నడుస్తున్న కాలం-10

ఆ మధ్య తెలుగులో ఒక పెద్దనటుడి సినిమా రిలీజైన మొదటిరోజు ఒక యువకుడు సినిమా చూసి బయటకు వచ్చి తన సంతోషం పట్టలేక అర్ధనగ్నంగా డాన్సు చేసిన దృశ్యం ఇప్పటికీ నా కళ్ళముందు నుంచి చెరిగిపోలేదు. ఆ రోజు నేను ఆ పిల్లవాడి గురించి కాక, అతడి తల్లిదండ్రుల్ని తలుచుకుని  బాధపడ్డాను. కాని ఇప్పుడు ఆ దృశ్యం గుర్తొస్తే అసలు దేశం గురించే నాలో తీవ్రమైన అనుతాపం రేకెత్తుతున్నది. ఎందుకని?

డెమోగ్రాఫిక్ డివిడెండు

ఏ దేశ జనాభాలో అయినా ప్రధానంగా పధ్నాలుగేళ్ళలోపు వాళ్ళు. పసిపిల్లలనుంచి హైస్కూలు చదువుదాకా, ఇంకా తమ తల్లిదండ్రులమీద ఆధారపడేవారు oka వర్గం. రెండో వర్గం  65 ఏళ్ళ వయసు దాటిన వృద్ధులు.. ఆ రెండు వర్గాలకీ మధ్యలో 15-64 మధ్య వయసులో ఉండేవారు శ్రామిక శక్తి.  తమనీ, తమమీద ఆధారపడ్డవాళ్ళనీ పోషించుకునే  వర్గం. ఇటువంటి శ్రామిక జనాభా మొదటి రెండు సముదాయాలకన్నా ఎక్కువగా ఏ దేశంలో ఉంటుందో ఆ దేశం జనాభాపరంగా ఒక లాభదాయక స్థానంలో ఉన్నట్టు. దాన్నే డెమోగ్రాఫిక్ డివిడెండు అని అంటారు. అటువంటి శ్రమశీల వయస్కులు ఇప్పుడు భారతదేశమొత్తం జనాభాలో 65 శాతందాకా ఉన్నారు. జనాభా పరంగా భారతదేశం ఇంత లాభదాయకమైన అవకాశంలో మునుపెన్నడూ లేదు. కానీ ఈ అవకాశానికి ఒక కాలపరిమితి ఉంది. 2041 లో అంటే పదిహేనేళ్ళ తరువాత ఈ లాభదాయకత పతాకస్థాయికి చేరుకుని 2055 కల్లా, అంటే మరో ముప్ఫై ఏళ్ళ కల్లా డెమోగ్రాఫిక్ వింటరు మొదలవుతుంది.

డెమోగ్రాఫిక్  డివిడెండు వల్ల ఏం జరుగుతుంది?

మొత్తం జనాభాలో పనిచేసే వయస్సు కలిగిన జనాభా ఎక్కువగా ఉన్నందువల్ల పనిచేయడానికి ఎక్కువచేతులు అందుబాటులో ఉంటాయి. తమ మీద ఆధారపడ్డ పిల్లలూ, వృద్ధులూ తక్కువ శాతం ఉన్నందువల్ల, పనిచేసి సంపాదించేవారు, తమ ఆదాయాన్ని పొదుపు చేసుకోగలుగుతారు. జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఆ పొదుపు మరింత సంపదని ఆర్జించగల పెట్టుబడిగా మారుతుంది. సంతానోత్పత్తి పైన అదుపు ఉంటుందికాబట్టి, ఉన్న కొద్దిమంది పిల్లలకీ చక్కని చదువు చెప్పించగలుగుతారు. చక్కని ఆరోగ్యరక్షణ కల్పించగలుగుతారు.  కానీ ఇవన్నీ వాటికవే జరిగిపోయేవి కావు. పనిచేసే వయస్కులు అధికసంఖ్యలో ఉన్నంతమాత్రాన సరిపోదు. వారికి తగిన విద్య, తగిన నైపుణ్యాలూ, తగిన పని కల్పించే దిశగా ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. తమ దేశ ప్రజలకి  అటువంటి ఒక అవగాహన పెంపొందించవలసి  ఉంటుంది. రానున్న ముప్ఫై ఏళ్ళల్లో ఏ ఒక్క రోజూ, ఏ ఒక్క గంటా కూడా వృథాచెయ్యకూడదనే ఒక ఆతృత, మనముందున్న కొద్దిపాటీ సమయాన్నీ వీలైనంత ఉత్పాదకంగా వినియోగించాలన్న మెలకువా దేశం మొత్తానికి కలిగించవలసి ఉంటుంది.

దక్షిణ కొరియా, చైనా, బ్రెజిల్ ఉదాహరణలు

సమకాలిక ప్రపంచంలో ఇటువంటి డివిడెండుని మరికొన్ని దేశాలు చవిచూసాయి. వారు ఆ అవకాశాన్ని ఏ విధంగా అందిపుచ్చుకున్నారో పరిశీలిస్తే, మనం ఏం చెయ్యవచ్చో, ఏం చెయ్యకూడదో తెలుస్తుంది. అందుకని మూడు ఉదాహరణలు చెప్తాను. మొదటిది దక్షిణ కొరియా. 60లు-90 ల మధ్యకాలంలో దక్షిణకొరియాకి ఇటువంటి జనాభా బహుమతి లభించింది. ఆ దేశం ఆ అవకాశాన్ని పూర్తిగా వాడుకుంది. అప్పటిదాకా నిరుపేద వ్యావసాయిక దేశంగా ఉన్నది కాస్తా ఒక్కసారిగా అత్యున్నత సాంకేతిక శక్తిగా మారింది. జనాభాలాభదాయికత ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఆ దేశం సాలీనా 10 శాతం ఆర్థిక వృద్ధి నమోదు చేసింది. కాని దాని వెనక ఆ దేశం చేసిన నిర్విరామ ప్రయత్నం ఉంది.

1990-2010 మధ్యకాలంలో చైనాకి ఇటువంటి అవకాశం లభించింది. దేశంలోని మౌలిక సదుపాయాలమీద విస్తృతంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా, శ్రామికశక్తిమీద ఆధారపడ్డ వస్తూత్పత్తి రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా  ఆ దేశం కోట్లాదిమందికి ఉపాధి కల్పించింది. తద్వారా నిరుద్యోగులు గ్రామాలనుంచి బయటపడి పట్టణ శ్రామిక శక్తిగా మారారు. అయితే, ఈ మహోద్యమం ఇంకా పూర్తి కాకుండానే, చైనా డెమోగ్రాఫిక్ వింటరు లోకి అడుగుపెట్టింది.

ఇక జనాభా బహుమతిని చేజేతులా చేజార్చుకున్న కథ బ్రెజిల్ ది . అందుకనే ఆర్థిక వేత్తలు తక్కిన దేశాలకు  బ్రెజిల్ ఒక హెచ్చరిక అని చెప్తారు. గత శతాబ్దపు చివరి సంవత్సరాల్లో బ్రెజిల్ జనాభా పరంగా లాభదాయిక దశలో అడుగుపెట్టినప్పటికీ, విద్యపైన, ముఖ్యంగా నైపుణ్యాలు పెంపొందించగల విద్యపైన పెట్టుబడి పెట్టనందువల్ల, కేవలం ముడిసరుకులమీదనే ఆర్థికాభివృద్ధిని నిర్మిస్తూ, వాటిని వస్తూత్పత్తి రంగానికి మళ్ళించుకోలేకపోయినందువల్ల, స్త్రీల విద్యనీ , నైపుణ్యకల్పనను నిర్లక్ష్యం చేసినందువల్ల, మౌలిక సదుపాయాల్ని ఇతోధికంగా పెంపొందించుకోలేకపోయినందువల్ల,  కాలం తనకి అందించిన బహుమతిని బ్రెజిల్ అందుకోలేకపోయింది.

భారతదేశం మరో బ్రెజిల్ కాకూడదు

ఈ మూడు ఉదాహరణలూ విన్నాక, భారతదేశం మరో బ్రెజిల్ కాకూడదని అనిపించడం సహజం. నిజానికి 2026 నాటికి భారతదేశ పరిస్థితి ఎంతో కొంత ఆశాజనకంగానే ఉందనిచెప్పాలి. ఇప్పుడు మనదగ్గర నూరుకోట్ల మనుషులు రెండువందల కోట్ల హస్తాల్తో బలమైన ఆర్థికవ్యవస్థను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు . శ్రామిక శక్తిలో స్త్రీల భాగస్వామ్యం 2017 లో 23 శాతం ఉన్నది ఈ పదేళ్ళలో దాదాపుగా 37 శాతానికి చేరుకుంది. స్థూల జాతీయోత్పత్తిలో వస్తూత్పత్తి రంగం వాటా 17 శాతానికి చేరుకుంది.

కాని జనాభా బహుమతిని మనం పూర్తిగా అందుకోవాలంటే ముందుగా స్త్రీల భాగస్వామ్యం 55 శాతానికి చేరాలి. ప్రపంచవ్యాప్తంగా ఇది 47 శాతంగానూ, తూర్పు ఆసియా దేశాల్లో 60 శాతంకన్నా ఎక్కువగానూ ఉంది. శ్రామికశక్తిలో స్త్రీల భాగస్వామ్యం ఇప్పుడున్న 37 శాతం 55 శాతం కాగలిగితే స్థూల జాతీయోత్పత్తి 27 శాతం పెరుగుతుందని కూడా అంచనా. అలానే వస్తూత్పత్తి రంగంలో మనం గత మూడు దశాబ్దాలుగా 15-17 శాతం దగ్గరే ఆగిపోయాం. దాన్ని దాటి కనీసం 25 శాతానికి చేరుకోగలిగితే, ఇంక అక్కణ్ణుంచీ ఆర్థిక వ్యవస్థ పెద్ద పెద్ద అంగలు వెయ్యడం మొదలుపెడుతుందని, చైనా, దక్షిణ కొరియా, వియత్నాములు చెప్తున్నాయి. అయితే అన్నిటికన్నా పెద్ద సమస్య, ఈ శ్రామిక శక్తిని నైపుణ్యవంతమైన శ్రామిక శక్తిగా మార్చడమెలా అన్నది. ఇప్పుడు మన కళాశాలలనుంచీ, విశ్వవిద్యాలయాలనుంచీ, చివరికి అత్యున్నత సాంకేతిక విద్యాసంస్థలనుంచీ కూడా పట్టభద్రులవుతున్న వారిలో కేవలం సగం మంది మాత్రమే కనీస నైపుణ్యాలతో బయటికొస్తున్నారు. విద్యారంగంలో సమూల పరివర్తన సంభవిస్తే తప్ప, నైపుణ్యాల్లోని ఈ అసమానతలు, ఈ అంతరాలు తొలగడం కష్టం.

ఆ పిల్లవాడు నన్నెందుకు భయపెడుతున్నాడు

భారతదేశం తన చరిత్రలోనే అత్యంత కీలకదశలో ప్రయాణిస్తున్న ఈ కాలంలో మన రాజకీయ శక్తులు, మీడియా, మన పెట్టుబడిదారీ వర్గాలు, మన సామాజిక శక్తులు మన యువతని అత్యవసరంగా అత్యంత నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తిగా మార్చడం ఎలా అన్న అంశం వదిలిపెట్టి సామాజిక ద్వేషాన్ని పెంపొందించడం మీదనే తమ యావచ్ఛక్తీ ఖర్చుపెడుతున్నాయి. ఇప్పుడు మన దేశం మొత్తం ఒక troll-farm గా మారిపోతున్నది. రాజకీయాలు-మీడియా-సినిమాలు కలిసి యువతను ఒక political arsenal గా రూపొందిస్తున్నాయి. ఇప్పటికే జనాభా పెరుగుదలలో, జనాభా లాభదాయికతలో, వస్తూత్పత్తిలో, నైపుణ్యాల కల్పనలో ఉత్తర, దక్షిణభారతదేశాల మధ్య అంతరాలు స్పష్టంగా కనవస్తూ ఉన్నాయి. ఇటువంటి స్థితిలో ఉత్తర భారతదేశ యువతని విద్యావంతులుగా, నిపుణులుగా మార్చడం మీద దృష్టి పెట్టకుండా, వారిని మతోన్మాదులుగా తీర్చిదిద్దే ఒక hate-factory చాలా చురుగ్గా పనిచేస్తున్నది. కాబట్టే ఆ పిల్లవాడు నన్ను భయపెడుతున్నాడు.  కాలం మనకి అందించిన ఈ జనాబా బహుమతిని సద్వినియోగం చేసుకోవడం మీద మన పురోగామి శక్తులు, మన రాజకీయ-సామాజిక శక్తులు అత్యవసరంగా దృష్టి సారించడం ఒక్కటే ఇప్పుడు తరణోపాయం.


తెలుగు ప్రభ, 20-2-2026, స్కైబాబ కి ధన్యవాదాలతో.

17 Replies to “నడుస్తున్న కాలం-10”

  1. Good morning sir, today your article about population & disscus the struggle s & problems of population it is very nice informative now a days . From Srinidhi dept of heritage museum employee

  2. This voice (more a warning) must be heard loud and clear in Parliament. Our leaders must act before it’s too late.

  3. తెలుసుకోవలసిన విషయం .కనులు తెరవాల్సిన విషయం. మేధవికసనం జరిగే విద్య, నైతిక బాధ్యతలను గుర్తు చేసే విద్య అవసరం . దురదృష్టవశాత్తు రాజకీయ నాయకుల ఆరాటమంతా తమ మనుగడ గురించే ప్రయత్నాలు చేయడం మీదనే దృష్టి కేంద్రీకరించడం . వ్యక్తిగత విచక్షణ చేసుకునే మనస్తత్వం పౌరుల్లో పెంపొందినపుడు సువ్యవస్థ ఏర్పడే అవకాశం ఉంది. మీకు నమస్సులు.

  4. చక్కని ఆలోచనాత్మకమైన వ్యాసం. ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రజల సంస్కారాల్లో తేడా వున్న నిజాన్ని ఎత్తి చూపటం బాగుంది.

  5. You nailed it on the head. Demographic dividend if used productively can bolster development. Other wise it becomes Demographic Burden. We need policies and programmes to develop human capabilities in an environment that is inclusive as well as just. Thank you

  6. ఎన్నో విషయాల్ని తెలుసు కోగలిగాను నమస్సులు

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading