కలియువ మనె

Sri M R Anantakumar, Kaliyuva Mane

కిందటి నెలలో నేను మైసూరు వెళ్ళినప్పుడు దగ్గరలో ఏవైనా ప్రయోగాత్మక పాఠశాలలు ఉంటే చూద్దామనుకున్నాను. పాఠశాల విద్యాశాఖలో యునిసెఫ్ తరఫున కన్సల్టంట్ గా పనిచేస్తున్న స్వాతిదేవ్ దగ్గర అటువంటి ఇన్నొవేటివ్ స్కూళ్ళ గురించిన సమాచారం ఉంటుంది. దేశవ్యాప్తంగా నడిచే ఇటువంటి ప్రయోగాల గురించి ఆమె ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. మైసూరు చుట్టుపక్కల అటువంటి పాఠశాలలేవైనా నడుస్తుంటే ఆ వివరాలు చెప్పమంటే ఆమె మూడు పాఠశాలల గురించిన సమాచారం పంపించారు. ఒకటి అరివు అనే ప్రయోగాత్మక పాఠశాల, మరొకటి శిభూమి, ఋషీవేలీ లాంటి కృష్ణమూర్తి తరహా పాఠశాల. మూడవది కలియువ మనె అనే ప్రత్యామ్నాయ పాఠశాల.

నేను మూడింటిలో కనీసం రెండేనా చూడాలనుకున్నానుగాని, నాకున్న సమయంలో కలియువ మనె ఒక్కటి మాత్రమే చూడగలిగాను. కలియువ మనె అంటే నేర్చుకునే చోటు అని అర్థం. విద్యాహక్కు చట్టం నిర్వచనాల ప్రకారం అది పాఠశాల కాదు. కానీ నిజంగా ఒక పాఠశాల అని మనం దేన్ని పిలవగలమో అటువంటి చోటు అది. మైసూరుకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెంచలగూడు అనే గ్రామంలో అనంతకుమార్ అనే ఆయన 1992 లో ప్రారంభించిన ప్రయోగం అది.

నేను మైసూరు వెళ్ళిన సాయంకాలమే ఆ పాఠశాలకి వెళ్ళాను. ఆర్.ఐ.ఇ లో రిసెర్చి స్కాలర్ గా పనిచేస్తున్న దీపక్ నాకు తోడుగా వచ్చాడు. అతను ముందే వాళ్ళతో మాట్లాడి నా సందర్శనకి ఏర్పాట్లు చేసాడు. మేము వెళ్ళేటప్పటికి కనుచీకటి పడుతూ ఉంది. కాని ఆ స్కూలు, భవనాలు, ఇతర సదుపాయాల్ని చూడటానికి ఆ వెలుతురు సరిపోయింది. మేము అక్కడ అడుగుపెట్టగానే ముగ్గురు నలుగురు యువకులు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించేరు. వారు ఆ స్కూలు పూర్వవిద్యార్థులట. వారిలో ఒక పిల్లవాడు ఒకప్పుడు స్కూల్ డ్రాప్ ఔట్. ఇప్పుడు బెంగుళూరులో ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నాడు. ఎప్పుడు తీరిక చిక్కినా ఈ పాఠశాలకి వచ్చి తన వంతు ఏదైనా పని చెయ్యడానికి ఉందేమో చూసి చేస్తూ ఉంటాడు.

మేము వెళ్ళిన కొంత సేపటికి అనంతకుమార్ మమ్మల్ని చూడటానికి వచ్చారు. ఆయనకి ఈ మధ్య ఏక్సిడెంటు కావడంతో ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంకా నడక పూర్తిగా రాలేదు. కాని వేరే రాష్ట్రం నుంచి తమ పాఠశాల చూడటానికి అతిథులు వచ్చారని తెలియగానే ఆయన రాకుండా ఉండలేకపోయారు. ఆయన్ని పాఠశాల చరిత్ర మొత్తం అడిగి తెలుసుకున్నాను. అదంతా వాళ్ళొక పుస్తకంగా కూడా వేసారు. నేను ఆ స్కూలుకి వెళ్ళక ముందే స్వాతి నాకు ఆ పి డి ఎఫ్ పంపించారు.

అనంతకుమార్ మొదట్లో చాలా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేసేరు. కాని ఏ ఉద్యోగమూ ఆయనకి తృప్తినివ్వలేదు. స్వామి వివేకానంద రచనలు ఆయన్ని ఎక్కడా స్తిమితంగా నిలవనివ్వలేదు. తన జీవితానికి ఒక అర్థాన్నిచ్చే చోటుకోసం, పనికోసం వెతుక్కుంటూ ఆయన మైసూరు దగ్గర శ్రీరంగపుర గ్రామానికి వచ్చారు. అక్కడ ఆయనకి పదవ తరగతి చదువుతున్న ముగ్గురు పిల్లలు కనబడ్డారు. వాళ్ళు ఆ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరవుతూ తమకి లెక్కలు చెప్పమని ఆయన్ని అడిగారు. ముఖ్యంగా ఆల్జీబ్రా చెప్పమన్నారు. కానీ తీరా ఆయన వాళ్ళ పరిజ్ఞానం చూడబోతే వాళ్ళకి కనీస సామర్థ్యాలు కూడా లేవనీ, ప్రాథమిక సూత్రాలు కూడా తెలియవనీ అర్థమయింది. కానీ అది తన మొదటి పరీక్షగా భావించి వాళ్ళకి లెక్కలు ట్యూషను చెప్పారు. ఆ ముగ్గురు పిల్లలూ పదో తరగతి పాసయ్యారు.

తన కార్యరంగం విద్య అని ఆయనకి అర్థమయింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకి ట్యూషన్లు చెప్పడం కాదు, అసలు పాఠశాల ముఖమే చూసి ఉండని పిల్లలకి చదువు చెప్పడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అనుకున్నారు. దాంతో 1996 లో దివ్యదీప చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి కలియువ మనె పేరుమీద ఒక విద్యాలయాన్ని తెరిచారు. ఆయన గతంలో పనిచేసిన కంపెనీ అధిపతి ఆ ప్రయోగాన్ని చూసి దానికి సహాయం అందించడానికి ముందుకొచ్చాడు. 2003 లో కెంచలగూడలో రెండెకరాల ముప్ఫయి గుంటల భూమి కొనుగోలు చేసారు. మొదట్లో పధ్నాలుగు మంది విద్యార్థులతో ఒక పాకలో మొదలైన పాఠశాల ఇప్పుడు వంద మంది విద్యార్థులతో పూర్తి స్థాయి విద్యాలయంగా పనిచేస్తూ ఉంది. ప్రతి ఏటా చాలామంది పిల్లలు తమ పాఠశాలలో ప్రవేశం కోసం వస్తున్నారనీ, కానీ, సదుపాయాలు వందమంది పిల్లలకు మాత్రమే సరిపోతాయి కాబట్టి తాము అంతకు మించి ప్రవేశాలు ఇవ్వలేకపోతున్నామనీ అనంతకుమార్ చెప్పారు.

నిరాశ్రయులైన పిల్లలకు ఇలా ఆశ్రయం కలిగించి, చదువు చెప్పే పాఠశాలల్ని జువెనల్ జస్టిస్ బోర్డులు గుర్తిస్తూ ఉంటాయి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ తరపున కలియుగమనెను కూడా అటువంటి ఒక పాఠశాలగా గుర్తించారు.

ఆ పాఠశాలలో చదువుతున్నపిల్లల్లో 68 మంది బాలురు, 32 మంది బాలికలు. ఉపాధ్యాయులు పన్నెండు మంది ఉన్నారు. బోధనేతర సిబ్బంది మరొక పదముగ్గురు ఉన్నారు. బాలికలకీ, బాలురకీ ప్రత్యేకంగా వసతిగృహాలు ఉన్నాయి. కిచెన్, డైనింగ్ హాలు ఉన్నాయి. పాఠశాలకి తరగతి గదులు వేరే ఉన్నాయి. ఆటస్థలం ఉంది. స్కూలుకి దగ్గరలో కొంత స్థలం తీసుకుని అక్కడ కూరగాయలు పండిస్తున్నామని కూడా వారు చెప్పారు. అనంతకుమార్ కొడుకు ఆర్గానిక్ వ్యవసాయంలో దిట్ట. సేంద్రియ ఎరువులు తయారు చేసి అమ్ముతుంటాడు. ఆయన చొరవతో ఆ కూరగాయలతోట కూడా బాగా నడుస్తోందని ఆ పిల్లలు చెప్పారు.

కలియువ మనె సాంప్రదాయిక అర్థంలో పాఠశాల కాదు గానీ, చక్కని పాఠశాలలో ఉండే సమగ్రమైన విద్యావకాశాలన్నీ అక్కడ కూడా ఉన్నాయి. మేము వెళ్ళేటప్పటికి చీకటి పడి, రాత్రవుతున్నా కూడా, కొంతమంది పిల్లలకి సంస్కృతం క్లాసు నడుస్తూ ఉంది. హాస్టల్లో యోగా తరగతి నడుస్తూ ఉంది. పిల్లలకి ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్సులు మొదలైనవాటితో పాటు రోజుకు నాలుగుసార్లు ఆహారం కూడా అందిస్తున్నారు. ఆ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు ఏటా పది మందిదాకా పదవతరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ఉత్తీర్ణులవుతున్నారు.

సాధారణంగా ఇటువంటి ఇన్నొవేటివ్ స్కూళ్ళల్లో సరికొత్త ప్రయోగాలేవైనా ఉన్నాయా అని చూస్తూ ఉంటాను. కలియువ మనెలో వారం వారం జరిగే స్కూలు కోర్టు అటువంటి ఒక ప్రయోగం. ప్రతి శనివారం పిల్లలే ఒక కోర్టు నిర్వహించుకుంటూ ఉంటారు. ఆ వారంలో ఎవరేనా పిల్లలు తప్పులు చేస్తే వారి మీద పిల్లలే అభియోగాలు మోపి విచారణ చేపడతారు. పిల్లలతరఫున పిల్లలే న్యాయవాదులుగా వాదిస్తారు. అందుకోసం ఒక తరగతి గదిని కోర్టు హాలు తరహాలో నిర్మించుకున్నారు.

మరొక ప్రయోగం టక్ షాపు. పిల్లలకి కావలసిన సబ్బులు, కొబ్బరినూనె, టూత్ పౌడరు లాంటివి మొదట్లో ఉచితంగానే ఇచ్చేవారు. తర్వాత రోజుల్లో అందుకు బదులు పిల్లలు చేసిన మంచిపనుల్ని గుర్తించి వాటికి క్రెడిట్సు ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రతి నెలా పిల్లలు ఆ క్రెడిట్స్ నగదుగా మార్చుకుని వాళ్ళకి కావలసిన కాస్మొటిక్స్ ఆ షాపులో కొనుక్కోవచ్చు. ప్రతి నెలా పిల్లలకి అవసరమైన సామగ్రి కొనుక్కోడానికి వీలుగా ప్రతి పిల్లవాడికీ కనీస క్రెడిట్స్ వచ్చేలాగా చూస్తామని అనంతకుమార్ అన్నారు. దానివల్ల మామూలుగా ఉచితంగా లభించేవి కాస్తా పిల్లలు తమ మంచితనంతో సంపాదించుకునేవిగా మారిపోయాయి.

కలియువ మనె ప్రయోగం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఎన్.సి.ఇ.ఆర్.టి ఈ పథకం మీద ఒక డాక్యుమెంటరీ కూడా రూపొందించింది. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ లంకె చూడవచ్చు. https://youtu.be/fDRCGbPOIEw

మామూలుగా, సమగ్ర శిక్ష పథకం కింద ఇటువంటి ప్రత్యామ్నాయ పాఠశాలల కోసం పెద్ద ఎత్తున భారతప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ఉంటుంది. జిల్లాల్లో ఈ కార్యక్రమాల్ని పర్యవేక్షించడం కోసం ఆల్టర్నేటివ్ స్కూల్స్ కో ఆర్డినేటర్లు ఉంటారు. ఆ పాఠశాలల్లో రెసిడెన్షియల్, నాన్-రెసిడెన్షియల్ రెండు విభాగాల కిందా ప్రతి ఏడాదీ వేలాదిమంది డ్రాప్ ఔట్స్ ని గుర్తించి, చదువు చెప్పి, తిరిగి మెయిన్ స్ట్రీం చేసే అవకాశం ఉంటుంది. కాని నేను నా అనుభవంలో గ్రహించింది ఏమంటే, ఆ పథకాన్ని ఎలా నిర్వహించాలో చాలామందికి తెలియదని. ఇటువంటి నమూనాలు ఉన్నాయని నాకే ఇన్నాళ్ళదాకా తెలియలేదు. నేను సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టరుగా పనిచేసినప్పుడు ఈ పాఠశాలల్లో చేరే పిల్లలకోసం ప్రత్యేకంగా రీడింగ్ మెటీరియల్ తయారు చేయించాను. కరోనా సమయంలో చిక్కుబడిపోయిన వలస కార్మికుల పిల్లలకోసం ఇటువంటి పాఠశాలలు పెద్ద ఎత్తున తెరిపించాను. కాని ఇటువంటి నమూనాలు నాకు అప్పుడు తెలిసి ఉంటే, ఆ కార్యక్రమాల్ని మరింత సమర్థవంతంగా అమలు చెయ్యగలిగి ఉండేవాడిని అనిపించింది.

సమగ్ర శిక్షలో మరొకటి కూడా చూసాను. అక్కడ పథకాల మీద వచ్చే ఆరోపణలూ, ఆడిట్ పేరాలూ, డిసిప్లినరీ కేసులూ ఎక్కువ ఈ పథకాలకు సంబంధించినవే అయి ఉంటాయి. సాధారణంగా ఏదైనా పథకానికి స్వరూప స్వభావాలు నిర్దిష్టంగా ఉండకపోవడం, కఠినమైన నియమనిబంధనలు లేకపోవడం ఆ పథకాన్ని మరింత ప్రయోగాత్మకంగా అమలు పరచడానికి అవకాశాలుగా భావించాలి. కాని ప్రభుత్వానికి వచ్చేటప్పటికి, అటువంటి వెసులుబాటు సాధారణంగా అసమర్థతకీ, అవినీతికే దారి తీస్తూ ఉంటుంది.

కలియువ మనెలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సాయం లేదు. అదంతా దాతలూ, మిత్రులూ సమకూరుస్తున్నదే. ప్రభుత్వాలు కర్చుపెట్టే నిధులతో, నడిపిస్తున్న పాఠశాలల్తో పోలిస్తే, వందమంది పిల్లలకోసం నడిచే ఆ ప్రయోగాత్మక పాఠశాల అవగింజ సాటి చెయ్యదు. కానీ, అక్కడ గడిపిన కొద్దిసేపూ ఆ విద్యాలయం నాకిచ్చిన స్ఫూర్తి మాత్రం అపారం.

చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూచోడం కంటే ప్రయత్నించి చిన్న దీపాన్నేనా వెలిగించడం మంచిది అనే సూక్తి ఒకటి మనం తరచూ ఉదాహరిస్తూ ఉంటాం. కాని అటువంటి దీపం చిన్నదైనా, దాని కాంతి ఎంత ధారాళంగా ఉండగలదో ఇటువంటి ప్రయత్నాల్నీ, ప్రయోగాల్నీ చూసినప్పుడు మరింత బాగా అర్థమవుతుంది.

26-7-2023

11 Replies to “కలియువ మనె”

  1. ఇలాంటి ప్రయోగాత్మకమైన శిక్షణ ఇచ్చే వ్యక్తులు గురించి చదివినప్పుడు చాలా ఆశ కలుగుతుంది భవిష్యత్తుపట్ల .వ్యవస్థ బయట ,వ్యక్తుల చొరవ ,నిబద్ధత మీద నిలబడినవి విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువేమో.

  2. అనంతకుమార్ గారి కృషి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ప్రస్తుత సమాజం, దాని తీరుతెన్నులు నిరాశ, నిస్పృహ కలిగిస్తున్న ఈ రోజుల్లో ఇటువంటి మహనీయుల ఆశయాలు, ఆచరణ ఆశాజనకంగా కనిపిస్తాయి. ఇంత విలువైన సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు.

  3. “ಕಲಿಯುವ ಮನೆ” ಕೆಲಸ ಮಾಡುವ ರೀತಿ ಚೆನ್ನಾಗಿದೆ. ಅದನ್ನು ನಿರ್ವಸಿತ್ತುರುವ ಅನಂತ ಕುಮಾರ್ ಅವರಿಗೆ, ಪರಿಚಯ ಮಾಡಿಕೊಂಡ ನಿಮಗೆ ವಂದನೆಗಳು 💐🙏

  4. వీరభద్రులుగారు, నమస్కారం. ఈ article చూసి మీరు మైసూరు వచ్చారని తెలిసింది. మిమ్మల్ని కలిసే ఒక అవకాశం నాకు లభించలేదని బాధ కలిగింది. మీరాక తెలిసిఉంటె తప్పక మీరున్న చోటికి వచ్చి కలిసేదానిని. 😰 ఇక ‘కలియువ మనె’ గురించి విన్నాను. అయితే చూడలేదు. మీ article కారణంగా వివరంగా తెలుసుకున్నాను. ధన్యవాదాలు.Lit the Candle!! 🙏

    1. మీరు అక్కడ ఉన్నారని తర్వాత గుర్తొచ్చింది. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను.

      1. Time decides who you meet in your life.Your Heart decides who you want in your life. And your Behaviour decides who will stay in your Life!
        Thank you! 🙏

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%