఖ్యానం రాసారు. తర్వాత రోజుల్లో ఆయనకు తత్త్వశాస్త్రం బోధించిన పి.టి.రాజు దృష్టిలో భగవద్గీతకు అంతకన్నా ఉత్కృష్ట వ్యాఖ్యానం మరొకటి లేదు. ఆయన చివరిరోజుల్లో రాసింది వేదార్థ మీమాంస. అంటే దాదాపు అరవై ఏళ్ళు పైగా ఆయన శ్రుత్యర్థ పర్యాలోచన చేస్తూనే వున్నాడు. తనది శ్రుతి భగవతీ ఉపాసన అని కూడా చెప్పుకున్నాడు. సత్యాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన సహనం తనకి కల్చరల్ యాంత్రొపాలజీనుంచి లభించింది అని చెప్పుకున్నాడు. ఏ మనిషీ ఒంటరిగా సత్యాన్ని గ్రహించలేడనీ, మరొక మనిషివల్ల మాత్రమే, ప్రతి మనిషికి మానవత్వం సిద్ధిస్తుందనీ, ఇది తనకి మార్టిన్ బూబర్ ‘I-Thou’ చింతనవల్లనే బాగా బోధపడిందనీ రాస్తాడు.

అంటే ఏమిటి? ఆయన హిందూ వేదాంతపు పాదులోనే సత్యాన్వేషణ మొదలుపెట్టాడు. కాని న్యాయదర్శనం చూపించిన వెలుగులో తనని తాను తీర్చిదిద్దుకున్నాడు. బౌద్ధ దర్శనాల స్ఫూర్తితో తనని తాను విస్తృతపరుచుకున్నాడు. పాశ్చాత్యతత్త్వశాస్త్ర సంప్రదాయాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడంవల్ల తన ఎరుకని తాను సక్రమంగా వ్యక్తం చేయడమెలానో తెలుసుకున్నాడు. సైన్సు, సైకాలజీ, యాంత్రపాలజీ, రెలిజియస్ ఎక్స్పీరియెన్స్ ల సమక్షంలో తన చింతన ఒక డాగ్మా కాకుండా, తానొక conformist గా మారకుండా తనని తాను కాపాడుకున్నాడు. అంతిమంగా ప్రపంచ దర్శనాలన్నిటికీ నిజమైన వారసుడు కాగలిగేడు. అలా మనం కూడా వారసులం కావడమెట్లానో మనకొక తోవ చూపించి వెళ్ళిపోయాడు.

3

ఆచార్య సచ్చిదానందమూర్తి ఇంగ్లిషులో ముప్ఫైదాకా, తెలుగులో పన్నెండు పుస్తకాలు రాసారని చెప్తున్నారు. నేనైతే అన్నిపుస్తకాలూ చదవలేదు. చాలా పుస్తకాలు అందుబాటులో కూడా లేవు. కాని ఆయన భావధారను అర్థం చేసుకోడానికి, ఆయన ఆలోచనాపద్ధతినుంచి స్ఫూర్తి పొందటానికి, ప్రధానంగా మూడు పుస్తకాలతో మొదలుపెట్టవచ్చు. మొదటిది, ఆయన పి.ఎచ్.డి కోసం రాసుకున్న అధ్యయనాన్ని తర్వాత రోజుల్లో విస్తరించి వెలువరించిన Revelation and Reason in Advaita Vedanta (1959). రెండు భాగాలుగా ఉన్న ఈ రచనలో ఆయన మొదటి భాగంలో వేదాంతాన్ని తాను అర్థం చేసుకున్న తీరుని వివరించారు. రెండో భాగంలో తక్కిన అయిదు దర్శనాల సారాంశాన్నీ వివరిస్తూ శ్రుతిని అంటే revelation నీ, తర్కబద్ధ వివేచననీ సమన్వయించే ప్రయత్నం చేసారు.

తన అధ్యయనం మీంచి ఆయన చేసిన సూత్రీకరణలు మధ్యేమార్గానికి చెందినవి. అంటే శ్రుతి వల్ల లభించేది జ్ఞానమేగాని, అది కవిత్వ, కళాత్మక సత్యంలాంటి సత్యమనీ, వైజ్ఞానికసత్యం కాదనీ చెప్పడమన్నమాట. అది కూడా ఒక విధమైన ప్రజ్ఞానమే.  అది సంగీతం వింటున్నప్పుడు మనలో కలిగే తక్షణ అనుభూతి లాంటి అనుభవమనీ, దాన్ని ఇతమిత్థంగా సూత్రీకరించలేమనీ అంటాడు ఆయన. దీన్ని apercu అనే ఫ్రెంచి పదంతో సూచిస్తాడు. అలాగే ఒక మనిషి తనకి దైవవాణి వినబడిందని ఏ విధంగానూ ఋజువుచెయ్యలేడనీ, అలాగే అతడు వింటున్నది దైవవాక్కే అనిగానీ లేదా ఒక పవిత్రగ్రంథం దైవానుశాసనం అవునా గానీ అన్నది ఏ విధంగానూ బాహ్యప్రమాణాల్తో నిరూపించగలిగేది కాదనీ అని కూడా అంటాడు. తనకు వినబడుతున్నది దైవవాక్కు అవునో కాదో ఎవరికి వారు తేల్చుకోవలసిన సత్యమనీ, దానికి ఒక productive empathy అవసరమనీ అంటాడు. తాను ఏ సంప్రదాయంలో పుట్టిపెరిగాడో, ఏ సంప్రదాయానుసారం దైవవాక్కుని విశ్వసిస్తున్నాడో దాన్ని తనకై తాను విధించుకుని, అనుష్ఠిస్తూ, తన జీవితాన్ని దానికి తగ్గట్టుగా నడుపుకోలేకపోతే అతడు వింటున్నానని చెప్తున్నది దైవవాక్కు కానేరదని కూడా అంటాడు ఆచార్య మూర్తి. ప్రస్తుత కాలంలో ఈ మాట చాలా విలువైన మాట. మతాల పేరుమీదా, సంప్రదాయాల పేరుమీదా ఒకరినొకరు దూషించుకునేవాళ్ళూ, ఒకరిని చూసి మరొకరు అభద్రతకీ, భయానికీ లోనయ్యేవాళ్ళూ, అన్నిటికన్నా ముఖ్యంగా, తమ సంప్రదాయాన్నే ఓటమిపాలు చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే, దైవవాక్కు, దైవానుశాసనం వాటిని అనుష్టించేవాడికి మాత్రమే నిజం, అలా అనుష్ఠించినంతమేరకూ, అనుష్ఠించినంతసేపూ మాత్రమే నిజం.

ఇక reason కీ దైవానికీ మధ్య పైకి కనిపించే విభేదం తాత్త్విక దృష్ట్యా చూస్తే నిజంగా విభేదం కాదంటాడు. అంటే reason అనే దాన్ని ప్లోటినస్, కాంట్ ఏ అర్థంలో వాడారో, ratio అనే పదానికి వ్యతిరేకంగా ఎక్కార్ట్ intellectus అనే పదం ఏ అర్థంలో వాడేడో, ప్లేటో transcendental feeling అంటున్నప్పుడు దేన్ని సూచిస్తున్నాడో, ఆ అర్థంలో ‘తరచిచూసినప్పుడు’ సమస్త అనుభవంలోనూ దేవుణ్ణి ఒక necessary postulate గా, ఒక implicit నమ్మకంగా కనుగొనవచ్చంటాడు. అయితే ఈ నమ్మకం నిరూపణకు పనికొచ్చే అనుమాన ప్రమాణంకాదు. కాని ఆరుప్రమాణాల్లో ఒకటైన అర్థాపత్తి ప్రమాణం అని అనవచ్చు. అర్థాపత్తి అంటే మనం  చూస్తున్న ఒక వాస్తవం ఆధారంగా హేతుబద్ధమైన ఊహాగానంతో ఒక ప్రతిపాదన చెయ్యడం అన్నమాట. ఉదాహరణకి ‘దేవదత్తుడు పగటిపూట అన్నం తినడం లేదు, కాని అతడు ఆరోగ్యంగా ఉన్నాడు, అంటే దానర్థం అతడు రాత్రిపూట బాగానే అన్నం తింటూ ఉండవచ్చు’ అనడం లాంటిది.

ఈ సందర్భంగా ఆయన తన సమకాలికుడైన అస్తిత్వవాది కార్ల్ జాస్పర్స్ చెప్పిన ఈ వాక్యం ఉదాహరిస్తాడు. జాస్పర్స్ అంటున్నాడు:

Our enduring task in philosophical endeavor is to become authentic men by becoming aware of being; or , and this is the same thing: to become ourselves by achieving certainty of God.’

ఈ వాక్యం ఈ పుస్తకానికి సారాంశంగా చెప్పవచ్చు. అంటే నువ్వు ఒక మనిషిగా రూపొందడానికి ఒక దైవవాక్కుని విశ్వసిస్తున్నావంటే, ఆ క్రమంలో నువ్వు విశ్వసనీయమైన మానవుడివి కాగలుగుతున్నావంటే, నీ వరకూ దేవుడున్నట్టే అని నిశ్చయించుకోవచ్చు. అయితే, దాన్ని ప్రయోగశాలలో నిర్ధారించలేం కాబట్టి అది వైజ్ఞానిక సత్యం కాకపోవచ్చు, లేదా మతగ్రంథాలు చెప్పాయి కాబట్టి నమ్మితీరవలసిన సత్యం అని మనం చెప్పలేకపోవచ్చు, కానీ, అది సత్యమే. ఎందుకంటే, దేవదత్తుడు పగటిపూట అన్నం తినకపోయినా అతడు ఆరోగ్యంగా ఉన్నాడంటే అందుకు కారణం రాత్రిపూట అన్నం తినడం కావొచ్చేమో అన్నది ఎలా కారణం కాగలదో, నువ్వు ఒక విశ్వసనీయమానవుడిగా మారడం ద్వారా నువ్వు నమ్మిన దైవానికి ఈ లోకంలో నువ్వే ఒక నిరూపణగా నిలబడుతున్నావు.

29-9-2024

12 Replies to “సచ్చిదానందమూర్తి-1”

  1. ఆ సమున్నత చింతన ధారా ఋషికి నమస్సులు. ఆ నీళ్ళు మామీద చిలుకరించిన మీకు ధన్యవాదాలు..

  2. డా.సచ్చిదానంద మూర్తి గారిని చక్కగా ఆవిష్కరించారండీ. మీరన్న ప్రతి మాటతో, వారు చెప్పిన ప్రతి సిద్దాంతంతో ఏకీభవిస్తాను. దురదృష్టం, ఆంధ్రులకు తత్త్వం పైన ఆసక్తి లేకపోవటం, పైగా మొండి వాదనలకు -అభ్యంతరకరమైన భాషతో- దిగటం.
    మీకు ధన్యవాదాలు. 🙏🏼

  3. మొత్తానికి చదివేశాను.
    మీ రచనలు చదివినప్పుడు మాకూ ప్రధానంగా కనిపించేది ఒక నిర్మలత్వమూ, వినయసౌశీల్యమే.
    పైగా ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు చదువుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం.రేపు మళ్ళీ చదవాలి.
    నమస్సులు

  4. rammohanthummuri – I am a writer, a poet, a head master, a fater, a husband, and a creative person. I primarily in telugu language.
    Thummuri says:

    ఇంత విపులంగా మీరు మాత్రమే రాయగలరు. ఆ మహానుభావుడికి మీలాంటి వారు తప్పక తనను బ్రతికిస్తూ వుంటారన్న నమ్మకం నూరు శాతం ఉండి ఉంటుంది. ఇదంతా ఒక్క గుక్కలో చదవగానే అవగాహనకు రాకపోయినా ప్రధానమైన అంశం మాత్రం బుర్రకెక్కుతుంది. మతం, శాస్త్రం , స్వీయసమాలోచనం మూడూ కలిస్తే ఏర్పడే ఎరుక ఒక గొప్ప సత్యమార్గమౌతుంది.
    భారతీయులు గర్వించదగ్గ తత్త్వశాస్త్ర వేత్తను పరిచయం చేస్తున్న మీకు నమోవాకాలు.

  5. తన అస్తిత్వం గురించీ, ఈ ప్రపంచం గురించీ అసలు సత్యం ఏమై ఉంటుంది, అది తనకి ఎరుకలోకి ఎలా వస్తుంది, ఆ ఎరుకను తిరిగి తాను తనచుట్టూ ఉన్నవారితో ఎలా పంచుకోగలను అన్నదే ఆయన జీవితకాలం పాటు చేసిన అన్వేషణ. ఈ వెతుకులాట సచ్చిదానందమూర్తి ప్రత్యేకత. ఎలానో కొంచెం వివరించరూ , దయ చేసి.

    1. అవును, మరింత వివరంగా రాయాలి ఈ విషయం గురించి.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%