ప్రేమ మతం

జీవితపు వాకిట్లో చీకటి ముసురుకున్నప్పుడు, లేదా పైన నల్లటి దిగులు మబ్బు కమ్మినప్పుడు, తెలియని శూన్యమేదో చుట్టుముట్టినప్పుడు, రూమీనుంచి ఒక్క వాక్యం తెరిచినా, ఒక పూలబండి మనపక్కనుంచి వెళ్ళినట్టు, సాయంకాలం వీథిదీపాలన్నీ ఒక్కసారి వెలిగినట్టు, ఎండాకాలపు చివరిదినాంతాన ఋతుపవనమేఘం ఆకాశం మీద ప్రత్యక్షమయినట్టు ఉంటుంది.

అతిథిగృహం

రూమీ కవితని చూసి నాగేశ్వర్ కె.ఎన్.ఆర్ గారు బరంపురం నుంచి పరవశిస్తూ తనకి ఆ కవిత్వం ఇంకా ఇంకా కావాలనిపిస్తోందన్నారు. పులికొండ సుబ్బాచారిగారు గొప్ప సాహిత్యరసజ్ఞులు 'రూమీ గానం చేసాడని రాసారు, కాని మీ అనువాదం వచనంగానే ఉందికదా' అన్నారు.

రాత్రంతా సంభాషణ

రూమి కవిత చదివాక అన్నిటినీ వదిలేసి వాటినే చదువుకుంటూ మిగిలిన జీవితం గడిపేయాలని అనిపించింది అని రాసారు ఒక మిత్రురాలు. కోలమన్ బార్క్స్ చేసింది కూడా అదే.