కవిత్వహిమాలయ సంచారి

ఇంగ్లిషులో phenomenon అని ఒక పదం ఉంది. కంటికి కనిపించే ఒక యథార్థమైన విషయం అనే అర్థంలోనే కాకుండా, మనల్ని అబ్బురపరిచే ఒక మనిషిని సూచించడానికి కూడా ఆ మాట వాడతారు. నాగరాజు రామస్వామిగారిని అభివర్ణించాలంటే ఆయన ఒక phenomenon అని అనాలి.

ఆయన పుట్టింది కరీంనగర్లో. ఈ సెప్టెంబరు తొమ్మిదో తేదీన ఆయన తన ఎనభై అయిదో ఏట అడుగుపెట్టారు. ఆయన చిన్నప్పుడు నారాయణరెడ్డిని చూసి స్ఫూర్తిపొందారు. విశ్వనాథ సత్యనారాయణ ప్రిన్సిపాలుగా పనిచేసిన కాలేజిలో చదువుకున్నారు. విశ్వనాథకు నకలు అని చెప్పదగ్గ ధూళిపాళ శ్రీరామమూర్తిగారి దగ్గర తెలుగు చదువుకున్నారు. కొన్నాళ్ళు శాంతినికేతన్ లో గడిపారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువు పూర్తయ్యాక ఉద్యోగజీవితం మొదలయ్యాక నలభయ్యేళ్ళపాటు సాహిత్యానికి దూరంగా బతికారు. రిటైరయ్యాక మళ్ళా సాహిత్యవ్యాసంగం మొదలు పెట్టారు. కాని ఆ వ్యాసంగం ఒక రిటైర్మెంటు వ్యాసంగం స్థాయిది కాకపోవడమే ఆయనలో అబ్బురపరిచే అంశం.

పన్నెండేళ్ళ కిందట మొదలైన ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుల్ని అధిరోహిస్తూనే ఉన్నారు. జాన్ కీట్స్ కవితల్ని ‘ఈ పుడమి కవిత్వం ఆగదు’ పేరిట అనువదించడంతో పాటు, ‘అనుస్వరం’ పేరిట వివిధ దేశాల కవుల కవితల్ని కూడా అనువదించారు. రవీంద్రుడి గీతాల అనువాదంతో పాటు ఆక్టేవియో పాజ్ దీర్ఘకావ్యాన్ని ‘సూర్యశిల’ పేరిట తెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు తన 84 వ ఏట, కొందరు ప్రపంచ మహాకవుల్ని పరిచయం చేస్తూ ‘క’వన’కోకిలలు’ పేరిట ఒక వ్యాససంపుటి వెలువరించారు.

ఈ పుస్తకాన్ని ఇవాళ రవీంద్రభారతి సమావేశమందిరంలో శిఖామణి ఆవిష్కరించారు. ఈ పుస్తకం గురించి ఏనుగు నరసింహారెడ్డిగారు మాట్లాడేరు.

ఒక మనిషి నలభయ్యేళ్ళకు పైగా సాహిత్యానికి దూరంగా ఉండి, మళ్ళా సాహిత్యంలో అడుగుపెట్టినప్పుడు తాను ఎక్కడ ఆ దారివదిలిపెట్టాడో అక్కడే మళ్ళా ఆ దారి వెతుక్కుంటూ తచ్చాడుతూ ఉండటం సహజం. అంటే తాను చిన్నప్పుడు నేర్చుకుని, దాదాపు మర్చిపోయిన తెలుగుని మళ్ళా కూడదీసుకుని పలుకుతూ చిన్ని చిన్ని కవితలు రాస్తూ ఉండటం కూడా సహజమే. కాని ఈ పన్నెండేళ్ళుగా రామస్వామిగారు రాస్తున్న కవిత్వంలోనూ, చేస్తున్న అనువాదాల్లోనూ కనిపించే తెలుగు మామూలు తెలుగు కాదు. నలభై ఏభై ఏళ్ళుగా నిర్విరామంగా సాహిత్యసాధన చేస్తూండేవాడి భాష ఎంత పరిణతిని సంతరించుకోగలదో రామస్వామిగారి భాషలో అదంతా కనబడుతుంది. ఆ పదప్రయోగాలు, ఆ శైలి, ఆ శయ్య ఆయన్ని ఒక ప్రౌఢకవిగా మనముందు నిలుపుతుంటాయి. కొన్నిచోట్ల ఆయన పదబంధాలు నాకు బైరాగిని గుర్తుచేస్తాయి. అంటే తాను ఇన్నేళ్ళుగానూ సాహిత్యానికి భౌతికంగా మాత్రమే దూరంగా ఉన్నాడుగానీ, అంతరంగంలో సాహిత్యార్చన చేస్తోనే ఉన్నాడు అని మనం గ్రహించగలుగుతాం.

ఆలా ఏళ్ళకిఏళ్లు సాహిత్యానికో, తన భాషకో, తన వాళ్ళకో దూరంగా ఉండి మళ్ళా సాహిత్యానికి చేరువైన సాహిత్యకారుడికి ఇన్నాళ్ళుగా తాను కోల్పోయిన కాలాన్నంతటినీ ఒక్క గుక్కలో అందుకోవాలని ఉంటుంది. తాను దూరమైన క్షేత్రాలన్నింటినీ ఒక్క అంగలో దాటెయ్యాలని ఉంటుంది. అందుకని అలాంటి వాళ్ళు అన్నిటికన్నా ముందు చేసేవి రెండుపనులు: ఒకటి, ఈ మధ్యకాలంలో వచ్చిన పుస్తకాల్లో మంచిపుస్తకాలు అని అనిపించినవాటిని త్వరత్వరగా చదివెయ్యడం, వాటిని సమీక్షించడం లేదా వాటి గురించి మాట్లాడుకోవడం, రెండోది, ప్రపంచభాషల్లో వచ్చిన గొప్ప కావ్యాల్నీ, ప్రసిద్ధి చెందిన కవుల్నీ తన భాషలోకి తిరిగి రాసుకోవడం. రామస్వామిగారు ఈ రెండు పనులూ చేస్తూ ఉన్నారు. ఒకవైపు జీవితం అత్యధికభాగం గడిచిపోయిందన్న ఆందోళన, మరొకవైపు తనకు దక్కుతున్న ఈ కాలాన్ని ఏ విధంగా ఎంత త్వరగా సద్వినియోగపరుచుకోగలనా అన్న ఆరాటం- ఈ రెండింటివల్లా ఆయనలో ఒక పసిపాపలోని ఆరాటంతో పాటు, ఒక జ్ఞానిలోని నెమ్మదికూడా కనిపిస్తుంటాయి.

నిప్పులు కక్కుతున్న ఈ వేసవిలో ఆయన ఒకరోజు మా ఇంటికి వచ్చారు. తనకి ఆ మధ్య ఒక యాక్సిదెంటు కావడంతో అతి కష్టం మీద అడుగులో అడుగు వేసుకుంటో ఆ ఎండవేళ మా ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నాకు ఆయన్ని చూడగానే మనసుకి కష్టంగా తోచింది. కాని ఆయన వస్తూనే తాను ఈ మధ్యకాలంలో రాసిన వ్యాసాల్ని కవనకోకిలలు పేరిట పుస్తకంగా తెస్తున్నాననీ, ఆ పుస్తకం నాకు అంతికమివ్వాలని అనుకుంటున్నాననీ చెప్పారు. ఆ మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇంతకుముందు కూడా ఇట్లానే సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారు తన 84 వ ఏట రాసిన షేక్స్పియర్ సాహితీలోకం పుస్తకాన్ని నాకు కానుకగా ఇవ్వడం గుర్తొచ్చింది. ఈ ఇద్దరు మునీశ్వరులనుంచి ఇటువంటి కానుకలు అందుకోడానికి నాకున్న అర్హత ఏమిటి? బహుశా వాళ్ళు సరస్వతీ దేవిని అర్చించడానికి ఒక తావు వెతుక్కుని అక్కడ తమ పుస్తకాల్ని ఉంచుతున్నారని అనుకున్నాను.

కవనకోకిలలు 67 మంది కవుల్ని పరిచయం చేసే 56 వ్యాసాల సంకలనం. ఆ కవుల్ని ఆయన మూడు విధాలుగా వింగడించారు. విదేశీ కవనకోకిలలు పేరిట హోమర్, వర్జిల్, శాఫో, వాల్ట్ విట్మన్ లాంటి కవుల్ని పరిచయం చేసారు. ప్రతి కవినీ పరిచయం చేసే చిన్న వ్యాసంతోపాటు వారి కవితల అనువాదాలు కూడా కొన్ని పొందుపరిచారు. అలానే స్వదేశీ కవనకోకిలలు పేరిట ఆండాళ్, అమృతా ప్రీతం, నజ్రుల్ ఇస్లాం, టాగోర్, సరోజినీ నాయుడు వంటి కవుల్ని పరిచయం చేసారు. ఇక మూడవ విభాగంలో నోబెల్ పురస్కారం పొందిన మహాకవులు నెరూడా, ట్రాన్స్ ట్రోమర్, లూయీ గ్లక్, చెస్లావ్ మీవోష్, యేట్స్ వంటివారిని పరిచయం చేసారు.

ఈ పరిచయాలు వారి గురించి వికీపీడియాలోనో లేదా బ్రిటానికాలోనో చదివి చేసిన పరిచయాలు కావు. వారి కవిత్వాలు తాను స్వయంగా చదివి, ఆ తోటల్లో విహరించి, వస్తూ వస్తూ మనకోసం కోసుకొచ్చిన గుప్పెడు పూలు.

ప్రపంచ కవిత్వంతో నాకు బాగానే పరిచయం ఉంది కదా, ఇందులో ఎందరు కవులు నాకు తెలియనివాళ్ళున్నారో చూద్దామని లెక్కేసుకున్నాను. మొత్తం 67 మందికవుల్లో దాదాపు మూడోవంతు కవులు నాకు ఈ సంపుటంతో కొత్తగా పరిచయమయ్యారు. సోమాలియా కవి హద్రావి, లాటిన్ అమెరికన్ కవి సబోరియో, రష్యన్ తొలి రొమాంటిక్ వాసిలి జుకోవిస్కి నాకు ఈ పుస్తకం ద్వారానే పరిచయమయ్యారు. కాని అంతకన్నా ఆశ్చర్యం, సమకాలిక భారతీయ ఆంగ్ల కవయిత్రులూ, బెంగాలీ కవయిత్రులూ, కశ్మీరీ కవయిత్రులూ ఆయన పరిచయం చేసిన పధ్నాలుగు మందిలో నాకు తెలిసినవారు ఇద్దరే. రామస్వామిగారి అధ్యయన విస్తృతి ఎంత విస్తారమో చెప్పటానికి ఈ ఉదాహరణ చాలనుకుంటాను.

ఆయా కవుల్ని ఆయన పరిచయం చేస్తూ తాను అనువదించడానికి ఎన్నుకున్న కవితలూ, వాటిని అనువదించినతీరూ కూడా విస్మయకారకాలే. ఉదాహరణకి బోదిలేర్ కవితల్ని ఆయన పూర్తి వచనకవితలుగా అనువదించినప్పుడు ఆ కవితల్లోని అంతఃస్వాతంత్య్రం ఛందోబంధనాల్ని తెంచుకుని మనముందు మళ్ళా కొత్తగా సాక్షాత్కరిస్తుంది. ఒక అనువాదకుడు పదిమంది కవుల్ని అనువదిస్తున్నప్పుడు నిజానికి ఆ పదిమందినీ తన కవులుగా మార్చేసుకుంటాడు. అంటే ఆ కవులు ఆయాభాషల ఆయా కాలాల భేదాల్ని దాటి అనువాదకుడి శయ్యలోనే అతడి సొంతమనుషుల్లా కనిపిస్తారు. ఉదాహరణకి పాల్ ఎలార్డ్ కి శ్రీ శ్రీ చేసిన అనువాదాల్తో బైరాగి అనువాదాలు పోల్చి చూడండి. యూరపియన్ కవులకి మోహన ప్రసాద్ అనువాదాల్ని ఇస్మాయిల్ అనువాదాల్తో పోల్చి చూడండి. రామస్వామిగారు కూడా ఇందుకు మినహాయింపు కాదు. రెండున్నరవేల ఏళ్ళ కిందటి శాఫో గ్రీకు, రామస్వామిగారి తెలుగులో, ఎలా వినిపిస్తున్నదో చూడండి:

చంద్రుని సమీపంలోని చుక్కలు
అతని మోహన రూపానికి అబ్బురపడి
తమ మెరుపు మోములను
ముసుగుమాటున దాచుకుంటవి.

శాఫోకి పదిహేను శతాబ్దాల తర్వాతి ఆండాళ్ కూడా తన సెందమిళాన్ని పక్కనపెట్టి నాగరాజు రామస్వామిగారి తెలుగునే మాట్లాడుతుండటం ఈ వాక్యాల్లో చూడండి:

మించు అంచులను పొదుగుకున్న
ఓ మొయులు రేఖా!
చెప్పు
ఎదమీద సిరిని పెట్టుకున్న వెంకటేశునికి
నా సుతిమెత్తని వక్షద్వయం
అతని తేజోమయ మేని స్పర్శకై తపిస్తున్నదని.

చూడండి, సహజంగానే ఒక loftiness ని సంతరించుకున్న శైలి అరవిందుల సావిత్రి లాంటి హిమాలయ శిఖరం లాంటి కావ్యాన్ని సమీపించినప్పుడు ఆ వాక్యధార ఎలా ఉంటుందో!

మేఘదూతికా
అతనో విగతపాంథుడు
తాను తన ఎరుకను మరచినట్టు
కోల్పోయిన లోని కాంతిని వెతుక్కుంటున్నట్టు
పరాయి ప్రాంత భ్రాంతిలో పరిభ్రమిస్తున్నట్టు
తెలియని ఇంటికేసి పయనిస్తున్నట్టు.

భాష ఒక రసాయనం. ఒక కవి లేదా అనువాదకుడు తన జీవితకాలపు సుఖదుఃఖానుభవాల్ని రంగరించి ఆ రసాయనాన్ని తయారు చేస్తాడు. ఒకసారి మనం ఆ ద్రవ్యానికి అలవాటుపడ్డామా ఇక మనల్ని ఆ లాలస వదిలిపెట్టదు. రామస్వామిగారి తెలుగుకి కూడా ఆ లక్షణం ఉంది. ఆ వాక్యాలు చదువుతూనే మనమొక sublime ని అనుభూతి చెందకుండా ఉండలేం. ఆ loftiness ఆయనకు సరస్వతి అనుగ్రహించిన వరం. ఒకసారి తన భావాల్లో, తన భాషలో ఆ ఔన్నత్యాన్ని అందుకున్నాక, ఆ అనువాదకుడు నిజంగానే అత్యున్నతులైన కవుల్నీ, కవిత్వాల్నీ అనువందించడానికి పూనుకున్నప్పుడు ఆ ప్రయాణం హిమాలయాల్లో దేవదారు కాననాల్లో సంచరిస్తున్నట్టే ఉంటుందని వేరే చెప్పాలా! ఒక్కమాటలో చెప్పాలంటే నాగరాజు రామస్వామి కవిత్వహిమాలయ సంచారి.

ఇందులో నాకు ఇష్టులైన మహాకవులంతా దాదాపుగా ఉన్నారు. ఈ పుటలు తిప్పుతుంటే రిల్క, సైగ్యొ, బషొ, హాన్ షాన్, దుఫు, లీపో, ఎమిలి డికిన్ సన్, ఎమర్సన్ వంటివారున్నారనే సంతోషంలో వ్యాసవాల్మీకులూ, డాంటే, కాళిదాసు, భారతియార్ లాంటివారు లేరనే విషయం అంత చప్పున మనసుకు తోచదు.

మనకి కవిత్వం పట్ల ఇష్టం కలగడం జీవితంలో మనం పొందగల వరదానాల్లో అత్యంత ఉత్కృష్టమైన వరదానం. ఒకసారి కవిత్వం పట్ల ప్రేమ పుట్టాక కూడా, తాము కవిత్వం రాయడం మొదలుపెట్టాక కూడా, చాలామంది మనుషులు తమ మధ్య కంచెలు కట్టుకుంటూ, గీతలు గీసుకుంటూ, హద్దులు కొలుచుకుంటూ ఉండే దృశ్యమూ చూస్తున్నాను. మరొకవైపు, ఇదుగో, తమ అంతరంగాన్నే ఒక తపోవనంగా మార్చుకుని దేశకాలాతీతంగా మహాకవుల సన్నిధిలో గడుపుతున్నవాళ్ళనీ చూస్తున్నాను. కాని మొదటితరహా కవులు కాక, ఇటువంటి సాహిత్య పిపాసులు, ఒక రాధాకృష్ణమూర్తి, ఒక రామస్వామి నాగరాజు వంటివారి సాంగత్యం లభించడం నాకు లభించిన భగవదనుగ్రహం అనుకుంటాను.

14-9-2024

6 Replies to “కవిత్వహిమాలయ సంచారి”

  1. నాగరాజు రామస్వామి గురించి మీ సమంచిత వివేచన వాక్యాలు సరసహృదయోల్లాసాలు.”విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్”.మీ వంటి రసజ్ఞ రత్న పరీక్షకులకే తెలుస్తుంది రామస్వామి కవిత్వమెంతటి అనర్ఘ రత్న సమమో. మీకు నా నమోవాకాలు .

  2. “బహుశా వాళ్ళు సరస్వతీ దేవిని అర్చించడానికి ఒక తావు వెతుక్కుని అక్కడ తమ పుస్తకాల్ని ఉంచుతున్నారని అనుకున్నాను.”

    ఇది నిజంగా నిజం…సర్.
    అభినందనలు.

  3. నమస్కారం సార్.
    రామస్వామి గారి ” కవి కోకిలల ” గురించిన మీ సమీక్ష హృదయంగమము గా ఉంది. వారి గురించిన మీ Intro చాలా విపులంగా సాగింది. ఒక కవి తనపై ఎంత నమ్మకం తో చేరువ అవుతాడో..ఆయన ఆకాంక్షలు ఏమిటీ…మరి అటువంటి కవిని మనం ఎంతగా అభిమానిచాలి…ఎంతగా Own చేసుకోవాలి…ఇత్యాదులు మీరు ఎంత నిష్టగా, అంకిత భావంతో చేస్తారో మీ ఈ సమీక్ష చదివితే బాగా అర్థమౌతుంది.
    ఎక్కడా మీ స్వోత్కర్ష, అతిశయం మచ్చుకకు కనపడవు. ఎంత పద్ధతిగా ఆత్మీయంగా మాట్లాడతారు సార్. మీ భావోద్వేగ నియంత్రణ మాగొప్పది సార్.
    రామస్వామి గారికి అభినందనలు.
    మీకు మిక్కిలి ధన్యవాదాలు.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%