ఒక చిక్కుముడి కథ

యశస్వి కుమార్ అనే ఇంకా పాతికేళ్లు నిండని ఒక యువకుడు రాసిన వేసవి కూలీ అనే ఈ నవలిక పధ్నాలుగేళ్ళ పిల్లవాడి జీవితంలో ఒకరోజు కథ. స్కూళ్ళకి వేసవి సెలవులు మొదలైన మొదటిరోజునే క్రికెట్‌ ఆడుకోవాలనో మరేవో కలలు గన్న పిల్లవాడు అనుకోని పరిస్థితుల్లో కూలిపనికి పోవలసి రావడం ఈ కథకి ఇతివృత్తం. ఆ పిల్లవాడు జీవితంలో మొదటిసారిగా ఒక కూలీగా ఒక రోజంతా గడిపిన అనుభవాల కథనం ఇది.

ఏదేనా ఒక నాటకం రాయాలనుకుంటే ఆ కథ ఒక రోజుకి మించి ఉండకూడదన్నాడు అరిస్టాటిల్‌. ఐర్లాండులో డబ్లిన్‌లో లియోపార్డ్‌ బ్లూమ్‌ అనే ఒక పాత్ర ఒకరోజు జీవితాన్ని జేమ్స్‌ జాయిస్‌ ‘యులిసిస్‌’ పేరిట పెద్దనవలగా రాసాడని మనకు తెలుసు. ఆధునిక నగరమానవుడి జీవితంలో ఏ ఒక్కరోజు తీసుకున్నా అది ప్రాచీన గ్రీకు మహాకావ్యం ఒడెస్సీలో ఒడెస్యూస్‌ చేసిన సాహసయాత్రకు ఏ మాత్రం తీసిపోదని జాయిస్‌ భావించాడు.

ఈ వేసవి కూలీ కూడా ఒక్కరోజు కథ. ఇంకా చెప్పాలంటే ఒకరోజులో సూర్యోదయం నుండి రాత్రి పొద్దుపోయేదాకా నడిచిన కథ. కాని ఆ ఒక్కరోజులోనే శ్రీరాం అనే పిల్లవాడు లోనైన అనుభవాలు, ఎదుర్కొన్న సమస్యలు, అతడి అనుభవాల ద్వారా రచయిత మనముందు లేవనెత్తిన ప్రశ్నలు ఒక ఇతిహాసానికి సమానమైనవి కావడం మనల్ని చకితుల్ని చేస్తుంది.

2024 లో అన్వీక్షకి ప్రచురణ సంస్థ నిర్వహించిన నవలలపోటీలో ఈ నవల ఎంపిక కావడం యాదృచ్ఛికం కాదనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏడాది జూలైలో భారత పార్లమెంటు ముందు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన ఎకనమిక్‌ సర్వే లేవనెత్తిన ప్రశ్నలూ, ఈ వేసవికూలీ నవల రేకెత్తిస్తున్న ప్రశ్నలూ దాదాపు ఒకటే.

ఎకనమిక్‌ సర్వే చెప్పినదాని ప్రకారం భారతదేశంలో ఉన్నతవిద్య పూర్తి చేసుకుంటున్నవాళ్ళల్లో కేవలం 52 శాతం మాత్రమే ఉద్యోగాలకి తగ్గ నైపుణ్యాలతో బయటికొస్తున్నారు. అంటే సగానికి సగం పట్టభద్రులకి పట్టాదొరికినా కూడా పనికి తగిన నైపుణ్యాలు కొరవడుతున్నాయన్నమాట.

జనాభాపరంగా భారతదేశానికి ఎంతో అరుదైన డెమోగ్రాఫిక్‌ డివిడెండు ఇప్పుడు లభ్యంగా ఉందని ప్రణాళికావేత్తలు ఎన్నో కలలు కంటూ ఉన్నారుగాని, ఆ కలల్లో సగం వట్టికలలుగా మాత్రమే మిగిలిపోతాయని ఎకనమిక్‌ సర్వే చెప్తున్నది.

కాని ఎకనమిక్‌ సర్వే చెప్తున్నది సగం సత్యం మాత్రమే. మన పాఠశాలలనుంచీ, ఉన్నత విద్యాసంస్థలనుంచీ బయటికొస్తున్న విద్యార్థులకి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు చాలినంతగా అలవడటం లేదన్నంతవరకూ మాత్రమే ఎకనమిక్‌ సర్వేకి అర్థమయ్యింది. కానీ మన యువత అటు ఉద్యోగాలకే కాదు, ఇటు తమ కుటుంబాలకు కూడా పనికి రాకుండా పోతున్నారనీ, తమ తల్లిదండ్రుల కష్టం గురించి వాళ్ళకి అణుమాత్రం కూడా తెలియదనీ, వాళ్ళు ఎట్లా రెక్కాడిస్తే తమ డొక్కాడుతున్నదో కూడా ఈనాటి యువతకు తెలియడం లేదన్నది ఈ కథకుడు మనకి చెప్తున్న సత్యం.

పిల్లల్ని ఉద్యోగాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దడంలో మన విద్యావిధానం విఫలమవుతున్నది సరే, చివరకి, తమ ఇంటిబరువు మోయడానికీ, బాధ్యత పంచుకోడానికీ కూడా వాళ్లని పనికిరాకుండా చేస్తున్నదనే సత్యం ఈ నవల చెప్తున్న మొదటి పాఠం.

అందుకనే, చదువు సగంలో మానేసి కూలిపనిలో చేరిన వేణు శ్రీరాంతో ఇలా అంటున్నాడు:

సదువుకున్నోడు పంచెస్సే ఉజ్జోగం అంటారు. సదువుకోనోడు పంచెస్సే కూలి అంటారు. అదే నేను కనిపెట్టిన తేడా.

ఆ మాటలు వినగానే శ్రీరాంకి కొత్తగా అనిపించింది. ‘అందరూ చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పిన వారే. అందులోనూ కూలిపని, ఉద్యోగం ఒక్కటే అన్నవారు ఒక్కరూ లేరు’ అని అనుకుంటాడు.

కాని వేణు చెప్తున్నది తన జీవితానుభవాల మీంచి చెప్తున్న సత్యం. అతడిరకా ఇలా చెప్తున్నాడు:

జాబ్‌ చేసేటప్పుడు నాకు ఒక విషయం బాగా అర్థమయిండాది. మనం చదువుకునే చదువు ఎందుకూ పనికిరాదు అని. ఇందాక సైన్‌ తీట, కాస్‌ తీట అన్నాను గదా అది చదివి నాకేమొచ్చిందంటే తలనొప్పొచ్చింది. ఇంతవరకూ నాకు అది యాడకూడా ఉపయోగపడలేదు. అలానే ఇంగేవో ఫార్ములాలు ఉంటాయి. అవి కూడా నాకేంటికి పనికి రాలేదు. అట్నే మిగతా సబ్జెక్టులల్లో కూడా ఏవేవో ఉంటాయి. అవన్నీ ఏం చేసుకోవాలా? అవి కష్టపడి చదవడం వల్ల నాకు ఏం లాభం వచ్చిండాది? నా జీవితానికి ఏం లాభం వచ్చిండాది?

చాలా తీవ్రమైన ప్రశ్నలు. కాని వేణు అక్కడితో ఆగలేదు. ఇంకా ఇలా అంటున్నాడు:

సరే అనుకొని ఇవన్ని పక్కన పెట్టి నెలరోజులు జాబ్‌ చేసినా. పన్నెండువేలు చేతిలో పెట్టిండారు. మా నాయన పెద్దకూలీ పంచేసి నెలకు పదహైదువేలు సంపాదిస్సాండాడు. పన్నెండేళ్ళు కష్టపడి చదివి, జాబ్‌లకి అప్లై అంటూ వేలు పోస్సే నా మొకానా పన్నెండువేలు పడేసిండారు. పైగా కూలిపని కంటే గొడ్డుచాకిరి ఆడతెలుసునా! మెంటల్‌ టార్చర్‌. కూలిపని చులకన బతుకే. కాని ఉద్యోగం బానిస బతుకు అని అర్థమయుండాది.

వేణు చెప్తున్న మాటలే నిజమా కాదా అని శ్రీరాం తేల్చుకునేలోపే తాను ఏ ఇంటిపని చేస్తున్నాడో ఆ ఇంటియజమాని శ్రీనివాసులు శ్రీరాం వివరాలు కనుక్కుని అతడితో ఇలా అంటున్నాడు:

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చదివినవాడు ఎవడైనా సరే జీవితంలో పైకొస్తాడు. కచ్చితంగా పైకొస్తాడు. చదువు ఎవరినీ నాశనం చెయ్యదు. చదువుకు ఉన్న శక్తి అలాంటిది. విలువ అలాంటిది. నేనే అందుకు ఉదాహరణ. చదువుకోకపోయి ఉంటే ఇదంతా నాకు ఉండేదా? ఎక్కడినుండి వస్తాయ్‌ ఇవన్ని. మా నాన్నలాగా నేను కూడా అప్పులు చేసుకుంటూ ఉందునేమో. చదువుకున్నాం కాబట్టే ఇలా ఉన్నాం. నేను మా పిల్లలకి కూడా చెప్తాంట. రేయ్‌ చదవండ్రా. చదివితేనే జీవితం బాగుంటుందిరా అని. కాబట్టి చదవాలి, చదివితేనే బాగుపడతావ్‌.’

చదువు గురించిన ఈ రెండు స్వానుభవాలు-ఒకటి చదువుకోవడం వేస్ట్‌ అనే వేణు అనుభవం, రెండోది చదువు ఎవర్నీ నాశనం చెయ్యదనే శ్రీనివాసులు అనుభవం- ఇవి రెండూ శ్రీరాంని అయోమయంలో పడేయకుండా ఎలా ఉంటాయి? అతడు-

తన ముందే అల్లుకున్న ఒక చిక్కుముడిని విప్పలేకపోతున్నాడు. ఆ ప్రశ్న బుర్రంతా వ్యాపించింది. విచ్చలవిడిగా స్వైరవిహారం చెస్తోంది. బుర్ర రకరకాల ఆలోచనలు, అనుమానాలతో నిండిరది. ఒక్క ప్రశ్న వంద ప్రశ్నలకు ఊపిరిపోస్తోంది.

ఇది ఈ నవల్లో శ్రీరాం అనుభవమే కాదు. నవల ముగించేటప్పటికి మన అనుభవం కూడా.

మరి ఈ చిక్కుముడి విప్పేదెవ్వరు? కథకుడా? ఆ బాధ్యత కథకుడిది కాదంటాను. అది మనం ఎవరికి వారు ఆలోచించి తేల్చుకోవలసిందే.

కాని అప్పటిదాకా ఏం చెయ్యాలి? కథకుడికి ఆ విషయంలో స్పష్టత ఉంది. కాలు బెణికి పనికి పోలేని తల్లికోసం తాను వేసవి కూలీగా మారాలని శ్రీరాం అనుకోవడం కథకి ప్రాణం. స్కూలు నడిచినంతకాలం అతడికి లభ్యంకాని విద్య సెలవులు మొదలుకాగానే, ఒక్కరోజు కూలిపనికి పోగానే పట్టుబడింది. తల్లి కష్టాన్ని తన భుజాలమీదకు తీసుకోవడంతో శ్రీరాంకి అన్నిటికన్న ముఖ్యమైన సంస్కారం, అసలైన జీవననైపుణ్యం పట్టుబడిందని మనకి చెప్పకుండా చెప్పడమే ఈ చిన్ని నవల సాధించిన పరమార్థం.


Featured image courtesy: UNICEF

6-8-2024

10 Replies to “ఒక చిక్కుముడి కథ”

  1. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చదివినవాడు ఎవడైనా సరే జీవితంలో పైకొస్తాడు. కచ్చితంగా పైకొస్తాడు. చదువు ఎవరినీ నాశనం చెయ్యదు. చదువుకు ఉన్న శక్తి అలాంటిది. విలువ అలాంటిది. నేనే అందుకు ఉదాహరణ. చదువుకోకపోయి ఉంటే ఇదంతా నాకు ఉండేదా? ఎక్కడినుండి వస్తాయ్‌ ఇవన్ని. మా నాన్నలాగా నేను కూడా అప్పులు చేసుకుంటూ ఉందునేమో. చదువుకున్నాం కాబట్టే ఇలా ఉన్నాం. నేను మా పిల్లలకి కూడా చెప్తాంట. రేయ్‌ చదవండ్రా. చదివితేనే జీవితం బాగుంటుందిరా అని. కాబట్టి చదవాలి, చదివితేనే బాగుపడతావ్‌.’

    నా ఓటు కూడా చదువు కె. చదువు ఎంత జ్ఞానాన్ని, హాయిని ఇస్తుందో, సరిగా చదువుకోకపోవడం వల్ల బతుకు ముగిసిపోతున్న సమయానికి చదువు విలువ తెలిసి కన్నీరు పెట్టుకోవడం మినహా నేను చేయగలిగేదేం లేదు.
    నేనూ కూలీ పనులు చేసాను. రెక్కలు ముక్కలు చేసుకుని. ఫలితం పిల్లల్ని చదివించగలిగాను.చదువు విలువ తెలుసుకుని.
    కానీ వేదన అంతా చదువు లేదనే చివరికి చింత.

    ఇంత క్లుప్తంగా ఎలా చెప్తారో గానీ మీరు… విషయం సూటిగా అర్థం అయింది. లేచీ లేవగానే చూసి చూడగానే చదివేయాలని అనిపించింది.
    మీరు మీ వినసొంపైన మాటలతో నవలలోకి, ఏ విషయం చెప్తే ఆ విషయం లోకి తీసుకుపోతారు. అది మీలోని greatness.
    నమోనమః.

  2. కాలు బెణికి పనికి పోలేని తల్లికోసం తాను వేసవి కూలీగా మారాలని శ్రీరాం అనుకోవడం కథకి ప్రాణం. స్కూలు నడిచినంతకాలం అతడికి లభ్యంకాని విద్య సెలవులు మొదలుకాగానే, ఒక్కరోజు కూలిపనికి పోగానే పట్టుబడింది. తల్లి కష్టాన్ని తన భుజాలమీదకు తీసుకోవడంతో శ్రీరాంకి అన్నిటికన్న ముఖ్యమైన సంస్కారం, అసలైన జీవననైపుణ్యం పట్టుబడిందని మనకి చెప్పకుండా చెప్పడమే ఈ చిన్ని నవల సాధించిన పరమార్థం.
    ఇది 2 వ పాయింట్. నేను ఇప్పుడు వంటింట్లోకి, లేదా ఏదైనా పని చేయడానికి వెళ్తే… నువ్వు పడ్డ కష్టాలు చాలు. మమ్మల్ని చదివించడానికి నువ్వు పడిన ఆరాటం చూసి కూడా ఇంకా నీకు రెస్ట్ ఇవ్వకపోవడం పిల్లల తప్పు అవుతుంది. అంటారు నాపిల్లలు.
    ఏది ఏమైనా చదువు విలువ మాటల్లో చెప్పలేనిది.
    నమోనమః

  3. మన చదువుల తీరు మీద ఇది ఒక పెద్ద సవాల్. నేను రాస్పల్లిలో పనిచేసేటప్పుడు కొందరు విద్యార్థులు అనివార్య పరిస్థితుల్లో వ్యవసాయపు పనులకు వెళ్లవలసి వచ్చేది. మిగతా టీచర్లు కంప్లెయింట్ చేస్తే వాళ్లను ఏమనవద్దని నచ్చచెప్పటం వారికి నచ్చేది కాదు. విద్య విద్యార్థులను ప్రయోజకులను చెయ్యాలి కాని పట్టభద్రుల్ని చెయ్యడం కాదు. విద్యారంగం మీద చాలా పరిశ్రమ చేయాలి. అవగాహనా కార్యక్రమాలు పాఠశాల స్థాయినుండే మొదలు కావాలి . నేనొక డాక్టరును,ఇందనీయరును అన్న దానికంటే గొప్పగా నేనొక ఫార్మర్ అని చెప్పుకునే రోజు రావాలి.

  4. ఆ ఒక్కరోజులోనే శ్రీరాం అనే పిల్లవాడు లోనైన అనుభవాలు, ఎదుర్కొన్న సమస్యలు, అతడి అనుభవాల ద్వారా రచయిత మనముందు లేవనెత్తిన ప్రశ్నలు ఒక ఇతిహాసానికి సమానమైనవి కావడం మనల్ని చకితుల్ని చేస్తుంది.

    He succeeded sir. Congratulations to Kumara Yashaswi💐

  5. చదువు వల్ల ఉద్యోగం వచ్చినా రాకపోయినా, జీవితాన్ని, మనుషులనీ చదవటం నేర్పుతుంది. వివేకాన్ని, విచక్షణను నేర్పుతుంది. కూలి పనికి వెళ్తే అదే డబ్బు వచ్చినా, కూలి పని రోజూ దొరికేది కాదు. అందులో కూడా ఆ మేస్త్రీ కి ఎంతో కొంత ముట్టచెప్పకపోతే పిలవడు. కానీ ఉద్యోగం దొరకటం మరీ కష్టం. నిలకడైన ఉద్యోగం కాక, ప్రైవేట్ షాపుల్లోనో మరోచోటో అయితే గొడ్డుచాకిరితో పాటు యజమాని పెట్టే బాధలు, అవమానాలు, తొలగింపులు తట్టుకోవాలి. ప్రభుత్యోద్యోగం రాదు. ఏం చెయ్యాలి. నిజంగా జటిలమైన సమస్యే. మరోమాట. ఈ కాలపు చదువు విజ్ఞతనివ్వదు. అది విద్య వున్నా లేకపోయినా ఎవరికివారు స్వానుభవంతో
    తెలుసుకోవలసిన విషయం. రాబోయే కాలంలో ప్రభుత్వోద్యోగాలు ఎండిన చెరువులో చిన్న
    చెలమలో ఉన్న చేపపిల్లల్లాగా అతి తక్కువైపోతాయి.

    1. ఈ చిక్కుముడి విప్పడానికి ప్రయత్నించే కొద్దీ మరింత చిక్కు పడుతూ ఉంది.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%