సాత్త్వికీకరణ వాచకం

ధూళిపాళ అన్నపూర్ణగారు ఇవాళ డెబ్భైవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమె గొప్ప విదుషీమణి. ఆమె భర్త ధూళిపాళ మహదేవమణిగారు కూడా గొప్ప సంస్కృత విద్వాంసులు, ప్రవచనకారులు. ఆ దంపతులు రాజమండ్రిలో ఉంటారు. అన్నపూర్ణగారిది కోనసీమలోని పొడగట్లపల్లి అగ్రహారం. వారి తాతగారు దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారు ప్రసిద్ధ వ్యాకరణవేత్త. కాకినాడలో పైండా సత్యనారాయణమూర్తి ఓరియెంటల్ కళాశాలలో ఆమె మా అక్కా చాలాకాలంపాటు కలిసి పనిచేసారు. ఈ రోజు అన్నపూర్ణగారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబసభ్యులు వారి సాహిత్య వ్యాసాల్నీ, కథల్నీ ‘అంతర్వీక్ష’ పేరుమీద ఒక పుస్తకంగా ప్రచురించి ఆమెకు కానుక చేస్తున్నారు. ఆ పుస్తకానికి నన్ను కూడా ఒక ముందుమాట రాయమని వారి అమ్మాయి నన్ను అడగడం నా భాగ్యం. అన్నపూర్ణగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నా వ్యాసాన్నిక్కడ మీతో పంచుకుంటున్నాను.


గురజాడ అప్పారావుగారు తన డైరీల్లో విజయనగరం మహారాజా ఆనందగజపతి గురించిన విశేషాలు తలచుకుంటూ ఒకసంగతి రాసేరు. అదేమంటే రాజావారికి ఒకసారి ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఒక సందేహం కలిగిందట. దాన్ని తన మిత్రుడైన ఒక బిషప్పుగారితో ప్రస్తావిస్తే ఆ బిషప్పు ‘బట్లరు దొర దీనిని ఫలానా పుస్తకంలో ఫలానా ఫలానాచోట వివరణ రాసినట్టుంది’ అని అన్నాడట. అప్పుడు రాజావారు ‘బాగానే ఉంది కథ. అదేమిటో తెలియచెప్పక, రాసినట్టుందంటాడేమిటి? తను ఇంగ్లిషువాడై వుండి కూడా బట్లరు గురించి ఇతమిత్థమని తెలియదే!’ అని తలపోసి బిషప్పు వెళ్ళిపోగానే, బుక్‌ సెల్లరు వద్ద బట్లరు గ్రంథం కొని పరిశీలనగా చూసేరట. బిషప్పు పేర్కొన్న చోట, ఆ వివరణ విపులంగా ఉందట. అప్పుడు రాజావారిలాగ అనుకున్నారట: ‘ఈ ఇంగ్లిషు విద్వాంసులకు యెంత నిశ్చయ జ్ఞానముంది. దానిని చెప్పేటప్పుడు ఎంత నాగరికంగా, నమ్రతగా చెప్పుతారు!’ అని.

అన్నపూర్ణగారిని చూసినప్పుడల్లా, ఆమెతో మాట్లాడినప్పుడల్లా నాకీ మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఒకకి మనిషి పాండిత్యమూ, సాహిత్యమూ కూడా సమకూరేక ఆమె వ్యక్తిత్వంలో జీవితం పట్ల నిశ్చయజ్ఞానంతో పాటు, మనుషుల పట్ల సానుకంపతో కూడిన నమ్రత కనిపించడమే ఆమె సంస్కారానికి గుర్తు. ఆటువంటి సంస్కారి తాను సాత్త్వికురాలు కావడమే కాక, తను చుట్టూ ఉన్న మనుషుల్నీ, పరిసరాల్నీ కూడా సాత్త్వికీకరిస్తుంది. నిజానికి కావ్యానందం, భక్త్యావేశాల పరమార్థం ఇదేననే మన పూర్వీకులు చెప్తూ వచ్చారు.

అటువంటి సంస్కారం సాహిత్యం వల్ల అలవడుతుందని నేను చాలాకాలంగా నమ్ముతూ వచ్చేను. కాని అన్నపూర్ణగారిలాంటి వాళ్ళని చూసినతర్వాత, సాహిత్యం కొత్తగా ఏ సంస్కారాన్నీ అలవర్చదనీ, మనలో ఉన్న సంస్కారాన్ని మరింత తేటపరచడమే సాహిత్య ప్రయోజనమనీ గ్రహించాను. ఉదాహరణకి గంధపు చెక్కని చూడండి. దానిలో సుగంధం బయటనుంచి వచ్చింది కాదు, కాని అది సానకి రాపాడినప్పుడు చందనసుగంధం చిమ్ముతుంది. అన్నపూర్ణగారి లాంటి వాళ్లతోమాట్లాడుతున్నప్పుడు వారికీ, మనకీమధ్య ఒక చందన సుగంధం అల్లుకోడానికి కారణమిదే అనుకుంటాను. ఆమెలో ఉన్న సంస్కారానికి ఆమె పాండిత్యం, ఆమె అధ్యయనం మరింత మెరుగుపెట్టాయి. ఆమె ముందే సాత్త్వికురాలు, సాహిత్యం ఆమెని మరింత సాత్త్వికీకరించింది. ఇక ఆమె ఎవరితో మాట్లాడినా, ఏమి మాట్లాడినా ఆ సాత్త్వికసుగంధం పొంగిపొర్లకుండా ఎలా ఉంటుంది?

అప్పారావుగారు ప్రస్తావించిన సంఘటనలో రెండు సుగుణాల మేలిమి కలయిక కనిపిస్తున్నది. ఒకటి నిశ్చయజ్ఞానం, రెండోది ఆ జ్ఞానాన్ని పంచుకునేటప్పుడు ఉండవలసిన వినయం. అటువంటి నమ్రతని ఆయన నాగరికత అన్నాడు. పూర్వకాలపు భాషలో దాన్ని సభ్యత అనేవారు. సభ్యత అంటే సభలో వ్యవహరించవలసిన తీరు అని కాదు. ఇద్దరు మనుషులు కలుసుకున్నప్పుడు ఒకరిపట్ల ఒకరు అటువంటి నమ్రతతో ప్రవర్తించినప్పుడు మాత్రమే ఆ కలయిక ఒక సభగా మారుతుంది. సంస్కృతిగా వికసిస్తుంది.

2


అన్నపూర్ణ గారి ఈ ‘అంతర్వీక్ష’ వ్యాసాలు చదువుతున్నంతసేపూ నాకిలాంటి అనుభూతినే కలిగింది. మీరు చదవడం మొదలుపెట్టాక మీక్కూడా కలుగుతుంది. తాను చదివిన సాహిత్యం గురించి ఆమె మనతో చెప్తున్నప్పుడు తన సంస్కారాన్ని మనతో పంచుకోవడమే కాదు, మనలోపలి సంస్కారాన్ని కూడా వెలికి తీస్తున్నారని గ్రహిస్తాం. పుస్తకం చదవడం ముగించేక మనకొక అరుదైన నాగరికురాలు పరిచయమైందనీ, ఆమె మనకొక సభ్యతను అలవరుస్తున్నదనీ బోధపడుతుంది.

చూడండి, ఇందులో రెండు భాగాలున్నాయి. ‘అంతర్వీక్ష’, ‘బహిర్వీక్ష’. అంతర్వీక్ష ఆమె చదువుకున్న సాహిత్యం గురించిన తలపోత. బహిర్వీక్ష ఆమె రాసిన కథలు. మొదటి భాగంలో ఆమె మనతో పంచుకున్న సాహిత్యంభారతీయ సంస్కృతికి మూలకందాలైన రామాయణ మహాభారతాలూ, కావ్యాలూ, నదులూ, దేవతలూను. రెండో భాగంలో ఆమె తాను జీవిస్తున్న వర్తమాన సమాజంలో తాను చూసిన, విన్న, తాను వివేచించిన జీవితానుభవాల్లోంచి తాను గ్రహించిన సత్యాల్ని మనతో పంచుకోడానికి చెప్పిన కథలూను.

అసలు ఈ నిర్మాణమే చాలా ప్రశస్తంగా ఉంది. ఎందుకంటే, సాహిత్యకారుల సంగతి అలా ఉంచి, ముందు ప్రతి మనిషీ తనను తాను తీర్చిదిద్దుకోవలసిన జీవన శిల్పం ఇది. కావ్యపఠనం, పూర్వమహాకవుల, ఇతిహాసకారుల రచనలూ, సంస్కృతీ, సంప్రదాయాలూ మనిషిలోపల జీవితాన్ని సంపద్వంతం చెయ్యవలసినవి. వాటిల్లో మనం వెతకవలసింది బయటి జీవితం గురించి కాదు. బయటి జీవితంలోలాగా ఆ పుస్తకాల్లో లేదే అని వాటిని విమర్శించడం కాదు.

జీవితమంటే పైకి కనిపించే వేషభాషలూ, వస్తు సామగ్రీ కాదు. ఒక కాలంలో మనుషులు తాములోనైన జీవితానుభవాలనుంచి తమకి సంప్రాప్తమైన సుఖదుఃఖాల్ని మథించి కొన్ని సత్యాల్ని మన రక్తంలో ప్రవేశపెట్టి వెళ్ళిపోతారు. మనం ప్రస్తుత జీవితం కొత్తగా జీవిస్తున్నాం అనుకుంటాంగానీ, నిజానికి, జీవితానుభవాల పట్ల మన ప్రతిస్పందన ఎంత కొత్తగా కనిపిస్తుందో అంత పురాతనం. మన పూర్వీకులు కూడా జీవితం యెదట ఇంత బేలగానూ, ఇంత ధీరులుగానూ ప్రవర్తించేరనీ, ఆయా అనుభవాలు తమకి ఎదురైనప్పుడు ఆ తత్తరపాటులో వాటిని ఎలా నిభాయించుకోవాలో తెలియక మంచో, చెడో వాటినుంచి ఎదురయ్యేక, అప్పుడు నెమ్మదిగా, వాటినుంచి తమ తర్వాతి తరాలు గ్రహించవలసిన సూత్రాలు ఏముంటాయో వాటిని పాఠాలుగా చెప్పడానికే సాహిత్యసృజన చేసారనీ మనం తెలుసుకోవాలి.

జీవితం ఎదట మనం ప్రధానంగా రెండు రకాల అనుభూతులకు లోనవుతామని చెప్తూ అరిస్టాటిల్‌ వాటిని pity and fear అని అన్నాడు. జీవితం మనకి కష్టం కలిగించినప్పుడు మనం భయానికి లోనవుతాం. అప్పుడు మనం జీవితం నుంచి దూరంగా జరగాలనుకుంటాం. ఆదే, ఎదటివాళ్ళు కష్టానికి లోనైనప్పుడు వాళ్ళ పట్ల మనకు తెలీకుండానే మనలో కరుణ మేల్కొంటుంది. వాళ్లని ఓదార్చేక్రమంలో జీవితానికి దగ్గరగా జరుగుతాం. ఒకసారి ఈ సత్యం బోధపడ్డాక, ఆ అంతర్దృష్టితో, మన చుట్టూ ఉన్న జీవితాన్ని మనం పరికించినప్పుడు, మనకి తత్తరపాటు కలగదు. మనం మరింత ధీరులుగా జీవితాన్ని సమీపించగలుగుతాం. మరింత మానవీయంగా మనతోటిమనుషుల సుఖదుఃఖాల్లో పాలుపంచుకోగలుగుతాం. ఈ పుస్తకంలోని ‘బహిర్వీక్ష’ భాగంలోని కథల్లో మనకు కనిపించేది ఇదే.

అంతర్వీక్ష అంటే చూపు లోపలకి తిప్పుకోవడం, బహిర్వీక్ష అంటే బయటి ప్రపంచాన్ని చూడటం అనేది మామూలు అర్థం. ఈ పుస్తకంలో ఆ అర్థాల్ని దాటిన పరమార్థం మనకు స్ఫురించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, అన్నపూర్ణగారు ప్రాచీన సాహిత్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ చూపులో తాను జీవిస్తున్న కాలానికీ, దేశానికీ సంగతమైన కొత్త మెలకువలు కూడా మనకి కనిపిస్తాయి. అలాగే తన చుట్టూ ఉన్న జీవితాన్ని కథలుగా చెప్తున్నప్పుడు అందులో పూర్వమహాకవులు తనలో జాగృతం చేసిన మెలకువలు కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తూనే ఉంటాయి.

ఉదాహరణకి దేవయాని, శర్మిష్ఠల కథనే చూడండి. సుప్రసిద్ధమైన కథ. ఆ కథని ఒక పురాణకథగా చదవవచ్చు లేదా మహాభారతానికి ప్రాతిపదికగా చెప్పదగ్గ కథల్లో ఒకటని కూడా చెప్పుకోవచ్చు. కాని దేవయాని పైన తన వ్యాసం మొదలుపెడుతూ, అన్నపూర్ణగారు ‘పురాణేతిహాసాల్లోని స్త్రీలను పరిశీలిస్తే-మనకు అత్యున్నతమైన వ్యక్తిత్వం కలవాళ్ళు అనేకమంది గోచరిస్తారు ’ అని మొదలుపెడుతూ ఆ తర్వాత ఏమంటున్నారో చూడండి:

‘చాలాకాలం నుండి స్త్రీలను పరిశీలించడంలో రెండు ధోరణులు కనపడుతున్నాయి. మొదటిది స్త్రీలలోని పాతివ్రత్యరూపమైన గుణాన్ని కీర్తించి వారిని ఉన్నతుల్ని చేయడం-రెండోది నేటి ఆధునిక పద్ధతిలో వారి పాతివ్రత్యమాత్రాన్ని గ్రహించి వారిని వ్యక్తిత్వము, జ్ఞానము లేని తోలుబొమ్మలుగా ఎంచి, ఈ ఆధునిక సమాజంలో వారి చరిత్ర పనికిరానిదిగా తొలగించడం. ఈ రెండు ధోరణులలోని పరిశీలనవలన స్త్రీలకు పూర్తి న్యాయము చేకూరినట్లు తోచదు.’

ఆమె వీక్షణలో అంతర్బహిర్‌ ప్రపంచాలు ఎలా సమన్వయం కాగలిగాయో చెప్పడానికి ఈ వాక్యం ఒక చక్కని ఉదాహరణ. ఇటువంటి చూపు అలవడటమే కష్టం. ఒకసారి అలవడ్డాక, ఆ పరిశీలన ఎలా ఉంటుందో, ఇదుగో, దేవయాని వ్యాసాన్ని ముగిస్తూ రాసిన ఈ మాటలు చూడండి:

దేవయాని అని పేరుపెట్టినందుకు ఈమె జీవితం మొత్తం దేవతల చేత నడపబడింది. ప్రధానమైన రెండు సందర్భాల్లోను ప్రయత్న పూర్వకంగా దేవతలు ఈమెను ప్రేరేపించారు. కచుడు ఈమెను ప్రసన్నురాలను చేసుకోవడంలో వారి పాత్ర ఎంత ఉన్నదో మనకు తెలుసు. అతనికి ‘దమేన’ అన్నమాట చెప్పి ఇంద్రియనిగ్రహశక్తి కలిగి ఉండమని హెచ్చరించారు. ఆవిణ్ణి ప్రసన్నురాలిని చేసుకొమ్మన్నారు తప్ప ఆమె మోహంలో అతడిని పడవద్దని చెప్పి ఆమె జీవనయానంలోని ప్రథమ వైఫల్యానికి కారణమయ్యారు. ఇక రెండో సందర్భంలో కూడా…ఇలా ఆ జగన్నాటక సూత్రధారుని చేతిలోని సూత్రానుసారం నడిచే జీవితాలే అయినా, మనం పరిశీలించి చూసుకుంటే, మనం అలవర్చుకోవలసిన కొన్ని ప్రత్యేకతలు-మనం విడిచిపెట్టవలసిన బలహీనతలూ గోచరమవుతూ ఉంటాయి. అందుకే ఈ పరిశీలన.

ఒక పురాణకథని పరిశీలించడంలో ఈ మెలకువ సగభాగమే. శర్మిష్ఠ గురించి రాసిన వ్యాసంలో ఆ మెలకువలోని రెండవ అర్థభాగం కూడా జతకూడి ఆమె దృష్టి మరింత సమగ్రమై, సమీచీనమై పరిపూర్ణత పొందింది. దేవయాని, శర్మిష్ఠల మధ్య కలహం గురించి చెప్తూ ఏమంటున్నారో, చూడండి :

ఇక్కడ ఈ ఇద్దరు స్త్రీలు తమ తండ్రుల అర్హతలను తమవిగా ఎంచి అహంకరించడం మనం గమనిస్తే-స్త్రీలకు తమకు సంబంధించిన అర్హతల పట్ల చైతన్యం లేకపోవడమే వివాదానికి కారణమనిపిస్తుంది.’

అసలు శర్మిష్ట పైనవ్యాసం మొదలుపెడుతూనే ‘సదసద్గుణముల సమతూకముతో ఈమె జీవితం నడిచినట్లు కనిపిస్తుంది’ అని అంటారు.

ఇలా ఇద్దరు స్త్రీల మధ్య నడిచిన కలహం వల్ల వాళ్ల జీవితంలో ప్రవేశించి, చివరికి వాళ్ళ మధ్య స్పర్థని మరింత రగిలించి, తన సంతానాన్ని కూడా శాపగ్రస్తుల్ని చేసిన యయాతి గురించి వివరిస్తున్నప్పుడు అన్నపూర్ణగారి కావ్యానుశీలన నన్ను ఆశ్చరపరవశుణ్ణి చేసింది. విశ్వనాథవారి ‘అమృత శర్మిష్ఠం’ నాటకం పైన ఆమె పరిశీలనని నేను చదివిన అత్యున్నత సాహిత్యపరిశీలనల కోవలో చేర్చుకోగలను. ఎందుకంటే, స్త్రీపురుషుల మధ్య సాధారణంగా సంభవించే అనుభవాల్ని మళ్ళీ మళ్ళీ వర్ణించిచెప్పడంలో భారతీయ కవికి ఆసక్తి లేదు. వర్ణన మామూలు కవి చేసే పని. కాని ఋషిగా మారిన కవి దృష్టి ఆ అనుభవాల్ని మథించి అందులోంచి ఒక అమృత సత్యాన్ని మన చేతుల్లో పెట్టడం మీద ఉంటుంది. చూడండి, విశ్వనాథ నాటకం గురించి రాస్తూ అన్నపూర్ణగారు ఇలా అంటున్నారు:

కాని కొన్ని సందర్భాల్లో స్త్రీపురుషులు రసప్లావిత హృదయులై తపోదీక్ష వంటి సమాధిమచ్చిత్తంతో రసానందానుభూతిని అనుభవించేవారిని ఈ నాటకం ద్వారా కవి చెప్పారని తెలుస్తుంది. ఈ విషయాన్ని చెప్పడంలో మానవునికి సంబంధించి ఒక కొత్త వ్యాఖ్య కవి చేస్తారు. శరీరనిష్టుడైన జీవుడూ, తాను అనుకునే ఉపాధి అని రెండు అంశలు ఉన్నట్టు మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ ఈ రెండింటికంటే భిన్నంగా భావుకుడనే మరొక అంశ కూడా మానవునిలో ఉంటుందని, అది మేల్కొనడానికి తగిన సామగ్రి లభించినప్పుడే ఆ ఎరుక మానవునికి కలుగుతుందని శర్మిష్ఠా యయాతుల శృంగారానుభవం ద్వారా కవి ప్రతిపాదించారు.

యయాతిలోని దేహం, దేహం కన్నా భిన్నమైన నామరూప అంశలతో పాటు ‘యయాతి అనే జీవుణ్ణి అతిక్రమించిన మరొక అంశ ‘తనలో ఉందని యయాతి గుర్తుపట్టాడనీ’, అదే ‘భావుకాంశ’ అని చెప్తూ ‘భావుకుడైన వ్యక్తి ఏ నియమాల్నైనా ఉల్లంఘించి ఆ రసానందాన్ని పొందడానికి సిద్ధపడతాడనీ, దానివల్ల వచ్చే కష్టనష్టాల్ని అనుభవిస్తాడనీ’ అంటున్నారామె. అదంతా విశ్వనాథ తన నాటకంలో ఏ విధంగా చిత్రించారో చెప్తూ, యయాతి చివరికి ‘ఒక ప్రేమగల తండ్రిగా, దయగల మనిషిగా రూపుదాల్చాడనీ’ చెప్తో ఇలా అంటున్నారు:

దీనికి కారణం అతనిలో శర్మిష్టతోడి ప్రేమానుభవం వల్ల అతిసుకుమార హృదయాన్నిచ్చే భావుకుడు మేల్కొని స్త్రీసమాగమాన్ని ఒక రససమాధి తపస్సుగా భావించడమే కారణంగా అనుకోవాలి. మనిషి వియయలోలుడైపోవడానికి కారణమైన స్త్రీసమాగమమే విశ్వనాథ మలిచిన ఆధ్యాత్మికానుభవ వాంఛకు కారణమయ్యింది యయాతిలో కనుక ‘వాగర్థమనో హృత్య్సక్‌ వివర్ధతామ్‌ రసమయం మహః’ అన్న ఈ వాక్యమే ఈ నాటకానికి భరతవాక్యం!!’

ఈ వ్యాసంలో చాలా విశేషాలున్నాయి. కాని అన్నిటికన్నా ముఖ్యంగా గమనించవలసింది ఒకటుంది. అదేమంటే యయాతి, దేవయాని, శర్మిష్ఠల కథ మహాభారతకథ. ఎన్నో యుగాలనాటి కథ. దాన్ని ఒక ఋషీశ్వరుడు తన ఇతిహాసంలో మొదటిసారి చెప్పాడు. ఇరవయ్యవశతాబ్దంలో విశ్వనాథ అనే ఒక మహాకవి తిరిగి దాన్ని ఒక సంస్కృతనాటకంగా మలిచాడు. అలా మలిచినప్పుడు ఆ పూర్వకథకి ఇన్నేళ్ళ మానవానుభవం సాధించిన కొత్త మెలకువను జోడించి మరీ చెప్పాడు. అంటే ఆ పూర్వకథకి లభించిన ద్వితీయకథనానికి ఆధునిక యుగం మనిషిలో తెచ్చిన కొత్తమెలకువ కూడా తోడయ్యింది.

ఇప్పుడు ఈ భావుకురాలు ఆ నాటకాన్ని పరిశీలిస్తున్న క్రమంలో తిరిగి ఆ ప్రథమ కథనాన్నీ, ద్వితీయకథనాన్నీ తన మెలకువతో మరొకసారి చెప్పడంతో ఈ వ్యాసం తృతీయకథనంగా మారింది. ఈ తృతీయకథనంలో ఆధునికయుగపు మెలకువతో పాటు ఆధునిక మహిళ తాలూకు చైతన్యం కూడా తోడయ్యింది. కేవలం ప్రాచీన సాహిత్యం చదువుకున్నవాళ్ళు ఇలా చెప్పలేరు. తాను స్వయంగా ఒక రసహృదయి కానిదే ఒక భావుకురాలు ఆ కథని ఇలా మళ్ళా మనముందు వ్యాఖ్యానించలేదు. ఆధునిక మహిళ చరిత్రని తిరగరాస్తుందని గురజాడ అన్న మాటల్లో నిజముందిగాని, ఆ మాటలు సగమే సత్యం. ఆ ఆధునిక మహిళ రసహృదయి అయితేనే ఆ చరిత్ర చరితార్థమవుతుందని మనకి అన్నపూర్ణగారిని చదివితే తెలుస్తున్నది.

3

అలా చరిత ప్రధానమైన చరిత్ర ఎలా ఉంటుందో బహిర్వీక్షలో కథలు మనకి ఉదాహరణలుగా నిలబడుతున్నాయి. ఆ కథలు మీరెలానూ చదవబోతున్నారు, కాని అవి చదివేటప్పుడు, మరొకసారి ఆగి చదవవలసిన వాక్యాలు చాలా ఉన్నాయి. ఇదుగో, ఇలాంటివి:

‘వేరు వేరు శరీరాలతో ఇద్దరిగా ఉన్న వ్యక్తుల జీవితంలో ఎవరి సమయం వారిదే. ఎవరి జీవితం వారిదే! ఇది తెలుసుకోలేకపోవడం వల్ల ఒకరి జీవితమే మిగులుతుంది. రెండోవారికి జీవితమే లేకుండా పోతుంది.’

‘స్త్రీ తన ఉనికిని నిలుపుకోవడమన్నది ఎంత కష్టసాధ్యమో ప్రేమించే హృదయమున్నవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ప్రేమించడమంటే వ్యక్తిత్వాన్ని వదులుకోవడమనే అనుకుంటుంది స్త్రీ ఎప్పుడూ. అతనితోడి ఐక్యం కోసం ఛాయగా మారిపోవాలి అని అనుకుంటోంది. దానితోనే ఆమె కాంతివిహీన అయిపోతోంది.’

‘మొగపిల్లలకి అన్ని బలాలకంటె అధికమైన సంఘబలం వాళ్లవెంట వుంటుంది మన సమాజంలో. ఆడపిల్లలకి దాన్ని ఎదుర్కొందుకు మనం విద్యాబలాన్ని, ఆర్ధిక బలాన్ని ఇవ్వాలి. వీటిద్వారా వాళ్ళ ఆత్మబలాన్ని పెంచాలి.’

ఈ విషయంలో నా హృదయం సంతృప్తమయి ఉంది. శరీరం హృదయాధీనం కాదంటావా? అనుభవానికి అంతేముంది? అనుభవానికైన ఈ తహతహ ఎక్కడో ఒకచోట ఆగాలనిపిస్తుంది నాకు. ఇంకా దాహం పెరిగే కొద్దీ-ఎడారులు పెరుగుతాయి.’

ఈ కథల్లో ఒక చోట, కథకురాలు, తాను ఎక్కడకు వెళ్ళినా రెండు పుస్తకాలు తన కూడా తీసుకువెళ్తూంటుందని రాస్తుంది. భవభూతి ‘ఉత్తరరామచరిత్ర’, టాల్‌ స్టాయి ‘ఫామిలీ హాపీనెస్’ ఒకటి ప్రాచీన కావ్యం, మరొకటి అధునిక కావ్యం. ఒకటి ప్రాచ్యకుసుమం, మరొకటి పాశ్చాత్య రత్నం. ఈ పుస్తకంలో కూడా అలానే రెండు భాగాలు. మొదటి భాగంలో వ్యాసాలు సాహిత్యానికీ, జీవితానికీ కూడా లక్షణ పరిశీలనలు అనుకుంటే, రెండో భాగంలో కథలు ఆ లక్షణ వివేచనకి లక్ష్య రచనలుగా నిలబడుతున్నాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ పుస్తకం ఆత్మబల సముపార్జనకి తోడ్పడే లక్ష్యలక్షణగ్రంథం.

ఆత్మబలాన్ని మన పూర్వులు సత్త్వబలం అని కూడా అన్నారని గుర్తుతెచ్చుకుంటే, ఈ పుస్తకాన్ని ఒక సాత్త్వికీకరణ వాచకంగా అభివర్ణించడానికి నాకెటువంటి సంకోచం లేదు.

2-7-2024

7 Replies to “సాత్త్వికీకరణ వాచకం”

  1. rammohanthummuri – I am a writer, a poet, a head master, a fater, a husband, and a creative person. I primarily in telugu language.
    Thummuri says:

    సాత్వికీకరణ వాచకం పేరుతో ధూళిపాళ అన్నపూర్ణ గారి అంతర్వీక్ష పుస్తకాన్ని మీ దైన శైలిలో పరిచయం చేయడం అనిర్వచనీయమైన ఆనందానుభవాన్నిచ్చింది.అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థితం అన్న మంత్రపుష్ప స్పృహను కలిగించింది. విశ్వనాథ అమృతశర్మిష్ఠ విశ్లేషణ ఆద్యంతం రసవంతంగా మనసును అమృతంలో ముంచి తీసినట్లనిపించింది. వారిది తృతీయ కథనమైతే మీది తురీయ కథనం మా వరకు చేర్చినందుకు. ఆ ఒక్క వ్యాసశకల విశ్లేషణ
    మంచి అత్తరు వాసన మట్టపై రాసి చూపినట్లున్నది.ఈరోజు మానసోదయం ఎంత ప్రకాశవంతమో చెప్పలేను. శ్రీమతి ధూళిపాళ అన్నపూర్ణ గారికి సప్తతి శుభాకాంక్షలు.

    1. మీ సహృదయ రసస్పందన కు హృదయపూర్వక ధన్యవాదాలు!

  2. ఇంత హృదయోల్లాసంగా రాయడం మీకే సాధ్యమయే సంగతి.అంతర్వీక్షలోని సారాన్ని మీ అంతర్వీక్షణతో వెలికి తీసారు.మీరు ఉటంకించిన వాక్యాలు..ముఖ్యంగా కథా వాక్యాలు నన్ను ఆలోచింపచేసినవి.మీ ఇరువురు కి ధన్యవాదాలు

    1. ధన్యవాదాలు శ్రీనివాస్!

      1. రెండు సుగుణాల మేలిమి కలయిక కనిపిస్తున్నది. ఒకటి నిశ్చయజ్ఞానం, రెండోది ఆ జ్ఞానాన్ని పంచుకునేటప్పుడు ఉండవలసిన వినయం. అటువంటి నమ్రతని ఆయన నాగరికత అన్నాడు. పూర్వకాలపు భాషలో దాన్ని సభ్యత అనేవారు. సభ్యత అంటే సభలో వ్యవహరించవలసిన తీరు అని కాదు. ఇద్దరు మనుషులు కలుసుకున్నప్పుడు ఒకరిపట్ల ఒకరు అటువంటి నమ్రతతో ప్రవర్తించినప్పుడు మాత్రమే ఆ కలయిక ఒక సభగా మారుతుంది. సంస్కృతిగా వికసిస్తుంది.

        2
        సాహిత్యకారుల సంగతి అలా ఉంచి, ముందు ప్రతి మనిషీ తనను తాను తీర్చిదిద్దుకోవలసిన జీవన శిల్పం ఇది. కావ్యపఠనం, పూర్వమహాకవుల, ఇతిహాసకారుల రచనలూ, సంస్కృతీ, సంప్రదాయాలూ మనిషిలోపల జీవితాన్ని సంపద్వంతం చెయ్యవలసినవి. వాటిల్లో మనం వెతకవలసింది బయటి జీవితం గురించి కాదు. బయటి జీవితంలోలాగా ఆ పుస్తకాల్లో లేదే అని వాటిని విమర్శించడం కాదు.
        జీవితమంటే పైకి కనిపించే వేషభాషలూ, వస్తు సామగ్రీ కాదు. ఒక కాలంలో మనుషులు తాములోనైన జీవితానుభవాలనుంచి తమకి సంప్రాప్తమైన సుఖదుఃఖాల్ని మథించి కొన్ని సత్యాల్ని మన రక్తంలో ప్రవేశపెట్టి వెళ్ళిపోతారు. మనం ప్రస్తుత జీవితం కొత్తగా జీవిస్తున్నాం అనుకుంటాంగానీ, నిజానికి, జీవితానుభవాల పట్ల మన ప్రతిస్పందన ఎంత కొత్తగా కనిపిస్తుందో అంత పురాతనం. మన పూర్వీకులు కూడా జీవితం యెదట ఇంత బేలగానూ, ఇంత ధీరులుగానూ ప్రవర్తించేరనీ, ఆయా అనుభవాలు తమకి ఎదురైనప్పుడు ఆ తత్తరపాటులో వాటిని ఎలా నిభాయించుకోవాలో తెలియక మంచో, చెడో వాటినుంచి ఎదురయ్యేక, అప్పుడు నెమ్మదిగా, వాటినుంచి తమ తర్వాతి తరాలు గ్రహించవలసిన సూత్రాలు ఏముంటాయో వాటిని పాఠాలుగా చెప్పడానికే సాహిత్యసృజన చేసారనీ మనం తెలుసుకోవాలి.
        ఎంత గా ఈ మాటలు నన్ను ప్రభావితం చేసాయో. సర్. మీరే ఇంత చక్కని భాష్యం చెప్పగలరు. అభినందనలు

  3. ఆ కార్యక్రమంలో అతిథిగా భాగమైనందుకు, అలా భాగస్వామిని చేసినందుకు శ్రీ మహదేవమణిగారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ నుండి కూడా 🙏💐

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%