
4
అమెరికాకి ఒక ఇతిహాసం అవసరమనీ, ఆ నూతన పురణానికి ఇతివృత్తం అమెరికన్ జీవితం సమస్తమనీ ఎమర్సన్ భావించాక, అటువంటి మహాకావ్యాన్ని కూర్చే కవికోసం తాను ఎదురుచూస్తున్నాడని చెప్పేక, ఆ మహాకవి తానే కావాలని విట్మన్ ఉవ్విళ్ళూరేక, మరొక మూడు ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఒకటి, ఆ నూతన ఇతిహాసానికి ఎటువంటి ఛందస్సు అవసరం? రెండోది, ఆ కావ్యకథానాయకుడెవరు? మూడోది, ఆ కావ్యం ఇవ్వగల లేదా ఇవ్వవలసిన సందేశం ఏమిటి?
తాను ఎదురుచూస్తున్న అమెరికన్ కవి గురించి చెప్తున్నప్పుడు ఎమర్సన్ మరొక మాట కూడా అన్నాడు. తనని విస్మయపరుస్తున్న విస్తారమైన అమెరికన్ భూగోళం తనని తాను వ్యక్తీకరించుకోడానికి అవసరమైన ఛందస్సులకోసం ఇంకెక్కువకాలం వేచి ఉండలేదని చెప్తూ ఒక జాతిగా తాము ఒక ఆదర్శ కవికోసం ఎదురుచూస్తున్నప్పుడు మిల్టన్, హోమర్ లు కూడా తమని సంతృప్తిపరచలేకపోతున్నారంటాడు. ఎందుకంటే మిల్టన్ కవిత్వం మరీ వాచ్యంగా ఉండగా, హోమర్ కావ్యాలు వాచ్యంగా ఉండటమే కాకుండా చరిత్రపాఠాలుగా కూడా వినిపిస్తాయి అని అన్నాడు.
ఆ సందర్భంగా ఆయనొక గొప్ప మాటన్నాడు. ‘ఛందస్సులు కావు, ఛందస్సుల్ని వెతుక్కునే ఉద్వేగమే కవిత్వాన్ని సృష్టిస్తుంది’ అని. ఆయన మాటల్లో metre-making argument. ఇందుకు మనకు బాగా తెలిసిన ఉదాహరణ శ్రీ శ్రీ కవితా ఓ కవితా కవిత. ఆ కవిత పద్యం కాదు, వచనం కాదు, గేయం కాదు, అలాగని పద్యగంధి వచనమూ కాదు. అందులో ఉన్నది ఒక ఉద్వేగం. ఛందస్సుల సర్పపరిష్వంగాన్ని విడిచి తన గీతం జాతి జనులు పాడుకునే మంత్రంగా మార్మ్రోగాలనే ఒక బలమైన ఆకాంక్ష. ఎమర్సన్ కోరుకున్నది అదే. ఆయనిలా అంటున్నాడు:
సందేహించకు, కవీ, ఏమి చేసైనా సరే, కొనసాగించు. ‘అది నాలో పరవళ్ళు తొక్కుతున్నది, అది నాలోంచి వెలువడి తీరుతుంది’ అని చెప్పు. అక్కడే నిలబడు, మూగగా, తొట్రుపడుతూ, సణుక్కుంటూ, గొణుక్కుంటూ, బుసలు కొడుతూ, కూతపెడుతూ, ఎట్టకేలకు ఆ భావావేశం, ప్రతి రాత్రీ నిన్ను నీకు ఎరుకపరిచే ఆ స్వప్నశక్తి, అన్నిరకాల పరిమితుల్నీ, బంధనాల్నీ అతిక్రమించి పైకి ఉబికి వచ్చేదాకా నిలబడు. ఏ శక్తివల్ల మనిషి ఒక విద్యుత్ స్రవంతిగా మారిపోతాడో దాన్ని ప్రకటించేదాకా పట్టువదలకు.
అలా తనని ఊగించి శాసించి దీవించే ఆ భావోద్వేగానికి ఒక గొంతునిచ్చినప్పుడు కవులు మనల్ని విముక్త పరిచే దేవతలుగా మారిపోతారంటాడు ఎమర్సన్.
విట్మన్ కవిత్వ శైలికి ఈ ఉద్బోధ ఒక దారి చూపించింది. ‘నేనప్పటిదాకా మరిగిపోతూ మరిగిపోతూ ఉన్నాను, ఎమర్సన్ నన్ను పొంగిపొర్లేటట్టు చేసాడు’ అని చెప్పుకున్నాడు విట్మన్. తనని నిలవనివ్వని అసీమిత భావోద్వేగాన్ని కవితగా వినిపించడానికి పూనుకున్నప్పుడు అప్పటిదాకా ఇంగ్లిషు కవులు ఉపయోగించిన ఛందస్సులన్నింటినీ విట్మన్ పక్కకు నెట్టేసాడు. ఎమర్సన్ ఏ metre-making argument గురించి మాట్లాడేడో అటువంటి ఒక నవీన ఛందోసంవాదాన్ని విట్మన్ కనుగొన్నాడు. దానికి ఆయన ఎందరో పురాతన మహాకవులకీ, మహాకావ్యాలకీ ఋణపడి ఉన్నాడు. ముఖ్యంగా కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిలుకి. బైబిల్లో పాతనిబంధనలోని ప్రవక్తల ప్రవచనాలు, డేవిడ్ రాసిన కీర్తనలు, విలాపాలు, సొలోమోన్ రాసిన దివ్యప్రేమ గీతం అతనికి దారి చూపించాయి. తన భావోద్వేగాన్ని ప్రకటించడానికి పద్యం కాదు, వచనం కాదు, గేయం కాదు, పాట కాదు, పద్యగంధి వచనం కాదు, ఇవన్నీ కలగలిసిన, వీటిని దాటిన ఒక వక్తృత్వం, ఒక ప్రవచనం, ఒక ప్రకటన, ఒక ఎలుగు, ఒక మూలుగు, ఒక కేక, ఒక ఆశ్వాసం, ఒక అభినందన, ఒక అభిశంసన అన్నీ కలిసిన కొత్త వాక్ప్రవాహానికి ఆయన ఒక వాహికగా మారాడు. దాన్నే మనం వచన కవిత అంటున్నాం.
కవిత్వ ఛందస్సుల వరకూ, ప్రపంచ కవిత్వ చరిత్రలో విట్మన్ ఒక సరిహద్దురేఖ. అతడికి ముందు ఎన్నో ఛందస్సులు ఉండిఉండవచ్చు. అతడి తర్వాత కూడా అవి ఎన్నో భాషల్లో కొనసాగుతూండవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విట్మన్ తరువాత మాత్రం వచనకవిత అనే కొత్త ఛందో రూపం ప్రవేశించింది. ఈ కొత్త ఛందస్సు దేశాలకీ, భాషలకీ, సంస్కృతులకీ అతీతంగా వికసిస్తోనే ఉంది.
తాను రాయాలనుకుంటున్న కవిత్వం అమెరికాకి ఇతిహాసంగా రూపొందాలని అనుకుంటున్నప్పుడు ఆ ఇతిహాసం ఇప్పటిదాకా ప్రపంచ సాహిత్యాల్లో వచ్చిన ఇతిహాసాలకన్నా భిన్నంగానూ, కొత్తదిగానూ ఉండాలని విట్మన్ కోరుకున్నాడు. ఆయనిలా రాస్తున్నాడు:
అమెరికన్ కవి అభివ్యక్తి ఇంతదాకా సంభవించినవాటిని దాటి కొత్తగా ఉండాలి. అది ప్రత్యక్షవాక్కుగా కాక, పరోక్షవాక్కుగా ఉండాలి. అది వర్ణనాత్మకంగానో, ఐతిహాసికంగానో ఉండేది కాకూడదు. దాని విశిష్టత వీటన్నిటినీ దాటిపోవాలి. తక్కిన జాతులు తమ కాలాల గురించీ, యుద్ధాల గురించీ పాడుకోనివ్వండి. వాటి పాత్రల్ని, యుగాల్నీ చిత్రించుకుంటూ కవిత్వం చెప్పుకోనివ్వండి. కాని అమెరికన్ గణతంత్రపు మహాసంకీర్తన మాత్రం అలా ఉండదు.
Great Psalm of the Republic అన్నాడు విట్మన్ తాను కలగంటున్న మహాకావ్యాన్ని. జాతులు గతంలో రాసుకున్న పురాణాలకి వాటి ఆవిర్భావానికి కారణమైన మహావీరుల కథలు ఇతివృత్తాలుగా ఉండేవి. వాటికి జాతుల గతాన్ని, పూర్వవైభవాన్ని కీర్తించడం ప్రధాన లక్ష్యం. కాని తాను సంభావిస్తున్న ఇతిహాసానికి వర్తమానమే ముడిసరుకుగా ఉండాలన్నది విట్మన్ ఉద్దేశ్యం. ఆయనిలా అంటున్నాడు:
మహాకవి కావాలనుకున్నవాడు ఎదుర్కోవలసిన ప్రత్యక్ష పరీక్ష నేడే, నేటి వర్తమానమే. మహాసాగరతరంగాల్లాంటి తన సమీప యుగ విశేషాల్తో అతడు తనని తాను ముంచెత్తుకోకపోతే, తన మాతృభూమి దేహాత్మల్ని తన మీద ఆవాహన చేసుకుని అతుల్య ప్రేమోద్వేగాల్తో తన నేలకి తాను అంటిపెట్టుకోకపోతే, దాని సమస్త గుణావగుణాల్లోకి తనని తాను చొప్పించుకోకపోతే, అసలు ఆ మాటకొస్తే అతడు తనకి తానే తన మూర్తీభవించిన తన కాలంగా మారకపోతే… అతడు కూడా సాధారణ జనస్రవంతిలో ఒకడిగా ఉంటూ తన పూర్తి వికాసంకోసం వేచి ఉండనీ.
తన కాలాన్ని చిత్రించవలసిన కవి ఎలా ఉండాలి? ఈ ప్రశ్న కూడా తనే వేసుకుని తనే ఇలా జవాబిస్తున్నాడు:
మహాకవి దృష్టిలో అల్పమైనవీ, అంతగా ప్రముఖంకానివీ అంటూ ఏవీ ఉండవు. అప్పటిదాకా ఏమంత ప్రాముఖ్యం లేని విషయాలుగా భావించేవాటిల్లో కూడా మహాకవి తన ఊపిరులూదగానే అవి వ్యాకోచించి వైభవోపేతంగా, విశ్వజీవితాన్నంతటినీ తమలో ప్రతిఫలింపచేస్తాయి. అతడు ద్రష్ట. అతడొక స్వతంత్రవ్యక్తి. అతడు తనకు తనే సంపూర్ణుడు. తక్కినవాళ్ళు కూడా తనతో సమానులని వాళ్ళకి తెలియకపోవచ్చుగానీ అతడికి తెలుసు. అతడు బృందగానంలో వినిపించే గొంతుల్లో ఒక గొంతు కాదు. అతడే నియమనిబంధనలకూ తలవంచే వాడు కాడు. అతడే నియమనిర్ణేత. .. మనకు తెలిసిన సమస్త విశ్వాన్నీ సంపూర్ణంగా ప్రేమించేవాడు ఒక్కడే ఉంటాడు. అతణ్ణే మహాకవి అంటాం.
అటువంటి మహాకవి తన మహాసంకీర్తన ద్వారా వినిపించవలసిన సందేశం ఏమిటి? ఆ సందేశం కేవలం సాహిత్యం కాదు. అదొక కొత్త మతం లాంటిది. విట్మన్ ఇలా అంటున్నాడు:
ఇంక పురోహితులకీ, పూజారులకీ కాలం చెల్లింది. వాళ్ళు చెయ్యవలసిన పని ముగిసిపోయింది. వాళ్ళు మహా అయితే ఇంకా ఒకటి తరాల పాటు కొనసాగుతారేమో, ఆ తర్వాత నెమ్మదిగా కనుమరుగవక తప్పదు. అంతకన్నా మహోన్నతులైన జాతి ఒకటి రానున్నది. విశ్వసదృశులూ, ప్రవక్తల బృందం ఒకటి రానున్నది. కొత్త వ్యవస్థ ఒకటి ప్రభవించబోతున్నది. ఆ వ్యవస్థలో దేవుడి పూజారులు కాదు, మానవుడి పూజారులు రాబోతున్నారు. అప్పుడు ప్రతి ఒక్క మనిషీ తనకు తనే పూజారి కాబోతున్నాడు. వాళ్ళ ఆధ్వర్యంలో నిర్మించే దేవాలయాలు స్త్రీపురుషుల దేవాలయాలు కాబోతున్నాయి. తమలోని దైవత్వాన్ని వెలికి తీసి విశ్వసదృశులైన ఆ కొత్తజాతి కవులు స్త్రీపురుషుల గురించీ, సకల విషయాల గురించీ, సమస్త సంఘటనలగురించీ గానం చేయనున్నారు. గతానికీ, భవిష్యత్తుకీ సూచికలుగా ఉండే నేటి విషయాలనుంచే వాళ్ళు ఉత్తేజితులవుతారు. అమరత్వాన్నీ, భగవంతుణ్ణీ, పరిపూర్ణతనీ, స్వాతంత్య్రాన్నీ, సౌందర్యాన్నీ, తాము నిల్చున్న నేల సత్యత్వాన్నీ పరిరక్షించుకోడానికి వారెంత మాత్రం వెనుకాడరు. ఆ కొత్త తరం కవులు అమెరికాలో ప్రభవించనున్నారు. తక్కిన భూగోళమంతా ఆ కవులకు ప్రతిస్పందించబోతున్నది.
అటువంటి మహాకావ్యంలో కథానాయకుడెవరు?
సామాన్యమానవుడు.
1855 లో వెలువరించిన తన కవిత్వానికి రాసుకున్న ముందుమాట మొత్తం ఈ విషయాన్నే పదే పదే నొక్కి చెప్తుంది. ఆ సామాన్యమానవుణ్ణి విట్మన్ తనలోకి ఆవాహన చేసుకున్నాడు. అమెరికన్ మేధావి కర్తవ్యం గురించి ఎమర్సన్ చేసిన ప్రసంగం వల్ల ప్రేరణ పొందిన థోరో మానవసమాజానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా జరిగితే, విట్మన్ మానవసమాజానికి దగ్గరగా జరగడమే కాదు, ఆ మానవాళి మొత్తం తనే కావాలని ఆశపడ్డాడు. అందుకనే ఇది Song of Myself గా మారింది.
సామాన్యమానవుడి గురించి రాయాలంటే అన్నిటికన్నా ముందు కావలసింది సమదృష్టి. విట్మన్ ఇలా అంటున్నాడు:
మానవాళి మొత్తమంతటిలోనూ మహాకవికన్నా సమభావం కలిగిన మనిషి మరొకడుండడు. అతడికి చేరువకాకపోయినందువల్లా, అతడికి దూరంగా ఉండిపోయినందువల్లా మాత్రమే విషయాలు వికృతంగానూ, విచిత్రంగానూ కనిపిస్తాయి. అవి తమ స్థిమితాన్ని కోల్పోతాయి. కాని అతడు ప్రతి విషయానికి ఎంత ప్రాముఖ్యం అవసరమో అంతే అందచేస్తాడు. ఒక పిసరు ఎక్కువ కాదు, ఒక పిసరు తక్కువ కాదు. అనంత వైవిధ్యానికి అతడే తీర్పరి. దాని రహస్యాన్ని విడమరిచే తాళం చెవి. తన కాలానికీ, తన దేశానికీ సమత్వాన్ని ప్రసాదించగలవాడు అతడు మాత్రమే.
అటువంటి మహాకవి అన్ని రకాలనిమ్నోన్నతాల్నీ ధిక్కరిస్తాడు. నియంతృత్వాల్ని ద్వేషిస్తాడు. అతడి దగ్గర హెచ్చుతగ్గులుండవు. కుల, మత, వర్ణ, లింగ, ప్రాంత భేదాలుండవు. ‘తనయందు నఖిలభూతములందు నొకభంగి సమహితత్వంబున’ మసలే భాగవతుడు అతడు.
కాబట్టి అతడి మతం ప్రజాస్వామ్యం. అతడి దేవతలు స్త్రీపురుషులు. అతడు కీర్తించే కాలం వర్తమానం. అతడి కథానాయకుడు సాధారణాతి సాధారణమానవుడు. అటువంటి మహాకవి తాను కావాలనీ, అప్పుడే తలెత్తుతున్న అమెరికన్ జాతికి తన కవిత్వమే ఒక నవీన ఇతిహాసం కావాలనీ కలగంటూ విట్మన్ Song of Myself రాసుకున్నాడు. ఆ కవితనీ , మొత్తం Leaves of Grass నీ చదవడం ద్వారా తన పాఠకుడి నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో ఇలా చెప్తున్నాడు:
నువ్వు చెయ్యవలసిందిదీ: నేలని ప్రేమించు, సూర్యుణ్ణీ, పశుపక్ష్యాదుల్నీ ప్రేమించు. సంపదల్ని తృణీకరించు. నిన్ను యాచించవచ్చిన ప్రతి ఒక్కటికీ దానం చెయ్యి, నోరులేనివారికోసం, నిరక్షరాస్యులకోసం నిలబడు, నీ ఆదాయం పరోపకారం కోసం వెచ్చించు. నియంతల్ని ద్వేషించు. దేవుడి గురించి వాదోపవాదాలు వదిలిపెట్టు. ప్రజల్ని పట్టించుకో. వాళ్ళ పట్ల ఓర్పు కలిగి ఉండు. తెలిసినవాటి ఎదటగాని, తెలియని వాటి పట్ల గాని, ఏ ఒక్క మనిషికిగాని లేదా మనుషులకుగాని తలవంచకు, చదువుకోనివాళ్ళే, అయితేనేం శక్తిమంతులు, వాళ్ళతో, యువకులతో, తల్లులతో కలిసి నడుచుకుంటూ పో. నీ జీవితంలో ప్రతి ఏడాదీ, ప్రతి ఋతువులోనూ, ఈ కవితల్ని ఆరుబయట చదువుకో, నీ స్కూల్లోనో, చర్చిలోనో లేదా నువ్వు చదివిన ఏదేనా పుస్తకంలోనో ఇంతదాకా నీకు చెప్పినవాటన్నిటినీ మరొకసారి పరీక్షించి చూసుకో. వాటిల్లో నీ ఆత్మని కించపరుస్తున్నదేదైనా కనిపిస్తే దాన్ని తక్షణమే పక్కనపడెయ్యి.
22-9-2024
ఏమిటిది, కవులందరూ పునః పునః పఠించాల్సిన ప్రార్థనా గ్రంథమా! ఏం మాటలు! ఏం అనువాదం! ఏం రాస్తున్నావు నువ్వు అని ఆ కవి నా ముందుకు వచ్చి నిలదీస్తునట్టు సిగ్గుపడిపోయాను.
“మహాకవి కావాలనుకున్నవాడు ఎదుర్కోవలసిన ప్రత్యక్ష పరీక్ష నేడే, నేటి వర్తమానమే. మహాసాగరతరంగాల్లాంటి తన సమీప యుగ విశేషాల్తో అతడు తనని తాను ముంచెత్తుకోకపోతే, తన మాతృభూమి దేహాత్మల్ని తన మీద ఆవాహన చేసుకుని అతుల్య ప్రేమోద్వేగాల్తో తన నేలకి తాను అంటిపెట్టుకోకపోతే, దాని సమస్త గుణావగుణాల్లోకి తనని తాను చొప్పించుకోకపోతే, అసలు ఆ మాటకొస్తే అతడు తనకి తానే తన మూర్తీభవించిన తన కాలంగా మారకపోతే… అతడు కూడా సాధారణ జనస్రవంతిలో ఒకడిగా ఉంటూ తన పూర్తి వికాసంకోసం వేచి ఉండనీ.”
ధన్యవాదాలు మానసా! విట్మన్ సంతోషిస్తాడు.
కవులకు కార్యాచరణ ప్రణాళిక . కవికి దర్శనం సాధ్యమైనపుడే చైతన్యవంతమైన సమసమాజ నిర్దేశనం చేయగలడు. మంచి సందేశాత్మక వ్యాస భాగం. 🙏
కవికి సమదర్శనం
అవును.
ధన్యవాదాలు సార్!