మధురవిషాద వీథిలో

ఇప్పటి మన సినిమాల్లో విషాద గీతాలు వినిపించడం లేదా? నాకు తెలీదు. నేను చూసే తెలుగు సినిమాలు చాలా తక్కువ. హిందీ సినిమాల గురించి నాకేమీ తెలియదు. కానీ పరేశ్ దోశి ఇలా అంటున్నాడు:

ఒకప్పుడు పాటల్లో ఎంతో వైవిధ్యముండేది. అందులో భాగంగానే విషాద గీతాలనబడే పాటలుండేవి. శ్రోతను రంజింపచేసే పాటలే కాదు, మనసును తడిపేసే పాటలు కూడా అంతే కట్టిపడేసేవి. ప్రజాదరణ పొందేవి. తర్వాత తర్వాత అవి నెమ్మదిగా తగ్గిపోయాయి. ఇప్పుడు అక్కడో పాట ఇక్కడో పాట వినిపిస్తుంది. అంతే.

‘ఇలా ఎందుకైంది?’ అని ప్రశ్నించి, తనే ఇలా అంటున్నాడు:

మానవజీవితంలో ఎన్నో పార్శ్వాలు ఉంటాయి. ఎన్నో ఉద్వేగాలు ఉంటాయి. అమాయకత్వం, లేగదూడ ప్రాయపు ప్రేమ, ఆకర్షణ, సరదా, సంతోషం, ఉత్సాహం, సంబరాలు, ప్రేమ, వియోగం, దుఃఖం.. ఇలా ఎన్నో. అయితే విషాద గీతాలు పరిహరించడం జీవితాన్ని ప్రతిబింబిస్తుందా? మానవ జీవితానుభవాల్లోంచి వేదన మాయం అయిపోతుందా? వస్తుపరంగా మనిషి ఎంతైనా ఎదిగి వుండొచ్చు, మానవ మూల అనుభూతులు అవేగా. మనిషి పోతే వియోగ బాధ, ప్రేమ పోతే దుఃఖభారం, మనసు కలత చెందితే చెమ్మగిల్లే కనులు, నిరీక్షణలోని కలగలిసిన బాధాసౌఖ్యాలు. ఇవన్నీ ఇప్పటికీ వున్నాయే.

ఈ ముందుమాటతో అతడు ఇటీవల వెలువరించిన లగ్ జా గలే, హిందీ సినిమాలో విషాద గీతాలు (ఛాయ, 2022) తెరిచాను. కాని అందులో అతడు పరిచయం చేసిన పాతిక పాటల్లోనూ ఎన్నో పాటలు నేను పదే పదే విన్నవి, వింటూనే వున్నవి. అవి నా జీవితంలో వినబడని సాయంకాలాలు, ఒంటరి రాత్రులు, నదీతీరాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. విషాదాన్ని మధురంగా మార్చిన ఆ పాటల్ని మరో సారి ఇలా మనతో పంచుకున్న ఈ పుస్తకం చదివిన ఏ పాఠకుడైనా ఆ గీతాలు వినబడని జీవితాన్ని కోరుకోగలడా?

పక్షిగూడులాగా అల్లుకున్న నా జీవితాన్ని మళ్ళా ఈ పుస్తకం వెలుతుర్లో చూసుకున్నాను. ఆ గూటిని అల్లుకున్న గడ్డిపరకల్లో ఎన్నో వాక్యాలు ఈ పాటల్లోంచి ఏరి తెచ్చుకున్నవే కదా.

‘అజీబ్ దాస్తాన్ హై యే కహాఁ షురూ కహాఁ ఖతమ్&

‘ఫిర్ వహీ షామ్ వహీ గమ్ వహీ తనహాయి హై’

‘లగ్ జా గలే కె ఫిర్ యే హసీఁ రాత్ హో న హో’

‘ముఝ్ కో ఇస్ రాత్ కీ తన్హాయీ మేఁ ఆవాజ్ న దో’

‘న కోయీ ఉమంగ్ హై న కోయీ తరంగ్ హై, మెరీ జిందగీ హై క్యా, ఇక్ కటీ పతంగ్ హై’

‘యూఁ హసరతోన్ కే దాగ్ ముహబ్బత్ మే ధో లియే, ఖుద్ దిల్ సే దిల్ కీ బాత్ కహీ ఔర్ రో లియే’

ప్రతి ఒక్క వాక్యం చుట్టూ ఎన్ని జ్ఞాపకాలు! ఎన్ని నిట్టూర్పులు, ఎన్ని వేదనలు-

రాజమండ్రిలో ఒకరోజు సరిదే సత్యభాస్కర్ ని అడిగాను, తన్హాయీ అంటే అర్థమేమిటని. కొన్నేళ్ళ కిందట ఒక మిత్రురాలితో ప్రేమలో పడ్డప్పుడు, అది స్నేహమో, ప్రేమనో, చాపల్యమో తెలిసీ తెలియకుండా నన్ను తికమకపెడుతున్నప్పుడు, ఆమె కిలకిలా నవ్వుతూ ‘అజీబ్ దాస్తాన్ హై’ అంది, అక్కడితో ఆగకుండా ‘యే కహా షురూ కహాఁ ఖతమ్’ అని కూడా అన్నది.

పాతికేళ్ళ కిందట హరిహరకళామహల్ లో బిమల్ రాయ్ రెట్రాస్పెక్టివ్ లో చూసాను, సుజాత, బందిని. ఇప్పటికీ, ఆ వర్షం రాత్రి పాడుకున్న పాట నా చెవుల్లో వానధారలతో వినిపిస్తూనే ఉన్నది కదా. నల్లమల కొండలమ్మట లతా గొంతు ఒక్కటే తోడుగా ఎన్ని రాత్రులు ప్రయాణించానో. ఆ ఒంటరి వెన్నెల రాత్రుల్లో ‘ ఉన్ కో యే షికాయత్ హై కె హమ్ కుఛ్ నహీ కహ్తే, కుఛ్ నహీ కహ్తే, అపనీ తో యే ఆదత్ హై కె హమ్ కుఛ్ నహీ కహ్తే’ అని అంటూన్న క్షణాలు నా హృదయం మీద పచ్చబొట్టు పొడిచినట్టుగా నిలిచిపోలేదూ!

‘ఎద మెత్తనౌటకై సొదగుందరా’ అన్నాడు కవి. ఒకసారి విషాదం మాధుర్యమెట్లాంటిదో తెలిసినవాళ్ళు తిరిగి తిరిగి ఆ melancholy కోసం వెతుక్కుంటూనే ఉంటారు. ఆ విలాపం కోసం పరితపిస్తూనే ఉంటారు. ఆ మోహవిషాద సౌందర్యం బహుశా హిందీ, ఉర్దూ కవులకి తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదనిపిస్తుంది. అందుకనే శైలేంద్ర, భరత్ వ్యాస్, రాజేంద్ర కృష్ణ, మజ్రూ సుల్తాన్ పురీ, సాహిర్, షహ్రాయర్ లాంటి సినిమా కవుల్ని నేను ఇరవయ్యవ శతాబ్దపు భక్తి కవులుగా లెక్కేసుకుంటాను.

సినిమారంగంలాంటి కమర్షియల్ ప్రపంచంలో, నిర్మాతల, దర్శకుల, హీరోహీరోయిన్ల డిమాండ్లని చెల్లిస్తున్నట్టు కనబడుతూనే వాళ్ళు ఒక నిరాకార దైవాన్ని అర్చించుకున్నారా అనిపిస్తుంది. లేకపోతే ఆ భాషలో, ఆ పదబంధాల్లో, ఆ అభివ్యక్తిలో అంత అలౌకికత ఎట్లా సాధ్యమవుతుంది! ఈ వాక్యాలు చూడండి, పరేశ్ అనువాదంలో:

మరింత దగ్గరకు రా, మళ్ళీ మళ్ళీ నీ దగ్గరకు రానేమో
గుండెలకు హత్తుకుని మనసారా విలపించుదామా
మన కనులలోంచి మరలా ఈ ప్రేమ కన్నీటివాన కురుస్తుందో లేదో
ఈ జన్మలో మరలా కలుసుకుంటామో లేదో ..

దైవమే లేని ఈ నిరంతరం మారుతున్న ఈ లోకంలో
చాలా చవకధరలకే దేవుళ్ళు అమ్ముడుపోయే బజారు ఇది
ప్రతి కొనుగోలుదారూ ఇక్కడ అమ్ముడుపోవడం చూసాను
నేనేం పొందగలను ఇక్కడ? ఇక్కడ యెవరేం పొందారని? ..

పువ్వును గాఢంగా కౌగిలించుకున్న సీతాకోకచిలుక వలసరిని నేను
వో క్షణం ఇక్కడ నిలిస్తే మరో క్షణం ఎగిరిపోతాను నేను
స్వర్గానికి దారిని వెతుకుతున్న దారిని నేను
నువ్వు మలుపు తీసుకునే చోటే మలుపు తిరుగుతాను నేను ..

చెప్పడానికైతే చాలానే వుంది, అసలంటూ చెప్పదలిస్తే
ప్రపంచం కృప ఎంతైనా వుంది, నేను పెదవే విప్పను. ..

మరొకరి జీవితానికి నీవు
వెలుగైనందుకు శుభాకాంక్షలు
ఒకరికి ఎంత దగ్గరయ్యావంటే
మిగతా అందరికీ చాలా దూరం అయిపోయావు. ..

ఇలా ప్రతి ఒక్క గీతం, ప్రతి ఒక్క అనువాదం తిరిగి ఎత్తి రాయాలి. సీతారామశాస్త్రి సినిమా పాటల పుస్తకం చదివి ఆయనతో ఒకసారి అన్నాను: ‘మీరు నిర్మాతల కన్నుగప్పి మేలిమి బంగారాన్ని సినిమా పాటలుగా భ్రమింపచేసారు’ అని. ఆ మాట పాత హిందీ సినిమా పాటలు చాలావాటికి వర్తిస్తుంది. అవి ఎక్కడ పడితే అక్కడ దుమ్ములో, రోడ్లమీద, టీషాపుల్లో విరజిమ్మినట్టు పడి ఉండే వజ్రాలు.

ఆ పాటల్ని అదాటుగా వింటేనే హృదయం ఎటో ఎగిరిపోతుంది. ఇలా ఒక పుస్తక రూపంలో ఒక కవి, భావుకుడు, ప్రేమైక జీవి తన మాటల్లో మళ్ళా మనతో ముచ్చటిస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా!

ఈ వివరాలేవీ ఇవ్వకుండా, ఇవి సినిమా పాటలని చెప్పకుండా, వట్టి తెలుగు అనువాదాలే సంకలనం చేసినా, ఆ కవిత్వం మనల్ని కట్టిపడెయ్యదని ఎలా అనగలం? ఈ కవిత చూడండి:

ఈ శమించని విరహాగ్నులూ, కోరికల మరకలూ
ప్రేమాశ్రువులలో ప్రక్షాళన పొందాయి.
మనసు ఊసులన్నీ ఈ మనసుతోనే
కన్నీళ్ళతో కదా చెప్పుకున్నాను.

బయలుదేరడం సంతోషాన్ని వెతుక్కుంటూ బయల్దేరినా
దారిలో ఎదురైన బాధలన్నీ విడువకుండా నా వెంటే వచ్చాయి
వాడిపోయినా, ఈ హృదయం ఒక పువ్వే కదా.

యిక మీ ఇష్టం: దీన్ని ముళ్ళతోనే తూచండి
ఈ పెదాలను కుట్టివేసినా, లోకం వూరుకోదే!
మౌనమెందుకు, మనసులో మాట చెప్పరాదా అంటుంది!

నిజమే, మనం ‘నాటు నాటు’ యుగంలో ఉన్నాం. సున్నితమైన అనుభూతీ, స్పందనలూ, వెలుగునీడలూ జీవితంలో లుప్తమవుతున్నాయి కాబట్టి, తెరమీద కూడా లుప్తమవుతున్నాయి. కాని, ఇంకా కొన్ని హృదయాలు ఉన్నాయి, కన్నీళ్లతో దాహం తీర్చుకునేవి, ఇంకా కొన్ని పాటలు మిగిలి ఉన్నాయి, మంటల్తో నీడనిచ్చేవి. ఇంకా కొందరు రసహృదయులున్నారు, పరేశ్ లాంటి వాళ్ళు, గాయాలతో హృదయానికి పట్టీ కట్టుకునేవాళ్ళు.

కాబట్టి

మధురవిషాద వీథిలో తిరుగాడుతూ, శైలేంద్ర చెప్పుకున్నట్టే మనమూ, చెప్పుకుందాం-

‘బాధాశ్రుతిలో పాడిన పాటలే మధురం కదా
అమాయకులు వారు, ఈ ముళ్ళను తప్పించుకుంటూ వెళ్ళేవారు.’

15-2-2023

4 Replies to “మధురవిషాద వీథిలో”

  1. ఇలాంటి సందర్భాల్లోనే చక్కని తిక్కన వాక్యం గుర్తొస్తుంది.’గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్.’-అని.
    కొన్ని దశాబ్దాల క్రితం అనుకునే వాణ్ని హిందీ సినిమాల్లాగా తెలుగు సినిమాలు ఎందుకు తీయరు? తెలుగు పాటలు హిందీ పాటల్లాగా ఎందుకు మనసుకు హత్తుకోవు అని. ఒకప్పటి రేడియో క్రేజీ,ఆబాల్య గోపాలాన్ని అలరించిన బినాకా గీత్ మాలా. ఎలా మాయమైందా మధుర సుందర గానలోకం. ఇప్పుడు కుప్ప కూలింది బాలీవుడ్ అదే ఒకప్పుడు తెలుగు సినిమాలను డామినేట్ చేసిన రోజులున్నాయి.
    ‘భూలే బిస్రే గీత్’ అని కాగజ్ నగర్ లో నార్త్ ఇండియన్ ఆర్కెస్ట్రా క్లబ్ లలో ప్రదర్శను ఏటేటా ఇస్తూండేది.ఇసుక వేస్తే రాలనంత జనం ఆ కార్యక్రమాలకు. అంత క్రేజీ . సందర్భమౌనో కాదో కానీ మా ఉష తెలుగు పాటలే వినక పోయేది. హిందీ పాటలు మాత్రమే వినేది పాడేది. యశోమతీ మయ్యా సే , రసిక్ బల్మా ,వంటి పాటలు స్టేజ్ మీద పాడటం మళ్లీ నన్ను నలభయ్యేళ్ల వాడిని చేసింది.తనకు నేను కొనివ్వడం అని కాదు మేము కొనుక్కున్న మొదటి వస్తువుల్లో ట్రాన్సిస్టర్ ఒకటి. ఒకాయన అడిగిన ప్రశ్న గుర్తుంది మీ ఆవిడ నార్తిండియనా అని . ఆమె హిందీ చాలా స్వచ్ఛంగా సహజంగా ఉండటం అందుకు కారణం. అలా అనిపించడానికి కారణం మాత్రం ఆమె హిందీ పాటల మోజే . తన అదృష్టం కొద్దీ హిందీ మీడియం స్కూల్‌లో జాబ్ రావడం అక్కడే 36 ఏళ్లు పనిచేయడం .
    అలాంటి హిందీ పాటల ప్రియుడే మన పరేశ్ దోషి గారు.ఆ నాటి ఆపాతమధురాలైన పాటల పలవరింతనే పరేశ్ గారికీ పనికల్పించిందేమో. పరేష్ దోషి గారి ప్రత్యేక విషయపరమైన కృషి అభినందనీయం.
    నాకొక్కో సారి చాలా రాయాలనిపిస్తుంది కొన్ని చదవగానే . అలాంటి వాటిల్లో ఇదొకటి.
    ఇరువురికీ శుభాకాంక్షలు.

  2. ఒక్కో సారి అనుకుంటా తెలుగులో సున్నితంగా భావాలను చూపిన పాటలు తక్కువ అని .తెలిసీ తెలియనట్టు ఉండే హిందీ /ఉర్దూ పాటలు ఆయుస్కాంతంలా లాక్కుంటాయి .
    ఇటీవల వచ్చిన Qala లో పాటలు నాకు నచ్చాయి .మీరు విన్నారా సర్ ?

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading