The Second Horizon

పునర్యానం నా మూడవ కవితా సంపుటి. 5000 పంక్తులకన్నా మించిన సుదీర్ఘ కావ్యం. ఆ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ వచన కవిత పురస్కారం కూడా అందించారు. ఆ పుస్తకం మొత్తాన్ని ఇంగ్లిషులోకి అనువదించడం అంత సులభం కాదు. అందుకని 60 కవితలు తీసుకుని మూడేళ్ళ కిందట ఇంగ్లిషులోకి అనువదించి ఇక్కడ మీతో పంచుకున్నాను. అప్పణ్ణుంచీ ఆ అనువాదాల్ని చిత్రికపడుతూనే ఉన్నాను. ఎట్టకేలకు, ఇలా The Second Horizon పేరిట bilingual edition ని ఇలా విడుదల చేస్తున్నాను. ఈ సాఫ్టు ప్రతిని ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు. పునర్యానం కావ్యాన్ని మా విజ్జికి కానుక చేసాను. ఇప్పుడు ఈ ఇంగ్లిషు అనువాదాన్ని ఆమె తండ్రి స్వర్గీయ పోరుమామిళ్ళ నారాయణరావుగారి స్మృతికి అంకితమిస్తున్నాను. ఇది నా 76 వ పుస్తకం.

సుమేరుశిఖరం మీంచి సూర్యోదయం

రాజేంద్ర ప్రసాద్ తాడికొండలో నా సహాధ్యాయి. ఆయన 1992 లోనో, 1993 లోనో పొఖారా వెళ్ళినప్పుడు సూర్యోదయ దృశ్యాన్ని చూసి ఇంగ్లిషులో ఒక కవిత రాసి నాకు పంపించాడు. నేను దాన్ని వెంటనే తెలుగు చెయ్యకుండా ఉండలేకపోయాను. ఆ అనువాదాన్ని 1993 లో అనుకుంటాను, ఆంధ్రజ్యోతి వారపత్రిక ప్రచురించింది. ఆ కవిత, ఇక నాకు దొరకదు అనుకున్నదాన్ని, నాసరరెడ్డినో మరెవరో నాకు పంపించారు. దాన్నిట్లా మీతో పంచుకుంటున్నాను.