
రెండు తెలుగు రాష్ట్రాలూ అటు పోలింగు పూర్తయిన అలసటలోనో లేదా ఇటు ఎగ్జిట్ పోల్స్ తాపత్రయంలోనో కూరుకుపోయి ఉండగా, ఎన్నడూ లేనంతగా వేసవి భగభగ మండుతూ ఉండగా, ఇద్దరు మిత్రులు మాత్రం ఇవేవీ పట్టకుండా తమ కార్యాచరణలో తాము నిమగ్నులైపోయి ఉన్నారు. ఎందుకంటే మళ్ళా నాలుగు రోజులు గడిస్తే ఎన్నికల ఫలితాలు వెలువడి రాజకీయ సంరంభం మొదలవుతుంది, ఆ తర్వాత మరో నాలుగు రోజులకి స్కూళ్ళు తెరుస్తారు, కాబట్టి తాము చెయ్యాలనుకున్న పనులేవో ఈ నాలుగైదురోజుల్లోనే వేగిరం పూర్తిచెయ్యాలన్నది వారి తపన.
రెండు రాష్ట్రాల్లోనూ వారిలాంటి మనుషులు మరొక్కరు కూడా కనిపించరు. ఒకరు మంచికంటి వేంకటేశ్వరరెడ్డి. ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వర రెడ్డి శాంతివనం పేరుమీద చేపడుతూ వస్తున్న ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికే నలుగురి దృష్టినీ ఆకర్షించాయి. రెండేళ్ళ కిందట ఇలానే ఆయన మండుటెండల్లో మోటార్ సైకిల్ మీద పుస్తక యాత్ర చేపట్టాడు. ఆ స్ఫూర్తితో కిందటేడాది విజయవాడలో ‘మరో గ్రంథాలయ ఉద్యమా’నికి శ్రీకారం చుట్టాడు. రెండు రాష్ట్రాల్లోని పుస్తకప్రియుల్నీ, సాహిత్యవేత్తల్నీ, విద్యావేత్తల్నీ ఒక్కతాటిమీదకు తీసుకురాడానికి తన వంతు ప్రయత్నాలు తాను మొదలుపెట్టాడు.
ఆ సమావేశంలోనే కాసుల రవికుమార్ ని మొదటిసారి చూసాను. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రవి లీడ్ ఫౌండేషన్ పేరిట తన ఇంటినీ, తాను ప్రయాణించే కారునీ కూడా గ్రంథాలయాలుగా మార్చిన పుస్తకయోధుడు.
కిందటేడాది విజయవాడలో మొదలుపెట్టిన ‘మరో గ్రంథాలయ ఉద్యమం’ రెండో దశలో ఈ సారి వాళ్ళిద్దరూ నర్సంపేటనుంచి హైదరాబాదుదాకా పుస్తక యాత్ర చేపట్టారు. అయితే ఈ సారి మోటారు సైకిలు మీద కాదు, కారు మీద. తమ యాత్రలో భాగంగా ఊరూరా కవుల్నీ, రచయితల్నీ, పుస్తకప్రేమికుల్నీ కలిసి పుస్తకపఠనం గురించి ప్రజల్లో కలిగించివలసిన జాగృతి గురించి వారికి మరోసారి గుర్తుచేసారు. ఆ యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కి నేను కూడా హాజరయ్యాను. నాతో పాటు ప్రముఖ కవి, హైదరాబాద్ పుస్తక ప్రదర్శన సంఘం అధ్యక్షులు యాకూబ్, బాలచెలిమి నిర్వాహకులు, విద్యావేత్త మణికొండ వేదకుమార్ గారు కూడా పాల్గొన్నారు. గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్యగారి మనమడు డా. అయ్యంకి మురళీకృష్ణ కూడా మరొక విశిష్ట అతిథిగా విచ్చేశారు.
చారిత్రికంగా మనమొక విచిత్రమైన యుగంలో ఉన్నాం. మానవచరిత్రలో పుస్తకాలు ఇంత విస్తారంగా మనుషులకి అందుబాటులోకి వచ్చిన కాలం ఇదే. ఒకప్పుడు గ్రంథాలకీ, మనుషులకీ మధ్య ఎన్నో అడ్డుగోడలుండేవి. ప్రపంచ తత్త్వశాస్త్రానికి పుట్టినిల్లు అని చెప్పదగ్గ ఏథెన్సులో కూడా పుస్తకవిద్య కేవలం సంపన్న కుటుంబాలకు చెందిన కొందరు పురుషులకు మాత్రమే పరిమితంగా ఉండేది. ప్రాచీన చీనాలో సామాజికంగా అట్టడుగున ఉన్న వ్యక్తికి స్వయంకృషితో చదువుకుని ఉన్నతస్థానాలకు చేరడం దాదాపు అసాధ్యంగా ఉండేది. భారతదేశంలో నిన్నమొన్నటిదాకా కూడా అక్షరవిద్య అగ్రకులాలకు మాత్రమే జన్మహక్కుగా నడిచేది. బానిసలూ, స్త్రీలూ, కాయకష్టం మీద బతుకు వెళ్ళదీసేవాళ్ళూ పుస్తకాలు చదవడం అలా ఉంచి ఆ పుస్తకాల్ని చదవడానికి అవసరమైన కనీస అక్షరాస్యతకి నోచుకోకుండానే ప్రపంచ చరిత్రలో ఎన్నో మహాయుగాలు దొర్లిపోయేయి. కాని ఇప్పుడు, ముఖ్యంగా, 1980 తర్వాత ప్రపంచం పరిస్థితి వేరు. ఇప్పుడొక విజ్ఞాన విస్ఫోటనం సంభవించింది. ఇన్ని యుగాలుగా ఎన్నో దేశాలకు, ఎన్నో భాషలకు, ఎన్నో పరిశోధనలకు చెందిన అపారమైన వాజ్ఞ్మయమంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్క క్లిక్ తో మన అరచేతుల్లో ప్రత్యక్షమయ్యే అపూర్వమైన కాలం మనముందు ప్రత్యక్షమయింది.
చూడండి, ఒకప్పుడు వేదం వింటేనే చెవుల్లో సీసం కరిగించిపోసేవారని విన్నాం. ఇప్పుడు గూగుల్ తెరిచి ‘ఋగ్వేద’ అని టైపు చేయగానే సెకండు కన్న తక్కువ వ్యవధిలో నూరు లక్షల ఎంట్రీల సమాచారం ప్రత్యక్షమయింది. కార్ల్ మార్క్స్ అని టైపు చేయగానే 23 కోట్ల ఎంట్రీల మేరకు సమాచారం తెరుచుకుంది. నలభై ఏళ్ళకిందట గౌతమీ లైబ్రరీలో కూడా దొరకని పుస్తకాలు ఈరోజు నెట్ లో ఒక్క క్షణంలో కళ్ళముందు ప్రత్యక్షమవుతున్నాయి.
కాని విషాదమేమిటంటే, పుస్తకాల అందుబాటు అనూహ్యంగా పెరిగినప్పటికీ, అక్షరాస్యత శాతం ఊహించలేనంతగా పెరిగినప్పటికీ, చదువరుల సంఖ్య పెరగకపోవడం. మొన్న తిరుపతి లైబ్రరీలో చూసాను. టిటిడి వారు 1980ల్లో ఏదేనా పుస్తకం ప్రచురిస్తే ఒక్కొక్కటీ కనీసం రెండువేల ప్రతులు ప్రచురించినట్టు తెలుస్తోంది. అదే ఇప్పుడు ఎంత విలువైన గ్రంథంగాని 250 ప్రతులకి మించి ముద్రించడం లేదన్నది కూడా వాస్తవం. ఒకప్పుడు దక్షిణభారత పుస్తక సంస్థ వారు ‘ప్లేటో సంభాషణలు’ తెలుగు అనువాదాన్ని 5000 కాపీలు ప్రచురిస్తే, ఇప్పుడు మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ మీద నా వ్యాఖ్యానాన్ని 100 కాపీలకు మించి ప్రచురించే సాహసం చెయ్యలేకపోయాను.
పుస్తకాలకీ, పాఠకులకీ మధ్య పెరుగుతున్న ఈ అగాధం ఇలా ఉండగా, ఫేస్ బుక్ లోనూ, ఇన్స్టా గ్రామ్ లోనూ రీల్స్ కి పెరుగుతున్న వీక్షకుల సంఖ్య, యూ ట్యూబ్ లో పొలిటికల్ గాసిప్ కి పెరుగుతున్న వ్యూస్ సంఖ్య లక్షల్లో ఉంటోంది. ఎందుకని? కారణం చాలా స్పష్టం. ఏదేనా ఒక వీడియో చూడటానికి మనం మనం తెలివితేటలు వాడక్కర్లేదు. మన మెదడుకీ, వివేచనకీ పనిపెట్టవలసిన కష్టం లేదు. కాని పుస్తకం చదివేటప్పుడు మనం మనకు తెలియకుండానే అందులో active participant గా మారకతప్పదు. కాని రీల్స్ చూస్తున్నప్పుడో లేదా పొలిటికల్ గాసిప్ వింటున్నప్పుడో మనకి తెలియకుండానే మనం passive collaborators గా మారిపోతుంటాం. పుస్తకం చదివినప్పుడు మనం ఆ రచయిత అభిప్రాయాల్తో కొన్నిసార్లు అంగీకరిస్తాం, కొన్ని సార్లు విభేదిస్తాం, కొన్ని సార్లు ఆలోచనలో పడతాం. చదువుతున్నంతసేపూ, చదివేకా కూడా పుస్తకం మనల్ని విశ్రాంతిగా కుదురుకోనివ్వదు. కాని ఒక రీల్, ఒక యూట్యూబ్ పొలిటికల్ లేదా ఫిల్మ్ గాసిప్ వీడియోతో మనకి ఎటువంటి పేచీ ఉండదు. మనం అయితే దాంతో అంగీకరిస్తాం లేదా వ్యతిరేకిస్తాం. మనల్ని మనం పెద్దగా శ్రమపెట్టుకోనక్కర్లేకుండానే మనం ఆ వీడియోలకు సబ్ స్క్రైబర్లుగా మారిపోతాం.
ఇటువంటి పరిస్థితులు రాజకీయంగా, సామాజికంగా ఎటువంటి పర్యవసానాలకు దారితియ్యగలవో ఊహించడం కష్టం కాదు. పుస్తకాల ద్వారా మన consent ని manufacture చేయడం సులభం కాదు. పైగా చాలాసార్లు పుస్తకాలు public consent పట్ల dissent ని ప్రోత్సహిస్తాయి. కాని రీల్స్, థ్రెడ్స్, గాసిప్ వీడియోలు తాము చూపిస్తున్నవాటికి మనల్ని చాలా సులభంగా customize చేసేస్తాయి. ఇక అప్పుడు మనం చేయగలిగేదల్లా ఆ వీడియోలకిందన వాటికి జై కొడుతూ ఒక నినాదం రాయడమే.
ఇదే ఈ కాలం నాటి అత్యంత విషాదం. పెరిగిన అక్షరాస్యత, సముద్రమంత సాహిత్యం మనుషుల్ని పాఠకులుగా మార్చేలోపు, అత్యధిక సంఖ్యాకులు ట్రోలర్లుగా మారిపోవడం. ఏదేనా రీల్ కింద లేదా సోషల్ మీడియాలో ఏదేనా పొలిటికల్ గాసిప్ పోస్టు కిందా వేలల్లో కనబడే కామెంట్లు చూడండి. వాళ్ళల్లో అత్యధిక సంఖ్యాకులకి అక్షరాలు టైపు చెయ్యడం కూడా రాదు. తెలుగులో గాని ఇంగ్లీషులో గాని ఒక్కవ్యాకరణ దోషం కూడా లేకుండా పూర్తి వాక్యాలు రాయలేరు. ఇది కేవలం సెక్సిస్టు, వయొలెంట్ కంటెంట్ ఉండే పోస్టులకు మాత్రమే పరిమితమైన విషయం కాదు. ఫేస్ బుక్ లో కనిపించే దేవుళ్ళ ఫొటోలూ, ప్రవచనకారుల వీడియోలూ, భక్తిపోస్టులూ చూడండి. వాటికింద కనీసం ఒక పూర్తి వాక్యం కూడా కామెంటు కనబడదు. కేవలం జయజయనినాదాలూ, వంద నమస్కారాల ఎమోజీలూ మాత్రమే కనబడతాయి.
వీటన్నిటినీ చూస్తుంటే ఏమి తెలుస్తోంది? ఈ viewers కి తమకి నచ్చినదాని గురించి నాలుగు వాక్యాలు రాసే శక్తి ఎలానూ లేదు, కనీసం ఒక వాక్యమేనా నచ్చిందని రాసే ఓపిక కూడా లేదు. వీళ్ళిట్లా మొదట్లో passive collaborators గా మొదలై నెమ్మదిగా intolerant mob గా పరిణమిస్తారు. మనం ప్రపంచం అంటే మనకు తెలిసిన, మన భావాలను గౌరవించే ఆ నలుగురైదుగురే అనుకుంటున్నాం. కాని అసలు ప్రపంచం, మన చుట్టూ ఉన్న ప్రపంచం నెమ్మదిగా ఈ intolerant mob తో నిండిపోతూ ఉందని గ్రహించడం లేదు. ఒకప్పుడు మధ్యయుగాల్లో మతం పేరుమీద ఒకరినొకరు ఊచకోత కోసుకున్నది వీళ్ళే. ఇప్పుడు ఏ చిన్న కారణం దొరికినా కూడా తమతోటిమనిషిని నిర్మూలించడానికి వీళ్లెంతమాత్రం వెనకాడరని చెప్పడానికి సామాజికశాస్త్ర పరిజ్ఞానం పెద్దగా అవసరం లేదు.
కాబట్టి పుస్తకపఠనం ఒకప్పుడు వ్యక్తిగత అవసరమేమోగానీ ఇప్పుడది అత్యవసరమైన సామాజిక అవసరం. పుస్తకాలు చదవడం వల్ల మనుషులు శాంతికిలోనవనీ, అశాంతికి లోనవనీ, అన్నిటికన్నా ముందు activate అవుతారు. ఎవడో ఏదో చూపిస్తే దానికి passive గా జైకొట్టడానికి సిద్ధంగా ఉండరు. మంచిగానీ, చెడుగానీ తమంత తాము ఆలోచించుకోడానికి ఇష్టపడతారు. అన్నిటికన్నా ముందు రోడ్డుమీద mob లో ఒక అనామక ముఖంగా మారకుండా తమని తాము గుర్తుపట్టుకునే అన్వేషణ మొదలుపెడతారు.
కనుకనే పుస్తకాల గురించీ, గ్రంథాలయాల గురించీ మాట్లాడుకోవాల్సిన ఇప్పుడు మరింత అవసరమవుతున్నది. గ్రంథాలయ ఉద్యమాలు తెలుగునాట కొత్త కాదు. ఒకప్పుడు ఆంధ్రప్రాంతంలో జాతీయోద్యమం అంటే గ్రంథాలయ ఉద్యమమే అని మా హీరాలాల్ మాష్టారు నాతో చాలా సార్లు చెప్పారు. తెలంగాణాలో నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తలెత్తిన పోరాటం గ్రంథాలయాల్లోనే ప్రాణం పోసుకుందని మనకు చరిత్ర చెప్తున్నది. అవి రాజకీయ విముక్తి కోసం నడిచిన పోరాటాలు. కాని ఇప్పుడు మనం మానసిక విముక్తి అవసరమైన కాలంలో ఉన్నాం. ఆ విముక్తిని సాధించడానికి ఎందరో ఎన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పిల్లల్నీ, పెద్దల్నీ కూడా పుస్తక పఠనం వైపు ప్రోత్సహించడం కూడా అటువంటి ప్రయత్నాల్లో ఒకటిమాత్రమే కాదు, అత్యంత ఆరోగ్యవంతమైన ప్రయత్నం కూడా.
ఈ నేపథ్యంలో మంచికంటి, రవికుమార్ అనే ఈ ఇద్దరు మిత్రులు గ్రంథాలయ ఉద్యమం పేరిట మొదలుపెట్టిన ఈ ప్రయత్నాలు కేవలం సాహిత్యానికో, రచయితలకో మాత్రమే సంబంధించినవి కావు. ఇవి సామాజిక ప్రక్షాళనా ప్రయత్నాలు అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న సమాజం ముఖం లేని మనుషుల్తో నిండిపోకుండా ప్రతి ఒక్కరినీ ఒక చైతన్యవంతుడైన మానవుడిగా, మానవిగా తీర్చిదిద్దే దిశగా ఎంతో ప్రేమతో వేస్తున్న అడుగులు అనిపిస్తుంది.
అందుకనే ఆ మిత్రులిద్దరికీ చెప్పాను, మీ కృషిలో ఎప్పుడు ఎటువంటి సహాయం అవసరమైనా, ఏ పని చెయ్యాల్సి వచ్చినా, ఒక సహకార్యకర్తగా నేనెప్పటికీ మీతో పాటే ఉన్నాను, ఉంటాను అని.
ఆ రోజు నేను చేసిన ప్రసంగం వినడానికి ఆసక్తి ఉన్నవారు ఈ వీడియో చూడవచ్చు.
4-6-2024


” A reader lives thousand times before he dies”అన్నట్లు పుస్తక పఠనం యిప్పుడు సామాజిక అవసరమే మరి.చాలా బాగా చెప్పారు.
ధన్యవాదాలు సార్!
శుభోదయం సర్. ఈ ఇంటర్నెట్ యుగంలో ముఖ్యంగా తెలుగు పుస్తక పఠనం పూర్తిగా సన్నగిల్లిపోతోంది. ఎప్పుడైతే మాతృభాషను(తెలుగు) మనమే ఇంట్లో నిర్లక్ష్యం చేశామో, మన పిల్లల తరం కు తెలుగు చదవడం, రాయడం రావడం లేదు. కేవలం ఒకేఒక బాహుబలి సినిమా చూసిన ఈ తరం, మన చిన్నప్పుడు చందమామ కథలు చదివి వందలాది బాహుబలి మించిన సినిమాలను మన ఊహ శక్తితో మనలో చూసుకొన్నాం. వీడియో కంటెంట్ వల్ల కేవలము మన
మెదడుకు ఆలోచనా శక్తి, ఊహా శక్తి రావడం లేదు. అలాగే ఇప్పుడు వస్తున్న ఆడియో కంటెంట్ వల్ల తెలుగు లిపి ని కోల్పోతున్నాం. ఎమోజీ లతో మధ్యరాతి యుగం కు చేరువ అవుతున్నాం. తెలుగును ఇంగ్లీష్ లిపిలో రాయడం ఎక్కువ అయింది. పిడిఎఫ్ పుస్తకాలను, ప్రింట్ పుస్తకాల చదివిన వేగంగా చదవలేక పోతున్నాము. కారణం పిడిఎఫ్ పుస్తక కాంతి కొంత సమయం తరువాత మన మెదడును మొద్దుబారిగా చేస్తోంది. నా దగ్గర కూడా వందలాది పిడిఎఫ్ పుస్తకాలు ఉన్నాయి. కానీ చదివిన పాపానికి పోలేదు. ఎందుకంటే అవి ఉన్నట్లు గుర్తుకు రావు. అదే ప్రింట్ పుస్తకం అయితే మన కంటికి కనబడి కనీసం పూర్తి చేయాలనే ఆలోచన కలుగుతుంది. ఇక చివరగా , కొసమెరుపుగా, ప్రసిద్ధ రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు కనీసం 500 పాఠకులు తన పుస్తకాలను కొంటే , 40% డిస్కౌంట్ తో నేరుగా తన పాఠకులకు చేర్చే స్కీం ను పెడితే , చివరకు ఆరు నెలల లోపు నిఖరంగా 150 పాఠకులు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు అందరికి ఉచిత కంటెంట్ కావాలి. తెలుగు పుస్తకానికి, రచయిత కు విలువ ఇవ్వడం లేదు. ఇప్పుడు తెలుగు పుస్తక పైరసీ కూడా ఎక్కువగా ఉంది. కొత్త పుస్తకం విడుదల అయితే, బాగుంటే, స్కాన్ చేసి ఇంటర్నెట్లో వదులుతున్నారు. నమస్కారాలతో
అవును మీ ఆవేదనా, నాఆవేదనా ఒకటే.
ఒకప్పుడు పుస్తకాలు చదవడం, వాటిగురించి మాటాడు కోవడమే వ్యాపకం గా ఉండేది. క్రమంగా వాటి స్థానాన్ని visual media ఆక్రమించేసింది.
నిజమే మీరన్నట్టు అనవసరమైన వాటిని .అలా పాసివ్ గా చూస్తూ గడపడం క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం.
ఈ నేపథ్యంలో గ్రంథాలయ ఉద్యమం చేపట్టిన సర్వశ్రీ మంచికంటి వకటేశ్వర రెడ్డి, రవికుమార్ గార్లకు అభినందనలు. మీ వంటి సాహితీ వేత్తల ప్రోత్సాహం వారికి మరింత బలం చేకూరుస్తుంది. ధన్యవాదాలు.
ధన్యవాదాలు మేడం
ఈ తరానికి కావలసిన ఉద్యమం నడిపిస్తున్న మంచికంటి, రవికుమార్లకు శుభాకాంక్షలు .
ఈ తరం పిల్లలకు, యువతకు గ్రంధాలయం పరిచయం చేయాలనే ఉద్దేశంతో మా గృహ సముదాయంలో కొద్దినెలల క్రితం ఒక గ్రంధాలయం మొదలుపెట్టాను . పేరు మాత్రం ‘రీడింగ్ రూమ్’, ఎందుకంటే ఆ పుస్తకాలు చదవటానికి కానీ బీరువాలో ఉండిపోవటానికి కాదు కదా. ప్రస్తుతం 500 దాకా పుస్తకాలు వున్నాయి అన్ని వయసుల వారికి. ఇక వాటిని చదివించే పనిలో వున్నాను.
మీ ఉపన్యాసాలు వింటుంటే ఓ నాలుగు పుస్తకాలు కొని చదివేయాలనే స్ఫూర్తి కలుగుతుంది, ధన్యవాదాలు.
ధన్యవాదాలు సార్
గ్రంథాలయ ఉద్యమంలో చేయికలపడానికి ముందుకు వచ్చిన మీకు ధన్యవాదాలు
అన్ని వ్యాసాలు లాగా ఈ వ్యాసాన్ని కూడా చాలా సమగ్రంగా రాసినందుకు మరోసారి ధన్యవాదాలు
—మంచికంటి
ధన్యవాదాలు మంచి కంటి!