
ఇప్పటిదాకా బసవన్న ఆలోచనల్లోని తాత్త్వికత గురించి చూసాం. ఇప్పుడు ఆయన కవిత్వం గురించి చూద్దాం. ఎందుకంటే బసవన్నని సంస్కర్త అనిగానీ లేదా ఉద్యమకారుడనిగానీ, లేదా కవి అనిగానీ లేదా మిస్టిక్ అని గాని ఏదో ఒక పాత్రకి కుదించలేం. కాని ఆయన కవిత్వం చెప్పకపోయి ఉంటే, ఆ కవిత్వాన్ని కూడా ప్రజలభాషలో చెప్పి ఉండకపోతే ఆయన తన కాలంలో నిర్వహించిన పాత్ర గురించి మనకి పురాణాలు మాత్రమే మిగిలి ఉండేవి. అదృష్టవశాత్తూ తనముందు నమ్మాళ్వార్ లాగా, తన తరువాత జ్ఞానేశ్వర్, కబీరు, నానక్ ల లాగా ఆయన పేరుమీద మనకి కొంత కవిత్వం మిగిలి ఉందికాబట్టి మనం ఆ మనిషి తన జీవితకాలంలో దేన్ని సంభావించాడు, దేనికోసం తపించాడు, దేనికోసం జీవించాడు, పోరాడేడు అన్నది ఆయన మాటల్లోనే వినే అవకాశం లభించింది.
కాబట్టి బసవన్న జీవితం ఎంత విలువైందో ఆయన కవిత్వం కూడా అంతే విలువైంది. బహుశా మనం బసవన్న సమకాలికులమో లేదా పదిహేను, పదహారు శతాబ్దాల లక్షణకారులమో అయి ఉంటే ఆ కవిత్వంలోని సాహిత్యవిశిష్టతని మనం పోల్చుకోలేకపోయి ఉండేవాళ్ళం. కాని భాగ్యవశాత్తూ, పద్ధెనిమిదో శతాబ్ది యూరపియన్ ఎన్లైటెన్ మెంటు యుగం నుంచీ ఇప్పటి బహుళాభిప్రాయాల వ్యాప్తిదాకా మానవ సమాజం తన అకాంక్షల్ని, అభ్యుదయ, సమజీవన, సహజీవన స్వప్నాల్ని ఏ విధంగా ప్రకటిస్తూ వస్తున్నదో, దానికోసం ఎప్పటికప్పుడు పాతకావ్యలక్షణశాస్త్రాల్నీ ధిక్కరిస్తూ కొత్త మానిఫెస్టోలు ఎలా రాసుకుంటూ వస్తూ ఉన్నదో పరిచమయ్యాయి కాబట్టి, ఇప్పుడు బసవన్న కవిత్వంలోని సాహిత్యవిలువల గురించి ఎంతో కొంత స్పష్టంగా మాట్లాడుకోగలం.
బసవ సమితి బెంగుళూరు వారు ప్రచురించిన వచనము కు ముందుమాట రాస్తూ ఎం.ఎం.కల్బుర్గి ‘వచనమనేది వేదాలు, బైబిల్, కురాన్ ల వలె పవిత్ర సాహిత్యం’ అనే వాక్యంతో మొదలుపెట్టాడు. అంగీకరించవచ్చును. ఎందుకంటే మతాలు రెండు రకాలుగా ఆవిర్భవిస్తాయి. ఒకటి ప్రవక్తల దివ్యవాణి ద్వారా, రెండోది, ఉత్తేజితులైన (inspired) కొందరు కవుల కవిత్వం ద్వారా. బౌద్ధమూ, జైనమూ, క్రైస్తవమూ, ఇస్లామూ, డావోయిజమూ ప్రవక్తల దివ్యవాణిద్వారా పుట్టిన మతాలు. కాని వైదికమతం, యూదు మతం, శిఖ్ఖుమతం, తమిళశైవం, శ్రీవైష్ణవం, వీరశైవం కవుల ద్వారా పుట్టిన మతాలు. కాబట్టి వచనాల్ని పవిత్రసాహిత్యంగా పేర్కోడాన్ని మనం అంగీకరించవచ్చును.
కాని పవిత్ర సాహిత్యం ప్రజల్ని స్పందింపచెయ్యడానికి ఆయా ప్రవక్తల, కవుల వాణి వెనక ఉత్తేజం ఎంత బలంగా ఉంటుందో, కవిత్వం కూడా అంతే బలంగా ఉంటుంది. ఋగ్వేదంలోనూ, సువార్తల్లోనూ, నానక్, నమ్మాళ్వారుల్లోనూ బలంగా వినిపించే కవిత్వాన్ని మనం గుర్తుపట్టగలం. నిజానికి ఆయా కవులు మంత్రద్రష్టలుగా తమ దివ్యవాణి వినిపిస్తున్నప్పుడు, వారి శుభసంకల్పాలూ, శివసంకల్పాలూ ప్రజల్లో హృదయాల్లోకి నేరుగా ప్రసరించడానికి చాలావరకూ వారి పలుకుల్లోని సాహిత్యబలం కూడా కారణమని మనం ఒప్పుకోవలసి ఉంటుంది. క్రీస్తు మాటల్లోని నిరలంకారత, బుద్ధుడి సంభాషణల్లో కనవచ్చే ఉపమాలంకారాలూ రెండూ కూడా బలమైనవే. ఇద్దరూ కూడా తాము చెప్పదలుచుకున్నదాన్ని శ్రోతల హృదయాలకు హత్తుకునేలా చెప్పడానికి పారబుల్ ని ఒక ముఖ్యసాధనంగా వాడుకున్నారు.
అలాగే బసవన్న వచనాల్లో కూడా ఆయన దయాహృదయం, తోటిమనిషికోసం పడిన అనుకంపన, శివశరణుల పట్ల సంపూర్ణసమర్పణ ఎలా స్పష్టంగా కనిపిస్తున్నాయో, ఆ వచనాల్లోని సాహిత్య విలువలు కూడా అంతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిని ముందు ముందు స్థూలంగా పరిశీలిద్దాం.
81
ఉత్తమ కులంలో పుట్టానన్న బరువుమోపి
నా మనసుకి కష్టం కలిగించకండయ్యా
కక్కయ్య తాను తినగా మిగిలింది
నాకు పెట్టడు.
దానయ్య శివదానం నింపడు.
మన్ననల చెన్నయ్య
నన్ను మన్నించడు
ఉన్నతమహిమోపేతుడా
కూడల సంగముడా
అయ్యా ! అయ్యా! (343)
82
సెట్టి అనగలనా సిరియాళుణ్ణి
మడివాలు అనగలనా మాచయ్యని
డొక్కలవాడనగలనా కక్కయ్యని
మాదిగ అనగలనా చెన్నయ్యని
నేను బ్రాహ్మణుణ్ణనిచెప్పుకుంటే
నవ్వుతాడయ్యా
కూడలసంగమయ్య. (345)
83
చెన్నయ్య ఇంట్లో పనివాడి కొడుకూ
కక్కయ్య ఇంట్లో పనిమనిషి కూతురూ
పిడకలకోసం పొలానికి పోయి
ఒక్కటయ్యారు.
వాళ్ళకి పుట్టిన పిల్లాణ్ణి నేను.
కూడలసంగముడు సాక్షి. (346)
84
నాన్న మన మాదిగ చెన్నయ్య
తాత మన డొక్కల కక్కయ్య
చిన్నయ్య మా అయ్య కానయ్య
అన్న మన కిన్నర బొమ్మయ్య.
కూడలసంగమదేవా
మీరెందుకని
నన్ను గుర్తుపట్టడం లేదు? (349)
85
భక్తికి నిరుపేదనయ్యా నేను
కక్కయ్య ఇంట్లో యాచించాను
చెన్నయ్య ఇంట్లో యాచించాను
దాసయ్య ఇంట్లో యాచించాను
పురాతనభక్తులందర్నీ గుర్తుపట్టి
పోయి వేడుకుంటే
కూడలసంగమదేవా
నా భక్తిభిక్షాపాత్ర నిండిందయ్యా.(350)
86
శ్వపచయ్య పెదనాన్న
డొక్కల కన్నయ్య చిన్నాన్న
మా మాదిగ చెన్నయ్య
నాన్నలకు నాన్న.
ఈ శరణులందరినీ
కనిపెట్టుకుని చూసుకోవయ్యా
కూడలసంగమయ్యా (351)
87
ఎవరూ లేరు
నాకెవరూ లేరంటారు
బాణుడి మనిషిని నేను.
మయూరుడి మనిషిని నేను.
కాళిదాసు మనిషిని నేను.
పెదనాన్న కక్కయ్య
చిన్నాన్న చెన్నయ్య
నన్నెత్తి ముద్దాడారయ్యా
కూడలసంగమదేవా (353)
88
రాజభవనంలో రాణిగా ఉండటం కన్నా
భక్తుల ఇంట్లో దాసిగా ఉండటం బహులెస్సయ్యా.
‘పోయి నీళ్లు తీసుకురా’
‘పత్రి పట్టుకురా’
‘లింగానికి నైవేద్యం పెట్టు’ అంటారు.
కూడలసంగముడి మహామందిరంలో
‘కిందపడ్డది
ఏరుకుతినరా’ అంటారు. (356)
89
కామం తొలగినవాడు
హేమం వదిలినవాడు
తెల్లవారి
దినక్రతువుల ధ్యాసలేనివాడు
అతడు శరణుండంటే.
ఎప్పటికీ మిమ్మల్నే
తలుచుకుంటూ ఉండేవారి
ఇంటికుక్కగా ఉండనివ్వు నన్ను
మహాదాతా
కూడలసంగమదేవా (359)
90
బ్రహ్మ పదవి వద్దు
విష్ణు పదవి వద్దు
రుద్రపదవి వద్దు.
మరే పదవీ వద్దయ్యా.
కూడలసంగమదేవా!
మీ సద్భక్తుల అడుగుజాడలు
అరయగలిగే
మహాపదవి కరుణించయ్యా (361)
91
ఎన్నెన్నో విధాల మిమ్మల్నే
తలుచుకునే వారి వాకిలి చూపించయ్యా
ప్రాణం పణం పెట్టినవారిది
మనసు సమర్పించినవారిది
ధనం ధారపోసినవారిది
ఇంటిముంగిలి చూపించయ్యా.
సమస్తం అర్పించిన నీ శరణుల్ని
నా వాళ్ళనే వాళ్ళ చెప్పులు
నా నెత్తిన మోయించయ్యా
కూడల సంగయ్యా (363)
92
చకోరానికి వెన్నెల చింత
అంబుజానికి సూర్యుడి చింత
భ్రమరానికి పూదేనెల చింత
నాకెంతసేపూ
కూడలసంగముని
తలపుల చింత. (364)
93
ఇప్పుడు నా ఇంటికి
ప్రమథులు వస్తారని
వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టి
గుమ్మానికి తోరణాలు కట్టి
‘అహా, భలే, భలే’
అని కేరింతలు కొడతాను.
తమ పాత్రల్లోంచి పొంగిపొర్లింది
కూడలసంగమశరణులు
నాతో పంచుకుంటారు కాబట్టి. (377)
94
మనసూ మనసూ కలిసినప్పుడు
తనువు కరగకపోతే
తాకీతాకగానే
పులకింతలు పొడచూపకపోతే
కళ్ళల్లో అశ్రుజలాలు
కురియకపోతే
మాటపలగ్గానే
గొంతు గద్గదిగం కాకపోతే
కూడలసంగమదేవుడిపట్ల
భక్తి కలిగిందని చెప్పగలమా?
ఇవేవీ నాలో లేవుకాబట్టి,
చూడండి,
నేను వట్టి డాంబికుణ్ణి. (379)
95
మసిని ఎంతకాలం వెలిగించినా
వెలుగు కాగలదా?
కర్మసంస్కారం
ఎముకల్ని పట్టి వదలదు.
అనంతకోటి సన్మానాలు
చేసి ఫలమేమిటి?
నిమిషం ఉదాసీనత
మొత్తం పాడుచేసింది.
కూడలసంగమదేవా!
మిమ్మల్ని నమ్మీనమ్మని
డాంబికుణ్ణి నేను. (383)
1-12-2023
చకోరానికి వెన్నెల చింత
అంబుజానికి సూర్యుడి చింత
భ్రమరానికి పూదేనెల చింత
నాకెంతసేపూ
కూడలసంగముని
తలపుల చింత.
కొన్ని వందల ఏళ్ల కిందనే ఆయన సమత్వభావాకాంక్ష ఎంత తీవ్రంగా ప్రకటించాడో తెలుస్తున్నది. మనిషి ఏ పనైనా చేయనీ , ఇక్కడ శైవమత లింగ భక్తిని ఉద్దేశించినా, బసవన్న ఆంతర్యంలో ఎల్లలులేని పవిత్ర పరమేశ్వరా రాధనాతత్త్వం గోచరిస్తున్నది.
వరుసగా మీ వ్యాసావళి చదువుతుంటే మన విద్యావిధానం మానవీయతా కోణాన్ని పూర్తిగా వదలి వేసి కేవలం యంత్రపు బొమ్మలను తయారు చేయటానికి ఏర్పడిందనిపిస్తుంది. జె.కే. వాక్యం గుర్తుకొచ్చింది’మనం డాక్టర్లను, ఇంజనీర్లను, లాయర్లను, సైంటిస్టులను తయారుచేస్తున్నాం కాని మానవీయత గలిగిన విద్యావంతుల్ని తయారు చేయడం లేద’ని. నిన్న మీరన్నట్లు మతం రాజ కీయాశ్రిత కాగానే తన ప్రయోజనసిద్ధిని కోల్పోతు న్నది. ఎక్కడ లేనన్ని మతాలు ఈ దేశంలో పుట్ట డం కూడా ఇక్కడి చైతన్య కాంక్షకు నిదర్శనమని చెప్పవచ్చు. ‘ఏకం సత్ విప్రా బహుధా వదంతి’
పాలు నీరు హంస వేరు చేస్తుందని విన్నప్పుడు నాకు అనుమానం కలిగేది సాధ్యమా ఎప్పుడూ. మీరు రాస్తున్నవి చదువుతున్నాకొద్దీఅది నిజమే నని అనిపిస్తున్నది . సాహితీమరాళులు మీరు. నమస్సులు.
ఎంతో సహృదయంతోనూ, ఎంతో ప్రేమతోనూ మీరు రాసిన స్పందనకు హృదయపూర్వక నమస్సులు.