స్వాతంత్ర్యోద్యమసంగ్రామ కాలంలో దేశాన్ని జాగృతం చేసిన మహనీయుల్లో మహాత్మాగాంధి, రవీంద్రనాథ్ టాగోర్ ముందువరసలో నిలుస్తారు. గాంధీని టాగోర్ మహాత్మా అని సంబోధిస్తే, గాంధీ టాగోర్ ని గురుదేవ్ అని పిలిచేవారు. కాని, సహాయనిరాకరణోద్యమకాలంలో వారిద్దరి మధ్యా అభిప్రాయభేదాలు తలెత్తాయి. అదొక ఆసక్తికరమైన సంవాదంగా రూపుదిద్దుకుంది.ఆ సంవాదం కూడా జాతిని మరింత జాగృతం చెయ్యడానికే సహకరించింది.
హరిలాల్ గాంధీ మహాత్ముడి పెద్దకొడుకు జీవితకథ
హరిలాల్ గాంధీ మహాత్మాగాంధీ పెద్దకొడుకు. మొదట్లో గాంధీ అనుయాయుడిగా దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. కాని అనంతరకాలంలో గాంధీ అభిప్రాయాలతో విభేదించి ఆయన మీద ధిక్కారం ప్రకటించాడు. చివరికి విషాదాంతంగా పరిణమించిన ఆ జీవితగాథను గుజరాతీలో చందులాల్ భాగుభాయి దలాల్ ఎంతో సత్యసంధతతో రచించారు.
గాంధీ వెళ్ళిపోయాడు, మనకు దిక్కెవరు
మహాత్మాగాంధీ 1948 ఫిబ్రవరిలో దేశ భవితవ్యం గురించి చర్చించడానికి వార్ధాలో ఒక సమావేశాన్ని సంకల్పించారు. కాని, జనవరిలో ఆయన హత్యకు గురవడంతో, ఆ సమావేశం డా.రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఏప్రిల్ లో జరిగింది. ఆ సమావేశంలో దేశం అప్పుడు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల మీదనే కాక, దేశ భవిష్యత్తు తీరుతెన్నుల గురించి కూడా విస్తృతంగా చర్చ జరిగింది. నెహ్రూ, వినోబా తదితరులు పాల్గొన్న ఆ సమావేశాల సారాంశాన్ని గోపాల కృష్ణ గాంధి Gandhi is Gone: Who will Guide Us పేరిట వెలువరించారు.
