అయిదు పాఠాలు

నిప్పులు కురిపిస్తున్న ఒక మే మధ్యాహ్నం చిప్పరిగె సతీష్ అనే ఒక కన్నడ సాహిత్యవేత్త మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. ఆయనతో పాటు తెలుగు, కన్నడ భాషల పట్ల సమాన అభినివేశం కలిగిన అజయ్ కూడా ఉన్నాడు. వారు రాగానే సతీష్ గారు తనని తాను పరిచయం చేసుకుంటూ తాము బుక్ బ్రహ్మ పేరిట ఒక సాహిత్య సంస్థ నడుపుతున్నామనీ, ఈ ఆగస్టులో దక్షిణభారత సాహిత్యాలకు సంబంధించిన ఒక ఉమ్మడి సదస్సుని ఒక పండగలాగా జరపాలని ఆలోచిస్తున్నామనీ, దానికి నన్ను కూడా రమ్మనీ ఆహ్వానించేరు.

ఆ ఆహ్వానం వినగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అందుకు కారణాలు లేకపోలేదు. 2013 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో నిర్వహించింది. నా ఆత్మీయ మిత్రుడు కవితాప్రసాద్  సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా ఆ మహాసభలు తానే స్వయంగా దగ్గరుండి జరిపించాడు. అప్పట్లో మేము కలుసుకోని రోజంటూ ఉండేదికాదు, మాట్లాడుకోని పూట కూడా ఉండేది కాదు. కాని ఆయన ఆ సభలకు నన్ను రమ్మని కనీసం మాట మాత్రంగా కూడా అడగలేదు. నన్ను వక్తగాగాని, సమన్వయకర్తగాగానీ ఏ ఒక్క సదస్సులోనూ పాల్గోమని పిలవలేదు. ఆ సందర్భంగా సాంస్కృతిక శాఖ ఎన్నో పుస్తకాలు ప్రచురించింది. అటువంటి పుస్తకం ఏదైనా నాతో రాయించే ఆలోచన కూడా ఆయనకి కలగలేదు. నన్నెందుకు ఆహ్వానించడంలేదని కూడా నేనాయన్ని అడగలేదు. బహుశా ఆ సభల్లో పాల్గొనడానికి అవసరమైన అర్హత ఏదో నాకు లేదేమో అని ఊరుకున్నాను.

2017 లో తెలంగాణా ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించింది. అప్పట్లో నేను హైదారాబాదులోనే ఉన్నాను. ఆ సభలకు కూడా నాకు ఎటువంటి ఆహ్వానం లభించలేదు. నా జీవితంలో సగభాగం పైనే నేను తెలంగాణాలో జీవిస్తూ వచ్చినప్పటికీ, నా ఉద్యోగ జీవితలోకూడా సగానికి పైగా తెలంగాణాలోనే సేవలు అందించినప్పటికీ, నేను తెలంగాణాలో పుట్టి ఉండనందువల్ల నాకు ఆహ్వానం దొరకలేదేమో అనుకున్నాను. కాని ఆ సభల్లో సాహిత్య అకాదెమీ పురస్కారాలు పొందినవారికి ప్రత్యేక ఆహ్వానాలు వెళ్ళాయని విన్నాను. నాకు కూడా ఒక అకాదెమీ పురస్కారం వచ్చినందువల్ల ఆ కాటగిరీలోనైనా నాకు ఆహ్వానం వస్తుందేమో అనుకున్నాను. కానీ నాకు మాత్రం ఆహ్వానం దొరకలేదు.

గత పదేళ్ళలో నా సొంత రాష్ట్రంలోనూ, నేనుంటున్న రాష్ట్రంలోనూ జరిగిన ఇంత పెద్ద సభల్లో నాకు ఆహ్వానం దొరకనప్పుడు, పక్క రాష్ట్రం నుంచి, అది కూడా దక్షిణభారత భాషల ఉమ్మడి సదస్సునుంచి నాకు ఆహ్వానం లభించడమేమిటి? ఆ సతీష్ అన్నాయన నేను ఎవరో తెలిసే మా ఇంటికి వచ్చాడా? పొరపాటు చిరునామాకు రాలేదు కదా అనుకున్నాను. ‘అయ్యా, తెలుగు సాహిత్యంలో మహామహులు చాలామంది ఉండగా నన్నే ఎందుకు పిలుస్తున్నారు? నా గురించి తెలుసుకునే వచ్చారా’ అనడిగాను ఆయన్ని.

ఆయన చిరునవ్వాడు. ‘సార్, మేము దక్షిణభారత భాషల్లో ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకోకుండానే ఒక ఉమ్మడి సదస్సు గురించి ఆలోచిస్తామని అనుకుంటున్నారా?’ అనడిగాడు.

నేను ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాను. తెలుగు సాహిత్యంలో సంగం సాహిత్యం గురించి మొదటిసారి సవివరంగా రాసిన వాణ్ణి నేను. తమిళ నాయన్మార్లు, ఆళ్వార్లు సంచరించిన తావులు తిరిగి వాళ్ళ కవిత్వాల గురించి ‘పాటలు పుట్టిన తావులు’ అనే పుస్తకమే వెలువరించినవాణ్ణి నేను. భారతియార్ గురించీ, యు.వి. స్వామినాథ అయ్యర్ గురించి  చిన్నపాటి ప్రస్తావన వచ్చినా కూడా నిలువెల్లా పులకించిపోయే మనిషిని. ఈ మధ్యనే బసవన్న వచనాలనుంచి మూడువందల వచనాలు తెలుగు చేసినవాణ్ణి. ఎజుత్తచ్చన్ ని స్మరిస్తూ ప్రతి ఏటా జరిపే తుంచెన్ పండక్కి కిందటేడాదే తెలుగు భాష ప్రతినిధిగా హాజరయినవాణ్ణి. ఇవన్నీ, ఇంకా తమిళ, కన్నడ, మలయాళ భాషల గురించి నేను రాసిన వ్యాసాలూ, మాట్లాడిన మాటలూ మరెన్నో గుర్తొచ్చాయి. కాని అవన్నీ తెలుగులో కదా ఉన్నవి, ఈ కన్నడ సాహిత్యకారుడికి వాటిగురించి ఎలా తెలిసి ఉంటుంది?

కాని తర్వాత తెలిసింది, ఆ సదస్సు నిర్వహణ ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు తెలుగు నుంచి ఎవరిని ఆహ్వానించాలా అన్న ఆలోచన జరిగినప్పుడు, నా పేరు ప్రతిపాదనకి వచ్చినప్పుడు, ఒక తమిళ సాహిత్యవేత్త కూడా ఆ ప్రతిపాదనని బలపరిచాడట. మూడేళ్ళ కిందట నేను విష్ణుపురం సాహిత్య సమావేశానికి కోయంబత్తూరు వెళ్ళినప్పుడు ఆ తమిళ సాహిత్యవేత్త నా ప్రసంగం విన్నాడట. ‘ఆయన మాట్లాడగా విన్నాను. ఆయనకి తెలుగు భాష గురించీ, సాహిత్యం గురించీ చక్కని అవగాహన ఉంది, ఆయన్ని తప్పకుండా పిలవండి’ అన్నాడట.

కాబట్టి ఆ తమిళ సాహిత్యవేత్త ఎవరో ఆయనా, సతీష్ చిప్పరిగె  కూడా నా కులాన్నో, మతాన్నో, ప్రాంతాన్నో చూసి కాక, తెలుగు భాషతోనూ, తక్కిన దక్షిణాది భాషలతోనూ నాకున్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకునే పిలుస్తున్నారని నాకు అర్థమయింది.

కాని నేనున్న పరిస్థితుల్లో మూడు రోజుల పాటు బెంగలూరు వెళ్ళి ఆ సభల్లో పాల్గోలేనేమో అని అనుకున్నాను. ఆ మాటే చెప్పాను. నాకు రావాలనే ఉందిగాని, రాగలనని నిశ్చయంగా చెప్పలేను అని. అక్కడితో వాళ్ళొచ్చిన పని అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతే బాగుణ్ణనుకున్నాను, ఎందుకంటే వారు వచ్చేటప్పటికి మధ్యాహ్నం మూడుగంటలు దాటింది. మాది అయిదో ఫ్లోరు కావడంతో మా హాలు ఒక కొలిమిలాగా ఉంది. భరించలేని ఆ వేడిలో, ఆ ఉక్కలో ఆ ఇద్దరు సాహిత్యకారుల్నీ ఎక్కువసేపు కూచోబెట్టడం సముచితం కాదనుకున్నాను.

కాని సతీష్ గారు కదల్లేదు. ఆయన నాతో యక్షగానం గురించీ, బసవన్న గురించీ, చాళుక్యుల శాసనాల గురించీ, శివరామ కారంత గురించీ, ఒకటా, రెండా ఎన్నో విశేషాలు మాట్లాడుతూ ఉన్నారు. నా ‘ఎల్లలోకము ఒక్క ఇల్లై’ పుస్తకం గురించి అజయ్ ప్రస్తావించాడు. అందులో నేను పరిచయం చేసిన కవుల గురించీ, కవిత్వాల గురించీ ఆయన నన్ను మరింత విశదంగా అడుగుతూ ఉన్నాడు. అంతసేపు కూచున్నా ఆయన కనీసం టీ కూడా తాగలేదు. పైనుంచి ఎండ ధారలాగా కిందకి దిగుతున్న సెగ ఆయన్ని ఏమీ తాకలేదు. ఏమైతేనేం, మా సంభాషణ ఎక్కడో ఒకచోట ఆగేక, ఆయన లేచి నిల్చుని, ‘ఇంతసేపు మీతో మాట్లాడేక, మా సదస్సుకి మీరొస్తేనే న్యాయం జరుగుతుందని మళ్లీ అనిపించింది, ఎలాగైనా వీలుచూసుకుని రండి’ అని మళ్ళా ఆహ్వానం అందించేరు.

ఈ లోపు ఆగస్టు రానే వచ్చిందికానీ నేను వెళ్ళాలో వద్దో తేల్చుకోలేకపోయాను. ఒకవేళ బెంగలూరు వెళ్ళినా ఒకరోజు కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఒక్కరోజు కోసం, అది కూడా పదినిమిషాల ప్రసంగంకోసం అంతదూరం వెళ్ళాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను. నా బదులు మరొక సాహిత్యవేత్తనెవరినైనా ఆ సదస్సులో పాల్గొనేటట్టు చూడరాదా అని అజయ్ ని రెండుమూడు సార్లు అడిగాను. కానీ అతను ఒప్పుకోలేదు. ఆ సదస్సు సమన్వయం చేస్తున్న ప్రతిభానందకుమార్ మీతో మాట్లాడతానన్నారు అని చెప్పాడు. ఒకరోజు నేనే ప్రతిభగారికి ఫోన్ చేసాను. కాని ఆమె ‘మీ గురించి నేను విన్నాను, మీ ప్రసంగంకోసం ఎదురుచూస్తున్నాను. మీకు నచ్చిన ఫార్మాట్ లో, నచ్చిన అంశం మీద మాట్లాడండి, మీకు కాలపరిమితి తప్ప మరే నియమనిబంధనలూ పెట్టబోవడం లేదు నేను’ అన్నారు.

ఇక వెళ్ళక తప్పదని అర్థమయింది. నా సెషన్ పదో తారీకు పొద్దున్న పదింటికి. కాబట్టి ముందు రోజు సాయంకాలానికి బెంగలూరు చేరుకున్నాను. అజయ్ కి ఫోన్ చేస్తే ‘మీరు ఇక్కడికే వచ్చెయ్యండి, జయమోహన్ మీ గురించి అడుగుతున్నారు’ అన్నాడు. కాని నేను ఆ రాత్రికి బెంగలూరులో మా అక్క దగ్గరికి వెళ్ళాను. ఆ మర్నాడు పొద్దున్న అవినేని భాస్కర్ వచ్చి నన్నూ, మా అక్కనీ బుక్ బ్రహ్మ వేదిక దగ్గరకి తీసుకువెళ్ళాడు.

నేను వెళ్లగానే చేసిన మొదటిపని ప్రతిభానందకుమార్ ని కలవడం. ఎందుకంటే ఆమె మా సెషన్ కి సమన్వయ కర్త. ఆమె ఎ.కె.రామానుజన్ శిష్యురాలు అని తెలిశాక ఆమె పట్ల మరింత గౌరవం కలిగింది. ‘నాకు కాలపరిమితి ఉందన్నారు కాబట్టి ఎక్కడన్నా టైము ఎక్కువ తీసుకుంటానేమో అన్న సంకోచంతో నేను మాట్లాడాలనుకున్నది ప్రసంగపాఠం తీసుకొచ్చేను’ అని చూపించేను.

మా సెషన్ పదింటికి. అందులో నాతో పాటు ప్రసిద్ధ కన్నడ విమర్శకుడు నాగభూషణస్వామి, మళయాళ రచయిత పాల్ జకారియా, తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ ఉన్నారు. సదస్సు ప్రారంభానికి అరగంట ముందు సమన్వయ కర్త మా నలుగుర్నీ ప్రత్యేకంగా సమావేశపరిచి తాను మా గోష్టిని ఏ విధంగా నిర్వహించబోతున్నారో వివరించారు. తాను ఒక్కొక్కరికీ ఎంత సమయం ఇవ్వగలరో, ఏ వరసక్రమంలో పిలుస్తారో చెప్పారు. ప్రతి ఒక్క వక్త గురించీ ప్రత్యేకంగా పరిచయం చెయ్యడానికి సమయం సరిపోదుకాబట్టి, వక్త పేరూ, ఆయన ఏ భాషకి ప్రాతినిధ్యం వహిస్తాడో అది మాత్రమే చెప్పి ఊరుకుంటానని కూడా చెప్పారు. 45 నిమిషాల సమయానికి మించి మాకు ఒక్క నిమిషం కూడా అదనంగా దొరకదని చెప్పారు.

నేను ఎన్నో సాహిత్యసమావేశాలకు, గోష్టులకి, టివి చర్చలకు, రేడియో ఇంటర్వ్యూలకు, యూనివెర్సిటీ సెమినార్ల కూ హాజరయ్యాను. కాని ఎక్కడా ఇలా 45 నిమిషాల గోష్టికి ముందు 30 నిమిషాల ప్రిపరేటరీ సదస్సు నిర్వహించడం చూడలేదు. బుక్ బ్రహ్మ నుంచి నేర్చుకోవలసిన మొదటి పాఠం ఇది అని అనుకున్నాను.

ఆ సెషన్ మొదలయ్యాక చూసాను, మా ఎదురుగా ఒక పెద్ద డిజిటల్ క్లాక్ అమర్చారు. అక్కడ మా కాలవ్యవధి నిమిషాలు, సెకండ్లలో డిస్ ప్లే అవుతూ ఉంది. మా గోష్ఠి ముగియడానికి అయిదు నిమిషాలు ఉందనగా ఒక బెల్ మోగింది. ఎప్పుడో నా చిన్నతనంలో వక్తృత్వ పోటీల్లో పాల్గొన్నప్పుడు అలా ఉండేది. మూడు నిమిషాల పాటు ప్రసంగించవలసి ఉంటే, రెండు నిమిషాలు కాగానే ఒక వార్నింగ్ బెల్ మోగేది. ఆ సెషన్ కూడా అంతే. నలభై అయిదో నిమిషం పూర్తికాగానే మా తర్వాతి సెషన్ వాళ్ళు ఆ వేదిక మీదకు వచ్చేసారు. బుక్ బ్రహ్మ నుంచి ఎవరేనా నేర్చుకోవలసిన అమూల్య పాఠం ఇది.

అంటే మొదటి గంటన్నరలోనే నేను రెండు పాఠాలు నేర్చుకున్నాను. అవి ఒకరు చెప్పిన పాఠాలు కావు, ఆచరణ ద్వారా చేసి చూపించిన పాఠాలు.

మా సదస్సు ముందు ఒకరినొకరు పరిచయం చేసుకున్నప్పుడు కన్నడ వక్త నాగభూషణ స్వామి ‘మీకు చీనా కవిత్వం ఇష్టమని విన్నాను. నేను కూడా కొంత కవిత్వం అనువదించాను’ అని అన్నారు. చూద్దును కదా! అవి పందొమ్మిది హాన్ కవితలు! నా ఆశ్చర్యానికి హద్దు లేదు! ఇంతవరకూ పందొమ్మిది హాన్ కవితల గురించి మొత్తం భారతదేశంలో నాకొక్కడికే తెలుసు అనుకునేవాణ్ణి. కాని ఇదుగో, నా ముందు ఒక కన్నడ రచయిత, ఆ పందొమ్మిదీ కవితల్నీ అనువదించి పుస్తకంగా కూడా వెలువరించాడు! ఆయన తన మొబైల్ తెరిచి ఆ పుస్తకం పిడిఎఫ్ నాకు చూపించాడు. అందులో ప్రతి కవితకీ తానొక చీనాచిత్రలేఖనాన్ని కూడా జతపరిచింది చూపించాడు. నేను కూడా నా మొబైల్ తెరిచి  పందొమ్మిది హాన్ కవితల్లో రెండు కవితల్ని అనువదించి వాటికొక పరిచయాన్ని కూడా రాసిన నా పోస్టు చూపించాను. నాగభూషణ స్వామి నా తెలుగు పోస్టును రెండుమూడు పేరాలు తెలుగు లిపిలో చదివి అంగీకారంగా తల పంకించాడు. నాకు చెప్పలేనంత సంతోషం కలిగింది.

ఇది మూడవ పాఠం. అంటే ఇలాంటి సమావేశాలకు ఎందుకు వెళ్ళాలంటే, నువ్వు మాత్రమే సాహిత్యకారుడివి కావనీ, నీది మాత్రమే విశిష్ట సాహిత్య కృషి కాదనీ, నువ్వు నాలుగడుగులు నడిచినందుకు గర్విస్తుంటే, నీకన్నా పదడుగులు ముందు నడిచినవాడొకడు అక్కడ ఉంటాడనీ నీకు తెలుస్తుంది. నీకు వినయం కలుగుతుంది. రేప్పొద్దున్న మళ్ళా కృషి కొనసాగించడానికి నీకొక కొండగుర్తు దొరుకుతుంది. అంతేకాదు, నువ్వు కూడా ఆ రంగంలో ఎంతో కొంత కృషి చేసి ఉంటే, అప్పుడు ఆ మనిషిని చూసి నీకు న్యూనత కలగదు, పైపెచ్చు, గొప్ప స్ఫూర్తి కలుగుతుంది. నువ్వు అతనితో మాట్లాడటానికి ఒక యోగ్యత సంపాదించుకున్నావని కూడా తెలుస్తుంది.

నా సెషన్ పూర్తయిపోయాక నేను అక్కడున్న పుస్తకాల స్టాళ్ళు, సాహిత్య అకాదెమీ స్టాలు చూసి బయటకి వస్తుంటే జయమోహన్ ఎదురుపడ్డాడు. ఆయన నన్ను చూడాలనుకుంటున్నాడని అజయ్ చెప్పిన విషయం మర్చిపోయాను. కానీ జయమోహన్ మర్చిపోలేదు. ఆయనకి మా అక్కనీ, అక్కడున్న మరొక నలుగురైదుగురు తెలుగు మిత్రుల్నీ పరిచయం చేసాను. అక్కడే దాదాపు ఇరవై నిమిషాల పాటు మా మధ్య చిన్నపాటి గోష్టి జరిగింది.

His visit to Coimbatore was an eye-opener for us అని అన్నాడాయన నా గురించి మా అక్కతో. ‘ఆయన మాట్లాడకముందు తెలుగు సాహిత్యం గురించి మాకు అంతగా తెలియదు. కాని ఆయన తెలుగు సాహిత్యం గురించి మాకు చెప్పింది విన్నప్పణ్ణుంచీ మేము తెలుగు సాహిత్యం కూడా చదవడం మొదలుపెట్టాం’ అని కూడా అన్నాడాయన. ఇది నాలుగవ పాఠం. అంటే ఒక రచయిత లేదా వక్త నిన్ను ముగ్ధుణ్ణి చేసాడని నీకు అనిపించినప్పుడు, అతని ద్వారా ఎంతో కొంత తెలుసుకున్నావని నీకు అనిపిస్తున్నప్పుడు, దాని unconditional గా చెప్పగలగడం. రహస్యంగాకాదు, ప్రైవేటు డిస్కషన్లలో కాదు, నలుగురి ఎదుటా చెప్పగలగడం. ‘అలా చెప్పినందువల్ల జయమోహన్ నా కళ్ళల్లో మరింత ఎత్తుకి ఎదిగాడు’ అంది మా అక్క. ఆరోజు జయమోహన్ మాటలు విన్న వాళ్లు ఎవరేనా ఆ మాటే అంటారు.

అక్కడ ఆ షామియానా కింద నిలబడే జయమోహన్ ఆ ఇరవై నిమిషాల పాటు ఎన్నో విషయాలు మాట్లాడేడు. భారతీయ నవల గురించి, బెంగాలీ నవల గురించి, ఆశాపూర్ణా దేవి గురించి, తారాశంకర్ బందోపాధ్యాయ గణదేవత, ఆరోగ్యనికేతన్ ల గురించి, గోపీనాథ్ మొహంతి గురించి, రావి శాస్త్రి గురించి- ఆయన మాట్లాడిన, పేర్కొన్న రచనల్లో నేను బహుశా ఒక మూడవ వంతు మాత్రమే చదివి ఉంటాను. కాని ఆ మూడో వంతేనా ఆయన మాట్లాడుతున్నది అర్థం చేసుకోగలిగేను కదా అని సంతోషించేను.

ఇక ఉందాం అని సెలవుతీసుకోబోతుంటే జయమోహన్ ‘మీరే రూంలో ఉన్నారో చెప్పండి, నేను వచ్చి కలుస్తాను, మీతో చాలా మాట్లాడాలి’ అని అన్నాడు. నేను రూంలో ఉండటంలేదనీ, సాయంకాలం మళ్ళా తిరిగి వెళ్ళిపోతున్నాననీ చెప్తే, ‘అలా అయితే కోయంబత్తూరులో కలుద్దాం, మళ్ళా మీతో ఒక సంభాషణ ప్లాన్ చేస్తాను’ అని అన్నాడాయన. ఇది అయిదవ పాఠం. ఆ సదస్సుల్లో ఆయన ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాడని ప్రతి ఒక్కరికీ అనిపించింది. ఆయనలో ఆ ప్రత్యేక ఆకర్షణ ఆయన రచనలవల్లనో లేదా సినిమాల వచ్చిందో కాదు. అది ఆయనలో ఉన్న జిజ్ఞాస. నా యవ్వనకాలంలో నేనిట్లా ఉండేవాణ్ణి. ఒక కవినో, రచయితనో కనబడితే అతడు గొప్పవాడా, తక్కువవాడా అని చూసేవాణ్ణి కాదు. అతడితో ఇంకొంతసేపు కూచుని మాట్లాడాలని వువ్విళ్లూరేవాణ్ణి. జయమోహనూ, నేనూ సమవయస్కులమే గాని, నాలోని ఆ యువకుడు అదృశ్యమైపోయాడు, జయమోహన్ లో ఇంకా పదిలంగా ఉన్నాడు.

సాధారణంగా ఇటువంటి విస్తృత సాహిత్య సమావేశాలకు మనం హాజరయ్యినప్పుడు మనం మన పరిమిత ప్రపంచం నుంచి ఒక్కసారిగా బయటకు వెళ్తాం కాబట్టి మన కంఫర్ట్ జోన్ నుంచి బయటపడుతున్నట్టు  మనకి తెలుస్తుంటుంది. కాబట్టి మనకి వెంటనే కలిగే భావాల్లో న్యూనత  తప్పనిసరిగా ఉంటుంది. వాళ్ళే అధికులేమో మనం అంత యోగ్యులం కామేమో అనిపిస్తుంది. కానీ కొంత సేపు ఓపిక పట్టగలిగితే, మనలోని జిజ్ఞాసని కాపాడుకోగలిగితే, అక్కడ చాలామంది మనకి పరిచయమవుతారు. కొత్త లోకాల్ని పరిచయం చేస్తారు. నువ్వు కాక మరొకరు కనబడ్డప్పుడు వారితో నిన్ను పోల్చుకోవడం మానవసహజమే అయినప్పటికీ, అలా పోల్చుకోకుండా ఉండలేకపోయినప్పటికీ, నెమ్మదిగా నీకు నీలోని శ్రేష్టగుణాలు కూడా కనిపించడం మొదలుపెడతాయి. ఒక కొత్త వెలుగులో నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు. అలా కొన్ని సమావేశాలకు నువ్వు హాజరవుతూ ఉంటే నీకు మొదట్లో కలిగే న్యూనత నెమ్మదిగా అదృశ్యమై దానిస్థానంలో ఒక చొరవ, ఉత్సాహం, గొప్ప exposure సాధ్యమవుతాయి. నాలుగు దక్షిణాది భాషల రచయితల మధ్య ఇటువంటి ఒక సాన్నిహిత్యం నెలకొనాలన్నదే బుక్ బ్రహ్మ ఆశయం.

ఇంతకీ బుక్ బ్రహ్మలో నేను గడిపింది దాదాపు నాలుగైదు గంటలకన్నా ఎక్కువలేదు. కాని ఆ కొద్ది సమయంలోనే కనీసం అయిదు విలువైన పాఠాలు నేర్చుకున్నాను. మరి మూడు రోజులూ అక్కడ గడిపిన మిత్రులు మరెన్ని విలువైన పాఠాలు నేర్చుకుని ఉంటారో! ఎవరేనా పంచుకుంటే వినాలని ఉంది.

4-9-2024

5 Replies to “అయిదు పాఠాలు”

  1. మీరు పదో తేదీ వస్తున్నారని నాకు తెలీదు అన్న. లేకుంటే కలిసి ఉండేదాన్ని.ఇలాంటి మంచి పాఠాలు మీ నుండి తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది.

  2. మీరు ఈ సదస్సు కి వస్తున్నట్టు నాకు తెలీదు, మిమ్మల్ని ఒకసారి కలవాలని, మాట్లాడాలని వుంది, అవినేని భాస్కర్ గారు నన్ను రమ్మని పిలిచారు గానీ నా కొడుకు కేశఖండన కార్యక్రమం మా వూరిలో పెట్టుకోవడం వల్ల కుదరలేదు, మిమ్మల్ని తప్పక కలుసుకొవాలనే కోరిక తీరలేదు

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%