ఆ స్ఫూర్తి నానాటికీ బలపడుతున్నది

No

మహాత్మాగాంధీ 150 వ జయంతి సంవత్సరం మొదలయ్యింది.

ఒకప్పుడు శ్రీ శ్రీ ఒక మాటన్నాడు: ‘గాంధీ అనే ఫాక్ట్ విచ్చిపోయి, గాంధీజం అనే మిత్ బలపడుతోంది, లెనిన్ అనే మిత్ విచ్చిపోయి, లెనినిజం అనే ఫాక్ట్ బయటపడుతోంది’ అని.  ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థిగా, తత్త్వశాస్త్ర విద్యార్థిగా, లెనిన్ నీ, గాంధీనీ కూడా అర్థం చేసుకోడానికి గత ముప్పై ఏళ్ళకు పైగా ప్రయత్నిస్తూనే వున్నాను. నాకు అర్థమయినదాన్ని బట్టి, గాంధీజం అనేదాన్ని గాంధీజీనే అంగీకరించలేదు. ఇక, గాంధీ ఒక మిత్ గా మారకుండా, ఆయన దైవీకరణ చెందకుండా ఆయన జీవితకాలంలోనే ఆయన కన్నకొడుకుతో సహా, ఎందరో వ్యక్తులూ, సంస్థలూ జాగ్రత్తపడుతూనే వచ్చారు. ఎవరో కొద్దిమంది వ్యక్తులు తప్ప, మొత్తం జాతి అంతా, గాంధీతత్త్వాన్ని ఒక జీవనాదర్శంగా స్వీకరించగలిగే స్థితి 1942 కే కనుమరుగయ్యింది.

కానీ, గత కొంతకాలంగా, ప్రపంచవ్యాప్తంగా, గాంధీ గురించిన మరింత మరింత సాహిత్యం, పరిశోధన, చింతన వెలువడుతున్న కొద్దీ,  గాంధీ అనే ఒక ఫాక్ట్, మనకు తెలియని ఎన్నో నిజాలతో మన ముందు ఆవిష్కారమవుతూనే ఉందని మాత్రం చెప్పగలను. గాంధీజీ రచనల వంద సంపుటాలతో పాటు, ప్రతి నెలా ఒక కొత్త పుస్తకం ఆయన మీద విడుదలవుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులకోసం, మానవీయ సమాజం కోసం పోరాడుతున్న ఉద్యమకారులెందరో ఆయన స్ఫూర్తి తమను నడిపిస్తున్నదని చెప్పేకొద్దీ, ఆయన ఎప్పటికప్పుడు కొత్తగా చదివి కొత్తగా అర్థం చేసుకోవలసిన ఫాక్ట్ గా కనబడుతూనే ఉన్నాడు.

గాంధీ మూడుఖండాల్లో నివసించాడు. జీవించి ఉండగానూ, తర్వాతా కూడా ప్రపంచాన్ని ఏదో ఒక తీరున ప్రభావితం చేస్తోనే ఉన్నాడు. వివిధ రాజకీయ, ఆర్థిక అంశాల మీద ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలకు ఈ రోజు ప్రాసంగికత లేకపోవచ్చు. సగం దేశం వలసపాలనలోనూ, తక్కినదేశం సంస్థానాధీశులపాలనలోనూ ఉన్నకాలంలో, దేశాని కంతటికీ వర్తించగల ఒక స్పష్టమైన రాజ్యాంగం లేని రోజుల్లో, రాజకీయ చైతన్యం ఎవరో కొద్దిమంది చదువుకున్నవాళ్ళకి మాత్రమే పరిమితమైన కాలంలో ఆయన పోరాటాలు చేపడుతూ వచ్చాడు. కాబట్టి, ఆ రోజుల్లో, ఆ పరిమితుల్లో ఆయన వెలిబుచ్చిన ఎన్నో భావాల్ని  మనం  ఈరోజు యథాతథంగా అనుసరించలేకపోవచ్చు.

కాని, ద్వేషంతో రగిలిపోతున్న సమాజానికొక సమగ్రతని కోరుకునేవాళ్ళకి మాత్రం గాంధీజీ నే బలమైన స్ఫూర్తిగా నిలబడుతున్నాడు. ఆ స్ఫూర్తి నానాటికీ బలపడుతున్నది కూడా. గాంధీజీ మొదట్లో ఈశ్వరుడు సత్యమనుకున్నాడు, తర్వాత సత్యమే ఈశ్వరుడని గ్రహించాడు. ఎవరి అంతరాత్మ ద్వారా వారికి స్ఫురించేదే సత్యమైతే, అసంఖ్యాక సత్యాలతో ఈ ప్రపంచం వైరుధ్యాల పుట్టగా మారిపోదా? ఈ ప్రశ్న అందరికన్నా ముందు గాంధీజీనే ఎదుర్కొన్నాడు. ఒక జీవితకాలం పొడుగునా బయటి ప్రపంచంతోనూ, తనతోనూ కూడా చేపట్టిన పోరాటం నుంచి ఆయన గ్రహించిందీ, మనకి చెప్పేదీ ఏమంటే, సత్యం అహింసా ముఖంలో మాత్రమే గోచరిస్తుందని.

సత్యం అఖండమే, కాని మనమే ముక్కలుగా చూస్తున్నాం. కాబట్టి ఒక వ్యక్తి లేదా సమూహం చెప్పేది మాత్రమే సత్యం కాదు. నీ సత్యాన్ని నీ తోటి మనిషి చూస్తున్న సత్యంతో కలిపి పోల్చుకోవాలి. ఇతరులు, the other ఏం చెప్తున్నారో వినటానికి నువ్వు ఓపిగ్గా చెవి ఒగ్గాలి. అటువంటి మనస్థితినే ఆయన అహింస అన్నాడు.

నువ్వు ఎంత హేతుబద్ధంగానైనా నీ సత్యాన్ని నిరూపించే ప్రయత్నం చెయ్యవచ్చుగాక, కాని, నువ్వు ఎదుటివాడి పట్ల నీ ద్వేషాన్ని అణచు కోలేనంతకాలం, నీ సత్యం కళంకితమే. నువ్వు ఏదో ఒక వర్గాన్నో, వర్ణాన్నో, ప్రాంతాన్నో ద్వేషించడానికి నీకు పూర్తి హక్కులున్నాయని అంటావనుకో, గాంధీ ఏమంటాడంటే, ఆ ప్రాతిపదికలమీద ఎదురవుతున్న వివక్షని నువ్వు పూర్తి శాయశక్తులతో ధిక్కరించు, నేను కూడా నీ పక్షాన నిలబడతాను, ప్రాణాలు కూడా వదులుకోగలను, కానీ మనుషుల్ని ద్వేషించకు అనే.

అందుకనే, మునుపెన్నటికన్నా కూడా నేడు గాంధీజీ స్ఫూర్తి మనకొక సామాజిక-నైతిక అవసరంగా మారుతున్నదని గ్రహిస్తున్నాను. అహింసని మనమింకెంత మాత్రం వ్యక్తి ధర్మంగా భావించి పక్కనపెట్టలేం. అన్నిటికన్నా ముందు అది జాతిధర్మం, దేశధర్మం, ప్రపంచధర్మంగా మారవలసి ఉంది. గాంధీజీ అన్నిటికన్నా ముందు అహింసావాది, ఆ తర్వాతనే మరేదైనా.

2

గాంధీజీని ఈ పార్శ్వంలో అర్థం చేసుకోవడం మొదలుపెట్టాక, నేనేమి గ్రహిస్తున్నానో దాన్ని నాకై నేను స్పష్టం చేసుకోవడానికి రాయడం అవసరమనిపించింది. ఎందుకంటే, నాకు రాయడమంటే ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్. ఆ దిశగా, ఇప్పటిదాకా, గాంధీజీకి సంబంధించిన మూడు ముఖ్యమైన పుస్తకాలు తెలుగులో అనువదించాను.

ఒకటి, గాంధీ పెద్దకొడుకు హరిలాల్ జీవితం గురించి చందుభాయి భాగుభాయి దలాల్ గుజరాతీలో రాసిన జీవితచరిత్రకు తృదీప్ సుహృద్ అనువాదానికి నా తెలుగు అనువాదం. మరొకటి, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినతరువాత, గాంధీ, 1948 ఫిబ్రవరిలో వార్థాలో ఒక సమావేశం నిర్వహించాలనుకున్నాడు. అందులో దేశ భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నో అంశాలను కూలంకషంగా చర్చించాలనుకున్నాడు. అయితే, ఆ లోపే ఆయన్ని మతోన్మాదులు పొట్టనపెట్టుకున్నారు. కానీ, గాంధీ అనుయాయులు కొందరు ఆయన కోరుకున్నట్టుగా ఆ సమావేశం జరిగితీరాలని భావించి 1948 ఏప్రిల్ లో వార్ధాలో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో చర్చించిన అంశాలను, దాదాపు అరవై ఏళ్ళ తరువాత గోపాలకృష్ణ గాంధీ దేశం దృష్టికి తీసుకువచ్చారు. ఆ పత్రాలను ‘గాంధీ వెళ్ళిపోయాడు: మనకు దిక్కెవరు పేరిట’ తెలుగు చేసాను. మూడవది, గాంధీ, టాగోర్ సంవాదాన్ని ‘సత్యమొక్కటే, దర్శనాలు వేరు’ పేరిట వెలువరించిన అనువాదం.

కాని ఇవి చాలా చిన్న ప్రయత్నాలు. ఇవి చాలవు. గాంధీజీని మరింత లోతుగా అర్థం చేసుకోవాలి, వివరించుకోవాలి.

3

గాంధీ జీవితకాలంలో చేపట్టిన సామాజిక-రాజకీయ పోరాటాలు మూడు దశల్లో జరిగాయి. మొదటిది, దక్షిణాఫ్రికాలో చేపట్టిన పోరాటం. రెండవది, సహాయనిరాకరణం ఒక జాతీయస్థాయి ఉద్యమంగా రూపుదిద్దుకోవడానికి ముందు 1915-1919 మధ్యకాలంలో ఆయన భారతదేశంలో చేపట్టిన సత్యాగ్రహ ప్రయోగాలు, వాటిల్లో ముఖ్యంగా చంపారన్ సత్యాగ్రహం. మూడవది, 1919 నుంచి 1948 దాకా ముప్పై ఏళ్ళ పాటు చేపట్టిన జాతీయోద్యమం.

ఇందులో, మొదటి దశ ప్రయోగాల గురించి గాంధీజీనే ‘దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం ‘ (1928), ‘సత్యంతో నా ప్రయోగాలు’ (1927-29) ల్లో విపులంగా రాసుకున్నారు. ఈ మధ్యకాలంలో నారాయణ దేశాయి వెలువరించిన My Life is My Message (2009) నాలుగు సంపుటాల్లో మొదటి సంపుటం గాంధీజీ దక్షిణాఫ్రికా పోరాటాన్ని చాలా వివరంగానూ, సమగ్రంగానూ చిత్రించింది. వీటితోపాటు, గిరిరాజ కిషోర్ అనే ఆయన దక్షిణాఫ్రికా సత్యాగ్రహాన్ని ఒక నవలారూపంగా హిందీలో వెలువరించిన రచనకు ఇంగ్లీషు అనువాదం The Girmitiiya Saga (2010) కూడా వెలువడింది, వ్యాస సమాన్ పురస్కారం పొందింది కూడా. కాబట్టి, ఆ దశకు సంబంధించిన పోరాటాల గురించి, ఆ పుస్తకాలు చదివితే సరిపోతుంది.

కానీ, రెండవ దశ పోరాటాల్లో, ముఖ్యంగా, చంపారన్ సత్యాగ్రహం గురించి ఇప్పటికే చాలా పుస్తకాలు వెలువడినప్పటికీ, ఈ మధ్యకాలంలో హిందీలో, నవలలు, నాటకాలు కూడా వెలువడినప్పటికీ, తెలుగుపాఠకులకి ఆ పోరాటాల గురించి తెలిసింది చాలా స్వల్పం.

కిందటేడాది, చంపారన్ సత్యాగ్రహం నూరేళ్ళ జ్ఞాపకం సందర్భంగా సాహిత్య అకాదెమీ నిర్వహించిన ఒక సెమినార్ కు నన్ను కూడా ఆహ్వానించారు. అక్కడ, కేవలం తెలుగునుంచి మటుకే కాదు, దక్షిణభారతదేశం మొత్తానికి నేనొక్కణ్ణే హాజరయ్యానని అర్థమయింది. ఆరోజు అక్కడ చంపారన్ సత్యాగ్రహం గురించి నేను విన్న విషయాలు నాలో కొత్త కుతూహలాన్ని రేకెత్తించాయి. ఈ ఏడాదిగా, ఆ సత్యాగ్రహం గురించి నేను చాలా సమాచారం చదివాను. డా.రాజేంద్రప్రసాద్ Satyagraha in Champaran (1919), At the Feet of Mahatma Gandhi(1955), డి.జి.తెండుల్కర్ Gandhi in Champaran (1957), శంకర్ దయాళ్ సింగ్ Gandhi’s First Step: Champaran Movement (1994) లతో పాటు కృపలానీ రాసిన Gandhi, His Life and Thought (1970) కూడా చదివాను.

వీటన్నిటికన్నా కూడా విలువైన పుస్తకం బీహార్ ప్రభుత్వం ప్రచురించిన Select Documents on Mahatma Gandhi’s Movement in Champaran 1917-18(1963). ఈ పుస్తకం  గాంధీ పోరాటానికి సంబంధించిన చారిత్రిక పత్రాల సంకలనం. ఆ పత్రాలు బ్రిటిషు ఉద్యోగులు, జిల్లా మేజిస్ట్రేటు మొదలుకుని వైస్ రాయిదాకా రాసుకున్న ఉత్తరాలు, నివేదికలు, పోలీసు రిపోర్టులు, కాన్ఫిడెన్షియల్ పత్రాలు-అన్నీను. అందులో కాగితాల్ని గాంధీ, రాజేంద్ర ప్రసాద్ కూడా చదివి ఉండరు. 600 పేజీల ఆ పుస్తకాన్ని నేను ఆమూలాగ్రం చదివాను. ఆ చారిత్రిక పత్రాలన్నీ చదివినతర్వాత, చంపారన్ లాంటి పోరాటం ప్రపంచ చరిత్రలోనే మరెక్కడా సంభవించలేదని అర్థమయింది. ఒక అరెస్టు లేకుండా, ఒక బుల్లెట్టు పేలకుండా, ఒక రూపాయి చందా దండకుండా, ఏదో ఒక పత్రికని ప్రచారం కోసం ఆశ్రయించకుండా చేపట్టిన పోరాటం అది. ఎంతో ఆత్మక్రమశిక్షణ ఉండే మనిషి గాని చంపారన్ సత్యాగ్రహం వంటి పోరాటం చేపట్టలేడు.

ఆ పోరాటంలో భాగంగా, రైతు సమస్యలు తెలుసుకోడానికి, ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ ని నియమించడానికి నిర్ణయించాక, ‘ఇప్పుడు నీ పని పూర్తయింది కదా, చంపారన్ తో నీకు ఇంకేం పని ?’ అని లెఫ్టినెంట్ గవర్నరు అడిగినప్పుడు,గాంధీ, తన అసలు పోరాటం అప్పుడే మొదలవుతుందని, ‘శిక్ష, స్వచ్ఛత, స్వాస్థ్య’ (విద్య, పరిశుభ్రత, ఆరోగ్యం) ధ్యేయాలుగా చంపారన్ ని పునర్నిర్మిస్తానని  జవాబిచ్చాడు. ఆ ప్రకారమే మూడు పాఠశాలలు తెరిచాడు. వాటితో పాటు ఆరోగ్యవిద్య కోసం సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ కార్యకర్తల్ని రంగంలోకి దింపాడు. ఇక పారిశుద్ధ్యం గురించి పనిచేయడానికి తన భార్యనే అభ్యర్థించాడు. ఒక వైపు రాజకీయపోరాటం చేస్తూ, మరొకవైపు అంతే త్యాగనిరతితో, గ్రామీణ పునర్నిర్మాణాన్ని చేపట్టగలిగే  ఇటువంటి ఉదాహరణ ల కోసమే నేను వెయ్యికళ్ళతో వెతుక్కునేది.

ఆ పుస్తకం చదివాక, నాకు చంపారన్ చూడాలనిపించింది. ఆ ప్రాంతాలు తిరిగి, వందేళ్ళ తరువాత, ఆ సమాజం ఎలా ఉంది, అక్కడ గాంధీ ప్రభావమేదన్నా ఇంకా మిగిలి ఉందా చూడాలని అనిపించింది.

అందుకని, ఈ ఆగస్టులో చంపారన్ లో నాలుగు రోజులు పర్యటించాను. గాంధీజీ నివసించిన స్థలాలు, దర్శించిన కొన్ని గ్రామాలు చూసాను. స్థానికులతో మాట్లాడేను. గ్రామస్థులతో మాట్లాడేను. నేను చదివినదాన్ని, చూసినదాన్ని బట్టి చంపారన్ గురించి త్వరలో ఒక రచన వెలువరించాలి అనుకుంటున్నాను. ఈ లోపు, నా చంపారన్ యాత్రానుభవాల ముచ్చట్లు కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

2-10-2018

11 Replies to “ఆ స్ఫూర్తి నానాటికీ బలపడుతున్నది”

  1. ఎప్పటికి మీరు చదివిన ఆ పుస్తకాలన్ని చదవ లేను కానీ మీరు రాసిన సమీక్ష చదివి 5నిమాషాలపాటు కళ్ళు మూసుకుని కూర్చుంటే మనసు ఒక స్తబ్ధత వస్తుంది అది చాలు మనిషి ఆలోచనలు లేకపోతే పిచ్చివాడు అనిపించుకుంటాడు

    కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే జపం, భజన, స్మరణ, ధ్యాన్నం చేసినప్పుడు కూడా ఆలోచన రహిత0 గానే ఉంటుంది కానీ మనని అందరూ చాలా ప్రశాంతంగా ఉన్నావంటారు.

    కానీ మీ సమీక్షలు చదివితే ఆ ప్రశాంతత ఒకరు అనేది కాదు ఒకరికోసము కాదు మనకి మనమే ఆప్రశాంతథాలో ఉన్న ఆనందాన్ని చవిచూసే క్షణం

    నాకు ప్రతి సారి మీ సమీక్ష చదివితే వచ్చే అనుభవం అదేనండీ 🙏🙏

  2. ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారండి.
    మాకూ చంపారన్ గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత కలుగుతోంది.
    అభినందనలు.
    త్యాగ నిరతునికివె నా సుమాంజలులు.
    జై భారత్.

  3. Select Documents on Mahatma Gandhi’s Movement in Champaran 1917-18.sir i tried and enquired this book on various platforms.couldnot find.could you tell me where will i get ..Thank you.

  4. నిరంతర ధ్యేయంతో పోరాటం చేసిన గాంధీజీ గురించి మరింత తెలుసుకోవడం బావుంది. ధన్యవాదములు.

  5. ¤

    http://swarajyamag.com/politics/strange-lapses-of-eminent-historians/

    http://www.dailyo.in/politics/subhas-chandra-bose-fundamental-conflicts-in-indian-nationhood-gandhi-vs-revolutionaries/story/1/2356.html

    https://www.myind.net/how-gandhi-and-nehrus-subverted-hindu-grass-root-peasant-movements-collusion-british-and-islamists

    https://www.myind.net/how-gandhi-and-nehrus-subverted-hindu-grass-root-peasant-movements-collusion-british-and-islamists-2

    https://www.myind.net/my-experiments-swaraj-mohandas-gandhi

    http://indiafacts.org/cow-protection-mahatma-gandhi-appeasing-muslims-bullying-dalits/

    http://www.dailyo.in/politics/cow-slaughter-mahatma-gandhi-gau-raksha-hindus-muslims-pakistan/story/1/12254.html

    http://www.dailyo.in/politics/how-gandhi-patel-and-nehru-colluded-with-the-british-to-suppress-the-naval-mutiny-of-1946/story/1/5567.html

    http://www.dailyo.in/politics/mahatma-gandhis-war-on-the-indian-revolutionaries-british-nehru-mountbatten-sardar-patel/story/1/5359.html

    http://www.dailyo.in/admin_preview.php?id=5049&sef=gandhi-hinduism-christianity-indian-freedom-struggle-non-violence-revolutionaries-indic-ethos

    http://www.dailyo.in/admin_preview.php?id=5064&sef=gandhi-hinduism-christianity-indian-freedom-struggle-non-violence-revolutionaries-indic-ethos-second-part

    http://www.dailyo.in/politics/mahatma-gandhi-subhas-bose-ahimsa-non-violence-british-raj-independence/story/1/4756.html

    http://www.dailyo.in/politics/mahatma-gandhi-subhas-chandra-bose-non-violence-british-raj-independence-nehru/story/1/4225.html

    ¤

    This is the otherside of Gandhi, which many fail to see due to the bias ingrained in us by the Huge Colonial Global Deep State Propaganda Promoting Gandhi for the past 106 years. Veerabhadrudu is requested to go through these articles .

    1. This is waste of your time. Gandhi is dear to my heart not by any propaganda.

      1. ¤

        The South African Gandhi
        Stretcher-Bearer of Empire

        ASHWIN DESAI AND GOOLAM VAHED

        SERIES: SOUTH ASIA IN MOTION
        2015 344 PAGES. FROM $25.00

        Hardcover ISBN: 9780804796088
        Paperback ISBN: 9780804797177
        Ebook ISBN: 9780804797221

        May I suggest this book

        ¤

      2. I read this also. Unless you approach Gandhi without any bias, without valorization and demonization, you will not be able to understand him.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%