
వాడ్రేవు చినవీరభద్రుడు కవిత్వం
నిద్రపోతున్నవాళ్ళని ఒక్కొక్కర్నీ పేరుపేరునా
లేపడం ఒక పనిగా జీవించాను బహుకాలం.
నెమ్మదిగా గ్రహించాను, నేడు డ్రిల్లుమాస్టరు
రేపు డిక్టేటరు కావటానికెంతో దూరం లేదని.
నిద్రలేవని వాళ్ళమీద అసహనం మొదలవుతుంది
మొదట్లో ముఖం మీద నీళ్ళుపోసి నిద్రలేపడం
ఒక వినోదంగానే ఉంటుంది. కాని నేడు నీళ్ళు
పోసిన వాళ్ళే రేపు నిప్పులు కూడా పొయ్యగలరు.
చూస్తూ ఉండగానే చెట్టు చిగురించింది, ఎప్పుడు
తలెత్తాయో కళ్ళు విప్పుకుంటున్నవి కానుగమొగ్గలు.
నిజంగా నిద్రలేచినవాళ్ళు చేసేదిదే: చల్లగా
నిద్ర లేచి తమపని తాము చేసుకుంటారు.
14-3-2026


Sir, I love this theme of ఫాల్గుణం మాసం and కానుగ మొగ్గలు running through your poems this month.
Such a beautiful metaphor to reflect human nature.
Your paintings are beyond beautiful!!