
కన్నడ వచన సాహిత్యం తర్వాత కృష్ణభక్తి కీర్తన సాహిత్యం, దాస సాహిత్యం కన్నడంలో ప్రచలితం అయ్యాక, కవిత్వం గానయోగ్యంగా మారింది. కాని వచనాల్ని కూడా గానం చేసే ఒక సంప్రదాయం కూడా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మనకాలంలో బసవన్న వచనాలకు మల్లికార్జున్ మాన్సుర్ గానం బంగారానికి తావి అబ్బినట్టుగానే పరిమళించింది. ఈ రోజు యువగాయకులు, ఉదాహరణకి స్మితా బెళ్ళూరు లాంటివారి వచనగానానికి కూడా ప్రజాదరణ పొంగిపొర్లుతూనే ఉంది.
వచనకారులు తమ కవిత్వంలో సద్యఃస్పందనకి పెద్ద పీటవేసారని చెప్పుకున్నప్పటికీ, వారి వచనాల్లో కొన్ని నిర్మాణ వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి వచనంలోనూ ఒక ఎత్తుగడ, ఒక విశదీకరణ, ఒక పతాకని మనం గుర్తుపట్టవచ్చు. ప్రతి వచనంలోనూ ఒక సాక్షాత్కార క్షణం మనకి అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. ఈ నిర్మాణ సౌందర్యాన్ని గ్రహించడానికి మనకి భాషతో పనిలేదనిపిస్తుంది కూడా. ‘ఇంటి యజమాని ఇంట్లో ఉన్నాడో లేడో’ (97) అనే బసవన్న వచనాన్ని తీసుకుని అందులో ఉన్న నిర్మాణ వ్యూహాల్ని రామానుజన్ ఎంతో లోతైన పరిశీలనతో వివరించాడు. ఆ పరిశీలన నమూనాగా మనం బసవన్న వచనాల్ని చాలావాటిని పరిశీలించి చూడవచ్చు. అవి పైకి కనిపించినంత సరళంకావనీ, deceptively simple అనీ, వాటిని పైపైన చదువుకుంటూపోతే వాటిలోని లోతుల్ని చూడకుండా ముందుకుపోయే ప్రమాదముందని మనకి బసవన్నని మొదటిసారి చదువుతున్నప్పుడే అర్థమవుతుంది.
ఉదహరణకి, ఈ వచనం (26) చూడండి:
ఒలె హత్తి ఉరిదడె నిలబహుదల్లదె
నెలహత్తి ఉరిదడె నిలలు బహుదె
(ఇల్లంటుకుంటే నిలవగలం గాని నెలవు అంటుకుంటే నిలవగలమా)
అళెవుత్త అళెవుత్త బళలు వరల్లదె, కోళగ బళలువుదె?
నడెవుత్త, నడెవుత్త, బళలు వరల్లదె, బట్టె బళలువదె?
(కొలుస్తూ కొలుస్తూ కొలిచే వారు అలిసిపోతారుగాని, కొలత అలిసిపోతుందా?
నడుస్తూ, నడుస్తూ నడిచేవారు అలిసిపోతారుగాని, బాట అలిసిపోతుందా?)
ఇటువంటి parelleisms బసవన్న కవిత్వంలో తరచూ కనవచ్చే నిర్మాణ వ్యూహం.
బసవన్న కవితాసామగ్రి ప్రధానంగా దైనందిన జీవితానికి చెందిన వస్తువులు. వాటిని ఆయన రూపకాలంకారాలుగా మార్చిన తీరు మనల్ని నివ్వెర పరుస్తుంది.
‘కత్తికంటుకున్న నేతిని నాకే కుక్క’, ‘బురదలో పడ్డ పశువు’, ‘అడవిలో దారి తప్పిన పశువు’, ‘పులి కరుచుకుపోతున్న అడవి బసవం’, ‘పెరట్లో కట్టిన గోవు’, ‘ఇనపతీగతో చుట్టిన గుమ్మడికాయ’, ‘గుమ్మం దగ్గర గడ్డిపెరిగిన ఇల్లు’, ‘ఏతం’, ‘పట్టకారు’, ‘బొమ్మలో కనిపించే సొగసు’, ‘నీళ్ళు తగ్గిపోయాక జాలరి చేతికి మిగలని చేపలు’, ‘పాము పుట్ట’, ‘టంకసాల’, ‘చెల్లే నాణేలు’, ‘చెల్లని నాణేలు’, ‘పిడకలు ఏరడంలోనే పొద్దుపోవడం’, ‘వేపాకు రుచి’, ‘నిప్పు తాకిన లక్క’, ‘మిగలముగ్గిన అరటిగెల’, ‘ముఖానికి కట్టిన అద్దం’, ‘రాతిన తాకిన పెల్ల’, ‘ఒక్క నిప్పుతునకకి తగలబడ్డ గడ్డివాము’, ‘మాఘమాసపు ఎండ’ లాంటి పోలికలు మామూలు జీవితంలోంచి ఏరుకున్నవి. ఇటువంటి పనినే కబీరు, వేమన్న కూడా చేసారు. కాని వాళ్ళకన్నా కనీసం మూడు నాలుగు శతాబ్దాలముందే బసవన్న ఈ పనిచేసాడని మనం గుర్తుపెట్టుకోవాలి. దైనందిన జీవితంలోంచి ఇటువంటి సరళసుందరమైన రూపకాలంకారాల్ని ప్రయోగించడంలో ప్రాకృతకవులు అందరికన్నా ముందు నడిచినవారన్నది నిజమేకాని, బసవన్న ఏరుకున్న పోలికలు మరింత విస్మయకారకాలుగా ఉంటాయి.
కొన్ని సమకాలిక సాంఘిక-రాజకీయ జీవితానికి చెందిన పోలికలు. ‘నిలువునా కొరతవేసినవాణ్ణి సుఖాలు అనుభవించమనడం ‘, ‘రాజుకు తెలియకుండా రాజుకి చేసే వెట్టి’, ‘రాత్రి పూట గొడుగుపట్టించుకోవడం’ లాంటివి. మరికొన్ని ఊహలో స్ఫురించిన రూపకాలేగాని చాలా సహజంగా తోచే పోలికలు-‘ఇసుకతో గోడకట్టి నీటితో కడుగుతున్నట్టుంది’ , ‘అడుగుజాడ హృదయంలో అచ్చొత్తించడం’, ‘పెన్నిధిని పట్టుకున్న భూతం’, ‘నీళ్ళల్లో ఎన్నాళ్ళు నానినా మెత్తబడని బండరాయి’, ‘దేవుడికి చెప్పిన పీనుగవెట్టి’, ‘సంసారమనే కుక్క’, ‘అంగడితెరిచిన మహదేవసెట్టి’ లాంటివి.
సామెతల్ని రూపకాలంకారాలుగా వాడుకోవడం మరీ అబ్బురం. ‘పుట్టమీద కొడితే పాము చస్తుందా?’ లాంటివి. ‘మూడున్నరకోట్ల రోమాలు కళ్ళుగా చూస్తున్నాను’అని అనడం లాంటి అనుభూతి ప్రయోగాలు ఇవ్వాళ్టికీ అత్యాధునికంగా కనిపిస్తాయి.
చాలాసార్లు ఆనందమో, ఆవేదనో ఆయన ద్విరుక్తాలుగా, ఆశ్చర్యార్థకాలుగా, ప్రశ్నార్థకాలుగా, సంతోషపు కేరింతలుగా ప్రకటిస్తుంటాడు. అటువంటిచోట్ల ఆ వచనాలు మరీ ముద్దొస్తాయి.
త్రిపురసంహారదిందమున్న
హరివిరించి గళిందమున్న
ఉమెయకల్యాణ దిదమున్న
మున్న మున్న మున్న (2)
ఈ వచనంలో మూడు సార్లు ‘మున్న’ అన్న తర్వాత కూడా మరోమూడు సార్లు మున్న అనడంలోని ఆ ఉక్తినిశ్చయం మామూలుది కాదు. ఆ emphasis ని అనువదించడం దాదాపు అసాధ్యం. చాలాసార్లు మూడు నాలుగు పంక్తుల వచనాల్లో ద్విరుక్తాలే ఒక పంక్తిగా ఉంటాయి. అక్కడ కవి ప్రకటిస్తున్న అనుభూతి భాషాతీతం. చూడండి:
హురుళిల్ల! హురుళిల్ల!
కూడల సంగమదేవా, శివధో! శివధో! (13)
చాలసార్లు పదాల జతలు, లేదా మూడు నాలుగు పదాలు వెంటవెంటనే యమక అలంకారం ప్రయోగిస్తాడుగాని, యమకంలో ఉండే superfluity బసవన్నలో కనిపించదు. ప్రతి పదం ఉలితో చెక్కినట్టుగా, బాడిదతో పెచ్చులు లాగి సాపుచేసినట్టుగా, ఒక్క పొల్లుకూడా తొలగించడానికి సాధ్యం కానిదిగా ఉంటుంది. ఉదాహరణకి, మాయ మనుషుల్ని ఆడిస్తుంది అని చెప్పడానికి
హొన్ను, హెణ్ణు, మణ్ణు తోరి ( 18)
అంటాడు. హొన్ను అంటే బంగారం, హెన్ను అంటే స్త్రీ, మన్ను అంటే మట్టి. తోరి అంటే చూపించడం. ఆ హొన్ను, హెన్ను, మణ్ణు అనే మూడు పదాల యమకం మామూలు ప్రయోగం కాదు.
కొన్నిసార్లు అర్థం ఇతమిత్థంగా తేల్చిచెప్పలేని ప్రయోగాలు, అవి దాదాపుగా కవి నిట్టూర్పులు పదజాలంగా మారిన తావులు. ఉదాహరణకి:
ఎంతక్కె, ఎంతక్కె-
హడెద కాయ బీయ వాగదమున్న అట్టుణ్ణు ఓ! (166)
మోహన్ ప్రసాద్ ‘అట్లా అని పెద్దబాధా ఉండదు’ అని కవిత మొదలుపెట్టడంలో ఎంత ఆధునికత ఉందో ఇలా ‘ఎంతక్కె, ఎంతక్కె’ అనే పదాలతో కవిత మొదలుపెట్టడంలో అంత ఆధునికత ఉంది.
ఈ వచనంలో లాగా కొన్ని సార్లు వట్టి కేరింతలు కొడతాడు:
ఇందన్నె మనెగె ప్రమథరు బందహరెందు
గుడితోరణవ కట్టి, షడు సమ్మార్జనెయమాడి
రంగవాలియనిక్కి ‘ఉగే, చాంగు భళా’ఎంబె.. (377)
‘ప్రమథులు ఇంటికొస్తారని వాకిలి కసవు ఊడ్చి, నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, గుడికి తోరణాలు కట్టి’- ఇదంతా మనకి అర్థమవుతున్నది. అప్పుడు ‘ఉఘె, చాంగు భళా’ అని పాడుకుంటాను అంటున్నప్పుడు ఆ మాటలు వట్టికేరింతలు తప్ప మరేమీ కావు. అటువంటి కేరింతలు బసవన్న వచనాల్లో కొల్లలు.
కొన్ని పదప్రయోగాలు అపురూపాలు. వాటిల్లో ఇప్పటికిప్పుడు ఒకటి చెప్పమంటే, ‘రత్నమౌక్తికపుటచ్చులు’ అనే మాట గుర్తొస్తున్నది. సంస్కృతం, కన్నడం కలిసిన ఒక అపురూపమైన పదసంయోజన ఇది. ఈ పదబంధమే ఒక రత్నమౌక్తికపుటచ్చు.
బసవన్న కవిత్వంలోని శిల్పసౌందర్యం గురించి ఇక్కడ చాలా పైపైన, చాలా స్థూలంగా ప్రస్తావించాను. కాని పదేపదే మనల్ని వెన్నాడే ఆ కవితా వాక్యాలు మన మదిలో కలిగించే అలజడి గురించీ, నెమ్మదిగురించీ ఎంతో చెప్పుకోవాలి. ఒకసారి అక్కిరాజు రమాపతిరావుగారు మా మాష్టార్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, మా మాష్టారు మాటల్లో ఇలా అన్నారు:
‘కవి కావటం కంటే సహృదయుడవటం కష్టం. చెరుకుతోటలో గొర్రెలు ప్రవేశిస్తే ఆ చెరుకుగడల ఆకులు మాత్రమే మేస్తాయనీ, ఏనుగు ప్రవేశిస్తే కదా, చెరుకురసం రుచి ఎట్లా ఉంటుందో తెలియడానికి అన్నాడు బసవేశ్వరుడు.’ అని.
ఆయనలాగా బసవన్న కవిత్వంలో నిండా మునిగిపోతే అప్పుడు ఏం మాట్లాడమన్నా బసవన్న వాక్యాలే గుర్తొస్తాయి.
భక్తుని ఐక్య స్థలం
126
ఈ ప్రపంచంతో స్నేహం వదిలిపెట్టనంతదాకా
భక్తుణ్ణని ఎట్లా చెప్పుకోగలను?
పరస్త్రీ, పరధన ప్రలోభం పోనంతదాకా
మహేశ్వరుణ్ణని ఎలా చెప్పుకోగలను?
అన్ని తాపాలూ అణగిపోనంతదాకా
ప్రసాదినని ఎలా చెప్పుకోగలను?
శ్వాస సుస్థిరం కానంతదాకా
ప్రాణలింగినని ఎలా చెప్పుకోగలను?
పంచేంద్రియాల పాకులాట తగ్గనంతదాకా
శరణుణ్ణని ఎలా చెప్పుకోగలను?
జననమరణాలు సమసిపోనంతదాకా
ఐక్యుణ్ణని ఎలా చెప్పుకోగలను?
ఇలాంటి భాష, వేషం, వ్రతాలు
తెలిసినవాణ్ణి కాను
జరిగింది, జరగంది, జరుగుతున్నది
తెలిసినవాణ్ణి కాను.
కూడలసంగమదేవా
మీ మనుషులకి
భృత్యుడిగా బతకటమే
నాకు తెలిసిన పని. (510)
127
కాళిదాసుకి చూపులిచ్చావు
ఓహిలయ్యను చేరదీసుకున్నావు
నంబి పిలవగానే
ఓ అంటూ జవాబిచ్చావు
తెలుగు జోమ్మయ్యనీ
ఇష్టపడ్డావు.
కూడలసంగమదేవా
నన్నెందుకయ్యా దూరంపెట్టావు? (518)
128
ముందు కోపంలో తెలుసుకోక
ఏమేమో అన్నాను.
చూడమ్మా
మెచ్చి మనసు
పిచ్చిదైపోయింది.
విను, విను, వినమ్మా
సఖుల్ని వదిలిపెట్టి
సుఖం పొందేవాళ్ళుంటారా?
నా కోపం చల్లారింది
ఇంక రమ్మనవే
కూడలసంగయ్యని. (520)
129
లజ్జ చెడింది, సిగ్గు చెడింది
కులం చెడింది, ఛలం చెడింది.
నిన్ను పూజించి, సంగా
నా భవం చెడింది.
నిన్ను ముట్టి
కూడలసంగమదేవా
మట్టిపాలయ్యాను. (521)
130
ఏం చేయ్యను?
నా పుణ్యఫలమిలా ఉంది!
శాంతి చెయ్యబోతే
బేతాళుడు మీద పడ్డాడు.
కూడలసంగమదేవరని
పూజించబోతే
నన్ను మింగడానికి
భక్తిమృగం
నా వెంటపడింది! (525)
131
భక్తి అనే నేలమీద
గురువనే బీజం అంకురించింది.
లింగమనే ఆకుతొడిగింది.
లింగమనే ఆకుమీద
విచారమనే పువ్వు పూసింది.
ఆచారమనే కాయపుట్టింది.
జ్ఞానమనే పండు పండింది.
జ్ఞానమనే పండు
తొడిమ విడి జారిపడేవేళ
కూడలసంగమదేవుడు
తనకే కావాలని ఏరుకున్నాడు. (526)
మహేశ్వరుని జ్ఞాన స్థలము
132
స్వామివి నువ్వు
శాశ్వతుడివి నువ్వు.
సకల జగం
నిన్ను స్తుతిస్తున్నది.
మహాదేవ, మహాదేవ.
ఆ పైన ఇక మరే
శబ్దం లేదు.
జగానికొకడే దేవుడు
పశుపతి.
స్వర్గమర్త్యపాతాళాల్లో
ఒకడే దేవుడు
కూడల సంగమదేవుడు. (527)
133
యుగయుగాల ప్రళయాన్ని
ముందూ చూడలేదు,
ఇప్పుడూ చూడలేదు.
భుగభుగమని రగిలి మండటం
నాడూ చూడలేదు
నేడూ చూడలేదు.
కూడలసంగమదేవుడు తప్ప
మరొకరు తలెత్తగా
నాడూ చూడలేదు
నేడూ చూడలేదు. (541)
134
ఇద్దరూ ముగ్గురూ దేవుళ్లంటూ
ఊరికే మదమెక్కి
మాటాడబోకు.
ఒక్కడే, చూడు.
ఇద్దరనడం కల్ల.
కూడలసంగమదేవుడు కాక
మరొకరు లేదంటున్నది వేదం. (546)
135
వెదురాకులు నమిలితే
నమిలినట్టే ఉంటుందిగాని
రసం తాగలేవు.
ఇసుక ఎంతసేపు వడికినా
వడికినట్టే ఉంటుందిగాని
తాడు పేనలేవు.
నీటిని ఎంతసేపు చిలికినా
చిలికినట్టే ఉంటుందిగాని
వెన్న తియ్యలేవు.
మా కూడలసంగమదేవుణ్ణి వదిలి
ఇతరదేవతలకి ఎంత మొక్కినా
పొట్టు దంచి
చేతులు బొబ్బలెక్కినట్టే. (553)
136
కొందరు దేవుళ్ళుంటారు
జనాల ఇళ్ళు పట్టుకుని
వేలాడుతుంటారు.
కొందరు దేవుళ్ళుంటారు
పొమ్మన్నా పోరు.
ఇక కొందరు దేవుళ్ళయితే
కుక్క కన్నా కనాకష్టం.
జనాల్ని అడుక్కు తినే
దేవతలు
కూడలసంగమదేవా
ఏమివ్వగలరు?
137
పాడుపడ్డ మోడుల్లోనూ
ఊరిదారుల మధ్యా
చెరువులదగ్గరా, బావులదగ్గరా
పూలుపూసే పొదలమధ్యా
గ్రామమధ్యంలో,
పట్టణ ప్రవేశద్వారాల
కూడళ్ల దగ్గరా
ఎప్పటివో మర్రిచెట్లమీదా
ఇల్లు కట్టుకుని
పాడిగేదెల్నీ
పసికూన, చూసాలు, బాలెంత
కుమారి, కన్యల్నీ పట్టుకుని
తింటూ తిరిగే
మారయ్య బీరయ్య, భూత, బేతాళ
గ్రామదేవతలూ
కాళయ్య ధూళయ్య మాళయ్య కేతయ్యలనే
నూరు కుండలకి
కూడలసంగమదేవా
నీ శరణనే ఒక్క వేటు చాలదా? (556)
138
లక్క తినగానే
కరిగిపోయే దేవుళ్ళని
మండుతున్న మంటని చూసి
జడిసిపొయ్యే దేవుళ్ళని
దేవుళ్ళని అనగలనా?
అవసరమైతే
అమ్ముడుపోయే దేవుళ్ళని
భయపడితే
వెలవెలబోయే దేవుళ్ళని
దేవుళ్లని అనగలనా?
సహజభావనిజైక్యుడు
కూడలసంగముడొక్కడే దేవుడు (557)
139
కుండ దేవుడు, చేట దేవుడు
నడివీథిలో బండ దేవుడు
దువ్వెన దేవుడు, వింటినారి దేవుడు
కుంచం దేవుడు, గిన్నె దేవుడు
ఎక్కడ చూడు, దేవుడు, దేవుడు
పాదం మోపడానికి చోటులేదు.
ఒక్కడే దేవుడు
కూడలసంగమ దేవుడు (562)
140
పచ్చటి చెరకుతోటలో పడ్డ
గొర్రెల మంద
రసమెక్కడుందో తెలియక
పైపైని ఆకులు మేసింది.
నువ్వెవరో మదకరికి
తెలుస్తుందిగాని
గొర్రెలకు తెలుస్తుందా
కూడలసంగమదేవా? (597)
5-12-2023
రసజ్ఞులు కాని వారి ముందు కవిత్వం చదవటం
శ్రీ శ్రీ కవిత్వ పొత్తాలను తూకం వేసి అమ్ముకోవడం
లాంటిదే!
గొర్రెలకు చెరుకు గడకు అంటుకున్న ఆకులు తినడమే తెలుసు
చెరకు తీపిని ఏనుగు మాత్రమే ఆస్వాదించ గలదు.
బసవన్న వచనానికి మీ అనువాదం అద్భుతం sir.
కావ్య రసాస్వాదన సహృదయులకు
కైలాసనాథుని దివ్య దర్శనం “కన్నప్ప”లకే స్వంతం సాంతంగా…..
ధన్యవాదాలు sir.
ధన్యవాదాలు మాష్టారూ!
‘రత్నమౌక్తికపుటచ్చులు’… వీసమెత్తయినను లేదు సందేహము
ధన్యవాదాలు సార్