జయగీతాలు-15

101

దావీదు గీతం


ప్రభూ, ఎన్నటికీ నిలిచి ఉండే నీ ప్రేమ, నీ న్యాయం

వీటి గురించే పాడతాను, ప్రభూ, సంగీతం కూర్చుకుంటాను

నిష్కళంకమైన నీ మార్గం గురించి తలపోస్తాను

ఓహ్! ఏ నడిరేయి ప్రభూ నువ్వు నన్ను చేరవచ్చేది?

నా ఇంట్లో సత్యసంధతతో సంచరిస్తాను

వ్యర్థవిషయాలవైపు

మనసుపోనివ్వను.

నీ దారిని వదిలిపెట్టినవాళ్ళ చేతల్ని ద్వేషిస్తాను

అవి నన్ను అంటకుండా చూసుకుంటాను.

కుటిల హృదయానికీ నాకూ మధ్య ఎంతో దూరం

చెడు నాకు అపరిచితం.

రహస్యంగా తన పొరుగువాణ్ణి నిందించే వాణ్ణి

నాశనం చేస్తాను

అహంకారదృష్టితో చూసేవాళ్ళనీ, పొగరుబోతుల్నీ

పక్కనపెట్టేస్తాను.

ఎవరు విశ్వాసాన్ని నమ్ముకుని ఉన్నారో వాళ్లని ఆదరిస్తాను

వాళ్ళని నాతోనే ఉండనిస్తాను.

ఎవరూ వేలెత్తిచూపలేని విధంగా ఎవరు నడుచుకుంటారో

అతడే నాకు పరిచారకుడు.

మోసకారిజీవితం జీవించేవాడికి

నా ఇంట్లో తావులేదు

అబద్ధాలాడటం ఎవరికి చాతకాదో

వాళ్ళమీదనే నా కటాక్షం.

ఈ భూమ్మీద చెడ్డవాళ్ళందరినీ

దినందినం సంహరిస్తూంటాను

దైవనగరంలో దుష్టకర్మలు

చేసేవాళ్ళని తుడిచిపెట్టేస్తాను.


ఇక్కణ్ణుంచి అయిదవ పుస్తకం (107-150) నుంచి ఎంపిక చేసిన కొన్ని గీతాల అనువాదాలు మీతో పంచుకుంటున్నాను.

110

దావీదు గీతం


ప్రభువు నా ప్రభువుతో చెప్తున్నాడు

నీ శత్రువులందర్నీ నీకు పాదాక్రాంతం చేసేదాకా

నువ్వు నా కుడిపక్కనకూచో.

నీ రాజదండాన్ని పంపించాడు

ప్రభువు తన దేవాలయం నుంచి

శత్రుమధ్యంలోనే పాలనసాగించు

దివ్యవస్త్రధారివైన

నీ బలోత్సేకానికి

నీ ప్రజలు తమంతతామే తలొగ్గుతారు

ప్రభాతగర్భం నుండి విడివడి
హిమశోభిత యవ్వనం నీదవుతుంది

ప్రభువు ఒకసారి వాగ్దానం చేసాక

వెనుతిరగడు

నీ పురాతన వంశంలో

నువ్వు సదా దైవసేవకుడిగా జీవిస్తావు

ప్రభువు నీ కుడిపక్కనున్నాడు

ఆయన కోపోద్రిక్తుడైన రోజు రాజులంతా మట్టిగొట్టుకుపోతారు

జాతులమీద తన శాసనం ప్రకటించినప్పుడు

అవి మరుభూమిగా మారిపోతాయి.

నాయకశ్రేణుల్ని దుమ్ములో కలిపేస్తాడు

తన ప్రయాణమధ్యంలో ఆగి ప్రవాహజలాలు కడుపారా తాగి

ఒకసారి తలపైకెత్తి చూస్తాడు.

112


ప్రభువుని స్తుతించండి

భగవంతుడికి భయపడేవాడు ధన్యుడు

ఆయన ఆజ్ఞల్ని హృదయానికి హత్తుకునేవాడు ధన్యుడు

అతడి సంతతి చిరకాలం వర్ధిల్లుతారు

నీతిమంతుడైన వాడు నిజంగా ధన్యుడు

అతడి గృహం సుసంపన్నం,  ఐశ్వర్యమయం,

అతడి సత్యసంధత శాశ్వతం

నీతిమతుడికోసం చీకట్లో వెలుగు ఉదయిస్తుంది

అతడు కృపామయుడు, దయామయుడు, ధర్మపరుడు

తోటిమనుషుల్తో ఉదారంగా ఇచ్చిపుచ్చుకునే వాడికి

తన పనులు నిజాయితీతో చేసుకునేవాడికి అంతా శుభమే.

సత్యవంతుడు చెక్కుచెదరడు

అతడు సదా స్మరణీయుడు

ఏ చెడ్డవార్త అతణ్ణి భయపెట్టలేదు

దేవుడిలో విశ్వాసం అతణ్ణి దృఢంగా ఉంంచుతుంది

తన శత్రువుల మీద విజయం సాధించి చిరునవ్వగలడు

తనకున్నదంతా ఉదారంగా బీదసాదలకు పంచిపెడతాడు

అతడి నీతివర్తన తిరుగులేనిది

అతడి విజయవాద్యం అడ్డులేనిది

దుర్మార్గుడు అది చూస్తాడు, పళ్ళు కొరుక్కుంటాడు

కోపగిస్తాడు, కనబడకుండా జారిపోతాడు

దుర్జనుల సంకల్పాలు ధ్వంసమైపోవుగాక!

113


స్తుతించండి ప్రభువుని!

ఓ ప్రభు సేవకులారా, ఎలుగెత్తి స్తుతించండి

భగవన్నామ సంకీర్తన చెయ్యండి.

నేటినుంచి మరెన్నటికీ

ప్రభునామం విరాజిల్లుగాక

ఉదయాద్రినుండి అస్తాద్రిదాకా

ప్రభు నామం ప్రకాశించుగాక!

ప్రభువు రాజ్యాలన్నిటికన్నా ఉన్నతుడు

గగనమండలమంతా ఆయన వైభవమే

సర్వోన్నత స్థానంలో ఆసీనుడై

భూమ్యాకాశాల్ని

పరికిస్తున్న

మన ప్రభువులాంటి దైవం మరెవరు?

ఆయన దుమ్ములోంచి బీదల్ని ఉద్ధరించగలడు

భస్మరాశుల్లోంచి ఆర్తుల్ని పైకి లేపగలడు

తన ప్రజానీకపు రాకుమారులసరసన

వారిని కూర్చుండబెట్టగలడు.

పిల్లల్లేని స్త్రీకి ఆయన ఆశ్రయం చూపగలడు

ఆమె చుట్టూ పసిపిల్లల కేరింతలు నింపగలడు

స్తుతించండి ప్రభువుని!

114


పరాయి భాష మాట్లాడే ప్రజలనుంచి,

ఈజిప్టు నుంచి నా దేశం విడుదలయినప్పుడు

ఒక ప్రాంతం ఆయనకు ఆశ్రయంగా అమిరింది

మరొక ప్రాంతం రాజ్యంగా విలసిల్లింది.

సముద్రం ఆ దృశ్యాన్ని చూసి పారిపోయింది

యోర్దాను నది వెనకడుగు వేసింది

పర్వతాలు పొట్టేళ్ళలాగా తుళ్ళిపడ్డాయి

కొండలు గొర్రెపిల్లల్లాగా గెంతులేసాయి

ఏమైంది, మహాసాగరమా, ఎందుకు పారిపోయావు

యోర్దాను ప్రవాహమా? ఎందుకు వెనుదిరిగావు

పర్వతాల్లారా, పోట్టేళ్లలాగా ఎందుకు తుళ్ళిపడ్డారు

కొండల్లారా, గొర్రెపిల్లల్లాగా ఎందుకు గెంతులేసారు?

నా దేశాన్ని కాపాడే నా దైవసన్నిధిలో

నా ప్రభు సమక్షంలో, భూమండలమా, కంపించు

ఆయన గండశిలల్ని సరోవరాలుగా మార్చగలడు

చెకుముకిరాళ్ళతో సెలయేళ్ళు పుట్టించగలడు.

28-1-2023

4 Replies to “జయగీతాలు-15”

  1. 101 ,110 గీతాల్లో వున్న అసహనం ,
    భయంతో దైవం పట్ల విధేయత చూపించాలన్న ధోరణి ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు .ప్రాచ్య దేశాలలో ప్రాచుర్యంలో వున్న మతాలలో ఈ ధోరణి కనిపిస్తుందా సర్ .గ్రీక్ ,రోమన్ pantheism లో కూడా భయంతో శాసించాలన్న భావమే కనిపిస్తుంది .అది నాగరికత బాల్యదశ లక్షణం అని అనుకున్నాను.

    1. మీ పరిశీల చాలా కీలకమైన పరిశీలన. దీని గురించి చాలా వివరంగా స్పందించవలసి ఉంది.

  2. ఇది మన ద్వైతసిద్ధాంతాన్ని,ఇంకా చెప్పాలంటే పురాతన కాలానికి చెందిన భావనలు లాగా ఉన్నాయి సార్ మనం అద్వైతాన్ని అందునా ప్రజాస్వామ్య విధానాన్ని పాటిస్తున్నాము కదా!
    అనువాదం బాగుంది

    1. అబ్రహామీయ మతాలు మూడు. అవి యూదుమతం, క్రైస్తవం, ఇస్లాం. ఆ మూడింటిలోనూ ఏకేశ్వరుడు ఉంటాడు. ఆయన ఒక పితృ ప్రభువు లాంటి దేవుడు. తన మాట వింటే మంచి చెడులు చూసుకుంటాడు. వినకపోతే శిక్షిస్తాడు. ఆ ఏకేశ్వరుడి ఉపాసనలోంచి వికసించిన గీతాలు ఇవి. అయితే తదనంతర కాలంలో ప్రపంచంలోని తక్కిన మతాల్ని కూడా ఈ మతాలు ప్రభావితం చేశాయి. ఉదాహరణకి మన బ్రహ్మసమాజికులు ఇటువంటి ఏకేశ్వరవాదాన్నే అనుసరించారు. సూఫీ కవులు ఇటువంటి ద్వైతాన్నే నమ్ముకున్నారు. మన భక్తికవులందరూ కూడా ఒక విధంగా ద్వైతులు లేదా విశిష్టాద్వైతులు. ప్రజాస్వామ్యానికీ, భక్తికవిత్వానికి మధ్య లంకె లేదు. రెండూ రెండు విభిన్న రంగాలు. అయితే భగవంతుడు అంటే ఏమిటి అని నిర్వచిస్తూ గాంధీ గారు ప్రజాస్వామ్యంలో ఆయనను మించిన ప్రజాస్వామికుడు మరొకడు లేడు అనడం గమనార్హం.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%