ఈ ముగ్గురనే కాదు, సామాజిక జీవితం మరింత న్యాయబద్ధంగా ఉండాలనీ, మనుషులు మరింత సమతలంమీద నడవాలనీ, ఒకరిమీద ఒకరు పెత్తనం చెయ్యకుండా, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి బతకాలనీ కోరుకుంటూ ఇప్పుడు రచనలు చేసే ఏ రచయిత అయినా నా దృష్టిలో స్వాతంత్య్ర వీరుడే.
రావిశాస్త్రి
అటువంటి ప్రజాపోరాటాలు, ఉద్యమాలు, తిరుగుబాట్లు ఉవ్వెత్తున చెలరేగిన కాలంలో ఆయన జీవించాడు. వాటిని రెండుచేతులా స్వాగతించాడు. ప్రభుత్వం గురించి, రాజ్యం గురించి, పాలనాయంత్రాగం గురించి ఆయనకు చాలా స్పష్టత ఉంది. ప్రజలు కావాలని తిరుగుబాట్లు చెయ్యరు. కాని ప్రభుత్వాలు వాటిని కావాలని అణచేస్తాయి అని ఆయన పదే పదే చెప్పాడు.
