భగ్నదేవతావిగ్రహం

 

3

ఎవరో అన్నారు, సంగీతాన్ని అనుకరించి మాత్రమే నేర్చుకోగలమని. బహుశా ఆ మాట కవిత్వకళకి కూడా వర్తిస్తుంది. నా మటుకు నేను కొందరు కవుల్ని నమూనాలుగా పెట్టుకునే కవిత్వసాధన చేస్తూంటాను. అట్లాంటి కవుల్లో జర్మన్ కవిశ్రేష్టుడు రేనర్ మేరియా రిల్క (1875-1926)ని ముఖ్యంగా చెప్పుకోవాలి.

నా రాజమండ్రి రోజుల్లోనే (1982-87) నేను రిల్క గురించి విన్నాను. బైరాగి ‘ఆగమగీతి ‘ లో రిల్క కవితలు మూడు అనువాదాలున్నాయి. కాని ఆ కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ కవిత్వశిల్పాన్ని అవగతం చేసుకోవడానికి నాకు చాలా ఏళ్ళే పట్టింది.

దాదాపు ఒక శతాబ్దంగడిచిన తరువాత కూడా అయన కవిత్వానికి సరికొత్త అనువాదాలు వెలువడుతున్నాయి. జె.బి.లీష్ మేన్ లాంటి తొలితరం అనువాదకులు మొదలుకుని ఎడ్వర్డ్ స్నో, స్టీఫెన్ మిచెల్ లాంటి మలితరం అనువాదకులదాకా ప్రతి కొత్త అనువాదకుడూ ఆయన్ని కొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తూనేవున్నాడు.

రిల్క కవిత్వంలో ఇంద్రజాలం ఏమిటి? దాన్ని కొన్ని మాటల్లో స్పష్టంగా చెప్పడం కష్టం. ఒక్కమాట మాత్రం చెప్పవచ్చు. అతడిది కఠినాతికఠినమైన సాధన. తెంపులేని అన్వేషణ. తనకవితలెలా ఉన్నాయో చెప్పమని అడిగిన ఒక యువకవికి అతడిచ్చిన సలహా ‘లెటర్స్ టు ఎ యంగ్ పొయెట్ (1929) గా పుస్తకరూపంలో ప్రసిద్ధి చెందింది. కవితాసాధకులు ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం అది. అందులో ఒకచోట ఇలా అంటాడు:

‘నిన్ను రాయడానికిపురికొల్పుతున్నదేదో కనిపెట్టు, ఆ కోరిక నీ హృదయాంతర్భాగాల్లో వేళ్ళుతన్నుకుందో లేదో చూడు.నువ్వు రాయకుండా ఉండలేకపోతే నీకు చచ్చిపోయినట్టనిపిస్తుందా- నిన్ను నువ్వు తరచి చూసుకో. అన్నిటికన్నా ముందు ఈ ప్రశ్న. నీ ఏకాంతసమయంలో, రాత్రి నిశ్శబ్దంలో నిన్ను నువ్వు ప్రశ్నించుకో: నేను రాసితీరాలా? దానికి విస్పష్టమైన సమాధానం కోసం నిన్ను నువ్వు తవ్వి చూసుకో. ఒకవేళ అవునని జవాబు వచ్చిందనుకో, ఇక నీ జీవితం మొత్తం ఆ అవసరానికి తగ్గట్టుగా మలుచుకో.ని జీవితంలోని ప్రతి ఒక్క సాధారణ, అప్రధాన క్షణం కూడా ఆ కోరికకి అనుగుణంగానే జీవించు. అప్పుడు ప్రకృతికి చేరువగా జరుగు. నువ్వు చూస్తున్నదీ, అనుభవిస్తున్నదీ, ఇష్టపడుతున్నదీ, పోగొట్టుకుంటున్నదీ ప్రతి ఒక్కటీ మొదటిసారి నీకే సంభవిస్తున్న మనిషిలాగా రాయి..’

రిల్క రోడే అనే ప్రపంచ ప్రసిద్ద శిల్పికి కార్యదర్శిగా పనిచేసాడు. రోడే రాతిని శిల్పంగా చెక్కినట్టుగా రిల్క దృశ్యాన్నీ, అనుభూతినీ కవితగా మార్చాలని తపించాడు. అందుకని విమర్శకులు రోడే రిల్క కవిత్వాన్నే ఒక శిల్పంగా మార్చేసాడన్నారు. ఒక కవి తనకు గోచరిస్తున్నదాన్ని కవితగా మలచడమెలానో తెలుసుకోవాలంటే రిల్క కవిత్వాని పదే పదే చదవడం కన్నా దగ్గరిదారి లేదు.

ఆ కవిత్వ శిల్పానికి రెండు ఉదాహరణలు. మొదటిది archaic torso of Apollo (1908) కవిత. ఒక కవిని ప్రపంచం మర్చిపోకుండా ఉండటానికి ఇటువంటి కవిత ఒక్కటి చాలు అన్నాడొక విమర్శకుడు. రెండవది, ఒక పండు మీద రాసిన కవిత the fruit (1924).

ప్రాచీన భగ్నదేవతావిగ్రహం

ఆ శిరసెలాఉండేదో మనకెప్పటికీ తెలియదు, కాంతి
సమస్తం ఆ ప్రసిద్ధ నేత్రాల్లో పరిపక్వమైంది,  ఆ
మొండెం మాత్రం కొద్దిగా కాంతిమందగించిన వీథిదీపంలా
జ్వలిస్తూనే ఉంది, ఎన్నాళ్ళకిందటో అందులో రగిలించిన

అతడి దృష్టి మాత్రం దాన్నింకా అంటిపెట్టుకు మెరుస్తోంది,
లేకపోతే, ఎగిసిపడుతున్న ఆ వక్షస్థలతరంగానికి నీ కళ్ళు
బైర్లు కమ్మేవి కావు, ప్రజననకేంద్రంవైపు ఒకింత మెలితిరిగిన
కటిప్రదేశం మీంచి  మందహాసం దూసుకుపోయేదికాదు.

ఆ భుజాల పారదర్శకపు వాలుకింద రాయిగా, చల్లగా
మిగిలిపోయి, వన్య మృగాల ఉన్నిలాగా నిగనిగలాడేదికాదు,
తన రేఖలన్నిటితోనూ తారగా మారేదికాదు, ఇప్పుడక్కడ
నిన్ను పరికించని చోటు లేదు, నువ్వు మారక తప్పదు.

పండు

అది నేలనుంచి అదృశ్యంగా పైకి పాకి పాకి
నిశ్శబ్దకాండంలో తన రహస్యాన్ని దాచుకుంది.
లేతమొగ్గలో తననొక జ్వాలగా రగిలించుకుని
తన రహస్యాన్ని మళ్ళా తనలోకి లాక్కుంది.

రాత్రింపగళ్ళు ప్రసవవేదనపడుతున్న చెట్టులో
ఒక వేసవి పొడుగుతా ఫలప్రదమయ్యింది.
తనని పిలుస్తున్న విశాలాకాశాన్ని తక్షణమే
చేరుకోవాలని తనంతతానే ఆతృతపడింది.

ఇన్నాళ్ళుగా పొందిన విశ్రాంతితో ఇప్పుడది
కొత్తగా, గుండ్రంగా, కాంతులీనుతున్నప్పటికీ
తన అంచుల్లోంచి పరిత్యక్తభావనతో తన
ప్రాదుర్భావకేంద్రానికే వెనుతిరుగుతున్నది.

25-7-2013

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading