
ఆధునిక చీనా కవిత్వం చదువుతున్నప్పుడు ఆ కవుల మీద ప్రభావం చూపించినవాళ్ళల్లో లియొనడ్ కోవెన్ కూడా ప్రముఖంగా కనిపిస్తున్నాడు. కెనెడియన్ కవి గాయకుడు లియొనడ్ కోవెన్ (1934-2016) ఇరవయ్యవ శతాబ్దపు వాగ్గేయకారుల్లో మొదటివరసలో ఉండే కవి. బాబ్ డిలాన్ కూడా ఆ తర్వాతే లెక్కలోకి వస్తాడు.
తెలుగులో లియొనడ్ కోవెన్, బాబ్ డిలాన్, బీట్ కవుల్లాంటి వాళ్ళ ప్రభావంతో పాటలు రాసిన కవులెవరూ కనిపించరు. ఎందుకా అని ఆలోచించాను.
మన గీతకారులు మూడు రకాలుగా కనిపిస్తారు. మొదటితరహా వాళ్ళు సినిమా కవులు. ఆధునిక జీవితానికి తగ్గట్టుగా పాట రాయడానికి సినిమా కవులకి మొదట్లో నమూనాల్లేవు. మనకి ఉన్నవి కీర్తనలూ, జావళీలూను. వాటిని సినిమా పాటలుగా మార్చడమెలానో తెలియని రోజుల్లో బాలాంత్రపు రజనీకాంతరావు ఒక దారి చూపించాడు. కృష్ణశాస్త్రి, శ్రీ శ్రీ మొదలుకుని, సినారె, దాశరథి నుంచి సిరివెన్నెల దాకా దాదాపుగా గీతకారులందరిదీ అదే దారి. కాని తెలుగు సినిమాసంగీతంలో మెలొడీ స్థానంలో బీట్ ప్రధానం కాగానే ఆ వేగానికీ, లయకీ, ఆ ఉధృతికీ పూర్వకాలపు సినిమా పాటల తెలుగు పాతబడిపోయింది. అందుకని ఇప్పటి సినిమా కవులు ఇంగ్లిషు పదజాలాన్ని ఆశ్రయిస్తున్నారు. నిజానికి గ్రామీణ, జానపద, వృత్తికార తెలుగుగీతాలు ప్రధానంగా లయమీదనే ఆధారపడతాయి. తెలుగు యక్షగానాలు దరువుల మీదనే ఆధారపడి ప్రజల్లోకి పోగలిగాయి. తెలుగు దరువుని, వెస్టరన్ బీట్ తో మేళవించుకుని పాటలు రాయడానికి ఇప్పటి సినిమా కవికి ఓపికా లేదు, తీరికా లేదు. కాబట్టి ఇలాంటి సినిమా కవుల్ని లియొనడ్ కోవెన్, బాబ్ డిలాన్ లాంటి వాళ్ళు ప్రభావితం చెయ్యడం అసాధ్యం.
రెండో తరహా గీతకారులు ప్రజాకవులు. గద్దర్, వంగపండు లాంటివాళ్ళు. గ్రామీణ తెలుగు జీవితాల గుండెచప్పుణ్ణి వాళ్ళు అద్భుతంగా పట్టుకున్నారు. ఒకవైపు మెలొడీ, మరొక వైపు బీట్ రెండూ కూడా వాళ్ళు జనజీవితంలోంచే తెచ్చుకోగలిగారు. కాబట్టే వాళ్ళు వట్టి గీతరచయితలుగా మిగిలిపోక, రాజకీయ ప్రభంజనాల్ని సృష్టించగలిగారు. కాని వాళ్ళ పాటల్లో వ్యక్తిగత విషాదాలకో, సంశయ, సంకోచాలకో, ఆశనిరాశల ఊగులాటకో చోటు దొరకడం కష్టం. ఆ పాటలు ఎప్పటికీ తారస్థాయిలో వినిపించవలసినవే తప్ప, మంద్ర, అనుమంద్ర స్థాయిల్లో, కవుల ఏకాంతక్షణాల్లో కమ్ముకునే దిగులుని పలికించడానికి పుట్టినవి కావు. కాబట్టి అటువంటి ప్రజాకవులు కూడా పాప్ గాయకుల ప్రభావానికి లోను కాగలరని ఊహించలేం.
ఇక మూడవ తరహా కవులు టెలివిజన్ కోసమో, రేడియో కోసమో లేదా తమ తమ చిన్న బృందాల్లో వినిపించడం కోసమో గీతాలు రాసుకునే ఔత్సాహిక గీతకర్తలు. తెలుగు గజళ్ళూ, గీతాలూ రాసుకునే కవులు. బహుశా ఇటువంటి కవుల్ని కోవెన్, డిలాన్ వంటి కవులు ప్రభావితం చెయ్యగలరు. కావలసిందల్లా, ఈ కవులు, మెలొడీ పరిథికే పరిమితం కాకుండా, ఒక్క అడుగు బయటకొచ్చి, తమ ఆనందవిచారాల్ని తాము అనుభవిస్తున్నవాటిని, అనుభవిస్తున్నట్టుగా పాటలు కట్టగలగడం. కొద్దిగా సాధన చేస్తే ఇటువంటి కవులు ఏకకాలంలో వ్యక్తినీ, సంఘాన్నీ కూడా తమ హృదయస్పందనతో కట్టిపడేయగల పాటలు కట్టగలరు.
కోవెన్ కవిత్వమే చూడండి. ఆయన దాదాపుగా యాభై, అరవయ్యేళ్ళ పాటు గీతకారుడిగా, గాయకుడిగా నిర్విరామ సాధన కొనసాగించాడు. తన సాధన గురించి చెప్పుకుంటూ
I’m just paying my rent everyday
Oh in the Tower of Song
అంటాడు. తనకి స్ఫూర్తిగా నిలిచిన Hank Williams అనే కవిని తలుచుకుంటూ
But I hear him coughing all night long
A hundred floors above me
In the Tower of Song
అని అంటాడు.
ప్రతి ఒక్క కవీ కూడా గీతగోపురంలో ఏ రోజుకి అద్దె ఆ రోజుకి చెల్లించుకుంటూ బసచేసేవాడే. ఆ హర్మ్యం ఏ ఒక్కరి సొంతం కాదు. నీకన్నా గొప్ప కవి అంటూ మరొకరుంటే, అతడు బహుశా ఆ భవనంలో నీకన్న మహా అయితే ఓ వంద అంతస్తుల పైన బసచేస్తుంటాడంతే. కాని ప్రతి ఒక్కరూ తమ పాటల్తో ప్రతి రోజునీ అక్కడ కొనుక్కుంటున్నవాళ్ళే.
కోవెన్ గీతాల్లో ఆ స్పృహ- ఆ రక్తీ, ఆ విరక్తీ రెండూ బలంగా కనిపిస్తాయి. అతడు ప్రేమ గురించి రాస్తున్నప్పుడు, ఆ వంకన దైవంతో తన ప్రణయం గురించి రాస్తాడు. దైవం గురించి రాస్తున్నప్పుడు, ఆయన పేరెత్తకుండా, ఆ నెపాన్న, తాను ప్రేమించిన, వదిలిపెట్టిన, వదులుకోలేకపోతున్న స్త్రీల గురించి రాస్తాడు. యుద్ధం గురించి రాస్తున్నట్టు రాస్తూనే శాంతి గురించి విలపిస్తాడు. శాంతిసమయాల్లో తనని నిలవనివ్వని రాగోన్మత్తత గురించి ఆక్రందిస్తాడు. కానీ అన్నీ చిన్న చిన్న మాటల్లో, ఊహించని అంత్యప్రాసల్లో, ఊహాతీతమైన మెటఫర్లతో రాసుకుంటూ పోతాడు. ఆ పాటలు శ్రోతల్ని సంగీతపరంగా ఎంత ఉద్రేకించగలవో, సాహిత్యపరంగా, పాఠకుల్నీ అంతే సమ్మోహితుల్ని చేయగలవు.
ఉదాహరణకి ఆయన సుప్రసిద్ధ గీతం Hallelujah (1984) చూడండి. ముందు ఈ పాట వినండి, ఆయన గొంతులో, ఆ మినిమలిస్ట్ మూజిక్ తో. అప్పుడు ఆ కవిత చదవండి.
ఈ కవితలో ఆయన డేవిడ్ గురించి రాస్తున్నట్టుగా తన గురించే తాను రాసుకున్నాడు. ఈ కవిత అర్థం కావాలంటే పాతనిబంధనలో సాముయేలు మొదటి, రెండవ భాగాల్లో ఉన్న డేవిడ్ కథ తెలిసి ఉండాలి. దేవిడ్ రాజైన తరువాత, ఒకరోజు, ఒక ఇంటిమిద్దె మీద బత్సెబా అనే ఆమె స్నానం చేస్తుండగా చూసాడు. ఆమె పట్ల మోహితుడయ్యాడు. ఆమెతో కూడుకున్నాడు. కాని వెంటనే ఆమె భర్తకి కబురంపించి అతణ్ణి పోయి ఆమెని కలవమన్నాడు. అలాగైతే ఆమెకి పుట్టబోయే బిడ్డకి ఆమె భర్తనే తండ్రి అని లోకం భావిస్తుందనుకున్నాడు. కాని ఆ భర్త బెత్సబాని కలుసుకోలేదు. డేవిడ్ కి ఆ సంగతి తెలిసి ఆమె భర్తని యుద్ధరంగంలో చంపించాడు. ఆ తర్వాత ఆ కథ అలా ఉంచి ఇక్కడ మనం గమనించవలసిందేమంటే డేవిడ్ భగవద్భక్తుడు కూడా అని. అతడు భక్తికవీ, గాయకుడూ కూడా. అపూర్వమైన తంత్రీవాద్యకారుడంటుంది పవిత్రగ్రంథం అతడి గురించి. కానీ డేవిడ్ మరొకరి భార్యతో కూడుకోవడం ద్వారా దైవాజ్ఞని ధిక్కరించినవాడు కూడా అయ్యాడు. ఒక వీరుడి జీవితంలో సంభవించిన పగులు అది. ఒకవైపు దైవం, మరొకవైపు దేహం.
లియొనడ్ కోవెన్ తన యూదురక్తంలో ప్రవహిస్తున్న ఈ అనాదిద్వైదీభావాన్నీ ఈ పాటలో పట్టుకున్నాడు. చిన్న చిన్న మాటలు, కాని ప్రతి ఒక్క మాటా శరాఘాతంలాగా మనల్ని గుచ్చుకునే మాటనే. చాలా పేలవమైన నా తెలుగులో, చూడండి ఈ కవిత:
హల్లెలూయ
ఇప్పుడు తెలుస్తున్నది నాకు
దావీదు మీటిన రహస్తంత్రి
ఒకటుందని, అది ప్రభువుని
సంతోషపెట్టిందని.
నీకు సంగీతమంటే
ఇష్టమేనా? నిజంగా?
ఆ స్వరప్రస్తారం సాగుతుందిట్లా
ముందు మధ్యమం, ఆ పైన పంచమం
ఇంతలో ఆవరోహం, ఇంతలో ఆరోహం
పట్టలేని విభ్రాంతిలో ఆ చక్రవర్తి
పలకడం మొదలుపెట్టాడు హల్లెలూయ
హల్లెలుయ, హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ
నీ విశ్వాసం గట్టిదే, కాని
నీకు నిరూపణ కావాలి
ఆమె మిద్దె మీద స్నానం చేస్తున్నది
ఆ వెన్నెల రాత్రి ఆమె అందం
నిన్ను మత్తెక్కించింది
ఆమెనిన్ను వంటింట్లో కుర్చీకి
కట్టిపడేసింది
నీ సింహాసనం పక్కకు నెట్టేసింది
నీ శిరోజాలు కత్తిరించింది
అప్పుడు పలికించిందామె
నీ పెదాలమీంచి హల్లెలూయ
హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ
ఒట్టుతీసి గట్టునపెట్టాననంటావు
నాకు ఒట్టుపెట్టుకోవడమే తెలీదు
పెట్టుకున్నానే అనుకో, దాంతో నీకేం పని?
పలికిన ప్రతి ఒక్క మాటలోనూ
మిరుమిట్లు గొలిపే విద్యుత్కాంతి
అది పవిత్ర శబ్దమో, భగ్నగీతమో
కాని నువ్వు వింటున్నది హల్లెలూయ
హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ
నేను చెయ్యగలిగినంత చేసాను
అయినా అది సరిపోలేదు
నాలో స్పందన కొరవడింది కాబట్టే
నీ స్పర్శకోసం వెంపర్లాడేను
ఉన్నమాట చెప్తున్నాను
నిన్ను మోసగించడం నా ఉద్దేశ్యం కాదు
ఒకవేళ అదంతా తప్పే అనుకో
అనుకున్నట్టు జరగలేదే అనుకో
అయినా నేను నా ప్రభువుముందు
నిలబడగలను, నా పెదాల మీద
నేను నిలుపుకునేదొక్కటే, హల్లెలూయ
హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ
లియొనడ్ కోవెన్ రాసిన ఎన్నో కవితలు ఇలా వాటి సంగీతంతో నిమిత్తం లేకుండానే గొప్ప సాహిత్యంగా మన తలుపు తట్టగలవు. ఉదాహరణకి Heart with No Companion (1984) అనే ఈ కవిత చూడండి:
తోడు దొరకని హృదయం
నిరాశానిస్పృహలకి అవతలి
ఒడ్డునుంచి విశాలభగ్నప్రేమతో
పిలుస్తున్నాను, నువ్వెక్కడున్నా
అది నిన్ను చేరుకుంటుంది.
ఇంకా ఓడ తయారుకాని సరంగుకోసం
పాడుతున్న పాట ఇది.
ఎటూ తేల్చుకోలేని తల్లికోసం,
ఇంకా నిండని ఊయెలతొట్టి కోసం.
తోడు దొరకని హృదయంకోసం,
నాథుడు దొరకని ఆత్మకోసం
ఏ పాటకీ ఇంకా పదనర్తనం
మొదలుపెట్టని నర్తకి కోసం.
సిగ్గుతో కుంగిపోతున్న రోజుల్లోంచి,
దుఃఖంతో బరువెక్కిన రాత్రుల్లోంచి
ఎందుకూ కొరగాని వాగ్దానాలే, అయినా
వాటిని నువ్వు నిలబెట్టుకోక తప్పదు.
వాటిని నువ్వు నిలబెట్టుకోక
తప్పదు, ఇంకా పడవ పూర్తికాని
నావికుడికోసం, ఎటూ తేల్చుకోలేక
ఇంకా తల్లి కాలేని తల్లికోసం.
Here It Is ( 2001) అనే ఒక కవిత ఉంది.
Here is your crown
And your seal and rings
And here is your love
For all things . ..
Here is your wine
And your drunken fall
Here is your love
Your love for it all. ..
ఇలా సాగే ఈ గీతం చదవగానే మనకీ ఇటువంటి కవులుండేవారని చప్పున గుర్తొచ్చింది. దాదాపు నూరేళ్ళ కిందట బసవరాజు అప్పారావు రాసిన ఈ పాట:
ఇది సంపెంగపూ
విది మల్లెపూవు
ఎది కావలెనే
చెలియా. ..
ఇది కృష్ణుప్రేమ
మిది మిత్రుప్రణయ
మెది కావలెనే
చెలియా
కోవెన్ రాసిన సుప్రసిద్ధ గీతాలు Suzanne (1967), Famous Blue Raincoat (1971) లాంటి వాటిని తెలుగులోకి అనువదించడం కష్టం. కాని అటువంటి కవితలు చదివినప్పుడు, తన హృదయాన్ని దాచుకోలేని ఏ తెలుగు భావుకుడైనా అంత శక్తింతమైన గీతాలు తెలుగులో కూడా రాయగలడని చెప్పగలను.
ఆ గీతాల్లో కనిపించే సారళ్యం మనల్ని నివ్వెరపరుస్తుంది. కొన్ని సార్లు, ముఖ్యంగా ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు, అతడు మన కాలపు సూఫీ కవినా అనిపిస్తాడు.
There is a crack in everything
That’s how the light gets in
మరీ ముఖ్యంగా మన సామాజిక అసమ్మతి కవులు పేలవమైన వచన కవితలు రాసేబదులు శిల్పపరంగా మరింత నిర్భయత్వాన్ని అలవరుచుకుంటే, ఇదుగో, ఇలాంటి వాక్యాలు అవలీలగా రాయగలరు:
They sentenced me to twenty years of boredom
For trying to change the system from within
దీనర్థం తెలుగు కవులు ఇప్పుడు కోవెన్ లానో, డిలాన్ లానో రాయాలని కాదు. కాని గీతకారులుగా మారాలనుకున్నవారికి మాత్రం కోవెన్ లాంటి కవుల్ని చదువుతుంటే కలిగే స్ఫూర్తి సామాన్యమైంది కాదని మాత్రం చెప్పగలను.
Featured image: When You Write the Music, image generated through AI.
24-5-2024
కోవెన్ గురించి అద్భుతమైన విశ్లేషణ
శుభోదయం సార్
ధన్యవాదాలు గోపాల్!
బయటి ప్రపంచం తెలియని నా బోటి వారికి ఇది విద్వదౌషధం . గేయమో గీతమో రాసినదానికంటే
ఆలాపించబడి నలుగురి చెవుల్లో పడ్డప్పుడే గుర్తింపు వస్తుంది. కవి రాసిన కవితాపంక్తులను
సంగీత పరులు స్వరపరచి పాడినప్పుడు గానీ వాటి మాధుర్యం తెలియదు. ప్రాచుర్యం సంపాదించి పేలవంగా రాసిన గేయాలు స్వరపరచే
అవకాశం ఉన్న కవులు రాణకెక్కతున్మారు. కరుణశ్రీ కి ఘంటసాల లాగా మంచి గీత రచయితలకు సహృదయగాయకులు దొరికితే కొన్ని వెలుగు చూడని కవుల లయాన్విత భావ పంక్తులు నలుగురినీ అలరించ వచ్చు అని నా ఉద్దేశం సార్.
మీరు అటువంటి గీతకారులు కాగలరని నా విశ్వాసం.
ధన్యవాదాలు సర్
‘కోవెన్ గీతాల్లో ఆ స్పృహ- ఆ రక్తీ, ఆ విరక్తీ రెండూ బలంగా కనిపిస్తాయి. అతడు ప్రేమ గురించి రాస్తున్నప్పుడు, ఆ వంకన దైవంతో తన ప్రణయం గురించి రాస్తాడు. దైవం గురించి రాస్తున్నప్పుడు, ఆయన పేరెత్తకుండా, ఆ నెపాన్న, తాను ప్రేమించిన, వదిలిపెట్టిన, వదులుకోలేకపోతున్న స్త్రీల గురించి రాస్తాడు. యుద్ధం గురించి రాస్తున్నట్టు రాస్తూనే శాంతి గురించి విలపిస్తాడు. శాంతిసమయాల్లో తనని నిలవనివ్వని రాగోన్మత్తత గురించి ఆక్రందిస్తాడు. కానీ అన్నీ చిన్న చిన్న మాటల్లో, ఊహించని అంత్యప్రాసల్లో, ఊహాతీతమైన మెటఫర్లతో రాసుకుంటూ పోతాడు. ఆ పాటలు శ్రోతల్ని సంగీతపరంగా ఎంత ఉద్రేకించగలవో, సాహిత్యపరంగా, పాఠకుల్నీ అంతే సమ్మోహితుల్ని చేయగలవు…’ Emi vaakyaalu! Aa dhaara, aa bhava prasarana amogham!
ధన్యవాదాలు సార్
మంచి పరిచయం సర్.
ధన్యవాదాలు మేడం
ఎప్పటిలానే గొప్పగా రాసారు.కోహెన్ గీత కవిత్వం బావుంది.మీ చూపు విస్తారమైనది.
ధన్యవాదాలు సార్
నన్ను నివ్వెరపరచిన వైవమిది.
వాడ్రేవుల వారికి వందనం.
ధన్యవాదాలు రామ్ భాస్కర్!