జోర్బా ద గ్రీక్

ఒకప్పుడు ఓషోకి డెంటల్ ఆపరేషన్ అయినప్పుడు ఆ డెంటల్ రూములోనే కొన్ని ప్రసంగాలు చేసాడు. కేవలం ఇద్దరు ముగ్గురు శిష్యులు మాత్రమే వినడానికి నోచుకున్న ఆ ప్రసంగాల్లో ఆయన తనకి నచ్చిన పుస్తకాల గురించి మాట్లాడేడు. మొత్తం పదహారు ప్రసంగాలు. 167 పుస్తకాలు. ఆ తర్వాత ఆ శిష్యులు వాటిని Books I have Loved (2005) పేరిట పుస్తకంగా తీసుకొచ్చారు. తన జీవితకాలంలో లక్ష పుస్తకాలు చదివానని చెప్పుకున్న ఓషో వాటిల్లో తన మనసుకి బాగా దగ్గరయిన పుస్తకాల గురించి ఆ ప్రసంగాల్లో తన భావాలు పంచుకున్నాడు. అలాగని వాటిల్లో ప్రతి ఒక్క పుస్తకం గురించీ వివరంగానో, విపులంగానో మాట్లాడలేదు. కొన్నిటిగురించి ఒకటిరెండు వాక్యాలు మాత్రమే చెప్పాడు. కొందరు రచయితల గురించి, కొన్ని పుస్తకాల గురించి ఇంతదాకా మనకి తెలిసి ఉండని అంతర్దృష్టితో మాట్లాడేడు.

ఓషో ప్రేమించిన పుస్తకాల గురించి చేసిన ప్రసంగాల గురించి ఇరవయ్యేళ్ళ కిందట, ఓషో టైమ్స్ పత్రికలో, మొదటిసారి తెలిసిందినాకు. అప్పట్లో ఆ పత్రికలో నెలకి ఒక పుస్తకం గురించి మాత్రమే వచ్చేది. నేను ఆ పుస్తకాల గురించి తెలుసుకోడానికి మళ్ళా నెల వచ్చేదాకా ఆగలేకపోయాను. అన్నిటికన్నా ముందు ఆ పుస్తకాల జాబితా చూడాలన్న కుతూహలం నన్ను నిలనివ్వలేదు. నేరుగా Books I have Loved పుస్తకం సంపాదించి, ఆ జాబితా మొత్తం ఒక్కసారి ఆమూలాగ్రం పరిశీలించుకున్నాను. అందులో చాలామంది రచయితల పేర్లు అప్పటికి నాకు కొత్త. తెలిసిన రచయితల్లో కూడా ఓషో ప్రస్తావించిన కొన్ని పుస్తకాల పేర్లు నేనప్పటిదాకా విని ఉండలేదు. కొన్ని పేర్లూ, కొన్ని పుస్తకాలూ తప్పనిసరిగా ఉంటాయనుకున్నవి లేనేలేవు. ఉదాహరణకి డాంటే, గొథే లాంటివాళ్ళు ఆ జాబితాలో లేరు. రామాయణం లేదు, అరవిందుడు లేడు, సావిత్రి లేదు. కాని నాకు తెలియని ఎందరో రచయితలు, ముఖ్యంగా మిస్టిక్కులు ఆ పుస్తకం ద్వారా నాకు పరిచయమయ్యారు. ఆయన ప్రస్తావించిన రచయితల పుస్తకాలు ఒక్కొక్కటే సంపాదించి చదవడమే ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు పనిగా పెట్టుకున్నాను. George Gurdjieff రాసిన Meetings with Remarkable Men, Alan Watts రాసిన The Way of Zen, Paul Reps  రాసిన Zen Flesh, Zen Bones లాంటి పుస్తకాలు అలా పరిచయమైనవే.

అప్పుడు పరిచయమైన పుస్తకమే Zorba the Greek కూడా. ఆ పుస్తకం ఓషోని ఎంతగా ప్రభావితం చేసిందంటే, ఆ పుస్తకం ఇచ్చిన మెలకువతో ఆయన Zorba the Buddha అనే భావనని ప్రపంచానికి పరిచయం చేసాడు. తాను దర్శిస్తున్న మానవుడు Zorba the Buddha లాగా ఉంటాడనీ, ఉండాలనీ చెప్పుకున్నాడు.

ఓషో పుస్తకం చదివిన వెంటనే తెప్పించుకున్నానో లేదా ఆ తర్వాత  కొనుక్కున్నానో గుర్తులేదుగాని, Zorba the Greek  (2000) ఇన్నాళ్ళుగా నాతోనే ఉన్నప్పటికీ ఇప్పటికి చదవగలిగాను. ఆ పుస్తకం చదవడం పూర్తిచేయగానే ముందు ఓషోనే గుర్తొచ్చాడు.

Zorba the Greek ఒక గ్రీకు నవల. దాని రచయిత నికోస్ కజంజకిస్ ఆధునిక గ్రీకు కవుల్లో, రచయితల్లో అగ్రగణ్యుడు. హోమర్ రాసిన ప్రాచీన గ్రీకు ఇతిహాసం ఒడెస్సీకి కొనసాగింపుగా Odessy, A Modern Sequel (1938) అనే మహేతిహాసం రచించాడు. కాని బయటి ప్రపంచానికి ఆయన నవలా రచయితగానే ఎక్కువ పరిచితుడు. నీషే Superman అనే భావనని ప్రపంచానికి పరిచయం చేసినట్టుగా, కజంజకిస్ Zorba the Greek అనే భావనని రక్తమాంస పరిపుష్టమైన పాత్రగా చిత్రించి ప్రపంచానికి పరిచయం చేసాడు.

నోబెల్ పురస్కారం పొందడానికి అన్నివిధాలా అర్హుడైనప్పటికీ, తొమ్మిది సార్లు ఆ పురస్కారానికి నామినేట్ అయినప్పటికీ కజంజకిస్ కి ఆ బహుమతి రాలేదు. ఒకసారి ఆయన కన్నా ఒక్క ఓటు ఎక్కువ రావడంతో ఆల్బర్ట్ కామూకి నోబెల్ బహుమతి దక్కింది. ఆ సంగతి తెలిసినప్పుడు కామూ తనకన్నా కూడా కజంజకిస్ కి ఆ పురస్కారం లభించిఉంటే తనకెక్కువ సంతోషం కలిగి ఉండేదని అన్నాడట.

కాని సాహిత్యప్రపంచంలో ఇదేమీ వింతకాదు. చాలాసార్లు అత్యున్నత పురస్కారాలు లభించిన రచయితలకన్నా కూడా ఏ పురస్కారాలు పొందని రచయితలే ప్రజల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుండే దృష్టాంతాలెన్నో ఉన్నాయి. కజంజకిస్ రాసిన The Last Temptation నవలని సినిమాగా తీసినప్పుడు అది ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. వాటికన్ ఆ నవలని తన నిషేధిత పుస్తకాల జాబితాలో చేర్చడం కజంజకిస్ కి దక్కిన గొప్ప గుర్తింపు అని చెప్పవచ్చు.

కజంజకిస్ జీవితానుభవం అత్యంత సుసంపన్నమైంది. ఆయన పారిస్ లో బెర్గ్ సన్ ప్రసంగాలు విన్నాడు. నీషే తత్త్వశాస్త్రం మీద డాక్టరేట్ చేసాడు. గ్రీసు తరఫున బాల్కన్ యుద్ధాల్లో సైనికుడిగా పోరాడేడు.  వియన్నాలో కూచుని బౌద్ధధర్మాన్ని అధ్యయనం చేసాడు. బెర్లిన్ లో రాడికల్స్ తో కలిసి పనిచేసాడు. సైకెలియానోస్ అనే ఆధునిక గ్రీకు కవితో కలిసి ప్రాచీన గ్రీసు మొత్తం పర్యటించాడు. ఒక్క గ్రీసు మాత్రమే కాదు, దాదాపుగా ప్రపంచమంతా, ముఖ్యంగా చీనా, జపాన్ లు కూడా విస్తృతంగా పర్యటించాడు.

సుసంపన్నమైన జీవితానుభవం, విస్తృత ప్రపంచాన్ని చాలా దగ్గరగా చూసిన మెలకువా, వివిధ తాత్త్విక దృక్పథాల్ని లోతుగా అధ్యయనం చేసిన అంతర్దృష్టీ కూడుకున్న రచయిత ఒక నవ్యమానవుణ్ణి సంభావిస్తే ఎలా ఉంటుందో Zorba the Greek లో మనకి కనిపిస్తుంది. అది కజంజకిస్ స్వీయానుభవాల మీంచి రాసిన నవల. ఆయన కొన్నాళ్ళు పెలిపొన్నెస్సస్ ద్వీవకల్పంలో లిగ్నైటు గనుల తవ్వకం మొదలుపెట్టి చేతులు కాల్చుకున్నాడు. ఆ రోజుల్లో అతడికి జార్జి జోర్బాస్ అనే అతనితో స్నేహం కలిసింది. ఆ స్ఫూర్తితో అతడు Zorba the Greek పాత్రని మలిచాడు.

Zorba the Greek నవల ఇంగ్లిషు అనువాదం వచ్చిన తొలిరోజుల్లోనే టైమ్ పత్రికకోసం సమీక్షిస్తూ ఒక విమర్శకుడు దాన్ని ఓడెస్సీ, డాన్ క్విక్సోట్ లతో పోల్చాడు. ఎందుకంటే ఒడెస్యూస్ లాగా, డాన్ క్విక్సోట్ లాగా జోర్బా కూడా రక్తమాంసాలు పరిపుష్టంగా ఉండే మానవపాత్ర. ఆ నవలలో కథకుడు ఒక మేధావి. అధ్యయనశీలి. ఇరవయ్యవశతాబ్దపు హామ్లెట్ లాంటివాడు. బుద్ధుడిపైన ఒక సమగ్రమైన పుస్తకం రాసేపనిలో ఉంటాడు. అతడికి స్టవ్రిడకిస్ అనే స్నేహితుడుంటాడు. ఆ స్నేహితుడు కాకసస్ లోనూ, యుక్రేన్ లోనూ ఉన్న గ్రీకుల్ని విడిపించడంకోసం పోరాడే ఒక యోధుడు. కథకుడికి అతడొక విస్పష్టమైన ఆదర్శం. తాను అలా జీవించలేకపోతున్నాననే ఒక అపరాధభావం కథకుణ్ణి పీడిస్తూ ఉంటుంది. కథ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతి కాలంలో మొదలవుతుంది. కథకుడికి ఒకరోజు మాసిడోనియాకి చెందిన ఒక గ్రీకు పరిచయమవుతాడు. తను బాగా వంటచేసిపెట్టగలననీ, తనని పనిలో పెట్టుకోవచ్చు కదా అని కథకుణ్ణి అడుగుతాడు. అతడే జోర్బా. కథకుడు అతడితో కలిసి క్రీటులో ఒక లిగ్నైట్ గని తెరిచే పని మొదలుపెడతాడు. వంటవాడిగా పనిచెయ్యడానికొచ్చిన జోర్బా గనిపనివాడిగా, ఇంజనీరుగా కూడా అవతారమెత్తుతాడు. ఇక ఆ తర్వాత ఆ నవల మొత్తం కథకుడూ, జోర్బా కలిసి క్రీటు ద్వీపంలో సాగరతీరంలో ఒక గ్రామంలో జీవిస్తూ లోనైన అనుభవాల కథనం. ఆ అనుభవాలూ, ఆ అనుభవాల మధ్య జోర్బా మాట్లాడే మాటలూ, అతడి చిత్రమైన ప్రవర్తనా కథకుణ్ణి ఎప్పటికప్పుడు ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. కాకసస్ లో గ్రీకు విముక్తికోసం పోరాడుతున్న తన మిత్రుడిలాగా జోర్బాకి స్పష్టమైన జీవితాదర్శం కాని, విస్పష్టమైన సిద్ధాంతం గానీ ఏమీ ఉండవు. అతడికొక నైతికతా, శీలప్రాధాన్యతా ఉన్నట్టు కనబడవు. అతడు తన తలపులకీ, మాటలకీ, చేతలకీ మధ్య ఒక అంగీకారం ఉన్నట్టుగా తన చుట్టూ ఉన్నవాళ్ళని నమ్మిచే ప్రయత్నం ఏదీ చెయ్యడు. నిజానికి అతడికి తన చుట్టూ ఉన్న ప్రపంచం తాలూకు అభిప్రాయాల పట్ల లక్ష్యం లేదు. తననీ, తన జీవనసరళినీ ప్రపంచం ఆమోదించాలన్న తాపత్రయం ఏదీ అతడికి లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అతడు మూర్తీభవించిన జీవశక్తి. మనిషిలోని ప్రాకృతిక జీవశక్తి ఎప్పుడు ఎలా వ్యక్తంకావాలనుకుంటే అలా వ్యక్తం కావడమే మనిషి జీవించవలసిన పద్ధతి అన్నట్టుగా కనబడతాడు. ‘లోపాలు లేని మనిషి అంటూ ఎక్కడుంటాడు చెప్పు? అసలు ఏ లోపం ఉండకూడనుకోడమే అసలైన లోపం’ అని అంటాడు అతడు కథకుడితో.

ఆ సముద్రతీర గ్రామంలో వాళ్ళు చాలా అనుభవాలకు లోనవుతారు. చాలా సంతోషాల్ని పంచుకుంటారు. ఊహించలేని దురాగతాల్ని కళ్ళారా చూస్తారు. వాళ్ళు తలపెట్టిన గనిపని విఫలమవుతుంది. కథకుడు ఆర్థికంగా నష్టపోతాడు. చివరికి అతడు ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోడానికే నిశ్చయించుకుంటాడు. జోర్బానుంచి సెలవు తీసుకుంటాడు. ఆ తర్వాత కొంతకాలానికి జోర్బా మరణించినట్టు ఉత్తరం వస్తుంది. కాని నవల ముగిసేటప్పటికి కథకుడిలో అపారమైన పరివర్తన సంభవించినట్టు మనకి అర్థమవుతుంది. అంతదాకా పుస్తకాల ద్వారానూ, ఆదర్శ దృక్పథం ద్వారానూ మాత్రమే జీవితాన్ని చూడటానికి అలవాటు పడ్డ కథకుడికి మొదటిసారి జీవితాన్ని చాలా దగ్గరగా, ఎలాంటి ముసుగులూ, దాపరికాలూ లేకుండా చూసిన అనుభూతి కలుగుతుంది. ఒక నిజమైన మనిషితో కొంతకాలమైనా దగ్గరగా గడిపిన స్పృహ మిగులుతుంది.

ఒక మనిషిగా కజంజికస్ అనుభవించిన ద్వైదీ భావాన్నే  తన రచనల్లో విపులంగా చిత్రిస్తూపోయేడని చెప్పవచ్చు. ముఖ్యంగా అతడిలో ఒక క్రైస్తవుడితో పాటు ఒక గ్రీకు కూడా ఉన్నాడు. ఆ గ్రీకు కూడా డయొనీషియన్ గ్రీకు. గ్రీకు ప్రాపంచిక దృక్పథాన్ని తొలినుంచీ అపొలో, డయోనిసస్ లు రెండు వేపులా లాగుతో వచ్చారు. అపొలొనియన్ గ్రీకు సుకుమారుడు. స్వాప్నికుడు, ఆదర్శవాది. కాని అదంతా పై పై పొరల్లో మాత్రమేననీ, మనిషి అంతరాంతరాల్లో అత్యంత ప్రాకృతిక స్వభావి అనీ, మనిషిలోని స్వాభావిక జీవశక్తి మంచిచెడ్డలకు అతీతమైందనీ డయోనిసస్ గుర్తుచేస్తుంటాడు. డయోనిసస్, అతణ్ణి బాకస్ (Bacchus) అని కూడా అంటారు, మద్యానికీ, ఉన్మాదానికీ కూడా అధిదేవత. గ్రీకు ట్రాజెడీ ఆవిర్భవించడం వెనక డయోనిసస్ క్రతువుల ప్రభావం ఉందంటారు. కజంజకస్, ఒక మనిషిగా, ఒక రచయితగా, క్రీస్తుకీ, డయోనిసస్ కీ మధ్య నలిగిపోయాడని ఆయన రచనలు చదివితే మనకు తెలుస్తుంది. ఇందులో కూడా ఆ సంఘర్షణ కనిపిస్తుంది. అయితే ఇందులో క్రీస్తుకి బదులు బుద్ధుణ్ణి ప్రతిపాదిస్తాడు. అంటే బుద్ధుడికీ, డయోనిసస్ కీ మధ్య నలుగులాట అన్నమాట. బుద్ధుడు జీవితకాంక్షని స్పష్టంగా నిరాకరించాడు. ప్రపంచం తనపైన విసరగల రంగులవలని ఆయన మారలీలగా గుర్తుపట్టి దాన్ని సునాయాసంగా తిరస్కరించగలిగాడు. కాని సమస్య ఎక్కడొస్తుందంటే, జోర్బా లాంటి వ్యక్తులు ప్రాపంచిక సుఖాల్ని ప్రేమిస్తున్నట్టే కనబడతారుగాని, వాటిల్లో కూరుకుపోరు. పూర్తి సాంగత్యం మధ్య వాళ్ళల్లో నిస్సంగి మరింత తేటతెల్లంగా కనబడుతూనే ఉంటాడు. జీవితం జీవించు, కాని కూరుకుపోకు, ఎప్పటికప్పుడు జీవితం నీముందు సంధించే ప్రశ్నలనుంచి పారిపోకు, సరాసరి ఆ ప్రశ్నలకొమ్ములు పట్టుకుని వాటితో కలయబడు, కాని నీ ప్రవర్తనని సిద్ధాంతీకరించకు అన్నట్టే ఉంటుంది జోర్బా ప్రవర్తన.

తాము చెప్తుండే ఆదర్శాలకు తగ్గట్టుగా జీవించలేకపోతో, ఆదర్శాలకూ, ఆచరణకూ మధ్య అంతరాల్ని శుష్కసమర్ధనలతో పూరించడానికి బదులు, ఏ ఆదర్శాల్నీ వల్లెవేయకుండానే, ఎప్పటికప్పుడు తన అంతరంగం ఎలా చెప్తే అలా నడుచుకుంటూ పోవడం ద్వారా మనిషి తనని తాను మరింత మానవీయంగా వికసింప చేసుకోగలడనిపిస్తుంది జోర్బాని చూస్తుంటే.

అయితే, ఏ ఆదర్శాల బరువుకిందా నలిగిపోని ఒక పాత్రను చిత్రించడం ద్వారా కజంజకిస్ మరొక ఆదర్శపాత్రను చిత్రిస్తున్నాడా అని అనుమానం కూడా కలుగుతుంది. అందుకనే ఆ నవల గురించి మాట్లాడుతూ ఓషో ఇలా అన్నాడు:

‘జోర్బా, నిరక్షరాస్యుడైన జోర్బా, నిరుపేద జోర్బా, ఒక  కార్మికుడు..అతడు బలిష్టదేహుడే గాని, ఒకింత ఉన్మాది కూడా. అతడు తన మిత్రుడైన యజమానికి గొప్ప సలహా ఇచ్చాడు: ‘ఒకింత ఉన్మాదిగా ఉండవయ్యా’ అని. నేనంటాను, ఒకింత ఉన్మాదం చాలదు, సంపూర్ణ ఉన్మాదం కావాలని. కాని పరిపూర్ణ ఉన్మాదం ధ్యానంలో మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే నువ్వు కుప్పకూలిపోతావు. అంత ఉన్మాదాన్ని నువ్వు అరాయించుకోలేవు. పైగా అదే నిన్ను తినేయడం మొదలుపెడుతుంది. ధ్యానమంటే ఏమిటో నీకు తెలియకపోతే నువ్వు దగ్ధమైపోతావు. అందుకనే నేను Zorba the Buddha కావాలంటాను.’

ఓషో ఇంకా ఇలా అంటున్నాడు:

‘Zorba the Buddha నా సమన్వయం. గొప్ప కళాసృష్టి చేసినందుకు నేను కజంజకిస్ ని నేను అభిమానిస్తాను. కాని అతడింకా చీకటిలోనే ఉండిపోయినందుకు జాలిపడతాను కూడా. కజంజకిస్, నీకు ఒకింత ధ్యానం కావాలి, అది నిన్ను లోబరుచుకోవాలి. లేకపోతే జీవితమంటే ఏమిటో నువ్వెప్పటికీ తెలుసుకోలేవు.’

ఓషో వాక్యాలు ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ, ఆయన జోర్బాను మరింత సరళంగా అర్థం చేసుకోడానికి ప్రయత్నించాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ రచయిత అయినా తన సాంస్కృతిక వారసత్వానికి బందీగానే ఉంటాడు. గ్రీకు నేలమీద ఒక బుద్ధుడు ఎప్పటికీ ప్రభవించలేడు. గ్రీకు సంస్కృతి, శిల్పం, సాహిత్యాలు చేసిన పని మానవదేహాన్ని కేవలం ప్రేమించడం కాదు, ఆరాధించడం.  క్రైస్తవం గ్రీకు నేలమీద అడుగుపెట్టినప్పుడు క్రైస్తవ దృక్పథాన్ని గ్రీకు మనస్తత్వానికి సన్నిహితంగా తీసుకుపోడానికి తొలిక్రైస్తవులు ప్లేటో రచనలమీద ఆధారపడ్డారన్నది మనం మర్చిపోకూడదు.  గ్రీకు మనస్తత్వానికి సొఫోక్లీసు, యురిపిడిస్ వంటి నాటకకర్తలు తప్ప సోక్రటీస్, ప్లేటోలు ప్రతినిధులు కారని మనం చెప్పగలం. గ్రీకు లిరిక్ కవిత్వంలో విస్తారంగా కనవచ్చే మానవదేహప్రేమని నిరాకరించడం కోసమే ప్లేటో సింపోజియం రాసాడని కూడా మనం మర్చిపోలేం.  గ్రీకు సాంస్కృతిక నేపథ్యంలోంచి చూసినప్పుడు కజంజకిస్ పడుతున్న సంఘర్షణ ఆయనొకడిదే కాదనీ, మొదటి ప్రపంచయుద్ధం తర్వాత మొత్తం గ్రీకు జాతి సంఘర్షణ అనీ మనం ఊహించగలం. అలాగని అది కేవలం గ్రీకులకి మాత్రమే పరిమితమైన అవస్థకాదనీ, ప్రపంచమంతటా ఆధునిక మానవుడి ప్రశ్నలు కూడా దాదాపుగా అటువంటివేననీ కూడా మనం పోల్చుకోవచ్చు. అందుకనే Zorba the Greek ని ప్రపంచమంతా రెండుచేతులా స్వాగతించింది.

అలాగని నవల మొత్తం సిద్ధాంత చర్చనో లేదా తాత్విక సంఘర్షణనో ఉందని అనుకుంటే అది పొరపాటే.  ఆ కథనం ఆద్యంతం ఎంతోహృద్యంగా నడుస్తుంది. ఎన్నో తావుల్లో కజంజకిస్ లోని కవి గొంతు ఎంతో స్పష్టంగా వినిపిస్తుంది. ఆ సముద్రతీర క్రీటన్ గ్రామంలో మనం కూడా కొన్నాళ్ళు ఉండివచ్చినట్టుగా అనిపిస్తుంది ఆ నవల చదవడం ముగించాక.

నవల చదువుతుండగానూ, తర్వాతా కూడా తెలుగులో ఇటువంటి భావతీవ్రతకు నోచుకున్న పాత్రలుగాని, నవలలుగాని ఏమైనా ఉన్నాయా అన్న ఆలోచన రాకపోలేదు. తెలుగు రచయితకి ఆదర్శపాత్రల్ని సృష్టించడం పట్లనే ఎక్కువ మక్కువ. ఒక అసమర్థుని జీవయాత్ర, ఒక అల్పజీవి, ఒక చివరకు మిగిలేది లాంటి నవలల్లో ఆదర్శమానవుణ్ణి కాక, అసమర్థ మానవుణ్ణి చిత్రించినప్పుడు కూడా ఆ అసమర్థతని ఒక ఆదర్శంగా ప్రతిపాదించడం లేదు కదా అనే అనుమానం రాకపోదు. చాలా ఆలోచించిన మీదట, చలంగారి నవలల్లోనూ, కథల్లోనూ కాదుగాని, ఆయన మూజింగ్సులో ఇటువంటి భావతీవ్రత కనిపిస్తుందనిపించింది. ఆదర్శానికి నిలబడలేని ఆచరణ వల్ల మనుషులు ఆత్మలోకంలో దివాలా తీస్తుండటాన్ని నిస్సంకోచంగానూ, తీవ్రాతితీవ్రంగానూ బయటపెట్టిన రచయిత ఎవరన్నా ఉన్నారా అంటే ఇప్పటికీ చలంగారే కనిపిస్తున్నారు. ఇక కథల్లోనూ, నవలల్లోనూ, నాటకాల్లోనూ ఇంత గాఢమైన భావతీవ్రతకు నోచుకున్న రచయితలు మరెవ్వరూ కనిపించడం లేదుగాని,  త్రిపుర గారి ‘జర్కన్’ కథలో వీరాసామి జోర్బాకు దగ్గరగా రాగల పాత్ర అనిపించింది.

ఏ భాషలోనైనా గాఢమైన రచనలు రావాలంటే, ప్రగాఢమైన పాత్రలు సృష్టించాలంటే, ముందు ఆ రచయితలకి తీవ్రమైన అన్వేషణ ఉండాలి. వారు తమకై తాము తీవ్రమైన సంఘర్షణకి లోనై ఉండాలి. తమ ప్రశ్నల్ని తాము సాహసంగా ఎదుర్కొని వాటికి సమాధానాలు అన్వేషించాలనే తపనతో రగిలిపోవాలి. అటువంటి తపనలోంచీ, అన్వేషణలోంచీ రాసే వాక్యాలు ఎలా ఉంటాయో ఈ నవలనుంచి చిన్న ఉదాహరణ చూపిస్తాను. కజంజకిస్ ఇలా రాస్తున్నాడు:

‘నేను స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నప్పుడు మాకు ఒక పాఠముండేది. అక్షరమాల నేర్పటానికి ఆ పాఠం చెప్పేవారు.’

‘ఆ కథలో ఒక పిల్లవాడు ఒక బావిలో పడిపోతాడు. అక్కడ అతడికొక అద్భుతమైన నగరం కనబడుతుంది. పూలతోటలు, తేనె నిండిన కొలను, అన్నం ముద్దలాంటి కొండా, రంగురంగుల బొమ్మలూ కనిపిస్తాయి. నేను ఆ బొమ్మల కింద ఉన్న ఒక్కో అక్షరాన్నీ బిగ్గరగా పలుకుతుంటే నాకు ఆ ఇంద్రజాల నగరం మరింతగా కళ్ళముందు తెరుచుకుంటూ ఉండేది. ఒక మధ్యాహ్నం నేను స్కూలునుంచి ఇంటికి రాగానే తోటలోకి పరిగెత్తాను. అక్కడ ద్రాక్షతీగని ఆనుకుని ఉన్న బావి అంచుదగ్గర నిలబడి ఆ బావిలోపలి నల్లటి నీటి అంచుని తదేకంగా చూస్తో ఉండిపోయాను. మరికొంతసేపు అట్లానే చూస్తే ఒక అద్భుతనగరం, ఇళ్ళూ, వీథులూ, పిల్లలూ, ద్రాక్షతోటలూ కనిపిస్తాయనిపించింది. ఇంక ఉండబట్టలేక తలకిందికి వంచి రెండు చేతులూ చాచి కాళ్ళు నేలమీంచి పైకి లేపి బావి అంచుమీంచి లోపలకి దూకబోయాను. సరిగ్గా ఆ క్షణమే మా అమ్మ కళ్ళల్లో పడ్డాను. ఆమె కెవ్వున కేకపెట్టి పరుగు పరుగున వచ్చి నా నడుం పట్టుకుని నన్ను వెనక్కి లాగేసింది. ..’

‘ఒక చిన్నపిల్లవాడిగా అప్పుడు నేను దాదాపు ఆ బావిలో దూకినంత పనిచేసాను. కాని పెద్దయ్యాక,  కొన్ని పదాల్లోకి నేను నిజంగానే దూకేసాను. ‘అనంతత్వం’ అటువంటి పదం. అలాంటి పదాలు చాలానే ఉన్నాయి- ‘ప్రేమ’, ‘ఆశ’, ‘దేశం’, ‘దైవం’- అలా ప్రతి ఒక్క పదాన్ని దాటుకుంటో నేను ముందుకొచ్చేస్తున్న కొద్దీ ఎప్పటికప్పుడు నేనో పెద్ద విపత్తునుంచి బయటపడుతున్నట్టూ, ముందుకు పోగలుగుతున్నట్టూ అనిపించేది. కాని, కాదు, నేనింతదాకా చేస్తూ వస్తున్నదల్లా పదాలు మార్చడమే. దాన్నే పురోగతి అనీ విముక్తి అనీ అనుకుంటూ వచ్చాను. ఇక ఇదుగో, గత రెండేళ్ళ బట్టీ, ఈ ‘బుద్ధుడు’ అనే పదం అంచుని పట్టుకుని వేలాడుతున్నాను.’

‘ఈ ఘనత జోర్బాదే. ఇప్పుడు అతడి పుణ్యమా అని ఈ బుద్ధుడనే పదమే నేను నిలబడ్డ చివరి బావి అనీ, ఇదే నన్ను సమ్మోహితుణ్ణి చేస్తూ వచ్చిన చిట్టచివరి బావి అంచూ అనీ, ఇంక దీని తర్వాత నాకు నిజంగానే విముక్తి అనీ నమ్మకం కలుగుతోంది. ఎప్పటికీ. నిజంగా ఎప్పటికీనా? ఏమో? ప్రతిసారీ మనకి మనం ఇలానే చెప్పుకుంటాం. ..’

ఇలా రాయగల రచయితలూ, ఇటువంటి నవలలూ తెలుగులో వచ్చే రోజు కోసం ఎదురుచూస్తుంటాను.

Featured image: Michelangelo Buonarroti, Bacchus, ca. 1496-97, Bargello National Museum, Florence, Italy. Tuscany Villas. Detail.

28-4-2024

7 Replies to “జోర్బా ద గ్రీక్”

  1. జోర్బా ను గురించి పుస్తకం లో కొన్ని వాక్యాలు ఉటంకించండి గురువుగారు👍

  2. Technology పుణ్య పుణ్యమా అని ఈ చిన్న వీరభద్రుడు కుటిరమే మనము నిలబడ సాహిత్య చివరి కుటీరం 🙏

  3. Your Translation is extra ordinary. It will be Telugu Readers privilege if you make it in Telugu Sir. Kindly consider.

  4. చాల మంచి నవల సార్. ఈ నవల గురించి మరీ క్లుప్థంగా వ్రాయలేము. ఎందుకంటే మీరు స్ప్రుసించిన భావం అంత గాఢమైనది కనుక. మరల మరల చదివి వ్రాయడానికి ప్రయత్నం చేస్తాను సార్. ఒషో ప్రస్థావన ఉంటె భావం చాలా లోతుగా ఉంటుంది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading