
సుమేరుశిఖరం మీంచి సూర్యోదయం
పి.వి.ఎస్.ఎస్. రాజేంద్ర ప్రసాద్
సమున్నత పర్వతశిఖరాలకూ ఆగాధమైన లోయలకూ నడుము వూయెలూగుతూ
ప్రవహిస్తున్న క్షీరధారల్లో పరుగులిడుతూ, గర్జిస్తున్న హిమపాత ధ్వనుల్లో గొంతు కలుపుతూ
పర్వతాగ్రాల మీంచి దూకుతున్నవి జలాలు.
భూమివక్షం పైకి ఒంగి చుంబించే ఆతృతతో
మోదుకుంటున్నవి గండశిలలకు తమ కలల్ని ఆపుకొనలేని తమకంతో
భీకరమై, సవిలాసమై, గర్వంగా, పొగరుగా
సమ్మోహనకరమయిన తన శతసహస్ర పార్శ్వాల్లో మెరుస్తున్నది హరితమంతటా
మోహపెడుతున్నది సకల జగాన్నీ విప్పారుతూ తాను పొగమంచు.
ఆ మధ్యలోనే ఒక అద్భుత ఇంద్రజాలం మధ్య
అపుడే ప్రకృతిలో నిండార స్నానం చేసి
వైభవోపేతమయిన తన దివ్యఊరువులతో
హఠాద్దర్శనమిస్తున్నది ఒక సుదూరపర్వతం.
ఇంతలో దిగంతం లోంచి లోయలోకి చిట్లి జారిన ఒక నక్షత్రవిస్ఫోటనం
పాతాళనగరంలోంచి మంచు పొరల్ని చీల్చుకుని పైకి చొచ్చుకుంటున్న ప్రకాశం
ఇవ్వడు ఇక్కడ ఈ ప్రపంచపు భుజాలపైన నిల్చున్న నన్ను నిశ్చేష్టితుణ్ణి చేసి పట్టి
నిలువుతున్నవీ దృశ్యాలు.
మంచుతెరలు వలపన్ని పట్టుకున్నవి సూర్యఖగాన్ని
ఈ మహా సుమేరు శిఖరాలు ప్రేమించి బుజ్జగించి లాలిస్తున్నవి, అతన్ని వెనక్కి లాగుతున్నవి.
కాని నేనిక్కడ నిల్చుని చూస్తున్నాను అతను ఉదయించాలని ఈ మహాంధతామిస్రం మీంచి
తప్పదు, భానుడుదయిస్తాడు, ఉదయిస్తాడు, ఉదయిస్తాడు.
అవును, అవే ఆయన రథపు వగ్గాలు ఆకాశానికి అడ్డంగా పరుచుకున్న తొలి రేఖలు
పూర్వ దిగంతమంతటా ఆయన సప్తాశ్వరింఖలు రేపిన వినీల రక్తధూళి
అయినా ప్రయత్నిస్తున్నది వెనుదిరగని మంచు ఆయన్ను ముట్టడించాలని
కాని ఒక హఠాక్షణాన్ని దొరకవుచ్చుకుని రాగలుగుతాడాయన మరుక్షణాన
అహో! అదే ప్రభవిస్తున్నాడాయన హిమమాయాజాలాన్ని తునకలు చేసి;
కప్పిన మోహవస్త్రాన్ని పక్కకు తప్పించి
మభ్యపెడుతున్న మహాశిఖర మూర్ధం పైనే బలంగా తన చరణాన్ని మోపి
ప్రాచీన ప్రాచీదిగంతం పైన అంకురించిన అరుణబిందువు
వయనిస్తోన్న ఏ రథచక్రపథ ప్రకాశమోనని భ్రమపడ్డాను.
క్షణక్షణానికి ఆ బిందువు పెరుగుతున్నది పెద్దనై గుండ్రంగా గుండ్రంగా
నిండుగా నిండుగా ఒక ప్రజ్వలితాగ్నిగా
అయినప్పటికీ నీ చూపుల్ని నొప్పించనంత చల్లగా
జన్మ, వికాసం, ఒక బ్రహ్మాండ రూపధారణం ఆ ఒక్క క్షణాన్నే
ఆ శైలశ్రేణుల పైని అవతరించిన మహాపూర్ణాకారం
ఆకాశం పైన వేలాడుతున్న అరుణగోళం, రక్తంతో వికసించిన వాయుగోళం
ఆ సన్నివేశ క్రమమంతా ఒక దివ్యానుభవం, స్పష్టం, దృగ్గోచరం.
అయినప్పటికీ ఒక హఠాత్ చలనం, సంభ్రమం, విస్మయోపేతం
ప్రాణం పోసుకొంటున్న ఒక అండం రెప్పపాటులో ఒక సజీవ పురుషరూపంలో
ధవళగిరిశిఖరాల మీంచి అన్నపూర్ణ వక్షంపైకి వెచ్చనిచేతుల్ని చావుతున్నది
నెమ్మదిగా ఆమె చూచుకాల్ని బహిర్గతం చేస్తున్నది
చూస్తుండగానే లోకమంతా ప్రభాశబలితమవుతున్నది.
అక్కడ అగాధమయిన లోయల అంచుల్లో నిస్త్రాణతో ఆ మంచు,
ఆ హిమపాతం, ఆ శైలశ్రేణి, ఆ సరోవరం
మరొక్క పందెం కోసం పణం పెట్టేందుకు బిక్కుమంటూ నక్కి కూచున్నవి.
(రాజేంద్ర ప్రసాద్ తాడికొండలో నా సహాధ్యాయి. ఆయన 1992 లోనో, 1993 లోనో పొఖారా వెళ్ళినప్పుడు సూర్యోదయ దృశ్యాన్ని చూసి ఇంగ్లిషులో ఒక కవిత రాసి నాకు పంపించాడు. షెల్లీ అతడి అభిమానకవి కాబట్టి ఆ కవితలో పట్టలేనంత భావోద్వేగం కనిపించి నన్ను సమ్మోహితుణ్ణి చేసింది. నేను దాన్ని వెంటనే తెలుగు చెయ్యకుండా ఉండలేకపోయాను. ఆ అనువాదాన్ని 1993 లో అనుకుంటాను, ఆంధ్రజ్యోతి వారపత్రిక ప్రచురించింది. ఆ కవిత, ఇక నాకు దొరకదు అనుకున్నదాన్ని, నాసరరెడ్డినో మరెవరో నాకు పంపించారు. దాన్నిట్లా మీతో పంచుకుంటున్నాను.)
28-2-2026


అద్భుతమైన ఉషోదయ వర్ణన నా వంటి సామాన్య పాఠకుల మనసులను “ విహ్వల విహంగాలను” చేసింది !
మంచుతెరల, శైల శిఖరాగ్రాల బంధనాలు తెంచుకుని పృధ్వీ తలాన్ని సగర్వంగా చుంబించిన భానుని, మహా జననం, వికాసం, విరాట్ రూపాలను యేకకాలంలో సాక్షాత్కరింప చేసిన ఉభయ కవులకు ధన్యవాదాలు 🌹
హృదయపూర్వక ధన్యవాదాలు జీవన్!
Good morning sir, today your poem about sunrises description is very nice
From Srinidhi dept of heritage museum employee
Thank you Amma!
అత్భుతమైన కవిత అట్లే మీ అనువాదంలో హృదయానికి హత్తుకుంది. మీకు, వారికి నమోవాక్కులు. ఈ కవిత నన్ను వెంటాడుతూనే ఉంటుంది.
ధన్యవాదాలు సార్ !
క్షమించాలి. తవిక బాగాలేదు. ఉషోదయాన్ని చూసి వికారపు వర్ణనలు చేయడం ఏమిటి.
అది ముప్ఫై ఏళ్ళ తర్వాత మళ్ళా గుర్తు చేసుకోవడం అవసరమా సార్.
Sigmund Freud viewed poetry as a profound expression of the unconscious mind,
He believed poetry acts as a therapeutic outlet for artists to manage hidden desires and conflicts, often viewing creative writing as a form of “day-dreaming” that translates repressed, subjective fantasies into universally accessible art.
వికారపు భావనలతో కూడిన రచనలు, పెయింటింగ్స్ చూస్తే ఫ్రాయిడ్ మాట నిజమనిపిస్తుంది.