కామరూప-2

నేను గౌహతి వెళ్ళిన మర్నాడు ఉదయం బ్రహ్మపుత్ర మీద సూర్యోదయ దృశ్యాన్ని చూడాలని తెల్లవారు జాము నాలుగింటికే లేచి తయారయ్యాను. నాతో పాటు నా సహోద్యోగులు కూడా నదీదృశ్యం చూడాలని ఉవ్విళ్ళూరారు. మాకు ఆ నదిని ఎక్కడ చూడాలో తెలీదు. మేమొక కాబ్ డ్రైవర్ ని పట్టుకుని అడిగితే అతడు రోజూ నది మీద క్రూయిజులు బయల్దేరే రేవు దగ్గర వదిలిపెట్టాడు. ఆ రేవు చూస్తే నాకు రాజమండ్రిలో ఒకప్పటి కొవ్వూరు లాంచీల రేవు గుర్తొచ్చింది. అక్కడ బ్రహ్మపుత్ర నదీతీరం చాలా శుభ్రంగా ఉంది. గౌహతిలో బ్రహ్మపుత్ర చాలా అపరిశుద్ధంగా ఉంటుందని మిత్రులు రాసారుగానీ, అంత పరిశుభ్రమైన నదీతీరం నేనెక్కడా చూడలేదు. బహుశా అక్కడ పడవల్ని అనుమతించక పోవడం వల్ల ఆ శుభ్రత సాధ్యపడిందనుకుంటాను.

మేము నది ఒడ్డుకి చేరేటప్పటికి తెల్లవారిపోయింది. ఇంకొంతముందు చేరి ఉంటే ప్రత్యూష కాంతిని కూడా చూసి ఉండేవాడిని అనుకున్నానుగాని, మేం వెళ్ళాకనే సూర్యోదయం కావడంతో సంతృప్తిగానే అనిపించింది. ఆ తెలివెలుగులో దూరంగా చిన్న చిన్న కొండలు, మంచుముసుగు ఇంకా తొలగించని అవతలి వడ్డు, రేవులో లంగరు వేసుకుని నిద్రపోతున్న క్రూయిజులు-వీటిమధ్య బ్రహ్మపుత్ర ఒక నీలిరేఖలాగా గోచరించింది. సూర్యుడు ఉదయించినతర్వాత, ఆ నీటిపాయలు ఇసుకతిన్నెలమీద ఆరబెట్టిన చీనాంబరాల్లాగా కనిపించడం మొదలుపెట్టాయి.

నేను ఆ నదిలో అడుగుపెట్టి ఆ నీళ్ళు నా నెత్తిన చల్లుకుని, ఒకప్పుడు కావేరి చూసాను, ఇప్పుడు బ్రహ్మపుత్ర చూసాను అని చెప్పుకున్నాను. ఈశాన్యభారతదేశానికి అన్నభిక్షా, అక్షరభిక్షా పెట్టిన ఆ నదీమతల్లిని అట్లానే చాలాసేపటిదాకా విభ్రాంతంగా చూస్తూండిపోయాను.

దేబశ్రీ దత్తారాయ్ అనే పరిశోధకురాలు బ్రహ్మపుత్ర గురించి రాస్తూ ‘ఆ నది భౌతిక, పౌరాణిక దేశకాలాల పరస్పరఖండితబిందువు దగ్గర సాక్షాత్కరిస్తుంది’ అని రాసింది. ఆ మాటలు ఈ దేశంలో ఏ నదికైనా వర్తించేవే అయినప్పటికీ, బ్రహ్మపుత్రకి మరింత వర్తిస్తాయి. అరుణాచల్ ప్రదేశ్ లో సియాంగ్ గా, బరక్ లోయలో సుర్మాగా, తాయి, బోడో ప్రాంతాల్లో తిలావోగా, సింగ్ ఫో, మిషిమి ప్రాంతాల్లో తలూక్ గా పిలవబడే బ్రహ్మపుత్రని అస్సామీయులు లుయిత్ అనే పిలవడానికి ఎక్కువ ఇష్టపడతారు. అసాంలో ప్రవేశించగానే ఆ నది లోహిత అనే ఉపనదితో కలవడం వల్ల, లోహితగా, స్థానికంగా లుయిత్ గా ప్రసిద్ధి పొందింది. లోహిత అంటే ఎర్రదనం. అది సౌందర్యం తాలూకు ఎరుపు, రక్తం తాలూకు ఎరుపు కూడా. తన తల్లిని వధించిన పరశురాముడు తన రక్తపంకిల హస్తాల్ని కడుక్కున్నందువల్ల ఆ నది నీళ్ళు ఎర్రబడ్డాయని స్థలపురాణం చెప్తున్నది.

బ్రహ్మపుత్ర ఈశాన్యభారతదేశానికి జీవదాయిని, మృత్యుదాయిని కూడా. ఓదార్పు, నిస్పృహ కూడా. వరప్రదాయిని, భీతికారకురాలు కూడా. బహుశా, ఈశాన్యభారతదేశ చరిత్రలోనూ, వర్తమానంలోనూ కూడా ఈ ద్వంద్వం విడదీయలేనంతగా కలిసిపోయిందనాలి. అరుణాచల ప్రదేశ్ కి చెందిన ప్రసిద్ధ కవయిత్రి మమంగ్ దాయి ఇలా రాసిందని దేవశ్రీ చెప్తున్నది:

సాధారణంగా ఈశాన్యభారతదేశం అనగానే అదొక గిరిజన సంస్కృతుల సమాహారమనే అనుకుంటారు. కాని అదొక సుదూర చిత్రం. ఆ ప్రాంతమంతా అడవులతోనూ, కొండలతోనూ నిండి ఉంటుందనీ, అదొక కల్లోలప్రాంతమనీ, వేర్పాటువాదమూ, సైన్యమూ తిరుగాడే ప్రాంతమనీ అనుకుంటే అది కూడా పూర్తిగా నిజమే. చాలామంది మనసుల్లో ఈ ప్రాంతం గురించి తలుచుకోగానే, సుందరసీమ, ప్రాకృతిక స్వర్గం స్ఫురిస్తాయి. పెద్ద పెద్ద నదులూ, రంగుల పండగలూ, దయామయులైన దేవీదేవతలూ కళ్ళముందు కదలాడతారు. ఇదంతా కూడా నిజమే. ఇదంతా చూస్తే మనకేమి అర్థమవుతుంది? ఇక్కడ సంఘర్షణ ఉంది, ఇక్కడ ప్రశాంతి ఉంది అనే.”

జోరహట్ దగ్గర బ్రహ్మపుత్ర రెండుగా చీలినందువల్ల ఏర్పడ్డ మజూలి ద్వీపం ప్రపంచంలోనే అత్యంత విశాలమైన నదీద్వీపం, ఇప్పుడొక జిల్లా కూడా. ఆ ద్వీపం మీదనే 15-16 శతాబ్దాల్లో శంకరదేవ నవ్య వైష్ణవాన్ని ఉద్యమంగా తీసుకొచ్చాడు. అసాంకి ఒక సంస్కృతిని సంతరించిన భక్తి ఉద్యమం అది. అయిదు శతాబ్దాలు గడిచిపోయినా ఆ ఉద్యమం అసాం జీవితాన్నింకా ప్రభావితం చేస్తూనే ఉంది. ఆ ద్వీపంనుంచి కిందకు మళ్ళాక బ్రహంపుత్ర కేవలం అన్నం పెట్టే నది కాదు, లేదా వరదలతో ముంచెత్తే ప్రవాహమూ కాదు. అదొక సంస్కృతి.

శంకరదేవ (1449-1568)కవి, గాయకుడు, సంగీతస్వరకర్త, నాట్యాచార్యుడు, హస్తకళాకారుడు, వక్త, భాగవతుడు, సంఘసంస్కర్త. అన్నిట్నీ మించి ఆయన తన జాతి చిత్తవృత్తిని సాత్వికీకరించే ప్రయత్నం చేసాడు. సాహిత్యం, లలిత కళల ప్రయోజనం అంతరంగాన్ని, మానవచిత్తప్రవృత్తినీ సాత్వికీకరించడమే కదా! ఇక అప్పణ్ణుంచీ అసాం సాహిత్యంలోనూ, సంస్కృతిలోనూ బ్రహ్మపుత్ర నిర్వహిస్తూ వస్తున్న పాత్ర అత్యంత రసమయం, సత్త్వమయం.

అసాం ఆధునిక యుగంలోకి మేల్కొన్న తరువాత యుగపురుషులుగానూ, వైతాళికులుగానూ చెప్పదగ్గ ప్రతి ఒక్కరికీ శంకరదేవ ఒక ఆదర్శం. అంటే వాళ్ళు ఆయన వైష్ణవాన్ని అనుసరించారని కాదు, ఆయన కళాభివ్యక్తిని, బహుముఖీన సృజనశీలత్వాన్ని వాళ్ళు నమూనాగా తీసుకున్నారు. శంకరదేవ, ఆయన శిష్యుడు మాధవదేవ రాసిన బోర్ గీత్ (వరగీతాలు, అంటే శ్రేష్ఠ గీతాలు) అసాంకొక పదసాహిత్య సంప్రదాయాన్ని సమకూర్చాయి.

1930-40 మధ్యకాలంలో జ్యోతి ప్రసాద్ అగర్వాలా (1903-1951) ఆ దారిలోనే దాదాపు 300 గీతాలదాకా రాసి, వాటికి స్వరకల్పన చేసి జ్యోతి సంగీత్ పేరిట ఒక నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆధునిక కాలంలో బ్రహ్మపుత్రని కవిత్వంలో సుప్రతిష్టితం చేసాడు. ‘లుయితార్ పరోరె అమి దేకా లోరా/ మొరిబొలె భొయ్ నాయ్ ‘(మేం బ్రహ్మపుత్ర తీర యువకులం, మృత్యుభయరహితులం ) అనే పల్లవితో సాగే అతడి ప్రసిద్ధ గీతం అసాం జాతీయవాద పోరాటాన్ని మేల్కొల్పిన గీతం.

అయితే అసలైన బ్రహ్మపుత్ర గాయకుడిగా ప్రసిద్ధి చెందిన వాడు భూపేన్ హజారికా (1926-2011). హజారికా అగర్వాలా లానే పాటలు కట్టాడు, వాటికి స్వరాలు కూర్చుకున్నాడు. కవి, గాయకుడు, వెరసి వాగ్గేయకారుడు. అయిదు దశాబ్దాల పొడుగునా అతడు కూర్చుకుంటూ వచ్చిన పాటల్లో బ్రహ్మపుత్ర అనేక రూపాల్లో కనిపిస్తుంది, కాని ఆ నది లేకపోతే తాను లేడన్నట్టే అతడి పాటలన్నిటితోనూ సాక్ష్యం చెప్తుంటాడు. నాకు తెలిసి గోదావరివడ్డునా, కృష్ణా తీరాన ఇటువంటి నదీగాయకుడు ఇప్పటిదాకా ప్రభవించనే లేదు. బ్రహ్మపుత్ర మీద అతడు రాసిన పాటల్లోంచి ఏదన్నా అనువదించాలనుకున్నప్పుడు, అతడి సుప్రసిద్ధ గీతం, కొందరి దృష్టిలో అతడి అత్యుత్తమ గీతం ‘అసాం అమార్ రూపహి గుణోరు నాయి శేష్ ‘ అందిస్తే బాగుంటుందనిపించింది. ఆ గీతం నా తెలుగు వచనంలో:

మన అసాం ప్రేమాన్వితం

‘అసాం, మన అసాం ప్రేమాన్వితం, ఆమె మనకందిస్తున్న కానుకలూ అంతే ప్రకాశవంతం. సూర్యుడుదయించే ఈ నేల భారతదేశ పూర్వదిగంతం.

లెక్కలేనన్ని దివారాత్రాలు నా జీవితమంతా వెచ్చించి వెతికినా, నా నేల వంటి నేల మరొకటి కనలేను.

నీ సతతహరితశాద్వాలాలెంత సుందరం, సూర్యుడుదయించే ఈ నేల భారతదేశ ప్రాచీదిగంతం.

వసంతకాలంలో నా తల్లి ఒక పొదరిల్లుగా మారిపోతుంది, మాఘమాసంలో పండిన పంట నెత్తికెత్తుకుంటుంది, తన బంగారు హస్తాలతో ఆ సుభిక్షాన్ని ఇంటికి చేరుస్తుంది.

శరద్రాత్రులు ఆమె కబరీభరాన్ని తారలతో అలంకరిస్తాయి, సూర్యుడుదయించే నా నేల భారతభూమి ఉదయదిగంతం.

రామధనువులాగా ఆమె కొండల్నీ, మైదానాల్నీ కలిపి అల్లుకుంటుంది, ఆమె ప్రేమభరితభాష మనుషుల మధ్య సేతువు కడుతుంది. నా లోహితనదీ మైదానాలకు నా ప్రణామాలు, నా జన్మ ఇక్కడ, నేను మరణించేదీ ఇక్కడే.

11-11-2018

ఈ అంశం మీద ఫేస్ బుక్ లో సవివరమైన చర్చ కోసం ఇక్కడ చూడొచ్చు


Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading