భవాబ్ధిపోతం

మొన్న శనివారం గుంతకల్లులో ఒక సాహిత్య సమావేశానికి వెళ్ళినప్పుడు ఎం.కె.ప్రభావతి అనే ఒక విదుషి నా దగ్గరకు వచ్చి తాను రాసిన రెండు పుస్తకాలు నా చేతుల్లో పెట్టారు. అందులో ఒకటి ఆమె వ్యాసాల సంపుటం. మరొకటి, పోతన భాగవతం మీద రాసిన పరిచయ వ్యాసాలు.

దానికి ఆమె ‘భవాబ్ధిపోతం’ అని పేరు పెట్టారు. అంటే జన్మ అనే సాగరాన్ని దాటించే నావ అని అర్థం. ఆ పుస్తకం దాదాపుగా అక్కడే చదివేసాను. చేతవెన్న ముద్దలాగా ఇట్టే నోట్లో వేసుకోగానే కరిగిపోయేదిగానూ, చెంగల్వపూదండలాగా, ఆ సురభిళం మనసును మరెటూ పోనివ్వదిగానూ ఉందా పుస్తకం. అది నా అనుభూతి మాత్రమే అనుకుందామా అంటే, దానికి పరిచయ వాక్యాలు రాసిన భావుకులంతా కూడా దాదాపుగా అట్లాంటి సంతోషానికే లోనయ్యారని వాళ్ళ ముందుమాటలు చెప్తున్నాయి.

‘ నేను భాగవత వ్యాఖ్యాన పుస్తకాలు చాలా చదివాను. కాని నా అభిప్రాయం కోసం పంపిన ‘భవాబ్ధిపోతం’ ప్రతిని చదివిన తరువాత ఈ ప్రతిని రచయిత్రికి తిరిగి ఇవ్వాలని అనిపించలేదు’ అని రాసారు గండ్లూరి దత్తాత్రేయ శర్మ గారు.

నిండా రెండువందల పేజీలు కూడా లేని ఈ పుస్తకం చేతుల్లోకి తీసుకోగానే పారిజాతాల గాలి వీచినట్టుండటానికి కారణమేమిటి? అన్నిటికన్నా ముందు ఆ భావుకురాలు పోతన భాగవతమనే పారిజాతాల తోటలో విహరించి విహరించి వచ్చినందువల్ల ఏ పుట తెరిచినా సుమసౌరభమే.

మడకశిర కృష్ణ ప్రభావతి జూనియర్ కాలేజి ప్రిన్సిపాలుగా పనిచేసి రిటైరయ్యారు. ఆమె తెలుగులో తొలిమహిళా అవధాని. పదవీ విరమణ తర్వాత, తన మిత్రురాలు, తెలుగు లెక్చెరర్ గా పనిచేసి రిటైరయిన జి.లక్షమమ్మ గారితో కలిసి శ్రీమద్భాగవతం పన్నెండు స్కంధాలూ చదివారు. ఒకసారి కాదు, పదే పదే చదివారు. చదివింది ఇద్దరూ కలిసి మననం చేసుకున్నారు. తమ మనసులు ఎక్కడ పరవశిస్తున్నాయో గుర్తుపట్టుకున్నారు, గుర్తుపెట్టుకున్నారు. భాగవతమనే దధిభాండాన్ని ఒక్క కవ్వంతో కాదు, రెండు మనసుల కవ్వంతో చిలికారు, వెన్న తీసారు. ఆ వెన్న ముద్దల్ని పుస్తకరూపంలో మనకందించారు.

భాగవతంలోని అందాల్ని 21 వ్యాసాలుగా మళ్ళీ మళ్ళీ పరిచయం చేస్తున్నప్పుడు, మనం ఊహించలేని, మనకు పరిచయం లేని, చర్వితచర్వణం కాని, ఏ పండితుడూ మాటాడని మధురాతిమధురమైన పద్యాల్ని మనకోసం ఏరితెచ్చారు. పండుమామిడిపళ్ళ గంపలాంటి ఆ పుస్తకంలోంచి ఏ పద్యాలని ఎంపిక చెయ్యను?

అయినా, మీతో పంచుకోకుండా ఉండలేక, నాలుగైదు పద్యాలు ఇక్కడ మళ్ళా ఎత్తి రాయకుండా ఉండలేకపోతున్నాను.

పోతనగారి పద్యాల్లో కొన్ని నిశ్చల చిత్రాల్లాంటివని చెప్తూ ప్రథమ స్కంథంలో శ్రీరామదర్శనాన్ని వర్ణించే ఈ పద్యాన్ని ఉదాహరించారామె.

మెరుగు చెంగటనున్న మేఘంబుకైవడి
ఉవిదచెంగట నుండ ఒప్పువాడు
చంద్రమండల సుధాసారంబు పోలిక
ముఖమున చిరునవ్వు మొలచువాడు
వల్లీయుత తమాలవసుమతీజము భంగి
బలువిల్లు మూపున బరగువాడు
నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి
ఘనకిరీటము తలకలుగువాడు

పుండరీక యుగము బోలు కన్నులవాడు
వెడద యురమువాడు, విపుల భద్ర
మూర్తివాడు, రాజముఖ్యుడొక్కరుడు నా
కన్నుగవకు నెదుర కానబడియె.

ఈ పద్యానికి ఆమె ఇట్లా తాత్పర్యం చెప్పారు:

‘పోతన గారికి తొలుతగా శ్రీరామ దర్శనమిలా జరిగింది. మేఘము, మెరుపు వలె రాముడు సీతమ్మ ఉన్నారు. స్వామి ముఖం మీది చిరునవ్వు వెన్నెల వెలుగులను తలపింప చేస్తున్నది. ఆయన భుజం మీద ఉన్న కోదండం వృక్షానికి అల్లుకున్న తీగలా ఉంటున్నది. ఆ ప్రభువు తలమీది కిరీటం నల్లనికొండపై కనిపిస్తున్న సూర్యుని వలె ఉన్నది. అతని కళ్ళు తెల్ల తామరలలా అందంగా,అహ్లాద కరంగా ఉన్నాయి. విశాలమైన వక్షస్థలం కలవాడు, భద్రమూర్తిగా ఉన్నవాడు రాజలాంఛనాలతో పోతనగారికి ఎదురుగా కనిపించాడు.’

ఆధునిక కవిత్వం వచ్చింతరువాత ప్రాచీన కవిత్వం చాలామందికి రుచించకుండా పోయింది. కాని, ఆధునిక కవిత్వం చదివిన తరువాత, మేలిమి యూరపియన్ మెటఫర్లు పరిచయమయ్యాక, నాకు ప్రాచీన కవిత్వం చాలా సరికొత్తగా కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి, ‘మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి’ అనే పోలిక నన్నొక పారవశ్యానికి లోను చేస్తున్నది. ‘నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘనకిరీటము’ నిజంగానే ఒక ఫొటోగ్రాఫు. ఆ కాంతిపరివేషం నా కళ్ళముందు మిరుమిట్లు గొల్పుతూ ఉంది.

మరొక పద్యం చూడండి:

కర్ణాలంబిత కాక పక్షములతో, గ్రైవేయ హారాళితో
స్వర్ణ భ్రాజిత వేత్రదండకముతో, సత్పింఛ దామంబుతో
పూర్ణోత్సాహముతో, ధృతాన్న కబళోత్ఫుల్లాబ్జ హస్తంబుతో
తూర్ణత్వంబున నేగె లేగలకునై దూరాటవీ వీథికిన్

దీనికి ఆమె ఇచ్చిన తాత్పర్యం:

‘ఉంగరాలు తిరిగిన జుత్తు భుజాల మీద పడుతుండగా, మెడలో ఎన్నో హారాలతో, బంగారంలా మెరుస్తున్న కర్రతో, నెమలి పింఛంతో, కుడి అరచేతిలో తినడానికి పెట్టుకున్న అన్నంముద్దతో, అడవుల్లోకి వెళ్ళిన ఆ లేగలను పట్టుకు రావాలనే ఉత్సాహంతో ఉన్నాడు.’

ఈ పద్యంలో ఉన్న అందమంతా, ఆ ‘ధృతాన్న కబళ ఉత్ఫుల్లాబ్జ హస్తం’ అనే మాటలో ఉంది. స్వభావోక్తి లాంటి ఈ వర్ణన గొప్ప కవిత్వంగా కనిపించడానికి కారణం ఆ అత్యంత సాధారణమైన దృశ్యాన్ని కవి అద్వితీయంగా పట్టుకోవడం. ఒక చేతిలో అన్నం ముద్ద పెట్టుకుని, మరొక చేత్తో కర్రపట్టుకుని అడవుల్లోకి పరుగెడుతున్న గోపబాలకుణ్ణి ఆ పదప్రయోగం ఎంతో సజీవంగా మనకళ్ళముందుంచుతున్నది కాబట్టి.

ఇంకో పద్యం చూడండి. ఈ పద్యాన్ని ఆమె వీడియోగ్రాఫు అన్నది.

కటిచేలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి దో
స్తట సంస్ఫాలాన మాచరించి చరణద్వంద్వంబు కీలించి త
త్కుట శాఖాగ్రము మిదనుండి యురికెన్ గోపాల సింహంబు ది
క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభ ధ్వానంబనూనంబుగన్

ఈ పద్యానికి ఆమె రాసిన తాత్పర్యం:

‘నడుముకున్న దట్టీ గట్టిగా బిగించి కట్టాడు.ఏదైనా ఘనకార్యం చేసేటపుడు, ‘నడుము బిగించుట’ అనే జాతీయము ప్రసిద్ధమైనదే కదా. తలపై అలంకారమైన నెమలిపింఛమును కొప్పుకు గట్టిగా బిగించాడు. ఆపై జబ్బలు చరిచాడు. అటుపై పాదాలు నొక్కిపట్టి ఒక్కసారిగా చెట్టుకొమ్మపై నుండి మడుగులోకి దూకగానే గుభగుభమనే శబ్దాలు దిక్కులన్నింటికి వ్యాపించాయి. అంటే ఎంత బలంతో దూకితే అంత బలంగా ఆ నీళ్ళు ఎగసి ఏ శబ్దాలు వెలువడ్డాయో తెలుస్తుంది.’

అత్యంత స్వాభావికమైన ఈ వర్ణనని, ఆమె వీడియో వీక్షణం అనగానే, ఈ పద్యం స్వరూపమే మారిపోయింది.

ప్రకృతి పులకింత అనే అధ్యాయంలో ఆమె ఎంచి కూర్చిన పద్యాలన్నీ విభ్రాంతపరిచేవే. ఈ పద్యం చూడండి:

ముదితా ,యే తటి నీ పయఃకణములన్ మున్ వేణువింతయ్యెనా
నది సత్పుత్రుని కన్న తల్లి పగిదిన్ నందంబుతో నేడు స
మ్మద హంసధ్వని పాటగా వికచపద్మశ్రేణి రోమాంచమై
యొదవం తుంగ తరంగ హస్తనటనోద్యోగంబు గావింపదే.

ఈ పద్యానికి ఆమె ఇట్లా వివరణ రాస్తున్నారు:

‘తన పాలు త్రాగి గొప్పవాడైన సత్పుత్రుని కన్న తల్లి ఆనందంతో హంసధ్వని రాగంలో పాడుతుండగా ఒడలు పులకలెత్తగా ఎత్తైన హస్తములను కదిలిస్తూ నాట్యం చేస్తున్నట్టుంది కదా! ఆ తల్లి యమునానది, సత్పుత్రుడు వేణువు, అది త్రాగినది నీరు. గొప్పవాడు కావడం కృష్ణుడి వాద్యంగా మారడం. పాడినది తనలొ ఉన్న హంసలు, రోమాంచమే విరిసిన కమలాలు. ఎత్తైన కెరటాల కదలికే నటించినట్లుండటం.’

పోతన నాకు పరిచయమైన మొదటి కవి. నా పసితనంలో మా బామ్మగారు నాతో గజేంద్రమోక్షం కంఠోపాఠం చేయించారు. కాని, ఆ కవిత్వం జీవితపు ప్రతి మలుపులోనూ మళ్ళా మళ్ళా చదువుకోవలసిందే. లేకపోతే, ఇదుగో, ఇట్లాంటి పద్యం, ఒకప్పుడు నోటికొచ్చిందే, మర్చిపోయింది, ఇప్పుడు మళ్ళా ఎదురై నిశ్చేష్టుణ్ణి చేస్తుంది.

నర్తకుని భంగి పెక్కగు
మూర్తులతో నెవ్వడాడు మునులున్ దివిజుల్
కీర్తింపనేరరెవ్వని
వర్తనమొరులెరుగరట్టి వాని నుతింతున్

ప్రభావతి ఇలా రాస్తున్నారు:

‘పోతనగారి భాగవతములో అష్టమ స్కంధములో గజేంద్రుడు దేవునితో తన్ను కావగా మొరపెట్టుకుంటున్న సందర్భములోనిదీ పద్యము. దీనికి తాత్పర్యం : ఒక నటుని వలె, అనేక రూపములు ధరించుచు ఎవడు తిరుగాడుచుండునో, ఎవ్వని కీర్తిని ఋషులు, దేవతలు కూడ పొగడ అశక్తులో, ఎవ్వని చరిత్రను, నడవడికను, ఇతరులెవ్వరు కనుగొనలేరో అట్టివానిని నేను ప్రస్తుతించుచున్నాను.’

‘నర్తకుని భంగి’ అన్న పోలికలో ఉంది మొత్తం కవిత్వం. ఆమె ఈ అధ్యాయానికి కూడా ‘నర్తకుని భంగి పెక్కుమూర్తులతో’ అనే శీర్షిక పెట్టారు.

‘మతాతీత ప్రార్థనలు’ అనే అధ్యాయంలో, గుణాతీతుడైన సర్వేశ్వరుణ్ణి కీర్తించిన పద్యాలు పొందుపరుస్తూ, సహజంగానే ప్రహ్లాద చరిత్రలోనూ, గజేంద్రమోక్షంలోనూ ఉన్న ప్రసిద్ధ పద్యాల్ని పొందుపరిచారు. సుప్రసిద్ధ పద్యమే అయినప్పటికీ, ఈ పద్యాన్ని మరోసారి ఇక్కడ రాసుకోకుండా ఉండలేకపోతున్నాను:

కలడంబోధి, కలండు గాలి, గలడాకాశంబునం, గుంభినిం
గలడగ్నిన్, దిశలం బగళ్ళ నిశలన్, ఖద్యోత చంద్రాత్మలం
గలడోంకారంబున ద్రిమూర్తుల త్రిలింగవ్యక్తులందంతటం
గలడీశుండు గలండు తండ్రి, వెదకంగానేల నీయా యెడన్

ఆమె రాసిన తాత్పర్యం: ‘భగవంతుడు సముద్రములో, గాలిలో, ఆకాశంలో, భూమిలో, అగ్నిలో, దిక్కుల్లో, రాత్రింబవళ్ళలో, సూర్యచంద్రులలో, ఓంకారములో, బ్రహ్మవిష్ణు మహేశ్వరుల్లో, స్త్రీపుంస నపుంసకాదుల్లో, అన్నింటా ఉన్నాడు. ప్రత్యేకించి ఇక్కడ అక్కడ అని వెతికే అవసరమే లేదు.’

చిన్నప్పణ్ణుంచీ ఈ పద్యం నా కళ్ళముందొక cosmic picture ని ఆవిష్కరిస్తూనే ఉంది. తేటతెలుగుభాష రోదసిలో ప్రసరించే మహానక్షత్రసముదాయాల కాంతిలాగా, మహాసాగర తరంగ ఘోషలాగా వినిపిస్తుందీ పద్యంలో.

‘భాగవతంలో భగవద్గీత’ అనే అధ్యాయంలో ఆమె వైదుష్యం, పరిశీలన చాలా గొప్పగా కనిపిస్తున్నాయి. గీతాశ్లోకాలకి సమానార్థకమైన పద్యాల్ని ఆమె భాగవతమంతా గాలించి పట్టుకొచ్చారు. ఉదాహరణకి:

పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృత మశ్నామి ప్రయతాత్మనః (9-26)

అనే శ్లోకానికి సమానమైన ఈ పద్యాన్ని ఆమె కుచేలోపాఖ్యానంలో (10-1010) గుర్తుపట్టారు.

దళమైన బుష్పమైనను
ఫలమైనను సలిలమైన బాయని భక్తిం
గొలిచిన జనులర్పించిన
నెలమిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్

‘కొందరికి తెనుగు గుణమగు, కొందరికిన్ సంస్కృతంబు గుణమగు’ కాని తాను అందరినీ మెప్పిస్తానని పోతన చెప్పుకున్నందుకు, ఆమె ‘తెనుగు గుణమైన’ వాళ్ళ కోసం కొన్ని పద్యాలు ఎంచారు. ఉదాహరణకి

పడతీ నీ బిడ్డడు మా
కడవలలో నున్న మంచి కాగిన పాలా
పడుచులకు బోసి చిక్కన
కడవల బోనాడచె నాజ్ఞకలదో లేదో

‘సంస్కృతం గుణమైన’ వాళ్ళ కోసం మరికొన్ని పద్యాలు, ఉదాహరణకి:

పూరించెన్ హరి పాంచజన్యము కృపాంభోరాశి చైతన్యమున్
భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్
సారోదార సితప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్
దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్ సైన్యమున్

ఇంక రెండూ గుణమైన వారికోసం-

సిరికింజెప్పడు శంఖచక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారమ్మును జీరడభ్రగపతిం బన్నింపడాకర్ణికాం
తరధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై.

ఇలా రాసుకుంటే పోతే మొత్తం పద్యాలన్నీ మళ్ళా రాసుకోవాలనిపిస్తున్నది. కాని మరొక్క పద్యం, పూతరేకులాగా నోటిలో కరిగిపోయే కడుతీపి పద్యమొకటి తలవకుండా ఉండలేకపోతున్నాను.

ఒక చెలికానిపై నొక చేయి సాచి వే
రొక చేత లీలాబ్జమూను వాని
కొప్పునకందని కొన్ని కుంతలములు
సెక్కుల నృత్యంబు సేయువాని
కురుచ చుంగలు పుచ్చి కొమరార కట్టిన
పసిడి వన్నియ గల పటము వాని
నౌదల తిరిగిరానలవడ చుట్టిన
దట్టంపు పించెంపు దండవాని

రాజితోత్పల కర్ణపూరముల వాని
మహతి పల్లవపుష్ప దామముల వాని
భువనమోహన నటభూష భూతి వాని
కనిరి కాంతలు కన్నుల కరవు తీర.

ఈ పద్యానికి ఈ విదుషీమణి రాసిన తాత్పర్యం: ‘అశోక వృక్షము కింద బాలుడు భువనమును మోహింపచేసే తన నటదైశ్వర్యమును చూపించుచున్నాడు. అతని మెడలో పూలు, చిగుళ్ళతో చేసిన వనమాల, చెవిలో ఒక కలువ, కొప్పు చుట్టూతా తిరిగి వచ్చేటట్లుగా నెమలి పింఛపు దండ, పచ్చని బంగారు వన్నె పట్టుపంచ చిన్ని చుంగలుగా కట్టుకున్నాడు. ఇతని కొప్పులోకి ఇమడని కొన్ని వెండ్రుకలు చెక్కిళ్ళపై చిందులు వేస్తుండగా ఒక చేయిని పక్కగానున్న చెలికానిపై వేసాడు, మరియొక చేత్తో విలాసంగా కమలాన్ని పట్టుకున్నాడు.’

ఎంత మనోహరంగా ఉంది! ముఖ్యంగా, ఆ ‘కొప్పునకందని కొన్ని కుంతలములు’ నా కళ్ళముందు నుంచి పక్కకు జరగటం లేదే.

ఏ లోకంలో ఉన్నాడో, నా మిత్రుడు రసజ్ఞ శేఖరుడు, కవితాప్రసాద్ ఈ పుస్తకం గురించి ఇలా అన్నాడట:

‘భవాబ్ధి పోతం చదివేవారు అదృష్టవంతులు. చదివి మననం చేసుకునేవారు సంస్కారవంతులు. మననం చేసుకుని నలుగురికీ చెప్పేవారు సుకృతులు. ఆచరించేవారు పరమభాగవతోత్తములు.’

1-5-2019

2 Replies to “భవాబ్ధిపోతం”

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading