
వచనం అంటే అర్థం ‘చెప్పింది’ అని. ఎ.కె.రామానుజన్ ఈ అర్థాన్ని గుర్తుచేస్తూ శ్రుతి అంటే ‘విన్నది’ అనీ, స్మృతి అంటే ‘గుర్తున్నది’ అ నీ కూడా గుర్తుచేస్తూ వచనం ఆ రెండింటికన్నా ప్రత్యేకమైందనీ దీన్ని ‘చెప్పిన మాట’ అని గుర్తుపెట్టుకోవాలనీ అన్నాడు. కాని ‘చెప్పిన మాట’ అనే అర్థంలో వచనం ప్రత్యేకమైన మాట ఏమీ కాదు. ఎందుకంటే వేదమంత్రాన్ని ‘సూక్తం’ అనే పద్ధతి ఉంది. సూక్తం అంటే ‘బాగా చెప్పింది’ అని అర్థం. కాబట్టి కేవలం ‘చెప్పింది’ అన్న అర్థం మాత్రమే వచనం తాలూకు ప్రత్యేకత కాదు.
మనకి వచన కవిత్వం పందొమ్మిదో శతాబ్దంలో వాల్ట్ విట్మన్ ద్వారానూ, ఫ్రెంచి కవిత్వంలో బోదిలేర్ ద్వారానూ ప్రాచుర్యంలోకి వచ్చిన ఒక కవితా ప్రక్రియ. వాల్ట్ విట్మన్ సందర్భంలో అది ప్రజాస్వామిక స్ఫూర్తినీ, బోదిలేర్ విషయంలో అది అన్నిరకాల వ్యవస్థల్నీ ధిక్కరించే స్ఫూర్తినీ అందించిన ప్రక్రియగా దాన్ని మనం గుర్తుపడుతున్నాం. ఎందుకంటే, రాజకీయాధికారం రాజునుంచి ప్రజలకు బదలాయించడం ప్రజాస్వామ్యమయితే, కవిత్వం విషయంలో ప్రజలకు ఏ అధికారాన్ని బదలాయిస్తే, కవిత్వాన్ని ప్రజాస్వామికం చేసామని చెప్పగలుగుతాం? కవిత్వసృష్టిని ఛందోనియమాలనుంచి బయడపడవెయ్యగలిగినప్పుడు మాత్రమే కవిత్వసృజన ప్రజాస్వామికం కాగలిగిందని చెప్పగలుగుతాం. యూరోప్ లో బోదిలేర్ చేసింది ఈ పనే. సరిగ్గా ఆ కాలంలోనే ఇంప్రెషనిస్టులు చిత్రకళని నవ్యసంప్రదాయవాదుల నిర్బంధం నుంచి బయటపడెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒకసారి చిత్రలేఖనం అకాడెమీ కఠిన నియమాలనుంచి బయటపడ్డాక, ఆ ప్రయాణాన్ని ఇంక మరెవ్వరూ ఆపలేకపోయారు. ఆశ్చర్యమేమిటంటే, యూరోప్ లోనూ, అమెరికాలోనూ కవిత్వంలోనూ, చిత్రకళలోనూ ఈ విప్లవాలు సంభవించడానికి కనీసం ఏడు వందల ఏళ్ళ ముందట, కల్యాణికేంద్రంగా అనుభవమంటపంలో ఇటువంటి ఒక మహత్తర విప్లవం సంభవించింది.
వచనం అనే ఒక కవిత్వ ప్రక్రియను బసవన్న ఎంచుకుని ప్రాచుర్యంలోకి తెచ్చేకాలానికి కన్నడంలో జైన కవులు మన నన్నయలాగా చంపూకావ్యాల్ని సృష్టించి ఉన్నారు. ఎన్నో వృత్తాల్నీ, కన్నడ దేశి ఛందస్సుల్నీ తమ కవిత్వం కోసం సమర్థవంతంగా, ప్రతిభావంతంగా వినియోగించి ఉన్నారు. అంతేకాదు, మనం వేంగీ చాళుక్యుల శాసనాల్లోనూ, ఆ ప్రభావంతో నన్నయ అనుసృజించిన ఆంధ్రమహాభారతంలోనూ చూసే తత్సమభూయిష్టమైన ఒక కావ్యశయ్యకి మూలం బాదామి చాళుక్యుల శాసనాలే. ఐహోలు శాసనాన్ని రాసిన రవికీర్తి తనకి కాళిదాసు స్ఫూర్తి అని స్పష్టంగా చెప్పుకున్నాడు కూడా. కాబట్టి తాము ప్రతిపాదిస్తున్న నవ్యజీవన విధానం నిమ్నోన్నతాల మీద ఆధారపడ్డ సాంప్రదాయిక వ్యవస్థకన్నా భిన్నమైంది అని చెప్పుకున్న వచనకవులు అటువంటి శైలిని, ఛందస్సుని ఎలా అంగీకరిస్తారు? దైనందిన జీవితంలో హెచ్చుతగ్గుల్లేని సమాజం ఒనగూడాలంటే భాషలోనూ, జ్ఞానంలోనూ కూడా హెచ్చుతగ్గులుండకూడదని వచనకవులు మనసారా నమ్మారు. కాబట్టి వారు అప్పటికి ప్రచలితంగా ఉన్న ఒక్క ఛందోనియమాన్ని కూడా పాటించవలసిన పనిలేని ఒక నవ్యవాహికగా వచనాన్ని తీర్చిదిద్దుకున్నారు.
రామానుజన్ ఉదాహరించిన ఒక వచనంలో (494) బసవన్న ఇలా అంటున్నాడు:
నాకు తాళమానగతులు తెలియవు
స్వరలయలు తెలియవు.
అమృతదేవగణాలేవో
కూడా తెలియవు.
కూడల సంగమదేవా
నిన్ను బాధపెట్టకుండా
నాకు నచ్చినట్టు
నీ పాటలు పాడుకుంటాను.
వచనకారులు సంస్కృత, కన్నడ దేశిఛందస్సులు రెండింటినీ దూరం పెట్టాక వారు కోరుకున్నది వారి మనసుకి ఎలా పాడుకోవాలనిపిస్తే అలా పాడుకోడం. ఇక్కడ రామానుజన్ బసవన్న రాసిన మరో వచనాన్ని (500) గుర్తుచేస్తాడు. బసవన్న ఇలా అంటున్నాడు:
నా దేహాన్ని దండిక చెయ్యండి
నా శిరసుని బుర్రగా మార్చండి
నా నరాన్ని తీగగా మార్చి
నా వేలుని కడ్డీ చేయండి.
నా ఎదనొత్తి వాయించి
ముప్ఫై రెండు స్వరాలు పలికించయ్యా
కూడల సంగయ్యా
ఇక్కడ (Speaking of Siva, పే.38) రామానుజన్ ఒక చక్కటి మాటన్నాడు:
The vacana is thus a rejection of a premediated art, the sthavaras of form. It is not only a spontaneous cry but a cry for spontaneity-for the music of a body given over to the Lord.
ఇది చాలా కీలకమైన వాక్యం. Cry for spontaneity. అంటే ముందే నిర్ణయించబడ్డ పద్ధతుల ప్రకారం, వ్యవస్థల ప్రకారం, నియమనిబంధనల ప్రకారం నడుచుకోవడం కాదు. వాటన్నిటిలోనూ అప్పటికే ఉన్నదాని కాపాడుకోవాలనే ఆకాంక్ష ఉంటుంది. వాటిమీద తిరగబడ్డవాటికి మరేదో కావాలనే ఆకాంక్ష ఉంటుంది. కానీ శివశరణులు ఉన్నదాన్ని యథాతథంగా కాపాడుకోవాలనే conservatives కారు. లేదా మరేదో నూతనవ్యవస్థను నెలకొల్పాలనే ఆసక్తి ఉన్నవారు కూడా కాదు. ఎందుకంటే అలా ఆలోచించడం ఉన్న వ్యవస్థ స్థానంలో మరో వ్యవస్థను తీసుకురావడమే అవుతుంది. ఆ వ్యవస్థ అనతికాలంలోనే కరడుగట్టకుండా ఎలా ఉంటుంది? కాబట్టి, వాళ్ళు నిన్నని కాపాడాలన్న బాధ్యతనుంచి ఎంత బయటపడ్డారో, రేపటిని నిర్మించాలన్న ధ్యాసనుంచి కూడా అంతే బయటపడ్డారు.
వీరశైవ వచనాల ప్రభావంతో తెలుగులో కూడా వచనకారులు వచ్చారు. కృష్ణమాచార్యుడనే ఆయన సింహగిరి వచనాలు, తాళ్ళపాక పెదతిరుమలాచార్యుడు శ్రీ వేంకటేశ్వర వచనాలు రాసారు. ఆ పద్ధతిని తాము అనుసరిస్తున్నామని తెలియకపోయినా, ఇరవయ్యవశతాబ్దంలో చలంగారూ, మోహన ప్రసాదూ కూడా ‘విన్నపాలు’ రాసారు. వీరంతా వ్యవస్థిత భావజాలాన్ని ధిక్కరించిన కవులు కావడం గమనించాలి. కాబట్టి వ్యవస్థని ఏదో ఒక రూపంలో పరిరక్షించాలనుకున్నవాళ్లు పద్యకవులుగా, ఉన్న వ్యవస్థ స్థానంలో మరొక వ్యవస్థ (అది రాజు కేంద్రంగా గానీ, దైవం కేంద్రంగా కానీ) నెలకొల్పానుకున్నవాళ్లు గీతకర్తలుగా, గేయకర్తలుగా కవిత్వం రాయగా, ఏ వ్యవస్థ పట్లా నమ్మకం లేని వాళ్లు వచనకవులయ్యేరు. ఈ మాట ఆధునిక వచనకవులకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే, సంప్రదాయ వ్యవస్థలో నమ్మకం ఉన్నవాళ్ళు పద్యకవులుగా కొనసాగగా, కొత్త వ్యవస్థ రావాలని కోరుకున్న విప్లవకవులూ, ప్రజాకవులూ పాటని ప్రధాన ప్రక్రియగా స్వీకరించారు. మరొక వైపు మార్కెట్ వ్యవస్థ ని నమ్ముకున్న కవులు సినిమాపాటలు రాయడం మొదలుపెట్టారు. కానీ మార్పు సంస్థల్లో కాదు, వ్యక్తుల్లో మొదలవ్వాలని భావించిన కవులు మాత్రం వచనకవులుగా కొనసాగుతున్నారు.
ఈ దారి కన్నడ వచనకారులు వేసిందని మనకిప్పుడు అర్థమవుతున్నది. వారికి తమ అంతరంగం ఏమి చెప్తే, ఎలా పలికితే అలా పలకడమే ప్రధానం. అందుకనే ఒక విమర్శకుడు, మామూలు కవిత పద్యమనీ, నుడికీ, నడవడికీ మధ్య తేడాలేకపోతే అది ‘వచనం’ అనీ అన్నాడు.
96
జంగముడి సన్నిధిలో
వాహనం ఎక్కనమ్మా
ఎక్కానా నా భవం నశించదు.
ఎందుకో తెలుసా?
ముందుముందు నన్ను కొరతవేసే
ప్రమాదముంది కాబట్టి.
జంగముడు వచ్చాడా
ఇంక ఆసనంలో కూచోను
కూచున్నానా, నా భవం నశించదు.
ఎందుకో తెలుసా?
ముందు ముందు కాలుతున్న ఇటుకల మీద
కూచోవలసి ఉంటుంది కాబట్టి.
జంగముడిముందు
మరీ బిర్రుబిగిసి ఉండను
ఉన్నానా, నా భవం నశించదు.
ఎందుకో తెలుసా?
ముందుముందు వెన్నుకి గదనో
గడకర్రనో కట్టి కూచోపెడతారు కాబట్టి.
ఇలాంటి బాధలంటే భయం నాకు.
అందుకనే
మీ మనుషుల అలికిడి వినగానే
మీరే వస్తున్నారనుకుని
చేతులు కట్టుకు నిలబడతానయ్యా
కూడలసంగమదేవా! (396)
97
వచ్చిన జంగాన్ని చూసి
గొప్పవాడు, మధ్యరకంవాడు
మరీ తక్కువతరహా అనుకున్నానా
నలిగిపోయానయ్యా
వేగిపోయానయ్యా
నా మంటనన్నే కాల్చేసింది.
మంచి జంగమూ
మామూలు జంగమంటూ
రెండు రకాలుగా ఉంటారా
కూడల సంగమదేవా! (400)
98
వేషం చూస్తే చాలు
జంగమని నమ్ముతాను.
వాళ్ళ అంతరంగమెలాంటిదో,
అది, మీరు చూసుకోండి.
సేవకుడు సేవకుడి పని చెయ్యాలిగాని
రాజుల బాగోగులు నాకెందుకయ్యా?
కూడలసంగమదేవా
మీ మనుషులు
రత్నమౌక్తికపుటచ్చులు. (401)
99
నన్ను పొగుడుకోడం
మరొకర్ని తెగనాడటం
ఈ మాటలు వినబడకుండా
చూడండయ్యా.
నేను భక్తుణ్ణి
నన్ను బాగా చూడండని అన్నానా
నేను మీకు ద్రోహం చేసినట్టు.
మీ మనుషులు బాగుంటే
కూడలసంగమదేవా
నేనూ బాగున్నట్టే. (407)
100
బాగా తిని, బాగా తయారై
వచ్చిన జంగాన్ని గొప్పవాడనీ
చిరుగుల బొంత కట్టుకొచ్చినవాణ్ణి
తక్కువవాడనీ అనుకుంటే
పంచమహాపాపాలతో సమానం.
అన్నం, వస్త్రం, ధనం, మాటల్ని బట్టి
రెండురకాలుగా లెక్కేస్తే
నరకంలో పడేస్తావయ్యా
కూడలసంగమయ్యా (411)
101
గుర్రం మీద
ఛత్రచామరాలతో కనబడితే
పొర్లుదండాలు పెట్టి
కాళ్ళు పట్టుకుంటారు.
బడుగు భక్తుడు వస్తే
‘చోటు లేదు, నడు, నడు’
అంటారు.
నా ప్రభువు
కూడలసంగముడు
కిందపడేసి మరీ
ముక్కుకొయ్యకుండా
వదుల్తాడా? (413)
102
దూరం నుంచి వచ్చిన జంగమయ్యని
‘గారూ’ అనీ
చెంతనే ఉన్న జంగమయ్యని
సేవకుడనీ భావించే
కీడంటే
నాకు భయమయ్యా
దగ్గరవాళ్ళనీ
దూరంవాళ్ళనీ
విడదీసి చూస్తే
నీ సింగారపు ముక్కుని
కోసేస్తాడయ్యా
కూడలసంగముడు. (414)
103
పాల కుండల్నీ
నేతి పాత్రల్నీ
బోడిగిన్నెలనకండి.
పాలు తీపి.
నెయ్యి కమ్మన
లింగానికి బోనము.
కూడలసంగముడి
మనుషుల్ని
అంగహీనులన్నారా
ఘోరనరకం తప్పదు. (416)
104
స్థావరభక్తునికి
పరిధిగాని
ఘనలింగ జంగానికి
హద్దులెక్కడ?
అంబుధికి పరిధిగాని
పారే నదికి
పరిమితి ఎక్కడ?
భక్తునికి హద్దుగాని
కూడలసంగమదేవా
జంగానికి
సరిహద్దులెక్కడ? (418)
105
జంగాన్ని నిందిస్తూ
లింగాన్ని పూజించడం
ఎలా సాధ్యం?
శివశివా!
నిందిస్తూ, పూజించడం
పాతకం.
అది విననే వినకూడదు.
జంగం
గురువుకే గురువు
అన్నది
కూడలసంగమ వచనం. (424)
భక్తుని మహేశ్వర స్థలం
106
ఎనభై నాలుగు లక్షల ముఖాలు
ఒక ముఖమై
నన్నే చూడు
వేడి చూడు,
వేడకుండా చూడు.
అయ్యా
మీ ప్రమథులమీద ఆన
నువ్వేముఖంతో
వచ్చి అడిగినా
ఇస్తానయ్యా
కూడలసంగమదేవా (430)
107
బంగారంలో ఒక గీత
వస్త్రంలో ఒక పోగు
అన్నంలో ఒక మెతుకు
ఈరోజుకీ, రేపటికీ
అన్నానా
నీ పురాతనులమీద
ఆన-
నీ మనుషులకోసం తప్ప
నాకు మరొకటి తెలియదయ్యా
కూడలసంగమయ్యా (435)
108
ఓడిపోయేవాడు
బంటు కాడు
అడుక్కునే వాడు
భక్తుడు కాడు.
బంటు
ఓడకూడదు
భక్తుడు
వేడకూడదు.
ఓడిపోనయ్యా
వేడుకోనయ్యా
కూడలసంగమయ్యా! (441)
109
ఎటు పడితే అటు
మనసుపోనిస్తే
ఆన.
నీ ఆన
నీ ప్రమథుల మీద ఆన
కూడలసంగమదేవా
పరవధువుని
అమ్మవారని అంటాను. (445)
110
పరుగెత్తే పాముకి
భయపడను
నాలుక చాచే మంటకి
భయపడను
కత్తిమొనకి జంకను.
ఒకదానికి భయపడతాను
ఒకదానికి వెనకాడతాను
పరస్త్రీ, పరధనాలంటే
భీతిల్లుతాను.
భయమంటే తెలియని
రావణుడికేమయ్యింది?
తలుచుకుని
భయపడతానయ్యా
కూడలసంగమయ్యా (446)
2-12-2023
“కూడల సంగమ దేవా
పర వధువుని
అమ్మ వారంటాను”
ఇలాంటి మాటలే చిన్నప్పుడు మా అన్నయ్య కీ.శే.Dr K. చిన్న రాజన్న గారు(రిటైర్డ్ prof) చెపుతూ ఉండేవారు.
ఆ సుసంస్కారం నాకూ అలవడింది.
ఇప్పుడు living relation పేరిట ఎన్ని అకృత్యాలు….
అదృష్టవంతులు